కరోనావైరస్ వ్యాప్తిని ఉత్తర కొరియా సమర్థంగా ఎదుర్కోగలదా?

  • 28 ఫిబ్రవరి 2020
ఉత్తర కొరియా Image copyright Getty Images

దక్షిణ కొరియాలో కరోనావైరస్ కేసులు పెరుగుతూ పోతున్న తరుణంలో, పొరుగున ఉన్న పేదదేశం ఉత్తర కొరియా ఈ పరిస్థితి తలెత్తితే ఎంత మేర ఎదుర్కోగలదనే ప్రశ్న ఉదయిస్తోంది.

ఉత్తర కొరియాలో అంటువ్యాధులు ప్రబలితే వ్యాప్తి తీవ్రంగా ఉండే ఆస్కారం ఎక్కువ. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన స్థాయిలో వనరులు, నైపుణ్యాలు ఇక్కడి ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థకు లేవు.

తమ దేశంలో కోవిడ్-19 కేసులేవీ లేవని ఉత్తర కొరియా చెబుతోంది. ఇది నిజమేనా అనే సందేహాన్ని కొందరు పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు.

ఉత్తర కొరియా జనాభాను ఇప్పటికే పోషకాహారలోపం, ఆరోగ్యం సరిగా లేకపోవడం లాంటి సమస్యలు వేధిస్తున్నాయని, ఇప్పుడీ వైరస్ ప్రబలితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

వైరస్ వ్యాప్తిని నివారించాల్సిన ఆవశ్యకతపై ఉత్తర కొరియా అసాధారణ రీతిలో స్పందిస్తోంది. ఇది 'మనుగడ'కు సంబంధించిన అంశమని వ్యాఖ్యానిస్తోంది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి 'విప్లవాత్మక' చర్యలు అవసరమని చెబుతోంది.

దేశంలో కరోనావైరస్ కేసులేవీ లేవని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా, అధికారులు పదే పదే చెబుతున్నారు. అదే సమయంలో, ఏ మాత్రం ఉదాసీనంగా ఉండొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన ముఖ్యమైన చర్యలను, బాధ్యతాయుతమైన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాల్సిన అవసరాన్ని వివరిస్తూ రోజూ సమాచారాన్ని కుమ్మరిస్తున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక దుస్తులు ధరించిన ప్రభుత్వ సిబ్బంది రసాయనం పిచికారీ చేస్తున్న ఫొటోలను, కోవిడ్-19 లక్షణాలపై ప్రజలకు ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్న ఫొటోలను మీడియా చూపిస్తోంది.

ఇంకో ఫొటోలో ఉత్తర కొరియా ప్రధాని జే ర్యాంగ్ మాస్క్ పెట్టుకుని, చర్యల గురించి నిర్దేశాలు ఇస్తున్నారు. చైనాతోపాటు ఇతర దేశాల్లో వైరస్ వ్యాప్తి గురించి ఇక్కడి మీడియా విస్తృతంగా వార్తాకథనాలు అందిస్తోంది.

వైరస్ వ్యాప్తి నివారణకు చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొరియన్ సెంట్రల్ టెలివిజన్(కేసీటీవీ) రోజూ ప్రసారం చేస్తోంది. "కరోనావైరస్‌ను అడ్డుకొందాం" పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్నీ అందిస్తోంది.

కోవిడ్-19 ఔషధాలంటూ నిర్ధరణ కాని కొన్ని మందుల గురించి కూడా ఉత్తర కొరియా మీడియా ప్రస్తావిస్తోంది. నిజానికి ఇప్పటివరకు కోవిడ్-19కు మందు లేదు.

Image copyright AFP PHOTO/KCNA VIA KNS
చిత్రం శీర్షిక ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు

ఉత్తర కొరియా ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది?

తమది ప్రపంచస్థాయి ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ అని ఉత్తర కొరియా చెప్పుకొంటుంది. వాస్తవానికి ఇది పేలవంగా ఉందని అంతర్జాతీయ నిపుణులు అంటారు. కొన్ని ఆస్పత్రుల్లో విద్యుత్, నీటి సదుపాయాలు కూడా లేవని చెబుతారు.

రాజధాని ప్యాంగ్యాంగ్‌ వెలుపల ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో వైద్య సదుపాయాలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారికంగా నిర్ధరణ కాని వైరస్ కేసులు ఉండొచ్చనే ఆందోళనలు ఉన్నాయి.

ప్రభుత్వం నిర్వహించే కేంద్రాల్లో ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని ఉత్తర కొరియా చెప్పుకొంటుంది. కానీ ఈ వ్యవస్థ ఉన్నత వర్గాలకే అందుబాటులో ఉందని అంటారు.

1970లు, 1980ల్లో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్-సంగ్ పాలనలోనే పౌరులకు ఇంతకంటే మెరుగైన వైద్యసేవలు అందేవని ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన తాయే-ఇల్ షిమ్ 'ఎన్‌కే న్యూస్‌'తో చెప్పారు.

వైరస్‌ ప్రబలినప్పుడు దానిని నియంత్రించేందుకు సర్వసన్నద్ధంగా లేకపోతే ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని, పరపతిని కోల్పోతుందని, అది అస్థిరతకు దారితీస్తుందని రక్షణ విధాన విశ్లేషకుడు కెవిన్ షెపర్డ్ 'ఎన్‌కే న్యూస్‌లో రాసిన ఓ వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్

సన్నద్ధత ఎలా ఉంది?

ఒక సూచీ ప్రకారం, వ్యాధులను ఎదుర్కొనే సన్నద్ధతలో ఇతర దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియా చాలా వెనకబడి ఉంది. 'అంతర్జాతీయ ఆరోగ్య భద్రత సూచీ' పేరుతో అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ఈ సూచీని రూపొందించింది.

కరోనావైరస్ సోకిందో, లేదో నిర్ధరించే పరీక్షలకు అవసరమైన సామగ్రిని ఉత్తర కొరియా కర్మాగారాలు ఉత్పత్తి చేస్తున్నాయని ప్రభుత్వ మీడియా చెబుతోంది. అయితే ఇలాంటి పరీక్ష జరపగల సామర్థ్యం ఈ దేశానికి ఉందా అనే సందేహాలు ఉన్నాయి.

అంతర్జాతీయ ఆంక్షల వల్ల అధునాతన వైద్య సామగ్రిని తెప్పించుకోవడం ఉత్తర కొరియాకు వీలు కావడం లేదు. అత్యంత నాణ్యమైన వైద్య పరికరాల అవసరం దేశానికి చాలా ఉందని పాలకుడు కిమ్ జాంగ్-ఉన్ గత ఏడాది ద్వితీయార్ధంలో వెల్లడించారు.

చేపట్టిన చర్యలు ఏమిటి?

కరోనావైరస్ ముప్పును జాతీయ అత్యవసర పరిస్థితిగా ఉత్తర కొరియా ప్రకటించింది. పెద్దయెత్తున చర్యలు చేపడుతోంది.

చైనాలో కరోనావైరస్ బయటపడగానే ఆ దేశంతో సరిహద్దులను వెంటనే మూసేసిన దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి.

విదేశీ పర్యటకులను ఎవరినీ దేశంలోకి అనుమతించడం లేదు. చైనా, రష్యాల నుంచి విమాన, రైల్వే సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇటీవల ఉత్తర కొరియాకు వచ్చిన విదేశీయులకు నిర్బంధ పర్యవేక్షణను పాలనా యంత్రాంగం 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచింది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలతోపాటు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే సిబ్బందిపై ఆంక్షలు విధించింది.

నిర్బంధ పర్యవేక్షణలో ఉన్న తమ పౌరులను తాము తీసుకెళ్తామని బ్రిటన్ ఇటీవల కోరగా, ఉత్తర కొరియా అంగీకరించలేదు.

Image copyright AFP PHOTO/KCNA VIA KNS

వైరస్ వ్యాప్తిని నివారించేందుకు, ఉత్తర కొరియా నౌకాశ్రయాలకు చేరుతున్న, లేదా సరిహద్దు వంతెనల గుండా రవాణా అవుతున్న అన్ని వస్తువులను యంత్రాంగం పది రోజులపాటు ప్రత్యేకంగా ఉంచుతోంది.

ఎవరైనా చనిపోతే కచ్చితంగా దహనమే చేయాలని, ఖననం చేయడానికి వీల్లేదని కూడా ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులు గుమికూడటంపైనా ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలను నెలపాటు మూసివేసింది.

ఇంకో అసాధారణ పరిణామం కూడా జరిగింది.

అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే సహాయ సామగ్రిని, ఔషధాలు, వైద్యపరికరాలను ఉత్తర కొరియా చైనాకు పంపించింది. సాధారణంగా ఇలాంటివి చైనా నుంచి ఉత్తర కొరియాకు అందుతుంటాయి.

చైనాలో వైరస్ వ్యాప్తి: ఉత్తర కొరియాపై ప్రభావం ఎంత?

ఉత్తర కొరియా విదేశీ వాణిజ్యంలో సుమారు 90 శాతం చైనాతోనే సాగుతుంది. చైనాతో సరిహద్దుల మూసివేతతో స్వల్పకాలంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే పడుతుంది.

ఉత్తర కొరియా-చైనా సరిహద్దుల్లో లావాదేవీలు సాగించే ఉత్తర కొరియా స్మగ్లర్లు, వ్యాపారులపైనా ప్రభావం తప్పదు. కిమ్ పాలనలో వృద్ధి చెందుతున్న ప్రైవేటు మార్కెట్లు కూడా తాజా పరిణామాలతో నష్టపోతాయి.

ఉత్తర కొరియాపై అంతర్జాతీయ ఆంక్షల జాబితాలో పర్యటకం లేదు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ పర్యటకులను నిషేధించడంతో, తనకెంతో అవసరమైన విదేశీ కరెన్సీని ఉత్తర కొరియా సంపాదించుకోలేకపోతోంది. ఏటా జరిగే ప్యాంగ్యాంగ్ మారథాన్ కూడా ఈ సారి రద్దయ్యింది.

ఆర్థిక వ్యవస్థపైనే కాదు, ఉత్తర కొరియాలో దౌత్య కార్యకలాపాలపైనా ప్రభుత్వ చర్యల ప్రభావం పడుతోంది. వైరస్ నివారణకు నిర్బంధ పర్యవేక్షణ చర్యల వల్ల ప్యాంగ్యాంగ్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించలేకపోతున్నాయని రష్యా రాయబారి అలెగ్జాండర్ మాట్సెగోరా రష్యాకు చెందిన టీఏఎస్‌ఎస్ వార్తాసంస్థకు రాసిన వ్యాసంలో చెప్పారు.

కిమ్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించారని, సైనిక కవాతులను రద్దు చేశారని, వైరస్ వ్యాప్తి ఆందోళనతోనే ఆయన ఈ చర్యలు తీసుకొని ఉండొచ్చనే వార్తలు కూడా వచ్చాయి.

చిత్రం శీర్షిక గతంతో పోలిస్తే, కరోనావైరస్ వ్యాప్తి నివారణకు ఉత్తర కొరియా అసాధారణ రీతిలో స్పందిస్తోంది.

ఉత్తర కొరియా గతంలో ఎలా స్పందించింది?

2014లో ఎబోలా, 2000ల ప్రారంభంలో సార్స్ ప్రబలినప్పుడు ఈ స్థాయిలో ఉత్తర కొరియా స్పందించలేదు. 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వ్యాపించిన తర్వాత దాదాపు ఎనిమిది నెలలకు ఉత్తర కొరియా తమ దేశంలో ఈ కేసు బయటపడిందని ప్రకటించింది.

అప్పట్లో ఉత్తర కొరియా వాసులు విదేశాలకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించిందని అమెరికాకు చెందిన 38నార్త్ వెబ్‌సైట్లోని ఓ కథనం చెబుతోంది. నాడు ప్రభుత్వం విదేశీయులను 21 రోజులపాటు ప్రత్యేక వైద్య పరిశీలనలో ఉంచింది.

సార్స్ వ్యాపించినప్పుడు ఉత్తర కొరియా తన సరిహద్దులను పూర్తిగా మూసేయలేదు. వైరస్ వ్యాపించిన కొన్ని ప్రాంతాల నుంచే ప్రయాణాలను నిషేధించింది. బీజింగ్‌కు విమానాలను నెలపాటు నిలిపేసింది. ప్రత్యేక అనుమతి తీసుకున్నవారినే దేశంలోకి అనుమతించింది. సార్స్ బాధిత దేశాల నుంచి వచ్చిన వారిని 10 రోజులపాటు నిర్బంధ పర్యవేక్షణలో పెట్టింది.

2009లో హెచ్1ఎన్1 ఫ్లూ ప్రబలిన మొదట్లో ఉత్తర కొరియా ఒక్క కేసు నమోదైనట్లు కూడా ప్రకటించలేదు. తొమ్మిది మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధరణ అయ్యిందని కొన్ని నెలల తర్వాత తెలిపింది.

గతంలో వచ్చిన వ్యాధులతో పోలిస్తే కరోనావైరస్ విషయంలో ఉత్తర కొరియా పెద్దయెత్తున స్పందిస్తోందని, దీనికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ స్పందన సూచిస్తోందని ఎన్‌కే న్యూస్ సీనియర్ విశ్లేషకులు మిన్యంగ్ లీ వ్యాఖ్యానించారు.

(అదనపు రిపోర్టింగ్: శ్రేయాస్ రెడ్డి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: ప్రపంచవ్యాప్తంగా 8,00,000 దాటిన కోవిడ్ బాధితులు, 37,000 దాటిన మృతులు

కరోనావైరస్: వృద్ధులు చేయాల్సిన, చేయకూడని పనులు

కరోనావైరస్‌తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు

కరోనావైరస్: భారత సైన్యం రాత్రికి రాత్రే 1,000 పడకల ఆస్పత్రి నిర్మించిందా? ఏది నిజం? - BBC FactCheck

కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం

కరోనావైరస్‌లో ఏముంది... అది ఎందుకంత ప్రమాదకరం?

కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?

కరోనావైరస్‌: తెలంగాణలో దిల్లీ నిజాముద్దీన్ మత కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన ఆరుగురు మృతి

కరోనావైరస్:‌ వేలం వెర్రిగా సాగిన టాయిలెట్ రోల్స్ కొనుగోళ్ళ వెనుక అసలు కథేంటి?