కరోనావైరస్: ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?

  • 24 మార్చి 2020
కరోనావైరస్ Image copyright Getty Images

కరోనావైరస్ కారణంగా చాలా మంది ఇప్పుడు ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ''రాజీ'' చేసుకోవాలని, అందరితో ప్రేమగా మెలగాలని కుటుంబ సంబంధాల స్వచ్ఛంద సంస్థ ఒకటి సూచిస్తోంది.

ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం ఇంట్లోనే కదలకుండా ఉండక తప్పని పరిస్థితులు నెలకొనవచ్చు. ఇలాంటపుడు అందరూ కలిసి ఉండే సమయం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి అలవాటు లేని పరిస్థితి ఇది.

రాబోయే కొన్ని వారాల్లో సామాజిక సంబంధాలకు పరీక్ష వంటిదని, అవి ఒత్తిడికి గురవుతాయని వైద్య చరిత్రకారుడు ఒకరు పేర్కొన్నారు.

రిలేట్ సిమ్రు అనే స్వచ్ఛంద సంస్థ.. కుటుంబ సంబంధాల మీద దృష్టి కేంద్రీకరించటం ద్వారా దీనిని అధిగమించవచ్చునని చెప్తోంది.

భారతదేశంతో పాటు చాలా దేశాల ప్రభుత్వాలు.. ప్రజలు 'అత్యవసరమైతే' తప్ప ప్రయాణం చేయవద్దని, ఎవరినీ కలవవద్దని, సాధ్యమైతే ఇంటి నుంచే పని చేయాలని, పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇది చాలా మందిలో ఇంటి జీవితం, కుటుంబ జీవితం మీద 'పట్టు కోల్పోయిన' భావన కలిగిస్తోందని రిలేట్ సిమ్రు కౌన్సిలర్ డాక్టర్ రాచెల్ డేవీస్ అంటున్నారు.

అయితే.. ''కుటుంబ సంబంధాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఒకరితో ఒకరు ప్రేమగా, దయార్థ్రంగా ఉండటం మనం మరింత మెరుగుగా పరిస్థితులను ఎదుర్కోవటానికి సాయపడతాయి'' అని ఆమె చెప్పారు.

Image copyright Getty Images

‘‘పిచ్చి పడుతోంది’’

కార్డిఫ్‌లోని నోరిస్ కుటుంబంలో ఒకే ఇంట్లో మూడు తరాలు ఉన్నాయి.

ఫ్రెడ్ (58), సుజెట్ (56)లు తమ ఇద్దరు పిల్లల్లో ఒకరైన ఫియాన్ (22), ఆమె 19 నెలల కొడుకు థియోతో కలిసి నివసిస్తున్నారు.

''ఇది కష్టంగా ఉండొచ్చు. ఎవరూ ఎక్కడికీ వెళ్లలేరు. ఎవరికీ వారికంటూ కొంత ఏకాంత సమయం దొరకదు'' అన్నారు సుజెట్.

తాను సుజెట్ కాళ్లకు అడ్డుపడతానని భయంగా ఉందని ఫ్రెడ్ అంటారు.

''నాకు పిచ్చెక్కుతోంది. నా ఆయువును కరోనావైరస్ కన్నా సుజెట్ ఎక్కువగా సవాల్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. వారం తిరిగేసరికి సుజెట్ నన్ను చంపేస్తుంది'' అంటూ ఆయన హాస్యమాడారు.

''మా సహనానికి ఇది పరీక్ష. సందేహం లేదు. చివరికి దీని నుంచి బయటపడటానికి ఏదో దారి కనుక్కోక తప్పదు'' అని పేర్కొన్నారు.

ఇంటర్నెట్ నిజంగా చాలా సాయపడిందని.. కుటుంబ సభ్యులు వేర్వేరు గదుల్లో కూర్చుని డివైజ్‌లు వాడుకోవటానికి వీలు కల్పించిందని ఫ్రెడ్ తెలిపారు.

చిత్రం శీర్షిక సుజెట్ నోరిస్ (56) ఇప్పుడు తన 19 నెలల మనుమడు థియోతో ఎక్కువ సేపు గడపవచ్చు

కానీ.. ఫియాన్‌కు మాత్రం బేబీ థియోతో జీవితం ఒక సవాలుగా మారింది.

''నిజాయితీగా చెప్తే.. నాకు పిచ్చెక్కుతోంది'' అన్నారామె.

''థియోకు వినోదంగా కాలక్షేపం చేయించటానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. మామూలుగా అయితే.. ఈతకో, ఆటకో అలా బయటకు తీసుకెళ్లటం అలవాటు. కానీ ఇప్పుడలా చేయలేం'' అని తెలిపారు.

ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల గురించి అడిగితే.. ''ఇప్పటికైతే బాగానే ఉంది. అంతగా పాడైందేమీ లేదు. కానీ ఇప్పుడే కదా మొదలైంది'' అని ఆమె స్పందించారు.

కుటుంబ సంబంధాల్లో అప్పటికే సమస్యలు ఉన్న కొంతమంది క్లయింట్లు రిలేట్ సిమ్రును సంప్రదించారని డాక్టర్ రాచెల్ తెలిపారు.

''ఈ సమయంలో ఏదో రకంగా రాజీ చేసుకోవటానికి సాధ్యమైనంత మేరకు ప్రయత్నం చేయాలని ప్రోత్సహిస్తున్నాం'' అని వివరించారు.

''మనం మన పోరాటాలను ఎంచుకోవాల్సిన తరహా పరిస్థితి ఉంది... బయటి వాతావరణం శత్రుపూరితంగా మారినపుడు మనం నిజంగా ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అసవరం ఉంది'' అని ఆమె పేర్కొన్నారు.

ఇంట్లో ఉద్రిక్తతలను ఎలా నివారించవచ్చు?

ఇంట్లో ఎటువంటి ఉద్రిక్త వాతావరణాన్నైనా తేలికపరచటానికి సాయపడే కొన్ని చర్యలను రిలేట్ సిమ్రు సూచిస్తోంది. అందులో కొన్ని:

  • ఒకరి మీద ఒకరు దయార్ద్రంగా ఉండాలి.. ఎదుటివారిని మునుపటిలా తప్పుపట్టటం మానేయాలి
  • ఇతరులు ఆందోళనను వేరే విధంగా ఎదుర్కొంటారన్న విషయం గుర్తెరగాలి - కొందరు దృష్టి మళ్లిస్తారు, ఇంకొందరు సమాచారంలో మునిగిపోతారు
  • కొంత ఏకాంతం కావాలనుకుంటే వేర్వేరు గదుల్లోకి వెళ్లాలి, ప్రతి రోజూ 24 గంటల పాటూ కలిసి ఉండేలా బలవంతం చేయవద్దు
  • వేర్వేరు గదుల్లో స్వీయ ఏకాంత నిర్బంధంలో ఉండాల్సిన అవసరముంటే.. సోషల్ మీడియా, ఫోన్, టెక్ట్స్ సందేశాలను ఉపయోగించుకోవాలి
  • పెద్ద పెద్ద సంభాషణలను తీవ్రమైన ఒత్తిడి క్షణాలు తొలగిపోయే వరకూ వాయిదా వేసుకోవాలి
  • కుటుంబం కలసి ఉండటానికి లభించిన అవకాశాలను ఒకరితో ఒకరు అనుబంధాలను పెంచుకోవటానికి ఉపయోగించుకోవాలి

ఈ ఆధునిక కాలంలో జనం అనూహ్యమైన ఆంక్షలు ఎదుర్కొంటున్నారని స్వాన్సియా యూనివర్సిటీలో మెడికల్ హిస్టరీ లెక్చరర్ డాక్టర్ మైకేల్ బ్రెసాలియర్ పేర్కొన్నారు.

Image copyright DAVIS/HULTON ARCHIVE/GETTY IMAGES
చిత్రం శీర్షిక స్పానిష్ ఫ్లూ విజృంభించినపుడు అది సోకకుండా నిరోధించటం కోసం బస్సుల పై డెక్‌లను తొలగించారు

శతాబ్దం కిందట స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని చుట్టుముట్టినపుడు నాటి కుటుంబాలకు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవటంలో నేటికన్నా మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

డాక్టర్ బ్రెసాలియర్.. 1918లో ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్ల మందికి పైగా ప్రజలను బలితీసుకున్న స్పానిష్ ఫ్లూ మహమ్మారి మీద నిపుణుడు.

''నాడు జనం యుద్ధ పరిస్థితులకు.. వివిధ రకాల ఆంక్షలకు, లోటుపాట్లకు అలవాటుపడి ఉన్నారు. అయితే.. వారిలో సామాజిక ప్రయోజనం అనే భావన బలంగా ఉంది. దేశ ప్రయోజనాల కోసం ఏదో ఒకటి చేసేవారు'' అని ఆయన తెలిపారు.

''అదే తరహాలో ఇప్పుడు.. సామాజికంగా ఏకాంతవాసానికి, కదలికల మీద ఆంక్షల విషయంలో మనం ఎప్పటికన్నా మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం. మనకు సోషల్ మీడియా ఉంది. చాలా మందికి నెట్‌ఫ్లిక్స్ వంటి అనేక ఆన్‌లైన్ వనరులు అందుబాటులో ఉన్నాయి'' అని విశ్లేషించారు.

1918లో స్కూళ్లు, సినిమాలు మూసివేయటం, కొన్ని ప్రదేశాలకు వెళ్లటానికి పరిమితమైన అనుమతులే ఉన్నప్పటికీ.. ఇప్పుడు కరోనావైరస్ కారణంగా విధిస్తున్న ఆంక్షల వంటివి మునుపెన్నడూ లేవని డాక్టర్ బ్రెసాలియర్ చెప్పారు.

''జనానికి ఇది చిత్రంగా కనిపించొచ్చు కానీ.. ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. కొద్ది కాలం పాటే కొనసాగేట్లయితే.. ఇంట్లో చాలా పనులు చేయటం జనానికి అలవాటేనని నేను భావిస్తున్నా'' అని పేర్కొన్నారు.

''కానీ.. వారాలు దాటి నెల రోజుల వరకూ కొనసాగితే.. సామాజిక సంబంధాలు ఒత్తిడికి గురవుతాయి.. విషమ పరీక్షలు ఎదురవుతాయి'' అన్నారాయన.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: తూర్పు గోదావరి జిల్లాలో 150 మందితో ప్రార్థనలు చేయించిన పాస్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

కరోనావైరస్: కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ ఎవరెస్ట్ ఎక్కుతున్న చైనా పర్వతారోహకులు

కరోనావైరస్‌: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం

కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా

కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి

కరోనా వైరస్‌: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..

కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా

కరోనావైరస్: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా

కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం