మహిళల టీ20 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్... తుదిపోరు ఆస్ట్రేలియాతో

మహిళల క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, భారత్ మధ్య గురువారం సిడ్నీలో జరగాల్సిన సెమీస్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతైనా పడకుండానే రద్దైంది.

దీంతో గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటంతో నిబంధనల ప్రకారం భారత్ ఫైనల్ చేరుకుంది.

గ్రూప్ దశలో ఎ-విభాగంలో ఉన్న భారత్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఇంగ్లండ్ గ్రూప్ దశ‌లో బి-విభాగంలో ఉంది. భారత్ కన్నా రెండు పాయింట్లు వెనకబడింది.

సెమీస్ రద్దైతే, పాయింట్ల పరంగా ముందున్న జట్టును ఫైనల్‌కు పంపాలని నిబంధనలు ఉన్నాయి.

ఈ టోర్నీలో ఫైనల్ చేరుకోవడం భారత్‌కు ఇదే తొలిసారి.

ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య మరో సెమీఫైనల్ మ్యాచ్ కూడా సిడ్నీలోనే గురువారమే జరిగింది.

వర్షం వల్ల ఈ మ్యాచ్‌కు కూడా ఆటంకం ఎదురైంది.

చివరికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించినట్లుగా ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images

సెమీఫైనల్ ఆడకుండానే ఫైనల్‌కు చేరుకోవడం గురించి భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించారు.

"ఆట ఆడకపోవడం బాధగానే ఉంది. కానీ నిబంధనలు మనం పాటించాలి కదా. రిజర్వ్ డేలు ఉండాలనుకోవడం మంచి ఆలోచన. మేం మొదటి నుంచీ అన్ని 1మ్యాచులనూ గెలవాలనే లక్ష్యంతోనే ఆడాం. లేదంటే, ఒకవేళ సెమీ ఫైనల్ జరగకపోతే అప్పుడు చాలా కష్టమవుతుంది. టీమ్‌గా ఆడి అన్ని మ్యాచుల్లో విజయం సాధించాం. షఫాలీ, స్మృతి... ఇలా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. వాళ్లిచ్చే మంచి ఆరంభం మాకు ఎంతో ఉపయోగపడుతోంది. మేం పెద్ద స్కోర్లు సాధించకపోయినప్పటికీ ఓ టీమ్‌గా బాగా రాణిస్తున్నాం. మాకిది మొదటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్. ఇది మాకెంతో ప్రత్యేకం. ఫైనల్లో కూడా మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తాం. ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా బాగా ఆడాయి. అందుకే, మేము ఇతర జట్ల గురించి పెద్దగా ఆలోచించట్లేదు" అని ఆమె అన్నారు.

"చాలా బాధగా ఉంది. మా వరల్డ్ కప్ ప్రయాణాన్ని ఇలా ముగించాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఆడే అవకాశం లేదు, రిజర్వ్ డే లేదు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమికి మేం మూల్యం చెల్లించుకున్నాం. సెమీఫైనల్‌కు చేరాలనేది మా లక్ష్యం. అది మేం చేరుకున్నాం. గత కొన్ని మ్యాచుల్లో మేం చాలా మెరుగయ్యాం. సెమీస్ వరకూ చేరాం. మా స్పిన్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. మాకు మంచి క్రికెటర్లు దొరికారు" అని ఇంగ్లండ్ కెప్టెన్ హిథర్ నైట్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)