వెనెజ్వెలా విషాదం: ‘ఇక్కడ పసిపిల్లల్ని చెత్త కుండీలో పడేయడం మామూలైపోతోంది’

  • గ్విలెర్మో డి ఓల్మో
  • బీబీసీ ప్రతినిధి
శిశువులను చెత్తలో పడేయడం నిషిద్ధమనే సందేశంతో కూడిన పోస్టర్

ఫొటో సోర్స్, GUILLERMO D. OLMO

ఫొటో క్యాప్షన్,

శిశువులను చెత్తలో పడేయడం నిషిద్ధమనే సందేశంతో కూడిన పోస్టర్

"పసి బిడ్డలను చెత్తలో పడేయడం నిషిద్ధం" అనే సందేశంతో వెనెజ్వెలా కళాకారుడు ఎరిక్ మెజికానో రూపొందించిన ఈ బొమ్మ దేశంలో నెలకొన్న విషాదకర పరిస్థితిని సూచిస్తోంది.

రాజధాని కారకస్‌లో తాను నివసించే అపార్ట్‌మెంట్‌కు దగ్గర్లో ఓ చెత్తకుండీలో పసికందు బయటపడిన తర్వాత ఆయన ఈ బొమ్మ రూపొందించారు. తర్వాత దీనిని దేశవ్యాప్తంగా గోడలపై అతికించారు.

పసిపిల్లలను చెత్తకుండీలో పడేయడం-వదిలేయడం మామూలు విషయమైపోతోందని, కానీ ఇది మామూలు విషయం అనుకోవడానికి వీల్లేనిదని, ఈ నిజాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకే తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టానని మెజికానో వివరించారు.

వెనెజ్వెలాలో దాదాపు మూడో వంతు జనాభా అంటే 90 లక్షల మందికి పైగా ప్రజలకు తగినంత ఆహారం అందడం లేదని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) అధ్యయనం చెబుతోంది. ఆర్థిక వ్యవస్థ పతనం, భరించలేనంతగా ధరలు పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

దేశంలో గర్భనిరోధక సాధనాలు అంతగా అందుబాటులో లేకపోవడం, చాలా మందికి వాటిని కొనగలిగేంత డబ్బు లేకపోవడం లాంటి కారణాల వల్ల అవాంఛిత గర్భధారణను అడ్డుకోలేకపోతుంటారు. గర్భస్రావం (అబార్షన్) చట్టాలు కఠినంగా ఉండటం మరో ముఖ్యమైన కారణం. తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటే తప్ప గర్భం తొలగించడాన్ని ఇక్కడి చట్టాలు అనుమతించవు.

వీధుల్లో, లేదా ప్రభుత్వ భవనాల ముందు వదిలేసిన శిశువుల సంఖ్య 70 శాతం పెరిగిందని 2018లో ఓ సేవాసంస్థ తెలిపింది.

ఇటీవలి సంవత్సరాల్లో ఈ అంశంపై ప్రభుత్వం అధికారిక గణాంకాలేవీ వెల్లడించలేదు. ఈ సమస్యపై సమాచార శాఖ, బాలల హక్కుల సంస్థ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. వాటి నుంచి స్పందన రాలేదు.

తల్లిదండ్రులు వదిలేసే, అనధికార దత్తత కింద ఇచ్చే పిల్లల సంఖ్య పెరగడం వాస్తవమేనని సామాజిక సేవలు, ఆరోగ్య సేవల కార్యకర్తలు పలువురు బీబీసీతో చెప్పారు.

దేశంలో దత్తత ఇచ్చే వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దీనికి ఆర్థిక తోడ్పాటు సరిగా లేదని, దీంతో తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో శిశువులను వదిలిపెట్టడం లాంటి మార్గాలను ఎంచుకొంటున్నారని కారకస్‌లో దారిద్ర్యం తాండవించే ఒక ప్రాంతంలోని బాలల పరిరక్షణ మండలి సభ్యుడైన గైనకాలజిస్ట్ నెల్స్ విల్లాస్మిల్ తెలిపారు.

ఆయన ఓ ఉదాహరణను ప్రస్తావించారు. థామస్(అసలు పేరు కాదు) కారకస్‌లో ఒక పేదరాలికి జన్మించాడని, అతడిని పోషించే స్తోమత తనకు లేదని ఆమె భావించారని డాక్టర్ విల్లాస్మిల్ చెప్పారు.

థామస్ పుట్టినప్పుడు అక్కడే ఉన్న ఆయన, శిశువును ఆదుకొనేందుకు అంగీకరించారు. శిశువును పోషించలేనని ఓ తల్లి చెప్పడం ఇదే తొలిసారి కాదని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పిల్లలకు ఆహారం అందించేందుకు వెనెజ్వెలాలో సామాజిక వంటశాలలు ఏర్పాటు చేశారు. అయినా వారిని పోషకలోపం వేధిస్తోంది.

సాధారణంగా బిడ్డకు తొలిసారి పాలు పట్టించిన తర్వాత తల్లుల ఆలోచన మారిపోతుంటుందని, కానీ కొన్నిసార్లు అలా జరగదని, అప్పుడు బిడ్డ విషయంలో ఏంచేయాలనేది ఆలోచించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

థామస్ తల్లి నిస్సహాయత వ్యక్తంచేసిన తర్వాత విల్లాస్మిల్ తన పేషెంట్లలో ఒకరిని సంప్రదించారు. ఆమె తానియా(అసలు పేరు కాదు). 40ల్లో ఉన్నారు. బిడ్డకు జన్మనివ్వాలని ఆమె పరితపించేవారు. అయితే ఆమె గర్భం దాల్చలేకపోయారు.

థామస్‌ను, అతడి తల్లిని ఆదుకొనేందుకు తానియా ముందుకొచ్చారు. తర్వాత థామస్‌ను తీసుకోవడానికి ఆమె నిరాకరించారు. తన స్నేహితులైన ఒక జంటను సంప్రదించారు. వెనెజ్వెలాలోని ఓ గ్రామీణ ప్రాంతాని చెందిన ఆ జంట- థామస్‌ను సొంత బిడ్డలా పెంచుకొనేందుకు అంగీకరించింది.

ఆ జంట ఇంట్లో థామస్ ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు.

తాను చేసిన పనిపై తనకు విచారం లేదని తానియా చెప్పారు. థామస్ మేలు కోసమే అధికారిక దత్తత మార్గాలను అనుసరించకుండా ఇలా చేశానని తెలిపారు. వెనెజ్వెలాలో చట్టబద్ధమైన దత్తత అనేది పెద్దగా పనిచేయదని, అనాథాశ్రమానికి అప్పగిస్తే థామస్‌ చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆమె వ్యాఖ్యానించారు.

థామస్‌ను అతడి తల్లి అంగీకారంతోనే తానియా స్నేహితులకు అప్పగించారు.

థామస్ తల్లిలాగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉండే మహిళలను మోసగించేవారికీ వెనెజ్వెలాలో కొదవ లేదు.

ఇందుకు ఇసాబెల్ కథే ఓ ఉదాహరణ.

రెండో సంతానం కడుపులో ఉన్నప్పుడు ఇసాబెల్(అసలు పేరు కాదు) భర్త చనిపోయారు. దీంతో బిడ్డను వదులుకోవాలనే ఆలోచన ఆమె చేశారు. ఒంటరినైపోయిన తాను బిడ్డను పోషించలేనని అనుకొన్నానని ఇసాబెల్ తెలిపారు.

తెలిసినవాళ్ల సలహా మేరకు ఆమె కరీబియన్ ప్రాంతంలోని ట్రినిడాడ్ దీవికి వెళ్లి ఓ జంటను కలుసుకొన్నారు. పుట్టబోయే శిశువును దత్తత తీసుకోవడానికి ఆ జంట ఆసక్తిగా ఉందని వాళ్లు చెబితే ఆమె అక్కడకు వెళ్లారు.

దత్తతకు సంబంధించిన ఏర్పాట్లను ఒక కొలంబియా మహిళ చూసుకున్నారు. అంతా తన మాట ప్రకారమే చేస్తామని మొదట్లో ఇసాబెల్‌కు చెప్పారు. తర్వాత ఆమె ఆలోచనలకు విరుద్ధంగా కొలంబియా మహిళ నుంచి ఒత్తిడి ఎదురైంది.

అంతా చట్టబద్ధంగానే జరుగుతోందని తనతో చెప్పారని, కానీ అలా జరగడం లేదని తనకు అర్థమైందని ఆమె తెలిపారు. వాస్తవానికి తాను మనుషుల అక్రమ రవాణా వలలో చిక్కుకున్నానని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వెనెజ్వెలాలో ఆర్థిక వ్యవస్థ పతనం, ధరల పెరుగుదలతో మూడో వంతు ప్రజలకు తగినంత ఆహారం దొరకడం లేదు.

తనపై ఎప్పుడూ నిఘా ఉండేదని ఆమె వెల్లడించారు. తానుంటున్న ఇంటి నుంచి ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదని, ట్రినిడాడ్ నుంచి వెనెజ్వెలాకు తిరిగి రావడానికి విమాన టికెట్ తీయిస్తామన్నారని, కానీ అలా చేయలేదని వివరించారు.

ట్రినిడాడ్‌కు వెళ్లిన తర్వాత కొన్ని వారాలకు అక్కడి ఆస్పత్రిలో ఆమె నెలలు నిండకుండానే ఒక మగబిడ్డను ప్రసవించారు. శిశువును దత్తత ఇవ్వొద్దని ఆమె నిర్ణయించుకున్నారు. కానీ కొలంబియా మహిళ, న్యాయవాదినని చెప్పుకొన్న ఓ పురుషుడు బిడ్డను తమకు ఇవ్వాలని ఆమెను ఒత్తిడి చేశారు.

దత్తత తీసుకోవాలనుకొన్న జంట పార్కింగ్ ప్రదేశంలో ఎదురుచూస్తోందని, ఇంగ్లిష్‌లో ఉన్న కొన్ని పత్రాలపై సంతకం చేసి, బిడ్డను ఇచ్చేయాలని చెబుతూ ఒత్తిడి చేశారని ఇసాబెల్ వివరించారు. తనకు ఆ పత్రాలు అర్థం కాలేదన్నారు.

బిడ్డను ఇవ్వడానికి ఇసాబెల్ తొలుత ససేమిరా అన్నారు. తర్వాత ఆమెను బంధించినవారు ఆహారం, ఔషధాలు, బిడ్డకు అవసరమైన డైపర్లు నిరాకరించి ఒత్తిడి పెంచారు.

నిస్సహాయ పరిస్థితుల్లో మరో మార్గం లేక బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు, తాను తిరిగి వెనెజ్వెలా చేరుకొనేందుకు బిడ్డను వాళ్లకు ఇచ్చేయాల్సి వచ్చిందని ఇసాబెల్ రోదిస్తూ చెప్పారు.

ఇసాబెల్ కొడుకు ప్రస్తుతం ట్రినిడాడ్‌లో అధికార యంత్రాంగం సంరక్షణలో ఉన్నాడు. అతడిని వారానికి ఒకసారి చూసేందుకు మాత్రమే ఆమెకు అనుమతి ఉంది.

అతడిని తిరిగి తన అప్పగించాలంటూ ఇసాబెల్ న్యాయపోరాటం చేస్తున్నారు. తన బిడ్డ తనకు దక్కే వరకు పోరాడుతూనే ఉంటానని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)