"అమెజాన్ అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"

మారిస్టెలా, జూలియానా
ఫొటో క్యాప్షన్,

మారిస్టెలా, జూలియానా

అమెజాన్ వర్షారణ్యాల్లో చెట్ల నరికివేత ఆందోళనకర స్థాయుల్లో పెరుగుతోంది. అధికార గణాంకాల ప్రకారం 2019 జనవరితో పోలిస్తే 2020 జనవరిలో రెండింతల విస్తీర్ణంలో అడవులు నాశనమయ్యాయి.

గత ఏడాది వానలు పడకపోవడం, కార్చిచ్చులు, ఇతర కారణాలతో భారీ విస్తీర్ణంలో అడవులు నాశమనమయ్యాయి. అనేక సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత పెద్దయెత్తున అడవులు తగులబడిపోవడం, వన్యప్రాణులు చనిపోవడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసన, ఆందోళన వ్యక్తమయ్యాయి.

ఈ పరిణామాలు సంభవించి ఆరు నెలలవుతోంది. భూగోళం వేడెక్కడాన్ని నియంత్రించడంలో అమెజాన్ అడవులది కీలక పాత్ర. అమెజాన్ అడవుల భవిష్యత్తు గురించి స్థానిక యువత ఏమనుకొంటున్నారో తెలుసుకొనేందుకు బీబీసీ ప్రతినిధి నోమియా ఇక్బాల్ బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతానికి వెళ్లారు.

ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాం

ఈ వర్షారణ్యంలో వేల ఏళ్లుగా ఉన్న సుమారు తొమ్మిది లక్షల ఆదిమ సముదాయాల్లో అరారా-కరో ఒకటి. ఈ సమూహం వేటాడి జీవనం సాగిస్తుంది.

ఈ సముదాయం నివసించే ప్రత్యేక రక్షిత ప్రాంతాలు చెట్లు నరికేవారి నుంచి, గనుల తవ్వకందారుల నుంచి ఇప్పుడు ముప్పును ఎదుర్కొంటోంది. "మాకెంతో ఆందోళనగా ఉంది, ఎందుకంటే అడవి మాకు చాలా ముఖ్యం" అని ఈ సమూహానికి చెందిన 14 ఏళ్ల మారిస్టెలా క్లెడియానే వువాపా అరారా చెప్పింది.

"అడవి మా అమ్మ. అడవే మా బాగోగులు చూసుకుంటుంది. మాకు కావాల్సినవన్నీ ఇస్తుంది. మేం అడవిని తప్పక కాపాడుకోవాలి" అని మారిస్టెలా తెలిపింది.

ఫొటో క్యాప్షన్,

అమెజాన్ వర్షారణ్యంలో ఎక్కువ వయసున్న ఓ చెట్టును ప్రార్థిస్తున్న అరారా-కరో తెగ యువతులు

భూములకు, సంస్కృతికి సంబంధించి ఆదిమ సముదాయాలకున్న ప్రత్యేక హక్కులను తొలగించాలని బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సొనారో చెప్పారు. వారు మిగతా జనాభాతో కలిసిపోయేలా చేస్తామని, వారి భూముల్లో కొంత భాగంలో వ్యవసాయాన్ని, గనుల తవ్వకాన్ని అనుమతిస్తామని ప్రకటించారు.

ఈ విధానం మారిస్టెలాకు ఆందోళన కలిగిస్తోంది. బోల్సోనారో ప్రభుత్వం ఆదిమ సముదాయాల ప్రజలను ద్వేషిస్తోందని ఆమె విమర్శించారు. తనదో ఆదిమ సముదాయం కావడం తనకు గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. "మా భూమిని కాపాడుకోవడానికి పోరాడటం మహిళలుగా మా బాధ్యత" అని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

అరారా-కరో ఒక ఆదిమ సమూహం

అధ్యక్షుడు, ఆయన ప్రణాళికలే కాదని, అడవులపై ఇతర ఆదిమ ప్రజల దాడులు కూడా తమకు ఆందోళన కలిగిస్తున్నాయని మారిస్టెలా కజిన్ అయిన 22 ఏళ్ల జూలియానా ట్యూటీ అరారా చెప్పారు.

అడవుల నరికివేతకు బయటి వ్యక్తులు ఆదిమ ప్రజలతో జట్టు కడుతున్నారని, ఇది తమకు చాలా బాధ కలిగిస్తోందని ఆమె ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ చెప్పారు. గత కొన్నేళ్లలో తమ బంధువులే చెట్లను కొట్టేశారని, వాళ్లు బుల్డోజర్లతో అడవి మీదకు వచ్చారని ఆమె వివరించారు.

ఈ అడవుల పరిరక్షణకు తమ పూర్వీకులు పోరాడారని, ఇటీవలి పరిణామాలతో వీటిని కాపాడుకోవాలనే తమ పట్టుదల ఇంకా పెరిగిందని ఈ ఇద్దరు యువతులు చెప్పారు. ఇది పోరాడాల్సిన సమయమని, చేతులు కట్టుకొని చూస్తూ ఉండిపోలేమని స్పష్టం చేశారు.

భూములు కాపాడుకోవడానికి ఎంత వరకు పోరాడతారని అడిగితే- చచ్చే వరకు పోరాడతామని వాళ్లిద్దరూ క్షణం ఆలోచించకుండా సమాధానమిచ్చారు.

ఫొటో క్యాప్షన్,

మారిస్టెలా, జూలియానా

భూమి తమదేనని ఆదిమ ప్రజలతోపాటు ఇతర ప్రజలు కూడా అంటున్నారు. మారిస్టెలా, జూలియానాలున్న ప్రాంతం కాకుండా మరో ప్రాంతంలో నివసించే 16 ఏళ్ల కరీనా డి ఫారియా, 18 ఏళ్ల ఆమె అన్న రోడ్రిగో తర్వాతి తరం రైతులు.

తండ్రి జెర్సన్ వెంట సాగుతూ పశువులను మేపుతున్న వారిద్దరూ మాట్లాడుతూ- తాము తండ్రి అడుగుజాడల్లో నడవాలనుకొంటున్నట్లు చెప్పారు.

"భూమి ప్రతి ఒక్కరికీ అవసరం. స్థానికంగానైనా, ప్రపంచవ్యాప్తంగానైనా తమతోపాటు ఇతరులకు అవసరమైన ఆహారం, ఇతరత్రా అందించేందుకు చాలా మంది రైతులకు భూమి అవసరం. ప్రతి ఒక్కరికీ భూమిపై హక్కు ఉండాలి. అందుకే భూమిని అందరికీ సమానంగా పంచాలి" అని కరీనా అభిప్రాయపడింది.

వీళ్లకు వంద ఎకరాల పొలం ఉంది. ఆ భూభాగం ఒకప్పుడు వర్షారణ్యం. పొలంలో వీళ్లు కూరగాయలు పండిస్తారు. పశువులు పెంచుతారు.

భూములు అందరికీ ఉండాలంటున్న వీళ్లు కూడా- అడవుల నరికివేత పర్యవసానాలపై ఆందోళన చెందుతున్నారు. "ఇప్పటికే చాలా అడవులను నాశనం చేశారు, ఉన్న అడవులనైనా వదిలేయాలి" అని రోడ్రిగో అభిప్రాయపడ్డారు.

"కలప కోసం చెట్లను కొట్టేస్తున్న చాలా మంది వయసులో మా కన్నా పెద్దవారు. కానీ వాతావరణ మార్పుల దుష్ప్రభావం ఇప్పటికే ఉందని యువతీయువకులం గుర్తించాం" అని కరీనా తెలిపింది.

టెక్నాలజీతో యువత ఒకరికొకరు బాగా అనుసంధానమై ఉన్నారని, యువత కలసి పనిచేయాలని ఆమె సూచించింది. ప్రతి ఒక్కరికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది.

ఫొటో క్యాప్షన్,

తండ్రి జెర్సన్‌తో కరీనా, రోడ్రిగో

కరీనా, రోడ్రిగోలతో మాట్లాడిన తర్వాత కొన్ని నిమిషాలు కార్లో ప్రయాణిస్తే 18 ఏళ్ల గుస్టావో ఉండే ఊరు వచ్చింది. అతడు రోడ్రిగో స్నేహితుడు. నిరుడు ఆగస్టులో గుస్టావో కుటుంబ పొలం తగులబడిపోయింది.

వానల్లేని కాలంలో మంటలు సాధారణమే. చాలా సందర్భాల్లో సహజ కారణాల వల్లే ఇవి సంభవిస్తుంటాయి. ఈసారి పరిస్థితి వేరు. ఎవరో తమ పొలంలో నిప్పంటించారని, ఇది తమకు చాలా బాధ కలిగించిందని రోడ్రిగో చెప్పారు.

"70 శాతం పొలం తగులబడిపోయింది. మా పశువులకు గాయాలయ్యాయి. వాటికి చికిత్స చేయించాల్సి వచ్చింది. కొన్ని జంతువులు చనిపోయాయి. మేం చాలా కోల్పోయాం" అని ఆయన విచారం వ్యక్తంచేశారు.

పర్యావరణ అంశాల పట్ల చాలా మంది రైతులు సంకుచిత దృష్టితో ఉన్నారని, మరిన్ని లాభాల కోసం అడవులను నాశనం చేయాలని అనుకొంటున్నారని, దీనివల్ల వర్షారణ్యాలు బతకవని గుస్టావో విమర్శించారు. అమెజాన్ అడవుల భవిష్యత్తును వాళ్లే ప్రమాదంలో పడేస్తున్నారని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

గుస్తావో

పర్యావరణ న్యాయం కావాలి

''మాకేం కావాలి?

- పర్యావరణ న్యాయం.

ఎప్పుడు కావాలి?

- ఇప్పుడే"

బ్రెజిల్లో అమెజోనాస్ రాష్ట్ర రాజధాని మనావుస్ వీధుల్లో వినిపించే నినాదాలు ఇవి.

అమెజాన్ వర్షారణ్యం మధ్యలో ఉండే ఈ నగర జనాభా 20 లక్షలు. ఇక్కడ 15 ఏళ్ల బ్రూనో రోడ్రిగస్, ఆయన తోటి విద్యార్థులు 'కాన్షష్ నెక్స్ట్' అనే ఓ గ్రూపును ఏర్పాటు చేశారు.

వీళ్లు దారిన పోతున్న వారిని ఆపి, వాతావరణ మార్పులతో ఎదురయ్యే ప్రమాదాల గురించి వివరిస్తున్నారు. వీటిని ఎదుర్కోవడానికి తక్షణం ఎందుకు చర్యలు చేపట్టాలో వారికి చెబుతామని బ్రూనో తెలిపాడు. తాము చెప్పేది అందరూ పట్టించుకోరని, కొందరు తాము చెప్పేది ఎప్పుడూ వినరని వివరించాడు.

ఫొటో క్యాప్షన్,

అనా(మధ్యలో), బ్రూనో (కుడి)

స్వీడన్‌ టీనేజీ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ చేపట్టిన 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్' కార్యక్రమంలో భాగంగా ఈ నగరంలో ఇలాంటి యువత ప్రతి శుక్రవారం ఆందోళనలు నిర్వహిస్తుంటారు.

అమెజాన్ కార్చిచ్చుల ప్రభావం తమ కుటుంబంపై పడిందని 15 ఏళ్ల అనా బియాట్రిజ్ ఆవేదన వ్యక్తంచేసింది. తన సోదరికి శ్వాస సమస్యలు ఉన్నాయని తెలిపింది. కార్చిచ్చుల పొగ వల్ల అనారోగ్యం పాలైన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు.

కార్చిచ్చుల్లో చెట్లు కాలిపోయాయని, జంతువులు చనిపోయాయని, ఇదంతా తనకు బాధ కలిగించిందని ఆమె గుర్తుచేసుకొంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

2019 ఆగస్టు 24న అమెజోనాస్ రాష్ట్రంలోని బోకా డో ఎకర్‌లో అడవుల్లో కార్చిచ్చు తర్వాత కనిపించిన దృశ్యం

భూమ్మీదున్న జీవజాతుల్లో పది శాతం అమెజాన్ ప్రాంతంలో ఉన్నాయి. కార్చిచ్చుల వల్ల జాగ్వార్లు, పాములు, కీటకాలు సహా 20 లక్షలకు పైగా జీవులు చనిపోయాయని నిపుణులు అంచనా వేశారు.

కార్చిచ్చులు పెను విధ్వంసం సృష్టించినా భవిష్యత్తుపై బ్రూనో ఆవావహంగానే ఉన్నాడు.

"మాలో ఇంకా ఆశ మిగిలే ఉంది. మేం చేతలను నమ్ముతాం. రాజకీయ నాయకులు తగిన కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. వేల మంది యువతీయువకులం వీధుల్లో ఉద్యమిస్తున్నాం. నాయకులు మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటామంటే కుదరదు" అని తేల్చి చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)