ట్రాన్స్‌లేటర్ల ఉద్యోగాలకు కంప్యూటర్లు ఎసరు పెట్టగలవా?

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మేక పాలతో తయారు చేసిన వెన్నా లేదా మేక పేడా? ఈ విషయం పొరపాటున కూడా గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను అడగకండి.

ఫ్రాన్స్‌లో ఓ మంచి రెస్టారెంట్‌కి వెళ్లి మెన్యూలో చూడగానే కార్టన్ డి షెర్వ్ అన్న డిష్ కనిపిస్తుంది. మీకు ఫ్రెంచ్ భాష వస్తే సరే. లేదంటే వెంటనే గూగుల్ ట్రాన్స్‌లేటర్లో దాని అర్థం ఏంటా అని వెతకడం సర్వ సాధారణం. మీరు అలా టైపు చేశారో లేదో.. వెంటనే అందులో మేక పేడ అన్న అర్థం కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన మీరు వెంటనే నిర్ఘాంతపోయి... తరువాత డిష్ ఏముందా అని వెతకడం మొదలెడతారు. నిజానికి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను నమ్ముకొని మీరు మరో డిష్ కోసం వెతికితే... కచ్చితంగా ఫ్రెంచ్ రుచుల్లో ఒకటైన మేక పాలుతో తయారు చేసిన అత్యంత మధురమైన చీజ్‌ను మిస్సయినట్టే. సాధారణంగా ఫ్రాన్స్ రెస్టారెంట్లలో ఈ చీజ్‌ను స్టార్టర్ కింద వడ్డిస్తారు.

ఉచితంగా లభించే ఈ గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ టూల్‌లో ఇలాంటి తప్పుడు అర్థాలు కేవలం ఫ్రెంచ్ భాషలోనే కాదు దాదాపు అన్ని భాషల్లోనూ కనిపిస్తునే ఉంటాయి. అందుకే సుమారు 50 కోట్ల మంది ఉపయోగిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ టూల్ అనువాదకులకు ప్రత్యామ్నాయం కాలేకపోతోంది.

గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగం ఎంత?

చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ పర్యటకులు గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను బాగానే వినియోగిస్తున్నారు. కారణం ఇది అత్యంత చవగ్గా, సౌలభ్యంగా ఉండటమే. కానీ వ్యాపార, న్యాయ, వైద్య విభాగాల్లో సేవలందించే విషయానికొచ్చేసరికి మాత్రం దీని వినియోగం నామమాత్రంగానే ఉంది.

గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను వినియోగించడం వల్ల కొన్ని సార్లు పెద్ద పెద్ద తప్పులు కూడా జరగొచ్చు. ముఖ్యంగా ఒక పదానికి వేర్వేరు అర్థాలున్నప్పుడు.. అది కూడా న్యాయ, ఇంజనీరింగ్ విభాగాల్లో ఇది తరచుగా కనిపిస్తుంటుందని ఫ్రాన్స్‌కి చెందిన మాజీ న్యాయవాది, కోర్టు అనుమతితో ఫ్రెంచ్-ఇంగ్లిష్ అనువాదకురాలిగా సేవలందిస్తున్న సమంత లాంగ్లే అంటున్నారు.

అంత మాత్రాన ప్రొఫెషెనల్‌ ట్రాన్స్‌లేటర్లు కంప్యూటర్ అసిస్టెట్ ట్రాన్స్‌లేషన్ (క్యాట్) టూల్స్ వాడరని కాదు... ఈ తరహా అత్యంత అధునాతమైన అప్లికేషన్లు వారికి చాలా సందర్భాల్లో సాయపడుతుంటాయి.

ఇటీవల కాలంలో ఆధునిక భాషా సంబంధిత డిగ్రీ కోర్సుల్లో క్యాట్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇంతకీ వాటి వాడకటం ఎంత వరకు మంచిది?

ఫొటో సోర్స్, WAVERLY LABS

ఫొటో క్యాప్షన్,

ఇయర్‌పీస్‌లు అప్పటికప్పుడు అనువాదం చెయ్యగలవు

సర్వేల వరకు ఫర్వాలేదు

ఈ విషయంలో ఈ మధ్య కాలంలో అత్యంత పేరొందింది ట్రాన్స్‌లేషన్ ఇయర్‌పీస్. ఇది సాధారణంగా స్మార్ట్ ఫోన్ యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇది అవతలి వ్యక్తి మాట్లాడుతున్న విదేశీ భాషను అప్పటికప్పుడు అనవదించి వినిపిస్తుంది.

మానవ మెదడులోని నాడీ వ్యవస్థ ఏ విధంగా గుర్తించగలుగుతుందో అచ్చం అలాగే గుర్తించేందుకు వీలుగా ఆల్గారిథమ్స్‌ను సిద్ధం చేయడానికి కొన్ని దశాబ్దాల పాటు పరిశోధనలు చెయ్యాల్సి వచ్చిందని ట్రాన్స్‌లేటెడ్ ఇయర్‌పీస్‌లను తయారు చేస్తున్న అమెరికా స్టార్టప్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్రూ ఓఖా చెప్పారు.

అయితే ఇన్‌స్ట్రక్షన్ మేన్యువల్స్, క్వశ్చనీర్ల వంటి వాటి విషయంలో ఈ క్యాట్ టూల్స్ ఎంతో సాయం చేస్తున్నాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని వరల్డ్ బ్యాంక్‌కు చెందిన ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్ పవోలా గ్రస్సీ అంటున్నారు.

"సర్వేలకు సంబంధించిన వివరాల్లో చాలా వరకు పునరుక్తులు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో క్యాట్ టూల్స్ పనిని మరింత వేగవంతం చేస్తాయి" అని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

విదేశీ భాషల్లో నైపుణ్యం ఉన్న వారికి లెక్క లేనన్ని ఉపాధి అవకాశాలు

ట్రాన్స్‌లేషన్ టూల్స్‌కు పరిమితులు

సభలు, సమావేశాల విషయానికొస్తే వావెర్లీ వంటి ట్రాన్స్‌లేటర్లు కచ్చితంగా ప్రముఖమైనవే. అయితే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కాలంలోనూ ఈ తరహా ఇంటర్నెట్ ఆధారిత ట్రాన్స్‌లేషన్ ఇంజిన్లకు కొన్ని పరిమితులున్నాయి.

ముఖ్యంగా వీటిని వినియోగించే వాళ్లు అవతలి వ్యక్తి మాట్లాడిన మాటలు తమకు అర్థమయ్యే భాషలో అనువాదమై, వాటిని వినేందుకు కనీసం కొన్ని సెకన్ల సమయం తీసుకుంది. ఇక ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతంత మాత్రంగా ఉంటే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత ఆలస్యం కావచ్చు.

మేన్యువల్స్ వంటి విషయంలో ట్రాన్స్‌లేషన్ టెక్నాలజీ నిస్సందేహంగా ఉపయోగకరమైనదేనని వరల్డ్ బ్యాంక్ బ్రాండ్ అండ్ కంటెంట్ డైరెక్టర్ జీయో కూపర్ అంటున్నారు.

అయితే పాఠకునితో సహజమైన అనుబంధాన్ని ఏర్పరుచుకోవాలంటే మాత్రం కచ్చితంగా అనువాదకులు ఉండాల్సిందేనని... అప్పుడే ఆ వాక్యం సంపూర్ణంగా అనువాదం అయినట్లన్నది ఆయన అభిప్రాయం.

క్యాట్ టూల్స్ సృజనాత్మకతకు అడ్డుకట్టవేస్తాయన్నది స్పెయిన్‌కి చెందిన ఇంగ్లిష్-స్పానిష్ అనువాదకుడు ఆంటోనియో నవర్రోగొసల్వెజ్ భావన.

ఫొటో సోర్స్, GOOSEBERRY CREATIVE

ఫొటో క్యాప్షన్,

క్యాట్ టూల్స్ సృజనాత్మకతకు అడ్డుకట్ట వేస్తాయంటున్న ఆంటోనియో

బహుశా వచ్చే పదేళ్లలో ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందంటున్నారు ఇయర్‌పీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ ఓఖా.

"భావోద్వేగాలను, స్వర స్థాయులను వ్యక్తపరచాల్సి వచ్చినప్పుడు అక్కడ సెంటిమెంట్‌తో కూడిన విశ్లేషణ అవసరమవుతుంది. బహుశా క్యాట్ టూల్స్‌లో ప్రస్తుతం ఆ సౌకర్యం లేనప్పటికీ మరో పదేళ్లలో అందుబాటులోకి రావచ్చు" అని ఓఖా అంటున్నారు.

విదేశీ భాషల్లో నైపుణ్యం ఉన్న వారికి మార్కెట్లో ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. బ్రిటన్లో ఉద్యోగాలకు సంబంధించిన వెబ్‌సైట్ రీడ్‌లో విదేశీ భాషల్లో నైపుణ్యం ఉన్న వారికి సంబంధించిన ఉద్యోగాలే దాదాపు 15 శాతం ఉన్నాయి.

'అమెరికన్ కౌన్సిల్ ఆన్‌ ది టీచింగ్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్' తాజా పరిశోధన ప్రకారం 75 శాతం ఉత్పత్తి రంగ కంపెనీలకు విభిన్న భాషల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అవసరం ఉందని తేలింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)