కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?

  • 22 మార్చి 2020
కరోనావైరస్ Image copyright Getty Images

ప్రపంచం స్తంభించిపోతోంది. నిన్నమొన్నటివరకూ నిత్యం జనంతో నిండివున్న నగరాలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. మహా నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకూ ఏదో తెలియని భయంతో స్మశాన నిశబ్దం అలముకుంటోంది.

జనజీవనం ఇళ్లకే పరిమితమైంది. స్కూళ్లు, కాలేజీలు లేవు. ఊళ్లకు ప్రయాణాలు లేవు. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు మూతబడ్డాయి. ఆరుబయట పనులు రద్దు. ఆఫీసు పనులు ఇళ్లలోంచే. పెళ్లిళ్లూ పండుగలూ ఆత్మీయులతో కలయికలూ అన్నీ బందవుతున్నాయి.

కరోనావైరస్ విషయంలో ప్రపంచం మొత్తం ఇలా అసాధారణంగా స్పందిస్తోంది. ఇలా ఎంత కాలం? ఇది ఆగేదెప్పుడు? మన జీవితాలు మళ్లీ మామూలుగా మారేదెన్నడు?

రాబోయే 12 వారాల్లో కరోనా మహమ్మారి నుంచి బ్రిటన్ కోలుకోవటం మొదలవుతుందని, ఈ వైరస్‌ను తరిమి కొట్టగొలదని తాను భావిస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు.

కానీ.. రాబోయే మూడు నెలల్లో కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గటం మొదలైనా.. పూర్తిగా కోలుకోవటానికి ఇంకా చాలా కాలం పడుతుంది.

ఈ వైరస్ ఉధృతి తగ్గటానికి సుదీర్ఘ సమయం అంటే, సంవత్సరాల సమయమే పట్టవచ్చు.

జనం కదిలే, కలిసే ప్రాంతాలన్నిటినీ పూర్తిగా మూసివేసే ప్రస్తుత వ్యూహం ఎక్కువ కాలం కొనసాగించటం కష్టమన్నది స్పష్టమే. దీనివల్ల సామాజిక, ఆర్థిక నష్టం విధ్వంసకరంగా ఉంటుంది.

ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఈ పరిస్థితుల నుంచి ''బయటపడటానికి ఒక వ్యూహం'' అవసరం. ఆంక్షలను రద్దు చేసి, పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువెళ్లే ప్రణాళిక అవసరం.

కానీ.. కరోనావైరస్ అదృశ్యం కాబోదు.

ఈ వైరస్‌ను దూరం పెడుతున్న ఆంక్షలను తొలగిస్తే.. కేసులు మళ్లీ పెరిగిపోతాయి.

''ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రపంచంలో ఏ దేశానికీ 'ఎగ్జిట్ స్ట్రాటజీ' లేదు'' అంటారు యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరో ప్రొఫెసర్ మార్క్ వూల్‌హౌస్.

Image copyright Getty Images

ఇదో భారీ శాస్త్రీయ, సామాజిక సవాలు.

ఈ గందరగోళం నుంచి గట్టెక్కటానికి ప్రధానంగా మూడు మార్గాలున్నాయి.

  • వాక్సిన్లు వేయటం
  • ఇన్‌ఫెక్షన్ ద్వారా తగినంత మందిలో రోగనిరోధక శక్తి పెంపొందటం
  • మన ప్రవర్తన తీరును, మన సమాజాన్ని శాశ్వతంగా మార్చివేయటం

ఈ మూడు మార్గాల్లో ఏ ఒక్కటైనా.. వైరస్ వ్యాపించే అవకాశాలను తగ్గిస్తుంది.

Image copyright Getty Images

వ్యాక్సిన్లు: ఇంకా 12-18 నెలల సమయం పడుతుంది

ఒక వ్యక్తికి వ్యాక్సిన్ ఇస్తే.. ఆ వ్యక్తికి ఈ వైరస్ సోకినా జబ్బుపడరు.

జనాభాలో సుమారు 60 శాతం మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే.. ఈ వైరస్ విజృంభించదు. ఈ విధానాన్ని సామూహిక రోగనిరోధక శక్తిగా వ్యవహరిస్తారు.

కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీ కోసం పరిశోధనలు అసాధారణ వేగంతో సాగుతున్నాయి. వ్యాక్సిన్‌ను మనుషుల మీద పరీక్షించే ముందు జంతువుల మీద పరీక్షించాలన్న నిబంధనలను కూడా అమెరికా సడలించింది.

దీంతో ఈ వారంలోనే తొలి వ్యక్తికి ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ ఇచ్చారు.

కానీ.. ఇది విజయవంతమవుతుందన్న భరోసా లేదు. అసలు ప్రపంచ స్థాయిలో ప్రజలకు ఈ వాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా అన్నదీ ఇంకా తెలియదు.

అన్నీ సాఫీగా సాగితే వ్యాక్సిన్ తయారవటానికి ఇంకా కనీసం 12 నెలల నుంచి 18 నెలల సమయం పడుతుందని నిపుణుల అంచనా.

యుద్ధాలేవీ లేని శాంతియుత పరిస్థితుల్లో, అసాధారణ సామాజిక ఆంక్షలను ఎదుర్కొంటున్న తరుణంలో అంతకాలం వేచి ఉండటం అసాధ్యం.

''వ్యాక్సిన్ కోసం వేచి ఉండటం అనేది వ్యూహం కాబోదు'' అంటారు ప్రొఫెసర్ వూల్‌హౌస్.

సహజ రోగనిరోధక శక్తి - కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది

బ్రిటన్ అనుసరిస్తున్న స్వల్ప కాలిక వ్యూహం ఏమిటంటే.. ఆస్పత్రులు చాలనంతగా రోగులు పెరిగిపోకుండా చూడటానికి సాధ్యమైనంత వరకూ కేసులను తగ్గించటం. ఆస్పత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ బెడ్లు చాలకపోతే.. మరణాలు పెరిగిపోతాయి.

ఒకసారి కేసుల సంఖ్య తగ్గితే.. కొన్ని ఆంక్షలను కొంత కాలం పాటు తొలగించటానికి వీలుంటుంది. అంటే.. మళ్లీ కేసుల సంఖ్య పెరిగి మరో విడత ఆంక్షలు అవసరమయ్యే వరకూ వెసులుబాటు లభిస్తుంది.

ఇలా ఎప్పుడు జరుగుతుందనేది తెలియదు. ''ఈ విషయాల్లో కచ్చితమైన కాలావధిని నిర్ణయించటం సాధ్యం కాదు'' అని బ్రిటన్ ముఖ్య శాస్త్రీయ సలహాదారు సర్ పాట్రిక్ వాలాన్స్ పేర్కొన్నారు.

ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఇలా చేయటం వల్ల మరింత ఎక్కువ మందికి వైరస్ సోకి.. సామూహిక రోగనిరోధక శక్తి తయారవటానికి దారితీస్తుంది.

కానీ ఇదంతా జరగటానికి సంవత్సరాల కాలం పట్టవచ్చునని ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ చెప్తున్నారు.

''వైరస్ వ్యాప్తిని ఒక స్థాయికి - దేశంలో అతి తక్కువ మందికి - మాత్రమే పరిమితమయ్యేలా చేయటం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే.. ఇలా రెండేళ్లకన్నా ఎక్కువ కాలం కొనసాగితే.. ఒక స్థాయిలో సామూహిక రోగనిరోధక శక్తిని సంతరించుకున్న ఎక్కువమందికి ఈ వైరస్ సోకవచ్చు'' అని ఆయన వివరించారు.

అయినా.. ఇలాంటి రోగనిరోధక శక్తి శాశ్వతంగా కొనసాగుతుందా అనే సందేహమూ ఉంది. సాధారణ జలుబు లక్షణాలను కలిగించే ఇతర కరోనావైరస్‌లకు మన శరీరాల్లో చాలా బలహీనమైన రోగనిరోధక ప్రతిస్పందన వస్తుంది. అందువల్ల జనానికి వారి జీవితాల్లో అదే వైరస్ మళ్లీ అనేక పర్యాయాలు సోకే అవకాశముంది.

Image copyright AFP

ప్రత్యామ్నాయాలు - స్పష్టంగా ఏమీ లేవు

''వైరస్ వ్యాప్తి రేట్లను అతి తక్కువగా ఉండేలా చూడటానికి మన ప్రవర్తనలో శాశ్వత మార్పులు చేసుకోవటం మూడో మార్గం'' అంటారు ప్రొఫెసర్ వూల్‌హౌస్.

ఇందుకు.. ఇప్పుడు అమలు చేస్తున్న కొన్ని చర్యలను కొనసాగించాల్సి ఉంటుంది. లేదంటే.. వైద్య పరీక్షల నిర్వహణ, రోగులను ఏకాంతంలో ఉంచటం వంటి చర్యలను భారీస్థాయిలో పెంచాల్సి ఉంటుంది. తద్వారా వైరస్ విజృంభణను నియంత్రించటానికి ప్రయత్నించవచ్చు.

''మొదటి విడతలో మనం ముందుగానే గుర్తించాం.. కాంటాక్ట్ ట్రేసింగ్‌ కూడా చేశాం. కానీ అది ఫలించలేదు'' అని ప్రొఫెసర్ వూల్‌హౌస్ పేర్కొన్నారు.

కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను విజయవంతంగా నయం చేసే ఔషధాలను తయారు చేయటం.. ఇతర వ్యూహాలకు కూడా తోడ్పడుతుంది.

జనంలో ఎవరికైనా వైరస్ సోకిన లక్షణాలు కనిపించిన వెంటనే వారికి ఈ మందులు వాడవచ్చు. వారి నుంచి వైరస్ ఇతరులకు సోకకుండా నివారించటానికి ఇది తోడ్పడుతుంది.

లేదంటే.. ఈ వ్యాధి తీవ్రతను తగ్గించటానికి రోగులను ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స ఇవ్వటం ఒక మార్గం. దీనివల్ల ఇంటెన్సివ్ కేర్ మీద ఒత్తిడిని తగ్గించవచ్చు. తద్వారా మళ్లీ ఆంక్షలు, మూసివేత చర్యలు చేపట్టే సమయానికి ఎక్కువ కేసులను ఎదుర్కొనేందుకు వీలవుతుంది.

ఆస్పత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ బెడ్ల సంఖ్యను పెంచటం ద్వారా కూడా ఇదే తరహా ప్రభావం ఉంటుంది. వైరస్ విజృంభణను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది.

'మీ ఎగ్జిట్ వ్యూహం ఏమిటి?' అని బ్రిటన్ ముఖ్య వైద్య సలహాదారు ప్రొఫెసర్ క్రిస్ విటీని నేను అడిగాను.

ఆయన ఇచ్చిన సమాధానం: ''దీర్ఘ కాలికం. దీని నుంచి బయటపడటానికి వ్యాక్సిన్ ఒక మార్గం. అది సాధ్యమైనంత త్వరగా జరుగుతుందని మేమంతా ఆశిస్తున్నాం. సైన్స్ దీనికి పరిష్కారాలు చూపుతుంది.''

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్‌ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం

కరోనా లాక్‌డౌన్: ‘చావు తప్పదనుకుంటే మా ఊళ్లోనే చనిపోతాం’

కరోనా లాక్‌డౌన్: నరేంద్ర మోదీ మన్‌కీ బాత్.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇది యుద్ధం లాంటి పరిస్థితి’

కరోనా వైరస్: ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా సోకిందని కనిపెట్టడం ఎలా

కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్

కరోనావైరస్: ట్విటర్‌లో #ShameOnBCCI ట్రెండింగ్, ఎందుకు

ఆంథొనీ ఫాచీ: ఆరుగురు అమెరికా అధ్యక్షులకు సలహాలు ఇచ్చిన వైద్యుడు.. ఒకప్పుడు ఎయిడ్స్‌‌తో, ఇప్పుడు కరోనాతో యుద్ధానికి దిగిన సైనికుడు

PMCARESకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విరాళం రూ.25 కోట్లు

కరోనావైరస్ మీద యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న యోధులు ఎవరు.. వారు ఏమంటున్నారు