కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా

  • రిచర్డ్ గ్రే
  • బీబీసీ ప్రతినిధి
ఎండలు

ఫొటో సోర్స్, Getty Images

వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే కరోనావైరస్ తగ్గుముఖం పడుతుందని కొంతమంది భావిస్తున్నారు. కానీ, మహమ్మారులు వ్యాప్తి చెందే తీరు కాలాలకు అనుగుణంగా వచ్చే జలుబు, దగ్గులా ఉండవు. ఈ విషయం గురించి బీబీసీ ఫ్యూచర్ పరిశీలించింది.

కొన్ని అంటువ్యాధులు కాలంతో పాటు వస్తూ వెళ్తూ ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో జలుబు, నోరో వైరస్ వలన వాంతులు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వేసవిలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది.

శీతోష్ణ ప్రాంతాలలో వేసవిలో మశూచి కేసులు తగ్గితే, ఉష్ణ ప్రాంతాలలో ఇవి పెరుగుతాయి. ఇదే తరహాలో కోవిడ్-19 కేసులు కూడా తగ్గే అవకాశం ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ మధ్యలో చైనాలో తలెత్తిన ఈ వైరస్ క్రమంగా యూరోప్ దేశాలకి, అమెరికాకి విస్తరించింది. ఆ దేశాలలో రోజు రోజుకి నమోదు అవుతున్న కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఇప్పటివరకు సంభవించిన చాలా మహమ్మారులు ఉష్ణోగ్రతలు అతి తక్కువ ఉన్న ప్రాంతాలలో తలెత్తడంతో, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టవచ్చేమో అని కొందరు భావిస్తున్నారు. అయితే, ఉష్ణోగ్రతలు పెరగడం వలన వైరస్ తగ్గు ముఖం పడుతుందనే ఆలోచన సరైనది కాదని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

సార్స్- COV - 2 గా పేర్కొనే కోవిడ్ 19 కి కారణమయ్యే సార్స్ 2 చాలా కొత్త వైరస్. కాలాలకు అనుగుణంగా దీని ప్రభావం మారుతుందనడానికి కచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు. 2003లో తలెత్తిన వైరస్‌ను త్వరితగతిన నియంత్రించగలగడంతో, కాలాలకనుగుణంగా ఈ వైరస్ చూపే ప్రభావం పై పెద్దగా సమాచారం లేదు.

గతంలో జరిపిన కొన్ని పరిశోధనల ద్వారా కరోనావైరస్ కాలానికనుగుణంగా దాని ప్రభావాన్ని మారుస్తుందా అనే అంశం పై కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి.

10 సంవత్సరాల క్రితం బ్రిటన్‌లోని ఎడింబరోలో శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు రోగుల నుంచి సేకరించిన కరోనావైరస్ శాంపిల్స్ పరిశీలించగా అవి శీతాకాలం వలన వచ్చినట్లు తెలిసిందని, ఎడింబరో యూనివర్సిటీలో అంటువ్యాధుల నివారణ కేంద్రంలో పని చేస్తున్న కేట్ టెంపుల్‌టన్ జరిపిన అధ్యయనంలో పేర్కొన్నారు.

ఈ వైరస్ ప్రభావం డిసెంబర్-ఏప్రిల్ నెలల మధ్యలో ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారి పై దాడి చేసిన నాల్గవ రకం కరోనావైరస్ ప్రభావం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19 ప్రభావం కూడా కాలాలకు అనుగుణంగా మారవచ్చు. వైరస్ ప్రస్తుతం ప్రబలుతున్న తీరు చూస్తుంటే దీని ప్రభావం శీతల దేశాలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా 500 ప్రదేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా జరిపిన ఒక అధ్యయనం కోవిడ్ 19 వ్యాప్తి కి, వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రతలు, తేమ శాతం, గాలి వేగానికి సంబంధం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కోవిడ్-19 ప్రభావం తగ్గవచ్చని ఇంకొక అధ్యయనం పేర్కొంది. అయితే, ఈ రెండు అధ్యయనాలు ఇంకా ప్రచురించాల్సి ఉంది.

శీతల ప్రాంతాలలో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండవచ్చని మరొక అధ్యయనం పేర్కొంది. ఉష్ణ ప్రాంతాలలో ఈ వైరస్ ప్రభావం తక్కువగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఈ అధ్యయనాలను ఇంకా నిర్థరించాల్సి ఉంది.

వీటిని నిర్ధరించడానికి, భవిష్యత్ లో వైరస్ వ్యాప్తిని అంచనా వేయడానికి కంప్యూటర్ నమూనాలు తప్ప పరిశోధకుల దగ్గర కచ్చితమైన సమాచారం ఏమీ లేదు.

సాధారణ వైరస్ ప్రభావం చూపే తీరుని, కోవిడ్-19 ప్రభావం చూపే తీరుకు పోల్చడం సరైనది కాదు. ఎందుకంటే కరోనావైరస్ ని ఎదుర్కోవటం ఇప్పుడు మానవాళి ముందున్న ఒక పెద్ద సవాలు.

కోవిడ్-19 ప్రభావం సాధారణంగా కాలాన్ని బట్టి వచ్చే జలుబు, దగ్గుని పోలి ఉండదు. ఉదాహరణకు సాధారణ జలుబు శీతాకాలంలో ఎక్కువగా వస్తే స్పానిష్ ఫ్లూ వేసవిలో తీవ్రంగా ప్రబలింది.

కోవిడ్-19 వైరస్ రాను రాను ఒక మహమ్మారిలా అవుతుందని స్టాక్ హోమ్‌ కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లో అంటువ్యాధుల నివారణ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ జాన్ ఆల్బర్ట్ అన్నారు. ఈ వైరస్ ప్రభావం కాలానికనుగుణంగా మారితే అది ఆశ్చర్యపడాల్సిన విషయమే అని అన్నారు. ఇది కచ్చితంగా తెలియదు కానీ, సాధ్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

కరోనావైరస్ కి సంబంధించిన కొన్ని ఇతర వైరస్ లు కాలానికనుగుణంగా ప్రవర్తించడంతో, కోవిడ్ 19 కూడా కాలాన్ని అనుసరించి తన ప్రభావాన్ని మార్చుకుంటుందేమో అనే ఆశ ఉంది.

కరోనావైరస్ కొన్ని కప్పి ఉంచిన వైరస్ ల కుటుంబానికి చెందినవి. అంటే అవి ఒక నూనె లాంటి పదార్ధంతో కప్పబడి ఉంటాయి. దీనిని లిపిడ్ బై లేయర్ అంటారు. ఇవి వైరస్ చుట్టూ కిరీటంలో ముళ్ళు ఆకారాన్ని పోలి ఉంటాయి. అందుకే దీనికి కరోనా అనే పేరు పెట్టారు. కరోనా అంటే గ్రీక్ లో కిరీటం అని అర్ధం.

ఇలా కప్పి ఉంచిన ఇతర వైరస్ ల పై చేసిన పరిశోధనలు వాతావరణంలో వేడి కారణంగా వీటి ప్రభావం తగ్గవచ్చని సూచిస్తున్నాయి. శీతల పరిస్థితుల్లో ఈ నూనె పదార్ధం లాంటి వైరస్ కవచం రబ్బర్ లా మారి మాంసం కొవ్వులా తయారు అవుతుంది. దీంతో వైరస్ కాల పరిమితి పెరిగిపోతుంది. కవచం ఉన్న వైరస్ ల కాల పరిమితి ఎక్కువ సేపు ఉండటానికి ఇదొక కారణంగా చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, others

ప్లాస్టిక్, స్టీల్ లాంటి గట్టి ఉపరితలాల్లో సార్స్- సి ఓ వి-2 వైరస్ 21 నుంచి 23డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో 40 శాతం తేమ ఉన్న చోట 72 గంటల పాటు సజీవంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కోవిడ్ వైరస్ వివిధ ఉష్ణోగ్రతల్లో ఎలా ప్రభావం చూపిస్తుందో ఇంకా అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే, ఇతర కరోనావైరస్ ల పై జరిపిన అధ్యయనాలు అవి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో 28 రోజుల పాటు సజీవంగా ఉంటాయని చెప్పారు.

2003లో తలెత్తిన సార్స్ మహమ్మారి కూడా శీతల ప్రాంతాలలో ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఉదాహరణకి 22 నుంచి25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 40 నుంచి 50 శాతం తేమ ఉన్న పరిస్థితుల్లో సార్స్ వైరస్ ఐదు రోజుల పాటు సజీవంగా ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వైరస్ కాల పరిమితి తక్కువగా ఉంది.

వాతావరణం వైరస్ వ్యాప్తి పై ప్రభావం చూపిస్తుందని, స్పెయిన్ లోని నేషనల్ మ్యూజియం అఫ్ నాచురల్ సైన్సెస్ లో పర్యావరణ మార్పుల పై అధ్యయనం చేస్తున్న మిగువెల్ ఆరుజో అన్నారు. వైరస్ వ్యాప్తి చెందడం, మహమ్మారిలా మారడానికి అది ఎంత సేపు సజీవంగా బయట వాతావరణంలో ఉండగలదో అనే అంశం పై ఆధార పడి ఉంటుందని అన్నారు. అయితే, సార్స్ సి ఓ వి - 2 అతి త్వరగా ప్రపంచం అంతా వ్యాపించి చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో దాని ప్రభావం ఎక్కువగా చూపించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఒకవేళ కోవిడ్-19 వాతావరణంలో ఉష్ణోగ్రతలకు, తేమని బట్టి ప్రభావితమయితే , వీటి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.

"రెండు రకాల వైరస్ లు ఒకేలా ప్రవర్తించవచ్చని అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ, ఇది కేవలం ఒకే ఒక్క అంశం పై ఆధార పడి లేదు. వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఎక్కడైనా జన సమూహం ఎక్కువగా గుమికూడినా, ఒకరితో ఒకరు దగ్గరగా మెలిగినా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. వైరస్ వ్యాప్తిని అర్ధం చేసుకోవడానికి వైరస్ ప్రవర్తించే తీరుని పరిశీలించాల్సి ఉంటుంది" అని అన్నారు

ఉష్ణోగ్రతలు 5 నుంచి 11 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ప్రాంతాలలో వైరస్ ఎక్కువగా ప్రబలిందని మేరీల్యాండ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది.

అయితే, ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతాలలో కూడా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఆసియాలో వైరస్ వ్యాప్తి పై హార్వర్డ్ మెడికల్ స్కూల్ జరిపిన అధ్యయనం మాత్రం వాతావరణానికి వైరస్ ప్రభావానికి సంబంధం లేదని అంటోంది.

ఫొటో సోర్స్, Reuters

చైనాలో, సింగపూర్ లోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ ప్రబలిన తీరు చూస్తుంటే ఇది వాతావరణానికి అనుగుణంగా తగ్గుతుందని చెప్పలేమని అన్నారు. ఈ పరిస్థితి ఒక సమర్ధ ప్రజా ఆరోగ్య వ్యవస్థ అవసరాన్ని స్పష్టం చేస్తుంది.

వైరస్ వ్యాప్తి చెందే తీరు కేవలం వాతావరణంలో ఎంత సేపు సజీవంగా ఉండగలదనే ఒక్క అంశం పై ఆధార పడి లేదు. అందుకే రోగాలు కాలాన్ని బట్టి మారుతాయా, లేదా అనేది అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమని అన్నారు. కోవిడ్ 19 విషయం లో వైరస్ ప్రజల నుంచి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. వీరి ప్రవర్తన శైలి మీదే ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఆధార పడి ఉంటుంది.

యూరోప్ లో మసూచి కేసు లను పరిశీలిస్తే, స్కూల్ తెరిచి ఉంచినప్పుడు వాటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. చైనా కొత్త సంవత్సరం సమయంలో ప్రజలు విపరీతంగా ప్రయాణం చేయడం వలన, బయట తిరగడం వలన, కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందడానికి ఒక కారణం అని చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, EPA

వాతావరణం కూడా రోగ నిరోధక శక్తి పై ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ఉన్న విటమిన్ డి శాతం కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశానికి ఒక కారణం అవుతుంది. శీతాకాలంలో ఎక్కువగా బట్టలు కప్పుకుని ఉండటం వలన శరీరానికి సూర్య రశ్మి సోకే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, దాంతో, విటమిన్ డి తయారు అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. అయితే, కొన్ని అధ్యయనాలు ఈ వాదనని సమర్ధించటం లేదు.

కొన్ని అధ్యయనాలు శీతాకాలం లో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుందని చెబుతున్నాయి. ఇన్ఫెక్షన్ నుంచి రక్షించే కణజాలం శీతాకాలంలో శరీరంలో ఎక్కువగా తయారు అవుతాయని మరి కొన్ని అధ్యయనాలు అంటున్నాయి.

వాతావరణంలో ఉన్న తేమ శాతం వలన రోగాల బారిన పడే అవకాశం ఉందని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల్లో రక్షణ కవచంగా సహజంగా ఉండే జిగురు లాంటి పదార్ధ శాతం తగ్గిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడేందుకు ఎక్కువ అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో జరిపిన ఒక అధ్యయనం వాతావరణానికి కోవిడ్ 19కి సంబంధం ఉందని చెబుతున్నాయి. చైనా లోని వుహాన్ లో సంభవించిన 2300 మరణాలను వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రతలు, తేమ శాతం, కాలుష్యంతో పరిశీలించి చూసారు.

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న రోజుల్లో మరణాల రేటు తక్కువగా ఉందని ఈ పరిశోధన పేర్కొంది. ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా గాని అత్యల్పంగా గాని ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో మరణాల రేటు అధికంగా ఉందని ఈ పరిశోధన చెబుతోంది. అయితే ఈ పరిశోధన కంప్యూటర్లో లభించిన సమాచారం ఆధారంగా నిర్వహించారు. ఇదే తీరు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కనిపిస్తుందో లేదో పరిశీలించి చూడాల్సి ఉంది. ఈ పరిశోధన ఇంకా ప్రచురితం కావల్సి ఉంది.

కోవిడ్ 19 వైరస్ కొత్తది కావడం వలన ఎవరైనా వైరస్ సోకి కోలుకున్న వారిని పరిశీలించాల్సి ఉంది. ఇది మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

ఈ వైరస్ విమాన ప్రయాణాల ద్వారానే ఎక్కువగా వ్యాప్తి చెందిందని ఫ్రెంచ్ హెల్త్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ డైరెక్టర్ విట్టోరియా కొలిజా అన్నారు. "అయితే, ఇది ఒక సారి సామాజికంగా వ్యాప్తి చెందడం మొదలైతే దీని ప్రభావం తీవ్రమవుతుంది. మనుషుల కదలికల్ని ఆపడమే దీనిని అరికట్టడానికి ఒక మార్గమని" చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు ఇదే పద్దతిని అవలంభిస్తున్నాయని అన్నారు.

వాతావరణం బట్టి వైరస్ ప్రవర్తన మారుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని కొలిజా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఒక వేల కోవిడ్-19 కేసులు తగ్గు ముఖం పడితే అది కేవలం వాతావరణం వలనేనని చెప్పడానికి లేదని, ప్రభుత్వాలు అమలు చేసిన స్వీయ నిర్బంధనలు, లాక్ అవుట్ లు వలన కూడా కావచ్చని చెప్పారు.

ఇప్పుడు నిర్బంధంలో ఉన్న వారంతా బయటకి వస్తే మళ్ళీ కరోనా వైరస్ విజృంభించినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.

రానున్న వేసవిలో కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టినప్పటికీ పూర్తిగా తగ్గిపోతుందని మాత్రం చెప్పలేమని అన్నారు. కానీ కేసు.ల సంఖ్య తగ్గితే కూడా మంచిదేనని అన్నారు

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపించినప్పటికీ , మహమ్మారి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వ్యాప్తిని కొంత కాలం పాటు అరికట్టగల్గితే, వైద్య పరంగా చర్యలు తీసుకోవడానికి సమయం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవడానికి కావల్సింది కొంత సమయం మాత్రమే.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)