ఇండొనేసియా: మునిగిపోతున్న రాజధాని.. రూ.2.52 లక్షల కోట్లతో కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ప్రణాళికలు

బోర్నియో ప్రణాళిక

ఇండొనేసియాలోని జకార్తా నగరంలో విండా ఇల్లు ప్రతి ఏటా 20 సెంటీమీటర్లు చొప్పున నీటిలో మునిగిపోతోంది. ఆమె నాలుగు ట్రక్కుల రాళ్లు, గ్రావెల్, సిమెంట్ కొనుక్కొచ్చి నేల మట్టాన్ని పైకి పెంచింది. పెరుగుతున్న సముద్ర నీటి మట్టం ఆమె ఇంటి తలుపును తాకకుండా అది అడ్డుకుంటుంది. కానీ దానివల్ల ఒక దుష్ప్రభావం ఉంది.

''మేం మట్టాన్ని ఒక్కో పొర పెంచుతున్న కొద్దీ ఇంటి పైకప్పు కిందికి దిగిపోతోంది'' అని ఆమె వాపోయింది. ఇప్పుడది ఆమె తలకన్నా కేవలం 50 సెంటీమీటర్ల ఎత్తులో మాత్రమే ఉంది. చేతితో తాకొచ్చు.

నగర ప్రణాళికలు రచించేవాళ్లకు జకార్తా కథ ఒక హెచ్చరిక. వాతావరణ మార్పులకు లోనవుతున్న జావా సముద్రం పెరుగుతోంది. అదే సమయంలో పరిపాలనా లోపాలు, తప్పుడు నిర్ణయాలతో ఆ సముద్రం మునిగిపోతోంది కూడా.

అంటే.. విండా తన ఇంటి మట్టాన్ని ఇంకా పెంచుకుంటూ పోవాలి.

''ఇంకెక్కడికి వెళ్లగలం? మాకు ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లే అవకాశం లేదు'' అంటారామె.

కానీ.. ఇండొనేసియా ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంది. పరిపాలనా యంత్రాంగాన్ని ఇక్కడి నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ కలిమంతన్ ప్రావిన్స్‌లోని బోర్నియో దీవికి తరలిస్తున్నట్లు ప్రకటించింది.

అక్కడ సుమారు రూ.2.52 లక్షల కోట్ల వ్యయంతో ఒక చిన్న తీరప్రాంత నగరాన్ని నిర్మించటానికి ప్రణాళిక రచించారు. దానికి ఐదు ఉప పట్టణాలు ఉంటాయి. ఆయిల్ పామ్ తోటల్లో వాటిని నిర్మిస్తారు. వాటి చుట్టూ మాగాణి నేలలు, ఉష్ణమండల అడవులు ఉంటాయి. తొలి దశ నిర్మాణాన్ని 2025 నాటికల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ఆ ప్రాంతాన్ని ఎంచుకోవటం రాజకీయంగా, ఆర్థికంగా తెలివైన పనిగా కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఇండొనేసియా దీవి సమూహపు మధ్య భాగానికి దగ్గరగా ఉంటుంది బోర్నియో.

కానీ.. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అడవులు కూడా ఈ దీవిలో ఉన్నాయి. వన్యప్రాణులకు ఆలవాలం కూడా. భూగోళం మీద అత్యంత వైవిధ్య భరిత జీవజాలాలు ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి.

ఇక్కడ నిర్మించే నగరం.. ఇండొనేసియా కానీ, ఆ మాటకొస్తే ప్రపంచం కానీ ఎన్నడూ చూడనటువంటి స్థాయిలో సుస్థిరమైన నగరంగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయితే.. ఈ గొప్ప ప్రణాళిక వల్ల విపత్కర ప్రభావాలు ఉంటాయని పర్యావరణవేత్తలు భయపడుతున్నారు.

రాజధాని నగరానికి రూపకల్పన చేసే బాధ్యతను పోటీలో గెలుచుకున్న జకార్తాలోని 'అర్బన్ ప్లస్' ఆర్కిటెక్ట్‌ల బృందం మాత్రం.. తాము ప్రకృతికి అనుగుణంగా పనిచేస్తామని, దానికి వ్యతిరేకంగా కాదని చెప్తోంది.

‘‘ప్రకృతితో సంతులనంగా నగరాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. ఏమీ లేని చోట మొదలుపెట్టి సంపూర్ణంగా నిర్మించే అద్భుతమైన అవకాశం మాకు ఉంది. ఇప్పుడు మనకు ఉన్న వాటినన్నిటినీ మించిన ఆదర్శవంతమైన నగరాన్ని రూపొందించే అవకాశం ఉంది'' అంటారు 'అర్బన్ ప్లస్' అధిపతి సోఫియాన్ సిబారాని.

కొత్త నగరం కోసం కేటాయించిన 2,500 చదరపు కిలోమీర్లలో 70 శాతం భూభాగం హరిత ప్రదేశంగా ఉండాలన్నది ప్రణాళికగా ఆయన చెప్తారు. నిర్మాణ ప్రాంతాల్లో కూడా అడవుల పునఃపెంపకానికి ప్రత్యేకించిన సంస్థతో పాటు, ఒక బొటానికల్ గార్డెన్ కూడా ఉంటుందని తెలిపారు.

నడుస్తూ తిరగగలిగే ఒక చిన్న నగరాన్ని నిర్మించాలన్నది ఆలోచనగా చెప్పారు. కేవలం పాదచారులు మాత్రమే సంచరించే ప్రాంతాలు ఉంటాయన్నారు. అదనపు రవాణా అవసరమైతే అది ఎలక్ట్రిక్ రవాణాగా ఉంటుందని పేర్కొన్నారు.

జకార్తా నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. కొత్త నగరానికి ఉప పట్టణాలను ఒక దానికి మరొక దానికి మధ్య హరిత క్షేత్రాలు ఉండేలా ప్లాన్ చేసినట్లు ఆయన వివరించారు.

జకార్తా ప్రణాళికలో ఒక ప్రధాన సమస్య.. పైపుల ద్వారా నీటి సరఫరా లేకపోవటం. జనాభాలో ఎక్కువ మంది భూగర్భ జలాలను తోడి తీయటం వల్ల నేల ఉపరితలం కుంగిపోతోంది. దీనికి.. వాతావరణ మార్పు ఫలితంగా సముద్ర మట్టాలు పెరగటం తోడై సంక్షోభం తీవ్రంగా మారింది. నివారణ చర్యలు చేపట్టకపోతే 2050 నాటికి జకార్తా తీర ప్రాంతం సముద్రంలో మునిగిపోతుందని అంచనా వేస్తున్నారు.

జకార్తా, అటువంటి నగరాలతో అసలు సమస్య.. అవి ప్రకృతికి సమతుల్యంగా లేకపోవటమేనని సిబారాని అంటారు. కాబట్టి ఆయన బృందం 'బయోమిమిక్రీ' అనే పద్ధతిని ఎంచుకుంది. అంటే పరిసరాల నుంచి నేర్చుకోవటం. ఇక్కడ.. వర్షాధార అడవులకు సంబంధించి నాలుగు విలక్షణమైన పొరలు స్ఫూర్తిగా 'అర్బన్ ప్లస్' తన డిజైన్‌ను రూపొందిస్తోంది.

అయితే.. రాజధాని నగరాన్ని బోర్నియోకు తరలించటం వల్ల ప్రభావాల గురించి.. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్స్‌లో పనిచేస్తున్న ఇండొనేసియాకు చెందిన పట్టణ ప్రణాళిక నిపుణురాలు రీటా పదవాంగి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

''సామాజిక, పర్యావరణ దృక్కోణం నుంచి చూసినపుడు నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామంటే.. పచ్చగా ఉన్న నేలను నిర్మాణాలకు మార్చుకోవాలి. అది ప్రభావం చూపుతుంది'' అని ఆమె పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంది.

ఇక అర్బన్ ప్లస్ రూపొందించిన డిజైన్‌ను నిజాయితీగా అమలు చేస్తారా అనే సందేహాలు కూడా రీటా వ్యక్తంచేస్తున్నారు.

కొత్త నగరం హరిత నగరంగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ.. అక్కడ ప్రధానంగా జలవిద్యుత్ ఉంటుందని ప్రభుత్వ విద్యుత్ సంస్థ చెప్తోంది.

ఈస్ట్ కలిమంతన్‌లో మూడు జలవిద్యుత్ ప్లాంట్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. వాటివల్ల పర్యావరణ సమస్యలు ఉంటాయి. ఇక కొత్త రాజధానికి సరిపోయేంత విద్యుత్ కూడా వీటి నుంచి రాదు.

అంటే.. అధిక మొత్తంలో విద్యుత్‌ను బొగ్గుతో నడిచే విద్యుత్ ప్లాంట్ల నుంచే ఉత్పత్తి చేయాల్సి వస్తుందని ఉద్యమకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ రాష్ట్రంలో కనీసం మూడు బొగ్గు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రణాళికా రచన పూర్తయింది కూడా.

బొగ్గు ఎగుమతిలో ఇండొనేసియా అగ్రస్థానంలో ఉంది. కొత్తగా నిర్మించే రాజధాని ఉండే రాష్ట్రం.. ఇందులో కేంద్ర బిందువు.

ఈస్ట్ కలిమంతన్‌లో 50,000 చదరపు కిలోమీర్ల కన్నా ఎక్కువ ప్రాంతంలో 1,434 మైనింగ్ పర్మిట్లు ప్రభుత్వం జారీ చేసింది. అది బెల్జియం కన్నా పెద్ద ప్రాంతం.

భారీ జనసమ్మర్థంతో నిండిపోయిన జావా దీవి నుంచి ప్రజలను జనం పలుచగా ఉన్న ప్రాంతాలకు తరలించే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కార్దీ తన కుటుంబంతో 1970ల్లో ఈస్ట్ కలిమంతన్‌కు వలస వచ్చారు.

''చాలా మంది జనం ఎక్కువ కాలం ఉండలేకపోయారు'' అని ఆయన నవ్వుతారు. ''చాలా కష్టంగా ఉండేది. అందుకే వాళ్లు తిరిగి వెనక్కు వెళ్లిపోయారు. అడవి పందులు, కోతులు చాలా ఉండేవి. అవి మా ఆహారాన్ని కాజేసేవి'' అని వివరించారు.

ఆయన ఇక్కడ పెను మార్పులు చూసారు. ఈస్ట్ కలిమంతన్‌లో ఇప్పటికే జరిగిన అభివృద్ధికి వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించారు కూడా.

ఈస్ట్ కలింతన్‌లో తవ్వి వదిలేసిన 1,735 బొగ్గు బావులు ఉన్నాయి. అవి 1,404 కంపెనీలకు చెందినవి. బొగ్గు తవ్విన తర్వాత ఈ బావులను పూడ్చివేయాలన్న చట్టబద్ధమైన బాధ్యతను అవి నిర్వర్తించలేదు.

అలాంటి ఒక బొగ్గు బావిలో వర్షపు నీరు నిండివున్నపుడు.. కార్దీ పదేళ్ల మనవరాలు నటాస్యా ఏప్రిలియా దేవీ గతేడాది మే నెలలో ఆడుకుంటూ వెళ్లి పడిపోయి మునిగిపోయింది.

''ఆమెకు ఈత రాదు. నిట్టనిలువుగా ఉండే బావుల అంచులు పట్టుకుని బయటకు వచ్చే వీలులేదు'' అని ఆయన వివరించారు.

''నా కూతురు డాక్టర్ కావాలనుకుంది. ఆమె పెరిగి పెద్దయి తన కలను నెరవేర్చుకుంటుందని అనుకున్నా'' అంటూ ఆమె తల్లి పూర్వాంతీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ రాష్ట్రంలో తవ్వి వదిలేసిన బొగ్గు బావుల్లో గత ఎనిమిదేళ్లలో పడి చనిపోయిన 36 మందిలో నటాస్యా ఒకరు.

కేంద్ర ప్రభుత్వం తమకు వందల మైళ్ల దూరంలో కాకుండా దగ్గరగా ఉంటే.. తమ ఆందోళనలను పట్టించుకునే అవకాశం ఉంటుందని కార్దీ ఆశిస్తున్నారు.

రాజధాని నగరం బోర్నియోకు తరలివస్తే అభివృద్ధి జరుగుతుందని, ఈ ప్రాంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, మరిన్ని ఉద్యోగాలు వస్తాయని కూడా భావిస్తున్నారు.

కానీ.. ఈ ప్రాంతపు ఆదివాసీ ప్రజల్లో అంత ఆసక్తి లేదు.

రాజధాని నగరం తరలివస్తే తమ సమాజపు విశిష్ట సంస్కృతి ధ్వంసమైపోతుందని పేసర్ తెగకు చెందిన దాహ్లియా ఆందోళన చెందుతున్నారు.

''మాకు చాలా భయంగా ఉంది. మా భూముల్లో పొడవాటి భవనాలు నిండిపోతాయని.. మా జీవన విధానాన్ని కోల్పోతామని ఆందోళనగా ఉంది'' అని ఆమె చెప్పారు.

ఆ నగరంతో పాటు భవిష్యత్తులో వచ్చే వలసల గురించీ ఆమె కలవరపడుతున్నారు.

''మా సంస్కృతిని, మా భాషను కాపాడుకోవటానికి మేం సంసిద్ధం కావాల్సి ఉంది. మా భూములు కొల్లగొట్టకుండా ఉంటారని ఆశిస్తున్నాం'' అంటారామె.

ప్రస్తుత రాజధానిని ఆమె ఎప్పుడూ చూడలేదు. కానీ టీవీల్లో చూశారు. ఆమెకు నచ్చలేదు. ''జకార్తాలో పేదలు వంతెనల కింద నివసిస్తున్నట్లు మేం జీవించాలని నేను కోరుకోవటం లేదు'' అని పేర్కొన్నారు.

దాహ్లియా వంటి ఆదివాసీ ప్రజలు బోర్నియోలో ఇప్పటికే ఇతర మార్పులను చవిచూశారు. బొగ్గు గనుల కోసం, పేపర్, ఆయిల్ పామ్ తోటల కోసం గత 50 ఏళ్లలో లక్షలాది ఎకరాల అడవులను నరికివేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా జరిగిన అడవుల నరికివేతలో ఇదొకటి.

ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారు ఇండొనేసియానే. షాంపూ నుంచి చాక్లెట్ల వరకూ అన్నిటిలోనూ దీనిని ఉపయోగిస్తారు.

ఇప్పటికే పేపర్, పామాయిల్ తోటలకు ఇస్తున్న రాయితీల పట్ల తాము ఘర్షణ పడుతున్నామని.. ఇక రాజధానిని తరలిస్తే ప్రభుత్వంతోనూ తాము పోరాడాల్సి వస్తుందని పేసర్ తెగకు చెందిన స్యూక్రాన్ అమీన్ అంటున్నారు.

''వాళ్ల 'అటవీ నగరం' ప్రణాళికల గురించి మాకు తెలుసు. కానీ వాళ్లు చెట్లు నాటాలని మేం కోరుకోవటం లేదు. ఇక్కడ మిగిలివున్న అడవిని వాళ్లు కాపాడాలని మేం కోరుకుంటున్నాం'' అని ఆయన చెప్పారు.

''ఒకప్పుడు ప్రపంచానికి శ్వాసకోసంగా మాకు పేరుంది. మా అడవిని తొలగించి నగరపు మొక్కలు నాటాలని మేం కోరుకోవటం లేదు'' అన్నారాయన.

అయితే.. జకార్తా నుంచి ఇక్కడికి తరలివచ్చే వారికి.. యువతరానికి ఉత్సాహకరంగా కనిపిస్తోంది.

మొత్తంగా పది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి వలస రావాల్సి ఉంటుంది. జకార్తా నుంచి ఇక్కడికి రావాలంటే స్పీడ్ బోట్ మీద, బస్సుల్లోనూ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయినా.. ప్రభుత్వోద్యోగి డియాజ్ డియాండ్రా చాలా ఆసక్తిగా ఉన్నారు.

''ప్రణాళికా బద్ధంగా నిర్మించిన నగరంలో, మంచి ప్రజా రవాణా ఉన్న నగరంలో నివసించబోతున్నానంటే చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది'' అని అధికారిక పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఈ 30 ఏళ్ల యువతి పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుకు సారథ్యం వహిస్తున్న మంత్రి బాంబాంగ్ బ్రాడ్జోననెగోరో ఈ పర్యటనకు నేతృత్వం వహిస్తున్నారు. ఒక ఎత్తైన భవనంలో ఉన్న ఆయన.. కొత్త రాజధానికి కేటాయించిన 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే అడవిని పరిరక్షిస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

దేదీ ఇరావాన్

కానీ ఇక్కడి పర్యావరణవేత్తలు పెద్దగా నమ్మటం లేదు.

స్థానిక పర్యావరణవేత్త దేదీ ఇరావాన్ మమ్మల్ని ఈస్ట్ కలిమంతన్‌లో మిగిలివున్న కొద్దిపాటి దట్టమైన అడవుల్లో ఒకటైన బుకిత్ సుహార్తోకి తీసుకెళ్లారు.

ఈ అడవి అభివృద్ధి వల్ల దెబ్బతింటుందని ఆయన చెప్తారు.

''దీనిని పరిరక్షిస్తామని వారు అంటున్నారు. కానీ ఇంతకుముందు కూడా ఇటువంటి హామీలే ఇచ్చారు. మైనింగ్ కంపెనీలు అడవులను పునరుద్ధరిస్తామనే హామీలతో వచ్చాయి. కానీ అవేవీ జరగలేదు'' అని పేర్కొన్నారు.

నగర ప్రణాళిక సలహాదారుల బోర్డులో బడా పారిశ్రామకవేత్తలను నియమించటం పట్ల కూడా స్థానిక ఉద్యమకారుల్లో అసంతృప్తి, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

''ఆదివాసీ ప్రజలు సలహాదారులుగా ఎందుకు ఉండకూడదు? దీనివల్ల అత్యధికంగా ప్రభావితమయ్యేది వారే కదా'' అని ప్రశ్నిస్తున్నారు.

''జకార్తా నుంచి వచ్చే సంపన్న ప్రభుత్వాధికారుల గేటెడ్ కమ్యూనిటీగా మారుతుందా?'' అని ప్రణాళిక నిపుణురాలు రీటా అడుగుతున్నారు.

రచయిత: రెబెకా హెన్స్చిక్, అబ్రహాం ఉటామా

ఇలస్ట్రేషన్స్: డేవీస్ సూర్య

గ్రాఫిక్స్: అర్విన్ సుప్రియాది, అఘ్నియా ఆడ్జికియా

ఫొటోలు: హరాయో విరావాన్, యుదిస్టిరా ట్రిబుదిమాన్, రోరీ మూన్, గెటీ ఇమేజెస్

డాటా ఆధారం: సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్రీ రీసెర్చ్, వరల్డ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్

ఎడిటర్: సారా బక్లీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)