కరోనావైరస్: పదేపదే ముఖాన్ని చేతులతో తాకే అలవాటు మానుకోవడం ఎలా?

  • ఫెర్నాండో డువార్టే
  • బీబీసీ ప్రతినిధి
గొరిల్లా

ఫొటో సోర్స్, Getty Images

జంతు ప్రపంచం నుంచి మనల్ని వేరు చేసే అలవాట్లలో పదే పదే ముఖాన్ని తాకడం కూడా ఒకటి.

మనకు తెలియకుండానే, అంసకల్పితంగా అలా చేసేస్తుంటాం.

కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనలు పెరగడంతో ఈ అలవాటు గురించి ఇప్పుడు వైద్యులు హెచ్చరిస్తున్నారు. పదేపదే ముఖాన్ని తాకొద్దని సూచిస్తున్నారు.

కానీ, మనం పదేపదే ముఖాన్ని ఎందుకు తాకుతాం? ఆ అలవాటు మానుకోవడం ఎలా?

ఆస్ట్రేలియాలోని వైద్య విద్యార్థులు 2015లో దీనిపై ఓ అధ్యయనం చేశారు.

తమ ముఖాన్ని తామే తాకకుండా ఉండలేకపోతున్నామని వాళ్లు గుర్తించారు.

ఆ అలవాటు వల్ల ప్రమాదమేంటో వారికి బాగా తెలుసు. అయినా కానీ, సగటున ఒక్కొక్కరూ గంటకు కనీసం 23 సార్లు వాళ్ల కళ్లు, ముక్కు, నోటిని తాకారు.

ఈ అలవాటు ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు వివిధ ప్రజా ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

చేతులను తరుచూ కడుక్కోవడమే కాదు, ముఖాన్ని తాకకుండా వాటిని నియంత్రణలో పెట్టుకోవాలని సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు అలా చేస్తాం?

ముఖాన్ని తాకకుండా ఉండలేకపోవడం మనుషులు, వానర జాతి జీవుల్లో కనిపిస్తోంది.

మన జీవ పరిణామంలోనే ఇది భాగమేమో.

సాధారణంగా చాలా జంతువులు ముఖాన్ని శుభ్రపరుచుకునేందుకో, పురుగులను తోలేందుకో ముఖాన్ని తాకుతుంటాయి.

కానీ, మనం, మన సహచర వానర జాతి మాత్రం అలా కాదు.

మనల్ని మనం ఓదార్చుకునేందుకు కొన్ని సార్లు ఇలా ముఖాన్ని తాకుతుంటామని అమెరికాలోని యూసీ బెర్కెలీ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ డాచెర్ కెల్ట్నర్ అన్నారు.

‘‘నాటకంలో ఓ సన్నివేశం ముగియగానే తెరను దించుతారు. మళ్లీ తెర ఎత్తి, ఇంకో సన్నివేశం మొదలుపెడతారు. మనం కూడా అలాగే మనకు తెలియకుండానే ఒక చర్యకూ, ఇంకో చర్యకూ మధ్యలో ఇలా ముఖాన్ని తాకుతుంటాం. కొన్ని సార్లు ఎదుటివారిని ఆకర్షించే ప్రయత్నంలోనూ అలా చేస్తుంటాం’’ అని చెప్పారు.

భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు, దృష్టి మరలకుండా ఉండేందుకు కూడా ఇలా ముఖాన్ని తాకుతుంటామని ఇంకొందరు పరిశోధకులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

మనుషుల మౌలిక ప్రవర్తనల్లోనే ఈ అలవాటు ఉందని జర్మనీలోని లీప్జిగ్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ మార్టిన్ గ్రన్వాల్డ్ అన్నారు.

‘‘మనల్ని మనం తాకడం అనేది దానికదే జరుగుతుంటుంది. సాధారణంగా ఇది భావాన్ని వ్యక్తపరిచే చర్య కాదు. పెద్దగా మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటుంది’’ అని గ్రన్వాల్డ్ బీబీసీతో చెప్పారు.

‘‘ఆలోచన, భావోద్వేగ ప్రక్రియల్లో వీటిది ప్రధాన పాత్ర. అందరిలోనూ ఇలా జరుగుతుంది’’ అని అన్నారు.

కళ్లు, ముక్కు. నోటి ద్వారానే వైరస్‌లు, బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతాయి.

అందుకే ఈ అలవాటు సమస్యాత్మకంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images

2012లో అమెరికా, బ్రెజిల్ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో జనం బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు గంటలో కనీసం మూడు సార్లు ఏదో ఒక చోటును చేత్తో తాకుతున్నట్లు వెల్లడైంది.

నోరు, ముక్కును కూడా గంటలో 3.6 సార్లకు మించి తాకుతున్నట్లు తేలింది.

ఈ అధ్యయనం బహిరంగ ప్రదేశాల్లో పరిస్థితి గురించి కాబట్టి, ఇంతకుముందు చెప్పుకున్న ఆస్ట్రేలియా అధ్యయన ఫలితాలకు, దీనికీ పెద్ద తేడా కనిపిస్తుండొచ్చు.

ఇలా ఏదో ఒక చోటును తాకి, తిరిగి నోరు, ముక్కును తాకడం వల్ల ప్రమాదమే.

మాస్క్ ధరిస్తే ముఖాన్ని తాకడం సహజంగానే తగ్గించుకుంటామని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

అయితే, అసంకల్పితంగా జరిగే చర్యను మానుకునేలా చేయడం సవాలు అని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖేల్ హాల్స్‌వర్త్ అన్నారు.

‘‘చేతులు తరుచూ కడుక్కునేలా చేయడం సులువు. అసంకల్పితంగా జరిగే చర్యను ఆపాలని చెప్తే, పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు’’ అని ఆయన అన్నారు.

అయితే, దీన్ని ఆపేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయని హాల్స్‌వర్త్ అన్నారు.

‘‘ఇది కూడా దురద లాంటిదే. దీనికి ప్రత్యామ్నాయ ప్రవర్తనను మనం నిర్మించుకోవాలి. ముఖాన్ని తాకాలని అనిపించినప్పుడు అరిచేయి వెనక భాగంతో తాకండి. ఇదేమీ పూర్తి పరిష్కారం కాదు. కానీ, ముప్పు తగ్గుతుంది’’ అని చెప్పారు.

‘‘ఎలాంటి సందర్భాల్లో మనం ముఖాన్ని తాకుతున్నామో గుర్తించాలి. కళ్లను తాకుతుండేవారు కళ్ల జోడు ధరించవచ్చు. ఫిడ్గెట్ స్పిన్నర్లు, స్ట్రెస్ బాల్స్ లాంటి వాటితో చేతులకు పని ఉండేలా చేయొచ్చు. చేతులు కింద పెట్టుకుని కూర్చోవాలి. మనకి మనం ఈ అలవాటును గుర్తుచేసుకోవాలి. ముఖాన్ని తాకుతుంటే వద్దని చెప్పమని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సూచించాలి’’ అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)