కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?

  • 27 ఫిబ్రవరి 2020
కరోనా వైరస్ Image copyright Getty Images

ఇటలీ, ఇరాన్‌లో కొద్ది రోజుల వ్యవధిలోనే ఊహించని రీతిలో భారీగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోనూ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో, కరోనా వైరస్‌ వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో ఇప్పుడు దక్షిణ కొరియా ఒకటిగా మారింది.

ఇప్పుడు కరోనా వైరస్ సమస్య ఒక్క చైనాది మాత్రమే కాదు. అనేక దేశాల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.

ఈ తరుణంలో కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారి (పాండెమిక్‌)గా మారుతుందా? దీనిని నిలువరించడం ఇప్పటికీ సాధ్యమేనా?

ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిలా వ్యాపించే వ్యాధిని ప్రపంచవ్యాప్త మహమ్మారి (పాండెమిక్‌) అంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రియేసస్ వ్యాఖ్యల ప్రకారం, ఈ వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారే అవకాశం తప్పకుండా ఉంది.

అయితే, ఇప్పుడే దీనిని ప్రపంచవ్యాప్త మహమ్మరి అనడం తొందరపాటు అవుతుందని, కానీ, ప్రపంచం అందుకు సన్నద్ధమై ఉండాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ అన్నారు.

డబ్ల్యూహెచ్‌వో చీఫ్ అభిప్రాయంతో కొందరు నిపుణులు విభేదిస్తున్నారు.

Image copyright Getty Images

ఇప్పటికే మొదలైందా?

ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారినట్లుగా భావించాలని లండన్‌లోని స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ జిమ్మీ విట్‌వర్త్ అంటున్నారు.

"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. కాబట్టి, ప్రస్తుత పరిస్థితిని చాలామంది పాండెమిక్‌గానే పరిగణిస్తారని అనుకుంటున్నాను" అని జిమ్మీ బీబీసీతో చెప్పారు.

రెండు వారాల క్రితమే ప్రపంచమహమ్మారి ప్రాథమిక దశ మొదలైందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇవన్నీ చూస్తుంటే పరిస్థితులు వేగంగా మారిపోతున్నట్లు అనిపిస్తోంది.

కరోనావైరస్ ప్రపంచమహమ్మారిగా మారుతోందని చెప్పడానికి దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లో తాజా పరిణామాలు బలమైన సంకేతంగా చెప్పొచ్చు.

దక్షిణ కొరియాలో వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటం చూస్తుంటే ఈ వైరస్ ఎంత వేగంగా పంజా విసురుతోందో అర్థమవుతుంది.

ఇటలీ, ఇరాన్‌ దేశాల్లోనూ చాలా కేసులు నమోదయ్యాయి. అధికారిక లెక్కల కంటే ఈ దేశాల్లో నమోదైన కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుందని అంచనా, చైనా నుంచి వచ్చిన వారి వల్లే ఈ కేసులు నమోదయ్యాయా? అన్నది ఇంకా వెల్లడికాలేదు.

"ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది. చైనాతో సంబంధం లేనివారికి కూడా అనేక మందికి ఈ వైరస్ సోకుతోంది" అని ప్రొఫెసర్ విట్‌వర్త్ అంటున్నారు.

Image copyright Getty Images

అత్యంత వేగంగా వ్యాపిస్తోంది

గత కొన్ని రోజులుగా పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయని, చైనా వెలుపల పలు దేశాల్లోనూ ఈ వైరస్ అత్యంత వేగంగా ప్రబలుతోందని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రొఫెసర్ లలితా దేవి శ్రీధర్ అన్నారు.

"ఇన్ని రోజులు చైనాలో అత్యవసర పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, ఇటలీ దేశాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇది అత్యంత ప్రభావవంతమైన వైరస్, అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది" అని ఆమె చెప్పారు.

ప్రపంచవ్యాప్త మహమ్మారి (పాండెమిక్) బారిన పడ్డామని తాను ఇప్పటికైతే అనుకోవట్లేదని, చైనా వెలుపల ఈ వైరస్ వ్యాప్తిని మరికొన్ని రోజులు గమనించిన తర్వాత ఒక అభిప్రాయానికి రావచ్చని ఆమె అంటున్నారు.

"ఇటలీ, ఇరాన్‌లో కేసులు నమోదవుతున్నాయంటే, ఇక అది అంతటికీ పాకగలదు" అని లలితా దేవి అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

ఇరాన్‌లో ఆందోళన కలిగిస్తున్న కరోనా

ఇరాన్‌లో కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయమని పరిశోధకులు అంటున్నారు. అది ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారకుండా చేస్తున్న ప్రయత్నాలకు ఇది పెద్ద సవాలేనని అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్‌లో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 61 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు ఈ దేశంలో 12 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఒక్క ఖూమ్ నగరంలోనే 50 మంది చనిపోయారని, ప్రభుత్వం ఈ విషయాన్ని దాచి పెడుతోందని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. కానీ, ప్రభుత్వ ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఈ ఆరోపణను తోసిపుచ్చారు.

ఈ వైరస్ సోకిన వారిలో కొద్ది శాతం మంది మాత్రమే చనిపోతున్నారు. అది కూడా వైరస్ సోకిన తర్వాత కొన్ని వారాలకు మరణిస్తున్నారు. కాబట్టి, అధికారిక లెక్కల ప్రకారం చూసినా ఇరాన్‌లో ఈ వైరస్ బాధితులు చాలామందే ఉంటారని అంచనా.

"ప్రాథమిక లక్షణాలు కలిగిన వారు చాలామందే ఉంటారని అనిపిస్తోంది. వారిలో కరోనా లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. కాబట్టి వారిని పరీక్షించడంలేదు. అది ఇంకా ఎంతగా విజృంభిస్తుందో ఎవరికి తెలుసు?" అని డాక్టర్ మాక్‌డెర్మాట్ అన్నారు.

సోమవారం ఇరాక్, అఫ్గానిస్తాన్, కువైట్, ఒమన్, బహ్రెయిన్‌లలో తొలి సారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితులంతా ఇరాన్ నుంచి వచ్చినవారే.

దశాబ్ద కాలంగా అంతర్యుద్ధాలతో కుదేలైన ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో వైద్య ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

"ప్రస్తుతానికి కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందని చెప్పడంలేదు. కానీ, వచ్చే ఒకటి రెండు వారాల్లో అది చాలా దేశాలకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే మనం క్లిష్ట పరిస్థితులకు దగ్గరవుతున్నామని అనుకోవచ్చు" అని డాక్టర్ మ్యాక్‌డెర్మాట్ అన్నారు.

అధికారికంగా కరోనాను ఇప్పటికీ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించడంలేదని, ఇంకా 'సాధారణ వ్యాధి'గానే వ్యవహరిస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో అధికారులు అంటున్నారు.

2009లో స్వైన్‌ఫ్లూను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ విమర్శలు ఎదుర్కొంది.

అప్పుడు ఆ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. కానీ, దాని ప్రభావం చాలా తక్కువగానే కనిపించింది. దాంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ తొందరపడి దానిని ప్రపంచవ్యాప్త మహమ్మారిగా 'పాండెమిక్'గా ప్రకటించిందన్న విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా క్వారంటైన్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాంకేతికతను ఎలా వాడుతున్నాయి?

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు

కరోనా వైరస్: 24 గంటల్లో 525 కొత్త కేసులు.. భారత్‌లో 3,072కి పెరిగిన పాజిటివ్ కేసులు

హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?

కరోనావైరస్ సంక్షోభం: సమానత్వ, న్యాయ మూలాలపై సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణీ స్త్రీలు, రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

వివిధ దేశాల్లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలు: ‘ఆడవాళ్లు బయటకు వచ్చే రోజు మగవాళ్లు రాకూడదు.. భార్యలు భర్తల్ని విసిగించొద్దు’

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: అమెరికా చేసిన తప్పులేంటి... ఒప్పులేంటి?