కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం

డేగులో మాట్లాడుతున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్

ఫొటో సోర్స్, South Korean Presidential Blue House/Getty Im

ఫొటో క్యాప్షన్,

డేగులో మాట్లాడుతున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 80 వేలకు మించడంతో బాధిత దేశాలన్నీ దీన్ని అరికట్టడానికి ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నాయి.

దక్షిణ కొరియాలో వైరస్ సోకినవారి సంఖ్య 977కి చేరింది. ఇటలీ, ఇరాన్ కూడా తమ దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపడుతున్నాయి.

వైరస్ వ్యాప్తి మరింత తీవ్రం కావొచ్చనే ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయంగా సోమవారం స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో జపాన్‌ స్టాక్ మార్కెట్లూ కుదేలయ్యాయి.

వాల్‌స్ట్రీట్, లండన్ మార్కెట్లూ పతనమయ్యాయి.

మహమ్మారిగా మారే ప్రమాదమున్న కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ మరింత సన్నద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

అప్పుడే దీన్ని ప్రపంచానికి సవాల్ విసిరే మహమ్మారి అనే ముద్ర వేయకపోయినా దీన్ని ఎదుర్కొనేందుకు మాత్రం ప్రపంచ దేశాలన్నీ సన్నద్ధం కావలని సూచించింది.

శ్వాసకోశ వ్యాధి కోవిడ్-19కి కారణమవుతున్న కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ సోకినవారిలో మృతుల సంఖ్య 1 నుంచి 2 శాతమే ఉన్నట్లు చెబుతున్నా ఈ మరణాల శాతంపై ఇంకా కచ్చితమైన లెక్కలు తెలియవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters

చైనాలో తాజా పరిస్థితి ఏమిటి?

వన్య ప్రాణులను తినడాన్ని చైనా ప్రభుత్వ నిషేధించింది. వాటి వేట, క్రయవిక్రయాలు, రవాణా వంటి అన్నిటిపైనా నియంత్రణ విధించింది.

హుబే ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో వన్య ప్రాణులను విక్రయించే మార్కెట్లో ఈ వైరస్ మొట్టమొదట ప్రబలినట్లు భావిస్తుండడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వచ్చే నెలలో జరగాల్సిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌ వార్షిక సమావేశాన్ని వాయిదా వేసుకోనున్నట్లు చైనా ప్రకటించింది.

కమ్యూనిస్టు పార్టీ తీసుకునే నిర్ణయాలను ఆమోదించే వ్యవస్థే ఈ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్.. 1978 నుంచి ఇది ఏటా క్రమం తప్పకుండా సమావేశమవుతోంది. ఈసారి కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టే చర్యలకు ఆటంకం లేకుండా ఈ సమావేశం వాయిదా పడుతోంది.

చైనాలో సోమవారం కొత్త 508 కేసులు గుర్తించారు. ఆదివారంతో పోల్చితే సుమారు 100 కేసులు అదనంగా నమోదయ్యాయి. వీటిలో అత్యధికం వుహాన్‌లో నమోదైనవే.

సోమవారం మరో 71 మంది మరణించడంతో ఇప్పటివరకు చైనాలో మరణించిన కరోనా బాధితుల సంఖ్య 2663కి పెరిగింది.

శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారని.. తియాంజిన్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ నాలుగు డోస్‌లు తీసుకోగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని చైనాలోని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

అయితే, ఈ వ్యాక్సిన్సు ఎంతవరకు సురక్షితం, ఎంతవరకు పనిచేస్తాయన్నది ఇంకా స్పష్టత లేదని.. ఇవి అందుబాటులోకి రావడానికీ ఇంకా నెలలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లో స్కూల్స్‌కు సెలవులు మళ్లీ పొడిగించారు. ఏప్రిల్ 20 వరకు స్కూల్స్ మూసే ఉంచాలని ఆదేశాలు వెలువడ్డాయి.

ఫొటో సోర్స్, JUNG YEON-JE/gettyimages

ఫొటో క్యాప్షన్,

పెద్దసంఖ్యలో మాస్కులు కొంటున్న దక్షిణ కొరియా ప్రజలు

మిగతా దేశాల్లో పరిస్థితేమిటి?

దక్షిణ కొరియాలో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 10 మంది మరణించారు.

ఆ దేశంలో ఈ వ్యాధి బారినపడినవారిలో అత్యధికులు షిన్‌చియోంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే ఒక మత శాఖకు చెందినవారు.

దక్షిణ కొరియాలో ఈ వైరస్ ప్రబలిన డేగు నగరంలో అధ్యక్షుడు మూన్ జే-ఇన్ పర్యటించి పరిస్థితి సమీక్షించారు. ఆ ప్రాంతంలో పరిస్థితిని అదుపుచేయడానికి మరిన్ని చర్యలు చేపడతామని ఆయన హామీ చెప్పారు.. అదేసమయంలో మరిన్ని మాస్కులు కావాలంటూ స్థానికులు నిరసన తెలిపారు.

వైరస్ వ్యాప్తి నివారణ కోసం పని వేళల క్రమం తప్పించాలని, టెలికాన్ఫరెన్సింగ్ అమలు చేయాలని జపాన్ ప్రభుత్వం మంగళవారం అక్కడి సంస్థలను కోరినట్లు ఎన్‌హెచ్‌కే బ్రాడ్‌కాస్టర్ తెలిపింది.

జపాన్‌లో ప్రస్తుతం 850కిపైగా కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికులు క్రూయిజ్ షిప్ డైమండ్ ప్రిన్సెస్‌లోనే ఉన్నారు.

ఆ నౌకలోని ప్రయాణికుల్లో నలుగురు మరణించినట్లు అక్కడి వార్తాసంస్థలు తెలిపాయి.

ఫొటో సోర్స్, ANDREAS SOLARO/gettyimages

ఫొటో క్యాప్షన్,

ఇటలీలో మాస్కులతో తిరుగుతున్న ప్రజలు

ఐరోపాలో అత్యధికంగా 231 కేసులు ఇటలీలో నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఆ దేశం చర్యలు చేపడుతోంది.

ఇటలీలోని లాంబర్డీ, వెనెటో‌ల్లోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఉంది. సుమారు 50 వేల మంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. ప్రత్యేక అనుమతులు లేకుండా వారెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేకుండా చేశారు.

ఇప్పటివరకు ఇటలీలో ఏడుగురు ఈ వ్యాధిబారిన పడి మరణించారు.

ఫొటో సోర్స్, MEHDI MARIZAD/gettyimages

ఫొటో క్యాప్షన్,

వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇరాన్‌లో చర్యలు చేపడుతున్నారు.

ఇరాన్‌లో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. అక్కడి పాఠశాలలను మూసివేశారు.

అమెరికాలో ఇంతవరకు 53 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఈ వైరస్‌పై పోరాటానికి 250 కోట్ల డాలర్లు ఖర్చు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డాక్టర్ టెడ్రోస్

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఆధానమ్ గెబ్రెయేసస్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియాలో కొత్తగా కరోనావైరస్ కేసులు బయటపడుతుండడం ఆందోళనకర పరిణామమని చెప్పారు.

ఈ వైరస్‌కు మహమ్మారిగా మారే సామర్థ్యం ఉన్నప్పటికీ తమ అంచనా ప్రకారం ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదని చెప్పారు.

అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం హెడ్ మైక్ రియాన్ మాత్రం ఒక మహమ్మారి నియంత్రణకు ఏం చేయాలో అన్నీ చేయాల్సిన సమయం ఇదని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)