కరోనావైరస్: ఇటలీలో 400కు పెరిగిన కేసులు

  • 27 ఫిబ్రవరి 2020
గ్రీస్ Image copyright Reuters
చిత్రం శీర్షిక గ్రీస్ తదితర దేశాలకూ కరోనావైరస్ విస్తరించింది

ప్రాణాంతక కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టటానికి అంతర్జాతీయంగా కృషి జరుగుతున్నప్పటికీ.. ఇటలీలో కరోనావైరస్ కేసుల సంఖ్య ఏకంగా 400కు పెరిగింది.

యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది.

ఇటలీలో కొత్త కేసుల ఆచూకీ తెలిసినట్లు పలు యూరప్ దేశాలు ప్రకటించాయి.

ఈ వైరస్ పుట్టిన చైనా వెలుపల వేగంగా వ్యాపించటం ఇదే తొలిసారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం నాడు పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 దేశాల్లో 80,000 మందికి పైగా జనం కరోనావైరస్ బారిన పడ్డారు. డిసెంబర్‌లో మొదలైన ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో అత్యధికులు చైనాలోనే ఉన్నారు.

ఈ వైరస్ వల్ల వచ్చే 'కోవిడ్-19' అనే శ్వాసకోశ వ్యాధివల్ల ఇప్పటివరకూ 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇటలీలో పరిస్థితి ఏమిటి?

ఇటలీలో బుధవారం రాత్రికి మొత్తం కరోనావైరస్ కేసులు 400 ఉన్నాయని అధికారులు నివేదించారు. మంగళవారం రాత్రి చెప్పిన కేసులకన్నా ఇవి 80 కేసులు పెరిగాయి.

మిలాన్ సమీపంలోని లాంబార్డీ, వెనిస్ సమీపంలోని వెనిటో ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించింది. దీనివల్ల దేశంలో ఇప్పటివరకూ 12 మంది చనిపోయారు.

ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

స్కూళ్లు, యూనివర్సిటీలు, సినిమా హాళ్లను మూసివేశారు. పలు బహిరంగ కార్యక్రమాలను రద్దుచేశారు.

వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతంలో 11 పట్టణాలను దిగ్బంధించారు. అందులో 55,000 మందికి పైగా జనం ఉన్నారు.

ఈ వైరస్ విజృంభణ వల్ల ఇటలీ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందన్న భయాలూ వ్యక్తమవుతున్నాయి. దేశంలో చాలా కేఫ్‌లు, హోటళ్లు ఖాళీగా ఉండటానికి వైరస్ భయమే కారణమని మిలాన్‌లోని బీబీసీ ప్రతినిధి మార్క్ లోవెన్ పేర్కొన్నారు.

మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి?

యూరప్‌లోని ఆస్ట్రియా, క్రొయేషియా, గ్రీస్, నార్వే, స్విట్జర్లాండ్, జార్జియా, నార్త్ మాసిడోనియాలు గత రెండు రోజుల్లో తమ దేశంలో తొలి కరోనావైరస్ కేసులు నమోదైనట్లు ప్రకటించాయి. ఆ కేసుల్లో చాలా వరకూ ఇటీవలే ఇటలీకి వెళ్లి తిరిగి వచ్చిన వారి ప్రమేయం ఉంది.

స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లో మరిన్ని కేసులు నమోదయ్యాయి. సిక్స్ నేషన్స్ రగ్బీ మ్యాచ్‌లలో మార్చి 7, 8 తేదీల్లో ఇటలీతో జరగాల్సిన ఆటలను ఐర్లండ్ వాయిదా వేసింది.

బ్రిటన్‌లో 13 కేసులు నమోదయ్యాయి. ఫ్లూ వంటి లక్షణాలు గల వారికి కూడా పరీక్షలు నిర్వహించటానికి కరోనావైరస్ పరీక్షలను పెంచుతున్నారు.

యూరప్ వెలుపల అల్జీరియా, బ్రెజిల్, పాకిస్తాన్‌లలో సైతం తొలి కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో తొలి కేసు నమోదవటంతో.. ఈ వైరస్ లాటిన్ అమెరికాలోనూ అడుగుపెట్టింది.

పశ్చిమాసియాలో వైరస్ కేంద్రబిందువుగా ఉన్న ఇరాన్‌లో గత వారం రోజుల్లో 139 కేసులు నమోదవగా, 19 మంది చనిపోయారు. ఈ వైరస్ మహమ్మారిగా మారుతుందనే భయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఏ నగరాన్ని లేదా పట్టణాన్ని దిగ్బంధించే ఆలోచన తమకు లేదని ప్రభుత్వం ప్రకటించింది.

వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న క్వామ్ ప్రాంతానికి ప్రజలు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అయితే.. ఏటా లక్షలాది మంది యాత్రికులు వచ్చే నగరంలోని ప్రార్థనా మందిరాన్ని మాత్రం మూసివేయలేదు.

చైనా వెలుపల అత్యధిక కేసులు నమోదైన దక్షిణ కొరియాలో ఇప్పటి వరకూ 1,200 మందికి ఈ వైరస్ సోకగా.. 12 మంది చనిపోయారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక మిలాన్‌లో బోసిపోయిన రాత్రి జీవితం

ప్రపంచ మహమ్మారిగా మారకుండా అడ్డుకోవచ్చు

ఫిలిప్పా కాక్స్‌బీ, బీబీసీ హెల్త్ రిపోర్టర్

కరోనావైరస్ చైనా వెలుపల ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తున్నప్పటికీ.. చైనాలో కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతుండటం సానుకూల అంశంగా కనిపిస్తోంది.

ప్రజలను ఇళ్లలో ఉండాలని చెప్పటం, పెద్ద సంఖ్యలో జనం పోగవకుండా చూడటం, ప్రయాణాలు, పనులు ఆపివేయటం వంటి చర్యలతో వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఇది చెప్తోంది.

ఈ వైరస్‌ ప్రపంచ మహమ్మారిగా మారకుండా నియంత్రించటం ఇప్పటికీ సాధ్యమేనని డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు చెప్తున్నారు.

ఈ వైరస్ విజృంభణ పట్ల అతిగా ప్రతిస్పందించటం వల్ల సామాజిక, ఆర్థిక నష్టాల గురించి బ్రిటన్ ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసింది.

ప్రజలను సురక్షితంగా ఉంచటం ప్రధమ ప్రాధాన్యం. సంయమనంతో, బాధ్యతగా వ్యవహరించటం కూడా అంతే ప్రధానమైన విషయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్: మణిపూర్ విద్యార్థులపై వివక్ష.. సూపర్ మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు

కరోనావైరస్: 24 గంటల్లో 549 కొత్త కేసులు.. 17 మరణాలు.. ఇండియాలో మొత్తం కేసులు 5,734

కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది

వుహాన్‌లో లాక్‌ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు

దిల్లీ హింస: అద్దాలు పగిలిన రాత్రి

కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా

కరోనావైరస్‌ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా

కరోనావైరస్ లాక్‌డౌన్ భారతదేశంలో ఆహార కొరతకు దారి తీస్తుందా?

కరోనావైరస్: లాక్‌డౌన్‌లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్‌జెండర్ల ఇబ్బందులు