లీపు సంవత్సరం ఎప్పుడు మొదలైంది? దీని అవసరం ఏంటి?

గడియారం

ఫొటో సోర్స్, PA

ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయని అడగ్గానే కొంచెం ఆలోచించి, 2020 నాలుగుతో భాగిస్తే 0 శేషంగా వస్తుంది కాబట్టి ఇది లీపు సంవత్సరం అవుతుంది, కాబట్టి ఈ ఫిబ్రవరిలో 29 రోజులుంటాయని చెప్పేస్తారు. మరి, ఈ లీపు సంవత్సరం ఎందుకు? అది ఎప్పటి నుంచి మొదలైంది?

అదనపు రోజు ఎందుకు?

సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో మాత్రం 366 రోజులు ఉంటాయి.

భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. అయితే, 0.2422 రోజును 0.25 రోజుగా పరిగణిస్తే, ఇలా ఏడాదికి దాదాపు ఆరు గంటలు మిగులుతుంది. అంటే, నాలుగేళ్లకకు ఒక రోజు (24 గంటలు) అవుతుంది. ఆ మిగిలిన రోజును నాలుగేళ్లకు* ఒకసారి క్యాలెండర్‌లో కలుపుతారు. అదే లీపు సంవత్సరం. అందుకే, సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి. లీపు సంవత్సరంలో మాత్రం 29 రోజులుంటాయి.

ఫొటో సోర్స్, bbc

2100వ సంవత్సరం లీపు ఇయర్ అవుతుందా?

సాధారణంగా నాలుగుతో భాగిస్తే శేషం 0 వచ్చే సంవత్సరం లీపు ఇయర్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కాబట్టి, 2100 కూడా లీపు సంవత్సరం అవుతుందని టక్కున చెప్పేస్తుంటారు.

అయితే, 2100ని నాలుగుతో భాగిస్తే శేషం 0 అయినప్పటికీ అది లీపు సంవత్సరం కాదు. దానికి ఒక నిబంధన ఉంది. పైన ప్రతి నాలుగేళ్లకు అనే పదానికి స్టార్ గుర్తు అందుకే పెట్టాం.

ఆ లాజిక్ ఏంటంటే... 100తో విభజించబడుతూ, 400తో విభజించబడని సంవత్సరం లీపు సంవత్సరం కాదు. కారణం... భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. కానీ, ఇందులో ప్రతి సంవత్సరం 0.25 రోజు మిగులుతున్నట్లు పరిగణించాం. కానీ, నిజానికి ఏటా మిగిలేది ఆరు గంటలకన్నా కొంచెం తక్కువే. ఆ కొద్దిపాటి వ్యత్యాసాన్ని కలిపితే 400 ఏళ్లలో మూడు రోజులు అవుతాయి. ఆ మూడు రోజులను భర్తీ చేసేందుకు ప్రతి 400 ఏళ్లలో మూడు లీపు సంవత్సరాలను కోల్పోతున్నాం.

ఉదాహరణకు 2100, 2200, 2300లు లీపు సంవత్సరాలు కావు. 2400 లీపు సంవత్సరం అవుతుంది.

ఫొటో సోర్స్, Tbs

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

లీపు సంవత్సరం ఎప్పుడు మొదలైంది?

రోమన్ చక్రవర్తి జూలియన్‌ సీజర్‌ హయాంలో లీపు సంవత్సరం మొదలైంది.

జూలియన్ సీజర్ అధికారంలోకి వచ్చే వరకూ 355 రోజుల వార్షిక క్యాలెండర్‌ ఉండేది. ప్రతి రెండు సంవత్సరాలకు 22 రోజులతో మరో నెల అదనంగా వస్తుండేది. దాంతో క్యాలెండర్‌కు, సీజన్లకు మధ్య తేడా వస్తుండేది.

ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని క్రీస్తుపూర్వం 46వ సంవత్సరంలో జూలియన్‌ సీజర్ తన ఖగోళ శాస్త్రవేత్త సోసిజెనెస్‌ను ఆదేశించారు.

సోసిజెనెస్ 365 రోజులను ఒక సాధారణ సంవత్సరంగా, ఏటా మిగిలిపోయే కొన్ని గంటలను కలిపి నాలుగేళ్లకోసారి క్యాలెండర్‌లో ఒక రోజును అదనంగా చేర్చాలని ప్రతిపాదించారు. అలా వచ్చిన జూలియన్ క్యాలెండర్‌తో లీపు సంవత్సరం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

లీప్ సంవత్సరం లేకపోతే ఏటా మిగిలిపోయే కొన్ని గంటల వల్ల కొన్ని శతాబ్దాల్లో క్యాలెండర్‌కు, సీజన్లకు మధ్య భారీ వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంటుంది

రోమన్ చక్రవర్తి అహం వల్లే

జూలియన్ క్యాలెండర్‌లో అప్పట్లో లీపు సంవత్సరంలోని ఫిబ్రవరి నెలలో 30 రోజులు ఉండేవి. జులైలో 31 రోజులు, ఆగస్టు నెలకు 29 రోజులు ఉండేవి.

కానీ, జూలియన్‌ తర్వాత వచ్చిన చక్రవర్తి సీజర్ ఆగస్టన్‌ అహం కారణంగా ఫిబ్రవరి రోజులు తగ్గి, ఆగస్టులో పెరిగాయని వావ్రిక్ విశ్వవిద్యాలయం గణిత ప్రొఫెసర్ ఇయాన్ స్వెవర్ట్ చెప్పారు.

"నా కంటే ముందు చక్రవర్తి జూలియన్ పేరుతో ఉన్న జులై నెలలో 31 రోజులుంటే, నా పేరుతో ఉన్న ఆగస్టులో తక్కువ ఎందుకుండాలి? రెండింటిలోనూ సమానంగా ఉండాల్సిందే... అంటూ సీజర్ ఆగస్టస్ ఆ క్యాలెండర్‌లో మార్పులు చేయించారు. అప్పుడు ఫిబ్రవరిలో రోజులను తగ్గించి, ఆగస్టులో 31 రోజులుండేలా క్యాలెండర్‌ను సవరించారు" అని ప్రొఫెసర్ స్వెవర్ట్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)