హ్యాండ్‌‌‌షేక్‌ చరిత్ర.. ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది? - కరోనావైరస్

హ్యాండ్ షేక్ చరిత్ర షేక్ హ్యాండ్ హిస్టరీ

ఫొటో సోర్స్, iStock

కరోనావైరస్ కలకలం మొదలైనప్పటి నుంచి రకరకాల ఆరోగ్య సూత్రాలపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు షేక్ హ్యాండ్ వద్దు, నమస్తేనే ముద్దు అని చాలామంది అంటున్నారు.

షేక్‌హ్యండ్ ఇస్తే ఒకరి నుంచి మరొకరికి క్రిములు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పలకరించడమే మంచిదని ఆరోగ్య నిపుణులూ చెబుతున్నారు.

చైనా రాజధాని బీజింగ్‌లో అయితే షేక్‌హ్యాండ్స్ ఇవ్వొద్దని ఎక్కడికక్కడ బోర్డులు పెట్టారు. ఫ్రాన్స్‌లో షేక్‌హ్యాండ్లకు ప్రత్యామ్నాయాలు సూచిస్తూ పత్రికల్లో ప్రకటనలు వేస్తున్నారు. జర్మనీ, పోలాండ్, ఇరాన్ లాంటి అనేక దేశాల్లో ఇప్పుడు ఇలాంటి హెచ్చరికలే జారీ అవుతున్నాయి.

ఇక ఈ నెలలో శ్రీలంకలో పర్యటించనున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టయితే, తాము ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రస్తకే లేదని తేల్చి చెప్పింది. దానికి బదులుగా ఫిస్ట్ బంప్స్.. అంటే పలకరింపుగా ఒకరి పిడికిలిని మరొకరి పిడికిలితో గుద్దుతామని చెప్పింది.

ప్రపంచమంతా షేక్ హ్యాండ్‌లకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న ఈ సమయంలో, అసలు ఆ షేక్‌హ్యాండ్ చరిత్ర ఏంటో, ఇది ఎలా పుట్టిందో, దీని ప్రాధాన్యం ఏంటో ఒకసారి చూద్దాం.

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్,

గ్రీకుల కాలంలో హెర్క్యులస్‌తో యాంటియోకస్ 1 కరచాలనం చేస్తున్నట్లు చెక్కిన శిల్పం

షేక్‌హ్యాండ్ ఎలా పుట్టింది?

ఒకరికి ఒకరు పలకరింపుగా షేక్‌హ్యండ్ ఇచ్చుకోవడం అనేది 5వ శతాబ్దం నుంచీ ఉందని ఎన్నో చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ సమయంలో చెక్కిన అనేక శిల్పాలు, వేసిన చిత్రాలపై ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు కనిపించే దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. వాటినిబట్టి పలకరింపు కోసం చేతులు కలపడం అన్నది చాలా పురాతన సంప్రదాయమే అని తెలుస్తోంది. కానీ, ఇలా చేతులు కలపడానికి వెనక ఓ ఆసక్తికర కారణం ఉంది.

అప్పట్లో సైనికులు, రాజులంతా కూడా తమ నడుముకు ఎడమవైపు ఒర పెట్టుకొని అందులో కత్తులు పెట్టేవారు. అవసరమైతే క్షణాల్లో తమ కుడిచేత్తో ఆ కత్తిని బయటకు తీసి ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చనే అలా చేసేవారు. దానికి బదులుగా ఒకరి ఖాళీ కుడి చేతిని మరో కుడి చేత్తో కలుపుతూ పలకరించుకోవడం ద్వారా, తమకు ఎదుటి వ్యక్తితో శత్రుత్వం లేదనీ, కాబట్టి కత్తిని బయటకు తీసే అవసరం రాదని సూచించేవారు. అంటే స్నేహానికి, ఎదుటి వ్యక్తిపై నమ్మకానికి ప్రతీకగా ఇలా షేక్‌హ్యాండ్ ఇవ్వడం మొదలైందని చెబుతారు.

రోమన్లు షేక్‌హ్యాండ్‌కు ముందు ఒక వ్యక్తి మోచేతిని మరో వ్యక్తి అరి చేత్తో పట్టుకొని పలకరించుకునేవారని, దానివల్ల ఎదుటి వ్యక్తి దగ్గర ఆయుధాలు లేవని నిర్ధరించుకునేవారని అంటారు.

షేక్‌హ్యాండ్ ఇచ్చేప్పుడు చేతుల్ని బలంగా పైకీ కిందకు కూడా ఊపుతుంటారు. చొక్కాలొపల ఎక్కడైనా చాకుల లాంటి చిన్నచిన్న ఆయుధాలు దాచుకుంటే, ఆ షేక్‌హ్యండ్ కుదుపులకు అవి జారిపడిపోతాయని అలా చేసేవారు. కానీ, క్రమంగా అది పలకరింపులో భాగమైపోయింది.

రాజకీయాల్లో, క్రీడల్లో, వ్యాపార సమావేశాల్లో.. ఇలా అనేక సందర్భాల్లో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది కాలక్రమంలో చాలా కీలకంగా మారింది. ఒకవేళ షేక్‌హ్యండ్ ఇవ్వకపోతే కొన్ని సందర్భాల్లో దాన్ని దురుసుతనంగా కూడా భావిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జపాన్‌లో ఇలా ముందుకు వంగి ఎదుటివారిని గౌరవిస్తుంటారు

ప్రపంచమంతా ఇంతేనా?

షేక్‌హ్యాండ్ ఇచ్చే అలవాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ, అనేక దేశాల్లో పలకరింపు కోసం ఇతర పద్ధతుల్ని కూడా ఉపయోగిస్తుంటారు. భారత్‌నే తీసుకుంటే, ఒకచేతిని మరో చేత్తో జోడిస్తూ, కాస్త కిందకు వంగి నమస్తే చెప్పే సంప్రదాయం ఎప్పట్నుంచో ఉంది. థాయిలాండ్‌లోనూ ఇదే పద్ధతి పాటిస్తారు. ఫ్రాన్స్‌, మొరాకో లాంటి దేశాల్లో పలకరింపుగా బుగ్గ మీద ముద్దు పెడతారు. జపాన్‌లో అయితే చేతుల్ని కాస్త దూరంగా పెట్టి, పలకరింపుగా ముందుకు వంగుతారు. ఇలా వేర్వేరు దేశాల్లో ఒక్కో విధమైన పలకరింపు ఉన్నప్పటికీ షేక్‌హ్యాండ్ అనేది ఒక యూనివర్సల్ పలకరింపుగా మారిపోయింది.

రష్యాలో ఆడవాళ్లు పెద్దగా షేక్‌హ్యండ్ ఇవ్వరు. అరబ్ దేశాల్లో కూడా అంతే. నార్వే, అమెరికా లాంటి దేశాల్లో చాలా బలంగా షేక్ హ్యాండ్ ఇస్తారు. కొరియా దేశాల్లో అయితే పెద్దవాళ్లే ముందుగా షేక్‌హ్యండ్ కోసం చేయి జాపుతారు. ఇలా షేక్ హ్యాండ్‌కు చాలా ప్రాధాన్యం ఉన్నప్పటికీ ప్రపంచంలో అత్యంత అనారోగ్యకర పలకరింపు షేక్‌హ్యాండేనని యూకేలోని అబెరీస్ట్విత్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. వేరే పద్ధతులతో పోలిస్తే షేక్‌హ్యండ్ ద్వారా 90 శాతం ఎక్కువగా క్రిములు ఇతరులకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. అదండీ షేక్‌హ్యండ్ కథ... అందరికీ నమస్తే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)