హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు

  • 26 ఫిబ్రవరి 2020
హోస్నీ ముబారక్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక హోస్నీ ముబారక్

పేరుకు హోస్నీ ముబారక్ మిలటరీ నుంచి వచ్చిన వ్యక్తే అయినా... అంతర్జాతీయ శాంతికి తన దేశం.. ఈజిప్టు కట్టుబడి ఉండాలని భావించే వ్యక్తుల్లో ఆయన ఒకరు.

ముబారక్ నాయకత్వంలోనే ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జరిగిన ప్రయత్నాలకు ఈజిప్టు నాయకత్వం వహించింది.

అధ్యక్షుడిగా సుమారు 3 దశాబ్దాల పాటు సాగిన ఆయన పాలనకు 2011లో తెరపడింది. దేశంలో తలెత్తిన తిరుగుబాటు ఆయన్ను పదవీత్యుణ్ణి చేసింది.

అత్యవసర పరిస్థితిని ఉపయోగించుకోవడం ద్వారా తన రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. తనపై వచ్చిన అనేక అవినీతి ఆరోపణలతో పోరాడటంతోనే ఆయన జీవిత చరమాంకమంతా గడిచిపోయింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1952లో యువ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా హోస్నీ ముబారక్

యుద్ధ పైలెట్

మహమ్మద్ హోస్నీ సయిద్ ముబారక్ మే 4 1928లో ఉత్తర ఈజిప్ట్‌లోని కఫ్ర్-ఇల్-మెసెల్హాలో జన్మించారు. తీవ్ర పేదరికం నుంచి వచ్చిన ఆయన 1949లో ఈజిప్టు మిలటరీ అకాడమీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 1950లో ఎయిర్ ఫోర్స్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

రెండేళ్ల పాటు యుద్ధ విమానాలను నడిపిన ఆయన ఆ పై శిక్షకునిగా బాధ్యతలు స్వీకరించారు. 1952లో జనరల్ గమాల్ అబ్దెల్ నసీర్ మిలటరీ కుట్ర సమయంలోనూ, ఆ తర్వాత సూయిజ్ సంక్షోభ సమయంలోనూ రెండింటికీ ఆయన సాక్షిగా నిలిచారు .

1959లో ఈజిప్టు ప్రభుత్వానికి ఆయుధాలను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సోవియట్ యూనియన్‌కి వెళ్లారు. ఫ్లై బాంబర్లను నడపటాన్ని ఆయన అక్కడే నేర్చుకున్నారు.

ఓ వైద్యుని కుమార్తె అయిన 17 ఏళ్ల సుజనేను ఆయన వివాహం చేసుకున్నారు. అక్కడ నుంచి పూర్తిగా కెరియర్‌పైనే దృష్టి పెట్టిన ఆయన ఒక్కో ర్యాంకు మెరగుపరుచుకుంటూ ఎయిర్ ఫోర్స్ అకాడమి అధిపతి స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత 1972లో ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈజిప్టులోని సూయెజ్ కెనాల్ పశ్చిమ గట్టు వద్ద ఇజ్రాయెల్ సైన్యం

నేషనల్ హీరో

ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా, రక్షణ శాఖ ఉప మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పేరు మారు మోగిపోయింది .

1973లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ దళాలపై ఆశ్చర్యకరమైన రీతిలో దాడులు జరపడంలో ఆయన కర్త, కర్మగా నిలిచారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1975లో హోస్నీ ముబారక్‌ను ఈజిప్టు ఉపాధ్యక్షుడిగా నియమించారు దేశాధ్యక్షుడు సదత్

ఉపాధ్యక్షునిగా

ఆయనకు అందుకు ప్రతిఫలం రెండేళ్ల తర్వాత వచ్చింది. అధ్యక్షుడు అన్వర్ సదత్ ఆయనకు దేశ ఉపాధ్యక్షునిగా పదవీ బాధ్యతలు అప్పగించారు.

అయితే ముఖ్యంగా ముబారక్ పూర్తిగా స్వదేశీ వ్యవహారాలకే పరిమితమైనప్పటికీ మిగిలిన అరబ్ నేతలతో సంబంధాలను బలపరుచుకోవడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా సౌదీ యువరాజు ఫహద్‌తో.

1979లో అధ్యక్షుడు సదత్, ఇజ్రాయెల్ ప్రధాని మెనాహెమ్ బిగెన్‌ల మధ్య జరిగిన క్యాంప్ డేవిడ్ శాంతి ఒప్పందానికి మద్దతుదారునిగా ముబారక్‌ ఎలాంటి గుర్తింపు పొందలేదు.

ఆ ఒప్పందం అరబ్ ప్రపంచాన్ని ముక్కలు చేసింది. మితవాద భాగస్వాములతో సంబంధాలు క్షీణించకుండా కాపాడటంలో అధ్యక్షుడు సదత్ వైఫల్యం చెందడంపై ముబారక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ పరిణామాలు అతివాదుల్న రగిల్చివేసింది.

1973లో జరిగిన అరబ్-ఇజ్రాయెల్ సంక్షోభంలో సదత్ సాధించిన విజయానికి ఏటా విజయోత్సవ వేడుకలు జరుగుతుంటాయి. అలాగే 1981 అక్టోబర్‌లో 8వ వార్షికోత్సవంలో భాగంగా జరిగిన ఓ ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో సైన్యం మద్దతున్న ఓ వర్గం ఆయన్ను దారుణంగా మట్టుపెట్టింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1981లో అధ్యక్షుడు సదత్‌ హత్య జరిగినప్పుడు ముబారక్‌ గాయపడ్డారు

అధ్యక్షునికి వ్యతిరేక దిశలో నిలబెట్టిన ఓ ట్రక్‌లో హత్యకు పాల్పడిన వాళ్లు దాక్కున్నారు. నిజానికి వాళ్లు కూడా పేరెడ్‌లో భాగమనే అనుకున్నారు. వారికి సెల్యూట్ చేసేందుకు ఆయన ముందుకొచ్చారు.

వెంటనే గ్రెనేడ్లు విసిరిన వాళ్లు ఏకే -47 తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. తీవ్రంగా గాయపడ్డ సదత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిలో హోస్నీ ముబారక్‌ కూడా ఉన్నారు.

ఆ తరువాత జరిగిన దేశ వ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణలో 98 శాతం మంది ముబారక్ వైపే మొగ్గు చూపడంతో సదత్ వారసునిగా విజయవంతంగా అధ్యక్ష పదవిని చేపట్టగలిగారు. క్యాంప్ డేవిడ్ ఒప్పందాన్ని నిలిపేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇజ్రాయెల్‌తో సంబంధాలు మాత్రం సదత్ హయాంతో పోల్చితే చెప్పుకోదగ్గ స్థాయిలో దెబ్బతిన్నాయనే చెప్పొచ్చు. దీంతో ఇదో ప్రచ్ఛన్న శాంతి అన్న వ్యాఖ్యలు వినిపించసాగాయి.

ఈజిప్టు, సౌదీ అరేబియా రెండూ అరబ్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలు మాత్రమే కాదు ధనిక దేశాలు కూడా. అంతేకాదు ఇరాన్లో అయతొల్హా ఖమీనీ బలోపేతం కాకుండా అడ్డుకునేందుకు చేతులు కలిపాయి.

నిజానికి 1979లోనే అరబ్‌ లీగ్ నుంచి ఈజిప్టును వెళ్లగొట్టారు. కానీ ముబారక్ వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈజిప్టు అరబ్ ‌లీగ్‌లో మళ్లీ భాగమయ్యింది. అంతేకాదు ఆ సంస్థ ప్రధాన కార్యాలయం తిరిగి నైలు నది ఒడ్డున ఉన్న సొంతగడ్డకు వచ్చేసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పీఎల్ఓ ఛైర్మన్ యాసర్ అరాఫత్‌తో ఈజిప్టు అధ్యక్షుడు ముబారక్

సోవియట్ మిలటరీ అకాడమీలో రషన్య్ భాష మాట్లాడటం నేర్చుకున్న ఆయన పశ్చిమ దేశాలతో సంబంధాలను బలోపేతం చెయ్యడంపై ప్రధానంగా దృష్టి సారించారు .

ఇజ్రాయెల్ - పాలస్తీనా శాంతి ప్రక్రియలో ఆయన పోషించిన కీలక పాత్ర కారణంగా అమెరికా అధ్యక్షులతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నారు. ఫలితంగా వారి నుంచి వందల కోట్ల డాలర్ల సాయం అందుతూ ఉండేది.

మరోవైపు ఆయన్ను అమెరికా చేతుల్లో కీలుబొమ్మ అని, ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని జైళ్లలో పెట్టి తీవ్రంగా హింసించారని, రిగ్గింగ్‌కి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేసేవారు విమర్శకులు.

అంతర్గత భద్రతా వ్యవస్థను ఆయన మరింత బలోపేతం చేశారు. అదే సమయంలో ఆయనపై ఆరు సార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చివరకు పోర్ట్ సెడ్‌లో ఆయనపై కత్తితో జరిగిన దాడిలో తీవ్ర గాయాల పాలయ్యారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కువైట్‌ను ఆక్రమించిన ఇరాక్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన అంతర్జాతీయ కూటమిలో అధ్యక్షుడు ముబారక్ చేరారు. దీంతో ఆయన అమెరికా చేతిలో కీలుబొమ్మ అని విమర్శలు ఎదుర్కొన్నారు

గల్ఫ్ యుద్ధం

1991లో కువైట్‌పై ఇరాక్ దాడి ముబారక్‌కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. నిజానికి కువైట్‌పై దాడి చేసే ప్రణాళిక ఏదీ లేదని అప్పటికే తనకు సద్దాం హుస్సేన్ చెప్పారన్నది ముబారక్ మాట.

అంతర్జాతీయంగా తీవ్ర ఆంక్షలు ఎదురైన నేపధ్యంలో ఇరాక్‌కు వ్యతిరేకంగా సంకీర్ణ దళాలకు మిలటరీ సాయం చేస్తానని ముబారక్ హామీ ఇచ్చారు .

ఈజిప్టు ప్రభుత్వాన్ని కూలదోయాలని సద్దాం డిమాండ్ చేశారు. కానీ అటు అమెరికా అలాగే ఇతర అంతర్జాతీయ రుణదాతలు మాత్రం వందల కోట్ల డాలర్ల రుణాలను రద్దు చేశారు.

సుమారు దశాబ్ద కాలం తర్వాత 2003లో అమెరికా నేతృత్వంలో ఇరాక్‌పై జరుగుతున్న దాడికి తన మద్దతును ఉపసంహరించుకున్నారు. ఇది మరో వంద మంది బిన్ లాడెన్లు పుట్టుకకు కారణమవుతుందన్నారు.

అంతేకాదు.. ఇజ్రాయెల్ -పాలస్తీనాల మధ్య నెలకొన్న సంక్షోభానికి పరిష్కారం కనుగొనడమే తమ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యమైన విషయమన్నది తన నమ్మకమని వ్యాఖ్యానించారు.

ఆయన వరుసగా 1987,1993,1999 సంవత్సరాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణల్లో వ్యతిరేకత అన్నదే లేకుండా తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.

2005లో అనేక పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ మొత్తం భద్రతా వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థలు ముబారక్ అధీనంలోనే ఉండటంతో ఆయన ఎన్నికకు ఢోకా లేకుండా పోయింది.

దేశంలోకి వెల్లువెత్తిన విదేశీ పెట్టుబడులు చేరాల్సిన వారికి చేరకపోయినప్పటికీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించడంలో మాత్రం ముబారక్ విజయవంతమయ్యారు.

ఫలితంగా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం తమ ఆస్తుల్ని భారీగా పెంచుకున్నారన్న వార్తలొచ్చాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2011లో ముబారక్‌కు వ్యతిరేకంగా ఈజిప్టులో ఉద్యమం మొదలైంది. దీంతో ఆయన పదవిని వదులుకున్నారు

అరబ్ వసంతం

పేదరికం, అవినీతి, నిరుద్యోగం, నిరంకుశత్వ పాలనకు విసుగెత్తిన ఈజిప్టు జనం 2011 జనవరిలో ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఆందోళనలు వారాల పాటు కొనసాగాయి.

వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చెయ్యనని ఆయన హామీ ఇచ్చినప్పటికీ ఆందోళనలు చల్లారలేదు. సుమారు 18 రోజుల తిరుగుబాటు తర్వాత తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ముబారక్ ప్రకటించారు.

నాలుగు నెలల తర్వాత అనారోగ్యంతో ఉన్న ముబారక్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆస్పత్రి మంచంపై ఉన్న ముబారక్ పై అవినీతి, ఆందోళనకారులను హత్య చేయించేందుకు పన్నాగాలు పన్నారన్న కేసులు నమోదయ్యాయి.

అయితే ఇప్పటికీ ఆయన చట్టపరంగా అధ్యక్ష పదవిలో ఉన్నందున కోర్టులు జోక్యం చేసుకోకూడదని ఆయన రక్షణ విభాగం మొదట్లో వాదించింది.

కానీ ఆందోళనకారులు హత్యకు గురికాకుండా ఆపడంలో ఆయన విఫలమయ్యారంటూ 2012 జూన్‌లో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో అవినీతి ఆరోపణల నుంచీ మాత్రం ఆయనకు విముక్తి కల్పించింది. కోర్టు నిర్ణయంపై కైరోలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఆరు నెలల తర్వాత ఆయనకు విధించిన శిక్షపై పునర్విచారణకు ఆదేశించారు. చివరకు ఆయన్ను కైరోలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో హౌజ్ అరెస్ట్ చేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2014లో విచారణ సందర్భంగా కటకటాల వెనుక ముబారక్

వరుస తీర్పుల్లో ముబారక్‌ అవినీతి ఆరోపణల నుంచి బయటపడినప్పటికీ నిధుల దుర్వినియోగం చేశారన్న విషయంలో ఆయనకు శిక్ష పడింది.

2017లో ఈజిప్టు అత్యున్నత న్యాయస్థానం ఆందోళనకారుల హత్యలకు ఆయన బాధ్యుడు కాదని స్పష్టం చేస్తూ ముబారక్‌ను విడుదల చేసింది.

ఈజిప్టును తన కన్నా ముందు పాలించిన నసీర్, సదత్‌లకు లభించినంత పేరు ప్రఖ్యాతలు ముబారక్‌కు లభించకపోయినప్పటికీ తన చివరి ఊపిరి ఉన్నంత వరకు ఈజిప్టుకు సేవ చేస్తానని శపథం చేశారు.

3 దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన పాలనలో ఈజిప్టులో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. అయితే ఎంతో మంది ఎలాంటి విచారణలు లేకుండా జైళ్లలో చిత్ర హింసలకు గురయ్యారు.

అంతర్జాతీయంగా చూస్తే ప్రాంతీయ సంక్షోభాలను నివారించడమే ధ్యేయంగా ఆయన విదేశాంగ విధానం కొనసాగినట్టు కనిపిస్తుంది. కానీ స్వదేశంలో మాత్రం ముబారక్ నిరంకుశత్వానికి తిరుగులేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: 6,00,000 దాటిన పాజిటివ్ కేసులు, ఏపీలో 19, తెలంగాణలో 65మంది బాధితులు

కరోనావైరస్: సినీ కార్మికులు, సాధారణ ప్రజలకు పెద్ద నటుల సహాయ హస్తం

కరోనావైరస్: పాకిస్తాన్‌ను భయపెడుతున్న కోవిడ్-19.. వైద్యులే వణికిపోతున్నారు

కరోనావైరస్: ఇటలీలో పెరుగుతున్న భయాలు... దక్షిణ ప్రాంతాలపై కోవిడ్-19 విరుచుకుపడితే పరిస్థితి ఏంటి...

కరోనావైరస్: మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీతో ప్రజలకు జరిగే మేలు ఎంత

కరోనావైరస్: కమల్‌ హాసన్ ఇంటికి ఐసొలేషన్ స్టిక్కర్.. తప్పుగా అతికించామని తొలగించిన అధికారులు

కరోనావైరస్: ఆర్‌బీఐ నిర్ణయాలతో మీ ఈఎమ్ఐ‌పై పడే ప్రభావం ఏంటో తెలుసా

కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్నా... రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎందుకంత నిశ్చింతగా ఉన్నారు

కరోనావైరస్ గ్రామాలకు పాకితే భారత్ పరిస్థితి ఏంటి