దిల్లీ అల్లర్లపై భారత్‌ను ఇరాన్ ఎందుకు విమర్శించింది?

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామెనెయి

ఫొటో సోర్స్, TWITTER/KHAMENEI_IR

ఫొటో క్యాప్షన్,

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామెనెయి

ఇండోనేసియా, పాకిస్తాన్, టర్కీల బాటలోనే ఇప్పుడు ఇరాన్ కూడా దిల్లీ అలర్ల విషయంలో భారత్‌ను విమర్శిస్తూ మాట్లాడింది.

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామెనెయి, విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ దిల్లీ అలర్ల గురించి స్పందించారు.

‘‘భారత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రాయోజిత హింసను ఇరాన్ ఖండిస్తోంది. ఇరాన్, భారత్ శతాబ్దాలుగా స్నేహితులుగా ఉన్నాయి. పౌరులందరికీ భద్రతల కల్పించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం’’ అని జావెద్ జరీఫ్ ట్వీట్ చేశారు.

దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశంలోని ఇరాన్ రాయబారి అలీ చేగెనీకి భారత్ సమన్లు విధించింది. నిరసనను తెలియజేస్తూ ఓ పత్రం అందించింది.

కానీ, ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామెనెయి దిల్లీ అల్లర్ల అంశంపై మాట్లాడారు. భారత్‌లో ముస్లింలు వేధింపులకు గురవుతున్నారని, దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు.

‘‘భారత్‌లో జరుగుతున్న ముస్లింల ఊచకోత గురించి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనతో ఉన్నారు. భారత ప్రభుత్వం రాడికల్ హిందువులను, వాళ్ల పార్టీలను అడ్డుకోవాలి. ఇస్లామిక్ ప్రపంచం భారత్‌కు దూరం కాకుండా ఉండాలంటే, ముస్లింల ఊచకోతను భారత్ అడ్డుకోవాలి’’ అంటూ ట్వీట్ చేశారు.

భారత్ ఈ వ్యాఖ్యలపై నేరుగా బదులివ్వలేదు కానీ, ఓ అంతర్జాతీయ వాణిజ్య సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయ్‌శంకర్ ఈ విషయంలో భారత్ ఏ వైఖరితో ఉందో సంకేతాలు ఇచ్చారు.

దిల్లీ అల్లర్లపై ఇరాన్ వ్యాఖ్యల గురించి స్పందించాలని కోరినప్పుడు... ‘‘ఇప్పుడే మాకు అసలు మిత్రులు ఎవరన్నది తెలిసివస్తుందనుకుంటా’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, PIB

ఇదే తొలిసారి

ఆర్టికల్ 370 సవరణ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఇదివరకు మలేసియా, టర్కీ, పాకిస్తాన్ ఆందోళనలు వ్యక్తం చేశాయి.

ఇది దేశ అంతర్గత వ్యవహారమని చెబుతూ, వారి అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది.

అయితే, ఆ విషయాల గురించి ఇరాన్ ఏమీ మాట్లాడలేదు. భారత ‘అంతర్గత వ్యవహారాల’ గురించి ఆ దేశం వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.

భారత్, ఇరాన్ మధ్య సంబంధాలు... రెండు దేశాల మధ్య సామాజిక, ఆర్థిక, వాణిజ్యపరమైన సహకారం చాలా పురాతనమైంది.

భారత్ ఇంధన అవసరాలు చాలా వరకూ ఇరాన్ నుంచి తీరుతూ వచ్చాయి. ఔషధాలు, భారీ యంత్రాలు, విడి భాగాలు, ధాన్యాలను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.

అఫ్గానిస్తాన్, మధ్య ప్రాచ్య దేశాలు, మధ్య ఆసియాలో రెండు దేశాలకూ ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన అంశాలున్నాయి.

ఇరాన్ నుంచి చమురు అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.

ఇవన్నీ కారణాలతో భారత్, ఇరాన్ ఒకరి అంతర్గత వ్యవహారాల గురించి ఇంకొకరు మాట్లాడకుండా దూరంగా ఉంటూ వచ్చాయి.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌పై ఇరాన్ విమర్శలు ఎందుకు చేసింది? రెండు దేశాల బంధాల్లో వస్తున్న మార్పులు ఏంటి?

ఫొటో సోర్స్, Reuters

‘అమెరికాతో భారత్ సాన్నిహిత్యం’

అమెరికా వైపు భారత్ మొగ్గుతోందన్న సందేహాలు ఇరాన్‌కు పెరిగాయని, అందుకే ఆ దేశం ఈ వైఖరి తీసుకుందని మధ్యప్రాచ్య వ్యవహారాల నిపుణుడు కమర్ అఘా అన్నారు.

‘‘అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత పర్యటన ఇరాన్ సందేహాలను పెంచింది. అమెరికా విధానాలను భారత్ ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తుందని ఆ దేశం అనుమానిస్తోంది. అయితే, ఇరాన్‌లోని చాబహార్ పోర్టు అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్‌ను అమెరికా అడ్డుకోకూడదన్న విషయం గురించి చర్చలు జరిగాయి. కానీ, రాబోయే రోజుల్లో భారత్ అమెరికా విధానాల వైపు మొగ్గుతుందని ఇరాన్ భావిస్తోంది’’ అని కమర్ అన్నారు.

ఇరాన్‌లో ఇప్పుడు అధికారం ఛాందసవాదుల చేతుల్లో ఉందని, ఉదారవాద వర్గం బాగా బలహీనపడిందని కమర్ అన్నారు.

‘‘అమెరికా, ఇరాన్ మధ్య సంక్షోభం పెరుగుతోంది. యూరప్‌తోనూ ఇరాన్ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను దూరం చేసుకుంటూ ఇరాన్ కష్టాలను పెంచుకుంటోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP

‘తగ్గిన చమురు దిగుమతులు’

ఇరాన్ వైఖరి అకస్మాత్తుగా ఏమీ మారలేదని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏకే పాషా అన్నారు. ఏడాదిన్నర క్రితం ఇరాన్‌తో ఉన్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకుని, కఠిన ఆంక్షలు విధించినప్పడే ఈ మార్పు మొదలైందని అభిప్రాయపడ్డారు.

అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలును భారత్ ఆపేసిందని, చాబహార్ పోర్టు‌పైనా భారీ పెట్టుబడులు తగ్గాయని ఇరాన్ చెబుతోందని పాషా అన్నారు.

తమ నుంచి చమురు, గ్యాస్ కొనుగోలుకు భారత్ సిద్ధంగా లేకపోవడం, అమెరికా నుంచి కొనుగోలు చేస్తుండటం ఇరాన్‌కు ప్రధాన సమస్యగా ఉందని నిపుణులు అంటున్నారు. పైగా ఇరాన్ క్రెడిట్, ఇన్సూరెన్స్ లాంటి సదుపాయాలను కూడా కల్పిస్తోంది.

ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు చమురు, గ్యాసే. ప్రతికూల పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, Reuters

భారత్ ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతులే తీర్చుతున్నాయి. వీటిలో ఇరాన్ వాటా గణనీయంగా ఉంది. అయితే, అమెరికా ఆంక్షల తర్వాత ఈ వాటా తగ్గింది.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించినా, 2019 మే వరకూ కొన్ని దేశాలకూ మినహాయింపులు ఇస్తూ వచ్చింది. ఆ దేశాల్లో భారత్, చైనా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత మినహాయింపులు కొనసాగించలేదు. ఈ ఏడాది అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలు తీవ్రమవడంతో భారత్‌కు ఇబ్బందులు పెరిగాయి.

2018-19లో భారత్ ఇరాన్ నుంచి 23.9 మిలియటన్ టన్నుల చమురు దిగుమతి చేసుకుంది. అప్పుడు అమెరికా ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపు ఉంది. కానీ, 2019-20లో ఈ దిగుమతులు 1.7 మిలియన్ టన్నులకు పడిపోయాయి. గత కొన్నేళ్ల దిగుమతులతో పోల్చితే, ఈ ఏడాది దిగుమతులు చాలా చాలా తక్కువ.

ఇప్పుడు భారత్ ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు అమెరికా, ఇరాక్, సౌదీ అరేబియాల వైపు చూస్తోంది.

గత సెప్టెంబర్‌లో విడుదలైన సమాచారం ప్రకారం 2018-19 ఏడాది తొలి ఐదు నెలల్లో అమెరికా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు 72 శాతం పెరిగాయి.

ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించుకున్నా, చాబహార్ పోర్ట్ అభివృద్ధిని భారత్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే, ఆ పోర్ట్ భవిష్యతుపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి.

ఈ పోర్ట్‌ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య మార్గం ఏర్పాటు చేసుకోవాలని భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్ 2016 మే‌లో నిర్ణయం తీసుకున్నాయి. మధ్య ఆసియా, రష్యా, యూరప్ దాకా చేరుకునేందుకు భారత్‌కు ఈ పోర్ట్ అవకాశం కల్పిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

‘మారుతున్న సమీకరణలు’

ఇరాన్‌పై ప్రభావాన్ని పెంచుకోవాలని చైనా చాలా కాలం నుంచి ఆశిస్తూ వచ్చిందని... కానీ, ఇరాన్ విధానాలు భారత్‌కు అనుకూలంగా ఉంటూ వచ్చాయని కమర్ అఘా అన్నారు. ఇప్పుడు భారత్, అమెరికా మధ్య సాన్నిహిత్యం పెరుగుతుండటంతో ఆ దేశం చైనా వైపు మొగ్గుతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

ప్రాంతీయంగా కొత్త కొత్త కూటములు ఏర్పాటవుతున్నాయి. భారత్-ఇరాన్ సంబంధాలు మారుతున్నాయి. తాలిబన్ల కారణంగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు కూడా మారుతున్నాయి.

మధ్య ప్రాచ్యంలోని సమీకరణల్లో మార్పుల ప్రభావం కూడా భారత్, ఇరాన్ సంబంధాలపై ఉందని ఏకే పాషా అన్నారు.

‘‘తాలిబన్లు తమకు శత్రువులని ఇన్నేళ్లుగా ఇరాన్ చెబుతూ వస్తోంది. భారత్, ఇరాన్, రష్యా, టర్కీ కలిసి అఫ్గానిస్తాన్‌లో పరిస్థితిని పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అయితే ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా లేదు. అమెరికా సైన్యం కూడా అఫ్గానిస్తాన్‌కు వస్తోంది. దీనిపై ఇరాన్ ఆగ్రహంతో ఉంది’’ అని ఆయన చెప్పారు.

యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియాతో భారత్ మంచి సంబంధాలు ఏర్పరుచుకుంది.

ఆ మూడు దేశాలు ఇజ్రాయెల్‌తో కలిసి తమకు ఇబ్బందులు పెంచుతాయని ఇరాన్ భావిస్తోంది.

ఫొటో సోర్స్, MEA TWITTER

‘ఇస్లామిక్ ప్రపంచం నుంచి వ్యతిరేకత ఉందా?’

ఇస్లామిక్ ప్రపంచం భారత్‌కు దూరం కాకుండా ఉండాలంటే, ముస్లింల ఊచకోతను భారత్ ఆపాలని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామెనెయి వ్యాఖ్యానించారు.

నిజంగానే ప్రస్తుత పరిస్థితులపై భారత్ ఇస్లామిక్ ప్రపంచం నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందా?

‘‘ఇస్లామిక్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడి పత్రికల్లో భారత్ నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ, చాలా వరకూ ఇస్లామిక్ దేశాల ప్రభుత్వాలు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు’’ అని ఏకే పాషా అన్నారు.

ఇస్లామిక్ ప్రపంచంలో ప్రస్తుతం భారత్‌కు మంచి పేరు ఉందని కమర్ అఘా అంటున్నారు.

సౌదీ అరేబియా, యూఏఈ సహా చాలా గల్ఫ్ దేశాలు భారత్ వైపు ఉన్నాయని ఆయన చెప్పారు. టర్కీ, మలేసియా, పాకిస్తాన్ మినహా భారత్ తీరును విమర్శించినవారు ఎవరూ పెద్దగా లేరని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఏం చేస్తుంది?

మలేసియా విమర్శలు చేసినప్పుడు, ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులపై భారత్ పరోక్షంగా నిషేధం విధించింది.

‘‘ఇరాన్‌తో మెరుగైన సంబంధాలు కొనసాగాలని భారత్ కోరుకుంటోంది. చాబహార్ పోర్ట్ అభివృద్ధిలో పాత్ర పోషించాలనుకుంటోంది. భారత్‌కు మధ్య ఆసియా ద్వారం ఇరానే. అఫ్గానిస్తాన్ నుంచి రైలు మార్గం ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటోంది’’ అని కమర్ అఘా అన్నారు.

‘‘ఇరాన్ భారత్‌కు సన్నిహితమైన, ముఖ్యమైన దేశం. ఆ దేశానికి ఎప్పుడూ భారత్ మిత్రపక్షంగానే ఉంది. స్వాతంత్య్రానికి ముందు రెండు దేశాలు సరిహద్దులు కూడా పంచుకున్నాయి. అయితే, ఇరాన్ తాజా వ్యాఖ్యల తర్వాత చాబహార్ విషయంలో కొన్ని సమస్యలు తప్పకుండా వస్తాయి. ఇకముందు ఇరాన్ వైఖరి ఎలా ఉంటుందో భారత్ చూడాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)