కరోనావైరస్: చైనాలో రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకుపోయిన క్యాన్సర్ పేషెంట్... ఆ తర్వాత ఏమైంది?

  • ఓవెన్ అమోస్
  • బీబీసీ న్యూస్
లు యూజీన్

ఫొటో సోర్స్, THOMAS PETER - REUTERS

ఫొటో క్యాప్షన్,

హు పింగ్ తల్లి లు యూజీన్

లు యూజీన్ ఒక చేతిలో ఒక బకెట్, దుస్తుల బ్యాగ్ పట్టుకుంది. మరో చేత్తో అనారోగ్యంతో ఉన్న తన కూతురు చుట్టూ కప్పిన రజాయిని గట్టిగా పట్టుకుంది.

ఆ కూతురు పేరు హు పింగ్. వయసు 26 సంవత్సరాలు. ఆమెకు లుకేమియా వ్యాధి ఉంది. ఆమెకు వెచ్చగా ఉండటానికి ఆ రజాయి కప్పుకుని ఉండాలి. అంతకన్నా ముఖ్యంగా.. ఆమె తన సొంత రాష్ట్రమైన హూబే వదిలి వెళ్లాల్సిన అవసరముంది.

హు పింగ్‌ జనవరి నెలలో హూబే రాజధాని వుహాన్‌లో కీమోథెరపీ తీసుకోవటం మొదలుపెట్టింది. కానీ.. ఆ కిందటి నెలలో ఇదే నగరంలో పుట్టుకొచ్చిన కరోనావైరస్ విజృంభణతో ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి.

ఆమె చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రిలో ఖాళీ లేదని, ఇంకెక్కడికైనా వెళ్లాలని హు పింగ్‌కు ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. వారి కుటుంబం హుబే లోని మరో పది ఆస్పత్రులకు తిరిగింది. కానీ ఎక్కడా ఒక్క బెడ్ కూడా దొరకలేదు.

హు పింగ్ రాష్ట్ర సరిహద్దు దగ్గర నివసిస్తుంటుంది. కాబట్టి ఆమె, ఆమె తల్లి పొరుగున ఉన్న జియాంగ్జీ రాష్ట్రానికి వెళ్లాలని ప్రయత్నించారు. కానీ.. యాంగ్జే నదిపై ఉన్న వంతెన మీద వారు చిక్కుకుపోయారు.

ఫొటో సోర్స్, THOMAS PETER - REUTERS

వుహాన్‌ను జనవరి 23న దిగ్బంధించారు. కొద్ది రోజులకే హుబే ప్రావిన్స్ మొత్తం మీద అవే ఆంక్షలు విధించారు.

వైద్య కారణాలతో రాష్ట్రం వదిలివెళ్లే వెసులుబాటు ఉంది. కానీ.. అందుకు అవసరమైన పాస్ హు పింగ్ దగ్గర లేదు. దీంతో వాళ్లు వంతెన దాటలేకపోయారు.

ఈ విషయం తెలిసిన వెంటనే.. లు యుజీన్ కన్నీళ్లు పెట్టుకుంది. ''దయచేసి నా కూతురును పోనివ్వండి. నేను వెళ్లాల్సిన అవసరం లేదు. నా కూతురును మాత్రం పోనివ్వండి చాలు'' అంటూ వేడుకుంది.

రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు - మార్టిన్ పోలార్డ్, థామస్ పీటర్ - ఆ సమీపంలోనే ఉన్నారు.

''నా కూతురు జియాంగ్జీ సరిహద్దులో ఉన్న జియుజియాంగ్‌ నగరంలో ఒక ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరముంది. ఆమెకు చికిత్స అవసరం. కానీ వీళ్లు మమ్మల్ని పోనివ్వటం లేదు'' అని లు యుజీన్ వారికి చెప్పింది.

ఆమె మాట్లాడుతన్నపుడు.. లౌడ్‌స్పీకర్‌లో ఒక స్వరం కఠినంగా వినిపించింది: ''హుబే నివాసులకు జియాంగ్జీలోకి ప్రవేశం లేదు.''

''నా కూతురు ప్రాణాలను కాపాడాలని మాత్రమే నేను కోరుతున్నా'' అని లు యుజీన్ చెప్పింది.

ఫొటో సోర్స్, THOMAS PETER - REUTERS

ఆమె ప్రాధేయపడుతూనే ఉంది. స్పీకర్లలో పెద్ద గొంతు వినిపిస్తూనే ఉంది. హు పింగ్ రజాయి చుట్టుకుని నేలమీద కూర్చుంది.

ఒక గంట తర్వాత.. చెక్‌పోస్ట్ అవతలివైపు ఒక అంబులెన్స్ వచ్చింది. వాళ్లిద్దరినీ అటువైపు వెళ్లడానికి అనుమతించారు.

పొలార్డ్, పీటర్‌లు తమ కథనం ప్రచురించారు. ప్రపంచం మొత్తం - జపాన్ టైమ్స్ మొదలుకుని గల్ఫ్ న్యూస్ వరకూ - లు యుజీన్ కన్నీళ్లు చూసింది. కానీ.. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు - ఇప్పటివరకూ.

రాయిటర్స్ కథనం చూసిన తర్వాత.. బీబీసీ హు పింగ్ కుటుంబాన్ని వెదికి పట్టుకుంది. ఆమె కాబోయే భర్త షి గ్జియావోడీతో మాట్లాడింది. ఆ సరిహద్దు దగ్గర ఏం జరిగిందో ఆయన మాకు చెప్పారు.

''నా అత్తగారు.. చాలా సేపు పోలీసులను ప్రాధేయపడుతూ ఏడ్చారు. కారణమేమిటో వివరంగా తెలుసుకోవటానికి పోలీసులు వచ్చారు. హు పింగ్‌ తీవ్ర లుకేమియాతో బాధపడుతున్న రోగి అని.. ఆమెకు చికిత్స అవసరమని తెలుసుకున్నారు'' అని వివరించాడు.

''ఏం చేయాలని వాళ్లు తమ ఉన్నతాధికారిని అడిగారు. ఆ ఉన్నతాధికారి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అంబులెన్స్‌ను పిలిపించాడు'' అని తెలిపాడు గ్జియావోడీ.

హు పింగ్‌ను నది అవతల జియూజియాంగ్ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎన్నో ఫోన్ కాల్స్, సంప్రదింపుల తర్వాత చివరికి ఆమెను చికిత్స కోసం చేర్చుకున్నారు.

''ఇప్పుడు ఆమెకు మంచి చికిత్స లభిస్తోంది. యువతి కాబట్టి బాగా కోలుకుంటోంది'' అని గ్జియావోడీ చెప్పాడు.

కానీ, వారి ఆందోళనలు ఇంకా సమసిపోలేదు.

ఈ జంట సంపన్నులు కారు. చైనాలో క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. (ప్రజారోగ్య బీమా సాధారణంగా చికిత్స మొత్తానికీ వర్తించదు.)

హు పింగ్‌కు లుకేమియా ఉన్నట్లు గుర్తించినపుడు గ్జియావోడీ ఒక వీడియో రూపొందించాడు. ''పెళ్లికూతురుకు లుకేమియా ఉంది.. కానీ మేం పోరాడతాం'' అంటూ.

వారికి వేలాది యువాన్లు విరాళాలుగా అందాయి. ''మాకు సాయం చేయటానికి ఎంతో మంది ప్రయత్నించారు'' అని చెప్పాడతడు. కానీ అది సరిపోదు.

అతడు తను దాచిన డబ్బు 1,00,000 యువాన్లు తన కాబోయే భార్య చికిత్స కోసం ఖర్చు చేశాడు. అయితే.. ఖర్చును ప్రధానంగా ఆమె కుటుంబమే భరిస్తోందని తెలిపాడు.

''కానీ ఆ కుటుంబానికి ఇప్పుడు ఆదాయం లేదు. వారి తల్లిదండ్రులు రైతులు. ఇప్పుడు (వైరస్ కారణంగా) బయటకు వెళ్లి పని చేయలేరు'' అని వివరించాడు.

అతడు చైనా ప్రభుత్వాన్ని కానీ, తన కాబోయే భార్యకు చికిత్స చేయకుండా తప్పిపంపిన ఆస్పత్రులను కానీ విమర్శించలేదు.

''ఆస్పత్రులు, డాక్టర్లు, నర్సులు చాలామంది.. నా క్లాస్‌మేట్లు చాలామంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రతి రోజూ, నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. వాళ్లు చాలా ప్రయత్నించారు'' అంటారాయన.

రాష్ట్ర సరిహద్దుకు అవతల ఆస్పత్రిలో చేర్చుకోవటం హు పింగ్ అదృష్టమని అతడు భావిస్తున్నాడు. ''చికిత్స అందకపోవటం వల్ల ఒకరిద్దరు రోగులు చనిపోయారనే వార్తలు విన్నాను'' అని చెప్పారు గ్జియావోడీ.

ఫొటో సోర్స్, FAMILY HANDOUT

మళ్లీ సాధారణ జీవితం మొదలవటానికి కొంత కాలం పడుతుందని కూడా అతడికి తెలుసు.

''ఆమెకు మంచి చికిత్స లభించినా.. పూర్తిగా కోలుకోవటానికి కనీసం రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. ఆమె పూర్తిగా కోలుకుని తిరిగివచ్చినా కూడా.. పరిస్థితి మళ్లీ విషమించే అవకాశమూ ఉంది'' అని చెప్పాడు.

హు పింగ్, షి గ్జియావోడీలు ఎనిమిదేళ్ల కిందట యూనివర్సిటీలో కలుసుకున్నారు. ఇద్దరూ ఒకటే తరగతిలో - హ్యూమన్ రిసోర్సెస్ - చదువుకున్నారు. మూడేళ్లుగా కలిసి ఉంటున్నారు.

జనవరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాల్సి ఉంది. అప్పుడే హు పింగ్‌కు లుకేమియా ఉన్నట్లు బయటపడింది. అదే సమయంలో కరోనావైరస్ దేశాన్ని చుట్టుముట్టింది. అంతా తారుమారైపోయింది.

మార్చి 5వ తేదీ నాటికి హుబే ప్రావిన్స్‌లో 67,592 నిర్ధరిత కరోనావైరస్ కేసులు ఉన్నాయి. అందులో 49,797 కేసులు ఒక్క ఉహాన్ నగరంలోనే నమోదయ్యాయి.

వైరస్ వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 3,000 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్త మరణాల్లో ఇది 90 శాతం.

తమ పెళ్లి వాయిదా పడిందే కానీ రద్దు కాలేదని షి స్పష్టంచేస్తున్నాడు. ''వీటన్నిటినీ అధిగమిస్తామనే విశ్వాసం మాకు ఉంది. ఆమె కోలుకున్న తర్వాత మేం పెళ్లి చేసుకుంటాం'' అని చెప్పారు.

అప్పుడు.. ఈ పెళ్లికూతురు తల్లి గర్వంగా హాజరవుతుంది. ఈసారి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)