జోసెఫ్ స్టాలిన్: అలనాటి సోవియట్ అధినేత జీవితం... ఇలా ముగిసింది

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
స్టాలిన్

ఫొటో సోర్స్, Getty Images

అది 1952 డిసెంబర్ 21. తన పుట్టిన రోజు సందర్భంగా స్టాలిన్ తన 'బిలజ్నాయా' డాచాలో ఓ విందు ఏర్పాటు చేశారు. తనకు బాగా దగ్గరివాళ్లను మాత్రమే ఆ పార్టీకి ఆహ్వానించారు.

గ్రామ్‌ఫోన్‌లో జానపద సంగీతంతో పాటు డాన్స్ పాటలు కూడా ప్లే అవుతున్నాయి. స్టాలిన్ స్వయంగా తన పర్యవేక్షణలో రికార్డుల్ని ఎంపిక చేయిస్తున్నారు. అయితే, అక్కడున్న ఇద్దరు అతిథులకు మాత్రం ఇదంతా నచ్చడం లేదు.

వారిలో ఒకరు నికితా కృశ్చెవ్. ఆయనకు డాన్స్ అంటే ఏ మాత్రం పడదు. స్టాలిన్ ఆయనను మరింత ఉడికిస్తూ, యుక్రేనియన్లు చేసే 'గోపాక్' డాన్స్ చేయాలని కోరారు. స్టాలిన్ స్వయంగా డాన్స్ 'స్టెప్పులు' వేయడంలో ఏనాడూ ప్రావీణ్యం సంపాదించలేదు. కానీ, ఇతరులతో డాన్స్ చేయిస్తూ, వాళ్లను ఏడిపించడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఎదుటివాళ్లు డాన్స్‌ సరిగా రాని వాళ్లయితే ఆయనకు మరీ సరదా.

ఆ సాయంత్రాన్ని ఇష్టపడని మరో వ్యక్తి ఓ మహిళ. ఆమె మరెవరో కాదు, స్వయంగా స్టాలిన్ కూతురు స్వెత్లానా అలిలుయెవా.

అప్పటికి ఆమెకు 26 ఏళ్లు. కానీ అప్పటికే ఆమెకు రెండు సార్లు విడాకులయ్యాయి. ఎవరైనా ఏదైనా పని చేయాలని తనకు ఆదేశాలు ఇవ్వటాన్ని స్వెత్లానా ఏ మాత్రం సహించలేకపోయేవారు.

స్టాలిన్ ఆమెతో కలిసి డాన్స్ చేస్తానని అన్నప్పుడు ఆమె అందుకు గట్టిగా తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

స్టాలిన్ కుమార్తె స్వెత్లానా అలిలుయెవా

ఆయన స్వెత్లానా జుట్టు పట్టుకున్నారు

ఆమె తన ప్రతిపాదనను తోసిపుచ్చడాన్ని స్టాలిన్ సహించలేకపోయారు. ఆయనకు కోపం వచ్చింది.

ఆయన తన కూతురి జుట్టు పట్టుకొని, ఆమెను దాదాపు ఈడ్చినంత పని చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అవమానంతో స్వెత్లానా మొఖం ఎర్రబడింది. కళ్లలో కన్నీళ్లు ఉబికాయి.

తన ఆత్మకథ 'కృశ్చెవ్ రిమెంబర్స్'లో నికితా కృశ్చెవ్ ఇలా రాశారు, 'స్టాలిన్ ఇలా మొరటుగా ప్రవర్తించడానికి కారణం స్వెత్లానాకు ఏదో ఇబ్బంది కలిగించాలని కాదు. నిజానికి స్వెత్లానా పట్ల ఆయన ప్రేమను చూపించే పద్ధతి ఇదే. కానీ, ఇతరులకు మాత్రం ఆయన ఆమె పట్ల అతిగా వ్యవహరిస్తున్నట్టుగా అనిపించసాగింది. స్టాలిన్‌కు ఇది అలవాటే. ఆయన తరచూ ఈ విధంగానే వ్యవహరిస్తుండేవారు.'

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కుమార్తెతో స్టాలిన్

డాచాలో స్టాలిన్ విందు

రెండు నెలల తర్వాత, ఫిబ్రవరి 28న తనతో కలిసి ఒక సినిమా చూసేందుకు తన సీనియర్ సహచరులైన జార్జీ మెలెన్‌కోవ్, బేరియా, కృశ్చెవ్, బుల్గానిన్‌లను తన 'డాచా'లోకి (సెలవుల్లో బస చేసే కాటేజి లాంటిది) స్టాలిన్ ఆహ్వానించారు.

సినిమా చూశాక అందరికీ మంచి భోజనం వడ్డించారు. అంతా కలిసి మద్యం సేవించారు.

స్టాలిన్ మనసును నొప్పించగల ఏ మాటనూ అక్కడ లేవనెత్తకుండా పార్టీ ప్రెసీడియం సభ్యులు పూర్తి జాగ్రత్త వహించారు. విందు మార్చి 1 తెల్లవారుజామున 4 గంటలకు పూర్తయింది.

స్టాలిన్‌కు ఒంట్లో బాగా లేదని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు.

ఆ తర్వాత కృశ్చెవ్ ఇలా రాశారు, 'మేం అక్కణ్నుంచి బయలుదేరే సమయానికి స్టాలిన్ చాలా చలాకీగా ఉన్నారు. ఆయన మాతో చాలా సరదాగా కబుర్లాడారు. ఆయన మాటిమాటికీ నా పొట్టలోకి వేళ్లు జొనిపారు. ఆయన యుక్రెయినియన్ యాసలో నన్ను కావాలనే 'మికితా' అని పిలవసాగారు.'

ఫొటో సోర్స్, Getty Images

అంగరక్షకులకు గదిలోకి రావొద్దనే ఆదేశాలు

పడుకోవడానికి గదిలోకి వెళ్తున్నానని స్టాలిన్ తన అంగరక్షకులకు తెలిపారు.

'నేను స్వయంగా పిలిచేంత వరకూ ఎవరూ తన గదిలోకి రావద్దని స్టాలిన్ మమ్మల్ని ఆదేశించారు' అని ఆయన అంగరక్షకుల్లో ఒకరైన పావెల్ లోజ్గాచేవ్ ఆ తర్వాత స్టాలిన్ జీవితచరిత్ర రచయిత ఎడ్వర్డ్ రాద్జిన్స్కీతో చెప్పారు.

స్టాలిన్ జీవితచరిత్ర రాసిన మరో రచయిత రాబర్ట్ సర్విస్ ఇలా రాశారు, 'మార్చి 1న రోజంతా స్టాలిన్ గదిలోంచి ఎలాంటి అలికిడీ లేదు. అక్కడ పనిచేసే ప్రతి గార్డు షిఫ్టు రెండు గంటలే ఉంటుంది. రెండు గంటల షిఫ్టు తర్వాత గార్డు రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. గార్డులు అన్ని వేళల్లో అప్రమత్తంగా, ఏ మాత్రం అలసట లేకుండా ఉండేందుకు గాను ఈ పద్ధతిని అనుసరించేవారు.'

ఫొటో సోర్స్, Getty Images

పొద్దంతా గదిలోంచి ఒక్క మాటా వినిపించలేదు

పొద్దున నిద్రలేవగానే ఒక నిమ్మకాయ ముక్కతో కప్పు చాయ్ కావాలని కోరడం స్టాలిన్‌కు అలవాటు.

ఆరోజు తాము చాలా కంగారు పడ్డామని ఆయన అంగరక్షకుల్లో ఒకరైన మార్షల్ ఎలెగ్జాండర్ యోరోవ్ ఆ తర్వాత అన్నారు. ఎందుకంటే తనకు ఇష్టమైన లెమన్ టీ కావాలని స్టాలిన్ ఆ రోజంతా అడగనే లేదు.

అయితే, బహుశా గదిలో ఫ్లాస్క్ ఉంది కాబట్టి ఆయన అందులో ఉన్న చాయ్ తాగేశారేమోనని కొందరు భావించారు.

సాయంత్రం చీకట్లు పడగానే డాచాలో లైట్లు వెలిగించారు. అప్పటికీ స్టాలిన్ తన గదిలోంచి బయటకు రాలేదు.

ఆయన భోజనం కావాలనీ అడగలేదు, మరే పనీ పురమాయించలేదు.

రాత్రి 10 గంటల సమయంలో సెంట్రల్ కమిటీ కార్యాలయం నుంచి స్టాలిన్ కోసం ఒక ప్యాకెట్ వచ్చింది. గార్డులంతా పరస్పరం సంప్రదించుకొన్న తర్వాత ఆ ప్యాకెట్ తీసుకొని స్టాలిన్ బెడ్‌రూమ్‌లోకి పావెల్ లోజ్గాచేవ్‌ వెళ్లాలని నిర్ణయించారు.

గదిలోకి అడుగుపెట్టిన పావెల్ అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images

నేలపై పడిపోయి ఉన్న స్టాలిన్

స్టాలిన్ జీవితచరిత్ర రచయిత ఎడ్వర్డ్ రాద్జిన్స్కీ ఇలా రాశారు, 'స్టాలిన్ నేలపై పడిపోయి ఉన్నారు. ఆయన చేయి కాస్త పైకి లేచి ఉంది. అప్పటికి ఆయన పూర్తిగా స్పృహ కోల్పోలేదు. అయితే ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారు. తన పైజామాలోనే మూత్రం పోసుకున్నారు. పక్కనే 'ప్రావ్దా' వార్తాపత్రిక, మినరల్ వాటర్ బాటిల్ పడి ఉన్నాయి. స్టాలిన్ లైట్ వేయడానికి ప్రయత్నించే క్రమంలో పడిపోయి ఉండొచ్చని గార్డులు అంచనా వేశారు.'

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత జరిగినా కూడా డాక్టరును పిలిపించాల్సిన అవసరం ఉందని మాత్రం ఎవ్వరూ ఆలోచించలేదు.

మాస్కోలో ఉన్న హోంమంత్రి సర్జెయి ఇగ్నాతియేవ్‌కు గార్డులు ఫోన్ చేశారు. ఆయన మెలెన్‌కోవ్, బేరియాలకు సమాచారం అందించారు.

ఆ సమయంలో బేరియా తన స్నేహితురాలితో ఒక డాచాలో రాత్రిని గడుపుతున్నారు.

కామ్రేడ్ స్టాలిన్ అనారోగ్యం గురించి ఎవరూ ఎవ్వరికీ ఏమీ చెప్పొద్దని బేరియా ఆదేశించినట్టుగా వోల్కోగోనోవ్, రాద్జిన్స్కీలిద్దరూ తాము రాసిన స్టాలిన్ జీవితచరిత్రల్లో పేర్కొన్నారు.

మరోవైపు స్టాలిన్ డాచాలో ఉన్నవారు పై నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూడసాగారు. ఈలోగా వారు స్టాలిన్‌ను నేల మీది నుంచి లేపి దీవాన్‌పై పడుకోబెట్టి, రగ్గును కప్పారు.

కొద్ది సేపటి తర్వాత డైనింగ్ హాల్‌లో ఉన్న మరో మంచంపైకి స్టాలిన్‌ను మార్చారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బేరియా

గార్డుల్ని బయటకు పంపించిన బేరియా

బేరియా, మెలెన్‌కోవ్‌లు అక్కడికి ముందుగా చేరుకున్నారు.

స్టాలిన్ జీవితచరిత్ర 'స్టాలిన్ - ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ'లో దిమిత్రీ వోల్కోగోనోవ్ ఇలా రాశారు, 'మెలెన్‌కోవ్ తన బూట్లు విప్పి చేతిలో పట్టుకున్నారు. ఎందుకంటే స్టాలిన్ గదిలోని మెరిసిపోయే గచ్చుపై అవి శబ్దం చేస్తున్నాయి. ఆయన, బేరియా ఇద్దరూ స్టాలిన్ ఎదుట నిలబడే సమయానికి స్టాలిన్ జోరుగా గుర్రు కొడుతున్నారు. దాంతో డాక్టరును పిలిపించడానికి బదులు, బేరియా గార్డుల్ని గదమాయిస్తూ - మీకు కనిపించడం లేదా, కామ్రేడ్ స్లాలిన్ గాఢనిద్రలో ఉన్నారు. మీరంతా గదిలోంచి బయటకు వెళ్లిపోండి. బాస్‌ను విశ్రాంతిగా పడుకోనివ్వండి - అన్నారు.'

డాక్టర్లను పిలవడంలో ఆలస్యం

కృశ్చెవ్ తన ఆత్మకథలో ఇలా రాశారు, 'మారి 2 ఉదయానికల్లా నాయకులందరూ స్టాలిన్ డాచా వద్దకు చేరుకోసాగారు. అప్పటికీ స్టాలిన్‌ను చూసేందుకు డాక్టరును మాత్రం పిలిపించలేదు.'

ఉదయం 10 గంటలకు స్వెత్లానాకు విషయం తెలిసింది. ఆ సమయంలో ఆమె ఫ్రెంచ్ భాష బోధించే క్లాసులో ఉన్నారు.

రాబర్ట్ సర్విస్ ఇలా రాశారు, 'కావాలనే స్టాలిన్ ఆరోగ్యం విషమించేలా చేశారనే అనుమానాలకు మూలం ఇక్కడే ఉంది. మరోవైపు ఆయన డిప్యూటీలెవ్వరూ నిర్ణయం తీసుకోవడానికి తటపటాయించారేమో అన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే, స్టాలిన్ మళ్లీ కోలుకున్నాక ఆయన జబ్బు పడ్డ సమయంలో దేశానికి ఇంచార్జి అయ్యే దుస్సాహసానికి ఒడిగట్టినందుకు తమకు భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చనే భయాలూ వారిలో లేకపోలేదు.'

దీని వెనుక మరో కథ ఉందని కూడా చెబుతుంటారు.

1953 ప్రారంభంలోనే స్టాలిన్ చాలా సార్లు స్పృహ కోల్పోయారు. ఆయనకు బ్లడ్ ప్రెషర్ కూడా చాలా పెరిగింది. దాంతో ఆయన సిగరెట్ తాగటం మానేశారు. అయితే చివరి వరకూ ఆయనకు తన డాక్టర్లపై విశ్వాసం లేదు. వాళ్లెప్పుడూ ఆయనను ఆయన డాచాకు దూరంగా ఉంచాలనే చూసేవారని వోల్కోగోనోవ్ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images

నెత్తుటి వాంతులు

డాక్టరు అక్కడికి చేరుకునే సమయానికి స్టాలిన్ జబ్బుపడి 12 గంటలు గడిచింది.

అప్పటికి స్టాలిన్ బట్టలన్నీ ఆయన మూత్రంతో తడిచిపోయి ఉన్నాయి. వారు బట్టలు మార్చి వాటిని వెనిగర్ ద్రావణంతో శుభ్రం చేశారు.

అప్పుడే స్టాలిన్ రక్తం వాంతి చేసుకున్నారు. దాంతో డాక్టర్లు ఆయన ఊపిరితిత్తులను ఎక్స్‌-రే తీయించారు.

జొనాథన్ బ్రాంట్, వ్లాదిమీర్ నౌమోవ్‌లు తమ పుస్తకం 'స్టాలిన్స్ డాక్టర్స్ ప్లాట్'లో ఇలా రాశారు, 'స్టాలిన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లకు వెంటనే అర్థమైంది. ఆయన కుడిభాగానికంతా పక్షవాతం సోకింది. మధ్యాహ్నానికి ముందు ఆయనకు ఎనీమా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దీంతో సానుకూల ఫలితం ఏదీ రాదన్న విషయం వారికి ముందే తెలుసు.'

వరుసగా మూడు రోజుల పాటు స్టాలిన్ అలా స్పృహ లేకుండానే ఉండిపోయారు.

పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఎప్పుడూ మంచంపైన ఆయన పక్కనే కూర్చొని ఉండేవారు.

బేరియా, మెలెన్‌కోవ్‌లు పగలంతా ఆయనతో ఉంటే, కృశ్చెవ్, బుల్గానిన్‌లు రాత్రిపూట మంచంపై ఆయన పక్కనే కూర్చుండిపోయేవారు.

స్టాలిన్ పరిస్థితి విషమంగా ఉందనీ, ఆయనకు ఏమైనా కావొచ్చనీ 3వ తేదీన డాక్టర్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

స్టాలిన్‌తో జార్జి మెలెన్‌కోవ్

ఉన్నత నాయకుల భేటీ

ఈ పరిణామాల మధ్య మార్చి 4న ఉన్నత నాయకులందరూ సమావేశమయ్యారు. ఎందుకంటే, దుర్వార్తను వినేందుకు సిద్ధంగా ఉండాలని వారికి అప్పటికే డాక్టర్లు తెలియజేశారు.

ఈ సమావేశానికి ఒక్క బుల్గానిన్ తప్ప అందరూ హాజరయ్యారు. (బుల్గానిన్ అప్పుడు స్టాలిన్ సేవలో నిమగ్నమై ఉన్నారు.)

స్టాలిన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మెలెన్‌కోవ్ అన్నారు. మెలెన్‌కోవ్ తక్షణం స్టాలిన్ స్థానాన్ని చేపట్టాలని బేరియా ప్రతిపాదించారు. దీనికి అందరి ఆమోదం లభించింది. సమావేశం ముగిసింది.

కానీ స్టాలిన్ ఇంకా చనిపోలేదు. ప్రెసీడియం సభ్యులందరూ ఆయన డాచాకు చేరుకున్నారు. అవి స్టాలిన్ చివరి ఘడియలు.

స్టాలిన్ తన దివాన్‌పై బోర్లా పడుకొని ఉన్నారు. ఇక ఎప్పటికైనా ఆయన లేవగలరా అన్న అనుమానాలు ఆయన సన్నిహితులందరి మనసుల్లోనూ మెదులుతున్నాయి. సగం అచేతనంగా, సగం మృత్యువుతో పోరాడుతున్న స్థితిలో ఉన్న వ్యక్తికి అప్పటికీ వారు భయపడుతూనే ఉన్నారు.

జొనాథన్ బ్రాంట్, వ్లాదిమీర్ నౌమోవ్‌లు తమ పుస్తకం 'స్టాలిన్స్ డాక్టర్స్ ప్లాట్'లో ఇలా రాశారు, 'మార్చి 5న స్టాలిన్ మళ్లీ రక్తం కక్కుకున్నారు. ఆయన కడుపులో రక్తస్రావం మొదలైంది.'

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సోవియట్ నేత జోసెఫ్ స్టాలిన్ సెక్యూరిటీ చీఫ్ బేరియా ఒడిలో స్టాలిన్ కుమార్తె స్వెత్లానా అలిలుయెవా

స్టాలిన్ ఆఖరు క్షణాలు

ఈ క్రమంలో అందరి కళ్లూ బేరియాపైనే ఉన్నాయి. స్టాలిన్ చేతిని పట్టుకొన్న బేరియా స్టాలిన్‌కు అందరికన్నా దగ్గరివాణ్ని తానేనన్న సంకేతాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ తర్వాత స్టాలిన్ కుమార్తె స్వెత్లానా అలిలుయెవా తన ఆత్మకథ 'ట్వెంటీ లెటర్స్ టు ఎ ఫ్రెండ్'లో రాస్తూ, 'ఆయన ముఖం పూర్తిగా మారిపోయింది. ఆయన పెదవులు నల్లబడ్డాయి. ముఖం గుర్తుపట్టరాని విధంగా మారిపోయింది. చివరి క్షణాల్లో ఆయన అకస్మాత్తుగా కళ్లు తెరిచారు. గదిలో ఉన్న వాళ్లందరి వైపూ దృష్టి సారించారు. చేయిని పైకెత్తారు. ఎవరి వైపైనా చూస్తూ శపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది. మరుక్షణంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.'

ఫొటో సోర్స్, Getty Images

ఉదయం 9 గంటల 50 నిమిషాలైంది.

నాయకులందరూ ఒకరినొకరు పట్టుకుని ఏడ్వసాగారు. కృశ్చెవ్ స్వెత్లానాను గుండెలకు హత్తుకొని సంతాపం ప్రకటించారు.

పనివాళ్లకు, అంగరక్షకులందరికీ స్టాలిన్‌ను చివరిసారి చూసేందుకు అనుమతినిచ్చారు.

రెండు దశాబ్దాల పాటు స్టాలిన్‌ను రష్యాలో జీవితులైన మహోన్నత వ్యక్తిగా భావించారు.

లెనిన్ భౌతికకాయానికి 1924లో స్టాలిన్ ఎలా చేశారో, స్టాలిన్ భౌతికకాయానికి కూడా అదే చేయాలని సోవియట్ యూనియన్ నాయకత్వం నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఆయన మృతదేహాన్ని భద్రపర్చేందుకు దానికి లేపనం పూయాలనే నిర్ణయం జరిగింది. 1953 మార్చి 9న స్టాలిన్‌ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.

చైనా ప్రధానమంత్రి చౌ ఎన్ లై, కమ్యూనిస్టు నేత పాల్మిరో తొగ్లియాతీ, మారిస్ థోరేజ్‌ తదితరులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

కమ్యూనిస్టు దేశాల పత్రికలు ఏక కంఠంతో 'చరిత్రలో ఓ మహోన్నత శిఖరం నేలకూలింది' అని రాశాయి.

పశ్చిమ దేశాల పత్రికల్లో మిశ్రమ స్పందన కనిపించింది. మానవజాతికి వ్యతిరేకంగా ఆయన నేరాలకు పాల్పడ్డారని కొన్ని పత్రికలు రాయగా, ఆయన సారథ్యంలో సోవియట్ యూనియన్ ఆర్థికాభివృద్ధిని ప్రశంసిస్తూ, హిట్లర్‌కు వ్యతిరేకంగా ఆ దేశం సాధించిన విజయానికి మూలకారకుడు ఆయననేనంటూ మరి కొన్ని రాశాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)