కరోనావైరస్‌‌కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే.. ఎలాంటి చర్యలూ అవసరం లేదంటున్న దేశాధ్యక్షుడు

  • 27 మార్చి 2020
బెలారస్‌లో ఇంకా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెలారస్‌లో ఇంకా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి

ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారికి యూరప్ కేంద్రంగా మారింది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ సహా యూరప్ ఖండంలోని అనేక దేశాల్లో ఇప్పటికే వేల మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక దేశాలు పూర్తిగా లాక్‌డౌన్ ప్రకటించాయి. అత్యంత కఠిన ఆంక్షలను విధించాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

అయితే, యూరోపియన్ దేశాల్లో ఒకటైన బెలారుస్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. యూరప్‌లోని మిగతా దేశాలన్నీ కరోనా భయంతో వణికిపోతుంటే, పొరుగునే ఉన్న యుక్రెయిన్, రష్యా దేశాలు కఠినంగా వ్యవహరిస్తుంటే... బెలారుస్‌ మాత్రం తనదైన మార్గంలో వెళ్తోంది.

అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచనలో యుక్రెయిన్ ఉంది. రష్యా పాఠశాలలను మూసివేసింది, జనాలు గుమిగూడే అనేక రకాల కార్యక్రమాలను, విమానాల రాకపోకలను రద్దు చేసింది.

బెలారుస్‌లో అలాంటి చర్యలేమీ లేవు. సరిహద్దులు తెరిచి ఉన్నాయి. ప్రజలంతా ఎప్పటిలాగే పనులు చేసుకుంటున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కరోనావైరస్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని బెలారుస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో అంటున్నారు

'భయం వద్దు'

కరోనావైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తమ దేశం ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవాల్సిన అవసరం లేదని బెలారుస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో అన్నారు.

"అలాంటివి చాలా వస్తాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరూ భయపడకూడదు!" అని మంగళవారం చైనా రాయబారితో జరిగిన సమావేశంలో ఆయన ఉద్ఘాటించారు.

బెలారుస్‌లో సినిమా థియేటర్లను మూసివేయలేదు. జనాలు గుమిగూడే కార్యక్రమాలను నిషేధించలేదు.

ప్రపంచవ్యాప్తంగా చాలా క్రీడా పోటీలు రద్దయ్యాయి. వాయిదా పడ్డాయి. ఈ దేశం మాత్రం తన ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ పోటీలను యథావిధిగా కొనసాగిస్తోంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక పొలాల్లో కష్టపడితే కరోనావైరస్ బారిన పడకుండా ఉండొచ్చని అధ్యక్షుడు లుకాషెంకో అంటున్నారు

'కరోనావైరస్‌ను ట్రాక్టర్ నయం చేస్తుంది'

"కరోనావైరస్‌ను ఒక ట్రాక్టర్ నయం చేస్తుంది" అని అధ్యక్షుడు లుకాషెంకో చేసిన వ్యాఖ్యలు... బెలారుస్‌లో సోషల్ మీడియా వేదికలపై చర్చనీయాంశంగా మారాయి.

వ్యవసాయ పొలాల్లో శ్రమిస్తే రోగాలు దరిచేరవనేది ఆయన భావన.

దేశాధ్యక్షుడు అంత ధీమాతో ఉన్నప్పటికీ, ఇక్కడి చాలామంది ప్రజలు కరోనావైరస్ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, బెలారుస్ వెలుపల ఇతర యూరప్ దేశాల్లో ఏం జరుగుతోందో వారికి తెలుసు.

కొంతమంది విద్యార్థులు రద్దీగా ఉండే పాఠశాలలకు వెళ్లడంలేదు.

ఈ ఆందోళనను తగ్గించే ప్రయత్నంలో భాగంగా, విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు విద్యార్థులంతా ఒకేసారి వెళ్లకుండా, కొన్ని తరగతులకు సమయాల్లో మార్పులు చేశారు.

ఈ వైరస్ వల్ల వృద్ధులకు ఎక్కువ ప్రమాదం ఉందని కొందరు ప్రజలకు అవగాహన ఉంది. కానీ, అధికారులు మాత్రం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదు.

బెలారుస్‌లో విదేశాల నుంచి తమ దేశానికి వచ్చిన వారందరికీ కరోనావైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యక్షుడు లుకాషెంకో చెప్పారు.

"రోజుకు ఇద్దరు ముగ్గురికి పాజిటివ్ అని వస్తుంది. వారిని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచి, రెండు వారాల తరువాత విడుదల చేస్తారు" అని ఆయన అన్నారు.

"ఎవరూ భయపడొద్దు. పుకార్లను వ్యాప్తి చేసేవారు వైరస్‌కంటే ప్రమాదకరం, భయాందోళనలను వ్యాప్తి చేస్తున్న ద్రోహులను వెతికి పట్టుకోవాలి" అని అధికారులను అధ్యక్షుడు ఆదేశించారు.

ఇప్పటివరకు, బెలారుస్‌లో 86 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా క్వారంటైన్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాంకేతికతను ఎలా వాడుతున్నాయి?

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు

కరోనా వైరస్: 24 గంటల్లో 525 కొత్త కేసులు.. భారత్‌లో 3,072కి పెరిగిన పాజిటివ్ కేసులు

హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?

కరోనావైరస్ సంక్షోభం: సమానత్వ, న్యాయ మూలాలపై సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణీ స్త్రీలు, రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

వివిధ దేశాల్లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలు: ‘ఆడవాళ్లు బయటకు వచ్చే రోజు మగవాళ్లు రాకూడదు.. భార్యలు భర్తల్ని విసిగించొద్దు’

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: అమెరికా చేసిన తప్పులేంటి... ఒప్పులేంటి?