కరోనావైరస్‌: గర్భిణికి సోకితే ఎలా? : ఓ డాక్టర్ అనుభవం

  • 27 మార్చి 2020
డాక్టర్ శైలజ చందు Image copyright Shailaja chandu
చిత్రం శీర్షిక డాక్టర్ శైలజ చందు

ఒమన్ దేశంలో ఆస్పత్రి జననాల సంఖ్య ప్రకారం చూస్తే, మా మెటర్నిటీ యూనిట్‌ది మూడో స్థానం. రోజూ 25 నుంచి 35 వరకు కాన్పులు అవుతుంటాయి.

కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతోందన్న వార్తలు రాగానే హాస్పిటల్ డైరెక్టర్.. విభాగాధిపతులందరితోనూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన, ఎప్పుడూ లేనంత గంభీరంగా ఉన్నారు.

ఆయన మాతో మర్యాదగా, ప్రసన్నంగా ఉండడమే నాకు తెలుసు. ముఖంలో, మాటల్లో కొద్దిపాటి అసౌకర్యం ఉంది.

ముంచుకొస్తున్న ముప్పుని ఎలా ఎదుర్కోవాలి? తీసుకోవలసిన నిర్ణయాలేమిటి? రోజువారీ పనిలో ఎలాంటి మార్పులు చేయాలి? ఈ విషయాలపై ఆయన మాట్లాడారు.

యుద్ధానికి ముందు సైన్యాన్ని ఉద్దేశించి చేస్తున్న ప్రసంగంలా ఉంది.

మా అందరి నుంచి సలహాలు, సూచనలు అడిగారు. ఇదివరకు జరిగే సమావేశాలకు భిన్నంగా ఈ మీటింగ్ చాలా గంభీరంగా, సుదీర్ఘంగా సాగింది.

విభాగాధిపతులు అందరూ తమ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఆయా విభాగాలకు వ్యాధి సోకిన వ్యక్తి ప్రవేశించినపుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎలా చికిత్స చేస్తారు? మిగతా రోగులకు ఆ వ్యాధి అంటకుండా ఎలా కాపాడాలి? ఈ క్రమంలో మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలి?

ఏయే మార్పులు చేయాల్సి ఉంటుంది? వంటి విషయాలతో పాటు, మీకు కావాల్సిన మార్పులు, వస్తువులు, పరికరాల వివరాలతో మీ ప్రణాళిక మొత్తం రేపటిలోగా సిద్ధం చేయాలని చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ఈ విపత్తు తగ్గుముఖం పట్టడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదు.

అనవసరమైన విజ్ఞానం పోగుచేసుకోదలచుకోలేదు. మార్గదర్శకాలను మాత్రమే చదివాను.

వార్తలు చూసి భయపడే అవకాశం తీసుకోదలుచుకోలేదు.

'భయానికి తలుపు తెరిస్తే అపజయాన్ని స్వాగతించినట్లే.'

టీవీ చూసే అలవాటు లేకపోవడం, ఈ విషయంలో సహాయపడింది.

గర్భిణీకి ఈ వైరస్ సోకితే ఎలా?

ఆమెకు కాన్పు చేయాల్సి వస్తే ఎలా?

ఆమెకు వైద్య సేవలు ఎక్కడ అందించాలి?

ఆమె నుంచి ఇతర రోగులకు ఆ వ్యాధి సోకకుండా ఎలా జాగ్రత్తపడాలి?

ఇవన్నీ ఆలోచిస్తుంటే... యుద్ధానికి ప్రణాళిక రచించినట్లు అనిపించింది.

పోరాడాల్సిన క్షణం వచ్చినపుడు యోధులనావహించే ఆత్మవిశ్వాసం, ధృఢ నిశ్చయం, క్రమశిక్షణ ఆవరించుకున్నాయి.

అప్పటికప్పుడు ప్రత్యేకంగా భవనాలను నిర్మించలేం. ఉన్న వాటినే వేరు చేసి ఉపయోగించాలి.

మా విభాగం బ్లూ ప్రింట్ ఒకసారి పరిశీలించాను.

కారు పార్క్ దగ్గరలో మా విభాగానికి సంబంధించినవే రెండు గదులున్నాయి. మామూలు రోగులు వచ్చే మార్గం కాకుండా దానికి వేరే దారి కూడా ఉంది. ఒక ప్రత్యేకమైన వార్డుని, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణుల కోసం గదిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశాం.

ఆమెకు ఆపరేషన్ ద్వారా కాన్పు చేయాల్సి వస్తే ఎలా?

మామూలు రోగుల నుంచి వ్యాధి సోకకుండా ఈమెను థియేటర్ లోపలకి ఎటు నుంచి తరలించాలి? ఆపరేషన్ థియేటర్ల సముదాయంలో ఏ థియేటర్ను ఉపయోగించాలి? ఒకేమారు ఇద్దరు పేషెంట్లు వచ్చినపుడెలా? సిబ్బందినెలా ఉపయోగించాలి?

వేరు వేరు పరిస్థితుల్ని ఊహించి ఒక ప్రణాళిక రాశాను.

ఐసొలేషన్ వార్డు ఏర్పాటు చేసిన ఓ వారం వరకు, ఆ వార్డును ఉపయోగించాల్సిన అవసరం రాలేదు.

ఈ దేశంలో ఎంతమందికి కరోనావైరస్ సోకి వుంటుంది?

వారిలో మహిళలు ఎంతమంది ఉంటారు?

అందులో గర్భిణులెంతమంది?

వారిలో కాన్పు తేదీ దగ్గరపడిన వారెంత మంది?

ఇటువంటి కాకి లెక్కలతో కాలక్షేపం చేస్తున్నాం.

Image copyright Shailaja chandu
చిత్రం శీర్షిక డాక్టర్ శైలజ చందు

ఎవరికైనా ప్రమాదం జరిగితే 'అయ్యో పాపం.'

చనిపోతే 'అయ్యో పాపం'

జబ్బు చేస్తే 'అయ్యో పాపం'

ఈ మాట వెనకాల ఒక ధీమా వినబడుతుంది.

'కష్టం మనకు కాదు, మనకు రాదు' అన్న మూర్ఖత్వపు ధీమా.

అటువంటి మూర్ఖత్వపు నిద్రలో జోగుతుండగా 'జమీల' (పేరు మార్చాను) మా ముఖాల మీద నీళ్లు జల్లి, కళ్లు తెరిపించింది. మా ప్రత్యేక వార్డునీ తెరిపించింది.

ఆమె నెలలు నిండిన గర్భిణి. చెకప్ కోసం వచ్చారు.

స్కానింగ్ చేసి చూస్తే బిడ్డ చుట్టూ ఉండే నీటి శాతం తగ్గిపోయింది. అందుకని డెలివరీ చేయాలని ప్లాన్ చేశాను.

ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని అన్నపుడు... "వారం నుంచి దగ్గు వస్తోంది" అని ఆమె చెప్పారు.

ఈ మధ్యన ఏదైనా దేశం దాటి వెళ్లారా? అని అడిగాను.

"మా చుట్టాలు వెళ్లారు. మేము వెళ్లలేదు" అని ఆమె చెప్పారు.

ఆమెకు పరీక్షలు చేసేందుకు శాంపిళ్లు తీసుకున్నాం. ఆ పరీక్ష ఫలితాలు వచ్చేవరకూ మిగతా రోగులతో కలిపి వార్డులో ఉంచలేమని చెప్పాము. ఒక ప్రత్యేక వార్డులో అడ్మిట్ చేసి, నొప్పులు రావడానికి మందు ఇస్తామని చెప్పాం.

నొప్పులు రావడానికి డైనో ప్రోస్ట్ జెల్ వాడతాం. జెల్ రూపంలో గానీ, చిన్న కాప్సూల్ రూపంలోగానీ, డైనో ప్రోస్ట్ జెల్‌ని గర్భాశయద్వారంలో పెట్టి 24 గంటలు ఉంచితే నొప్పులు వస్తాయి.

దాని గురించి ఆమెకు వివరించి, అది ఎందుకు చేస్తున్నాం? ఎలా చేస్తాం? నొప్పిగా ఉంటుందా, ప్రయోజనాలు, ప్రమాదాలు అన్నీ నర్సు సమక్షంలో వివరించి, సంతకాలు తీసుకోబోతుండగా, ఇంటికెళ్లి బట్టలు, బిడ్డకు కావలసిన వస్తువులూ తెచ్చుకుంటానని ఆమె వెళ్లిపోయారు.

ఇక అంతే! హాస్పిటల్‌కు తిరిగి రాలేదు.

తనెలా ఉందో, బిడ్డ తిరగడం తెలుస్తుందో లేదోనని రోజూ ఫోన్లో కనుక్కునేదాన్ని.

"జమీలా, ఇక హాస్పిటల్‌కు వచ్చేయమ్మా. కాన్పు అయ్యాక సాధ్యమైనంత త్వరగా పంపించేస్తాను" అని నేను అంటే, భయమేస్తోందని ఆమె చెప్పేవారు.

ప్రత్యేకమైన వార్డులో ఒక్కతే ఉండడానికి ఆమె ఇష్టపడేవారు కాదు.

ఆమెను ఒప్పించడానికి రోజూ ప్రయత్నించేదాన్ని.

రెండు రోజుల తర్వాత నాతో మాట్లాడడం కూడా ఆమె మానేశారు.

రాయబారాలన్నీ ఆమె భర్తతోనే.

Image copyright Getty Images

ప్రతి రోజూ సాయంత్రం రౌండ్స్ అయాక డైరెక్టర్‌తో సమావేశమవుతున్నాం, పరిస్థితి సమీక్షించేందుకు. ప్రతి విభాగాధిపతి తమ తమ యూనిట్‌లో జరుగుతున్న పని గురించి నివేదిక ఇవ్వాలి.

ఆ రోజు రాత్రి ఎనిమిది అవుతోంది. జోరున వర్షం కురుస్తోంది. సమావేశం జరిగే గది కిటికీలను గాలి విసురుగా తాకుతోంది.

ఆలోచనలు జమీల చుట్టూ తిరుగుతున్నాయి.

'వీకెండ్ వస్తోంది. మామూలుగానే రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. ఈ వారాంతంలో ఆమెకు డెలివరీ చేసెయ్యాలి' అని జమీల విషయం డైరెక్టర్‌కు చెప్పాను.

ఆమె రావడానికి ఇష్టపడడం లేదు. ఆయన అభిప్రాయం కూడా జమీలకు త్వరగా డెలివరీ అయితే మంచిదనే! రేపు వ్యాధి ఏ రూపం తీసుకున్నా, చికిత్స చేయడం సులభం అవుతుంది.

ఆ రాత్రి ఆమెతో ఇద్దరం మాట్లాడి మర్నాడు ఉదయమే వచ్చేట్లుగా ఒప్పించాం.

ఆ మర్నాడు, కొత్తగా ఉద్యోగానికి వెళుతున్నట్టు అనిపించింది. ఆ ఫీలింగ్ బాగుంది కూడా.

ఎనిమిదింటికి వస్తానన్న వాళ్లు పదకొండింటికి వచ్చారు.

ఓ చిన్న కిటికీ నుంచి, ఆమెకు మాస్కు ఇచ్చాం. అప్పటికే నేను, నవాల్ అనే నర్సు గౌన్లు, మాస్కులు, గ్లోవ్స్, కళ్లజోళ్లు, వాటర్ ప్రూఫ్ బూట్లు ధరించి అంతరిక్ష యాత్రికుల్లా తయారై ఉన్నాం.

జమీలకు తోడుగా ఆమె భర్త లోపలికి వస్తానంటే ఆపేశాను.

"నేనున్నాను కదా" అన్నాను.

అలా చెప్పడాన్ని మా గురువు గారు అలవాటు చేశారు.

నేను జూనియర్‌గా ఉన్నపుడు ఆ మాటలు పలకడానికి చాలా సిగ్గుపడేదాన్ని.

కొంత అనుభవం వచ్చాక తెలిసింది.. ఆ మాటల్లోని మహత్తు. ఆ మాట పలికిన తర్వాత కుటుంబ సభ్యుల ముఖాల్లో విరిసే నిశ్చింత చూసి తీరాల్సిందే.

ఆమెను ప్రత్యేక ఐసొలేషన్ వార్డులో ఉంచాం.

నర్సు నవాల్ ఆమె బట్టలు మార్పించి హాస్పిటల్ గౌను తొడిగించారు. ఆమె బట్టలు జాగ్రత్తగా పసుప్పచ్చని కవర్‌లో పెట్టి, చేతులు కడుక్కుని నర్సు వచ్చారు.

కడగడం, తుడవడం, మళ్లీ కడుక్కోవడం, మళ్లీ తుడుచుకోవడం ఓ గంటన్నర సేపు ఏదో చేస్తూనే ఉన్నాం. నేను డాక్టర్ను, తను నర్సు అన్న విషయం మర్చిపోయాం. ఇంట్లో తోడికోడళ్లలా ఇద్దరం చెరో పని చేస్తున్నాం.. మధ్య మధ్యలో జమీలను పలకరిస్తూ.

ఒక ముప్పావుగంట తర్వాత జమీల మాతో మాట కలిపింది.

Image copyright Getty Images

బిడ్డకేమైనా ప్రమాదమా?

"ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం, కడుపులో ఉన్న బిడ్డకు కరోనావైరస్ సోకే అవకాశం లేదు. బిడ్డ చుట్టూ ఉండే నీటిలో గానీ, గర్భాశయ ద్వారంలో ఉన్న ద్రవాల వల్లకానీ ఇది వ్యాపించదు. కానీ, పాలిచ్చే సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి."

డైనో ప్రోస్ట్ జెల్ పెట్టిన గంటకు ఆమెకు కొద్దిగా నొప్పులు వస్తున్నాయి. బిడ్డ గుండె చప్పుడు వినిపించేలా, సీటీజీ మెషీన్ ఆమె పొట్టకు అమర్చాం. ఉష్ణోగ్రత, ఆక్సిజన్ శాతం ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాం. 94 కన్నా ఎక్కువగా ఉండాలి. లేకపోతే ఆక్సిజన్ అందించాలి.

కాన్పు అంటే కనీసం నాలుగైదు గంటలు పడుతుంది.

ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో తెలియదు. ఎంత సేపని కూర్చుంటాను, వెళ్దామా అని "ఇక్కడే బయటే ఉంటాను. ఫోన్ చెయ్యి, రెండంగల్లో వచ్చేస్తా" అని నవాల్‌తో చెప్తుంటే "మీరెళ్లొద్దు, ఇక్కడే ఉండండి" అని జమీల అన్నారు.

దాంతో అక్కడే కూర్చున్నాను. నిజానికి బయటకు వెళ్లాలని నాకూ లేదు.

ఒక సారి గౌను విప్పేస్తే మళ్ళీ వేరేది వేసుకోవాలి. తర్వాత్తర్వాత ఎన్ని కావలసి వస్తాయో!

నేను, నవాల్, ఇద్దరం నెట్ ఫ్లిక్స్‌లో సినిమా చూద్దామని కూర్చున్నాం.

'తారే జమీన్ పర్'

"జమీలా, సినిమా చూస్తావా? హాస్పిటల్ లాప్‌టాప్ తెప్పిస్తానూ" అంటే ఆమె వద్దు అన్నారు. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటానని చెప్పారు.

మధ్య మధ్యలో వాళ్లాయన ఫోన్ చేస్తున్నారు. బయట చెట్టుకింద బెంచీ మీద కూర్చున్నారట. 'ఇంటికెళ్లు నాయనా' అంటే పర్లేదు అక్కడే ఉంటాను అన్నారు.

మెయిన్ డెలివరీ రూంకి, ఈ ప్రత్యేకమైన గదికి ఒక గోడ మాత్రమే అడ్డు. అక్కడ అయిదారుగురు పేషంట్లు అడ్మిట్ అయి ఉన్నారు. అక్కడ పనిచేసే హాస్పిటల్ సిబ్బంది అందరి దృష్టి మా గదిలో ఏం జరుగుతోందనే. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ప్రోగ్రెస్ గురించి తెలుసుకుంటున్నారు. మా అవసరాలు కనుక్కుంటున్నారు.

డెలివరీ త్వరగా కావడానికి మాకు తెలిసిన పద్ధతులన్నీ వాడాం. మధ్యాహ్నం ఒకటిన్నరకు డెలివరీ అయ్యింది. ఆడపిల్ల. పుట్టగానే ఏడుపు.

బిడ్డ ఏడుపు వినగానే గోడకు అటుపక్క నుంచి మా సిబ్బంది చప్పట్లు వినిపించాయి.

"అల్ హం దులిల్లాహ్!" అంటున్నారు.

ఎన్నో కాన్పులను నిశ్శబ్దంగా పర్యవేక్షించిన గోడలు.

జమీల బిడ్డకు మాత్రమే ఆ చప్పట్లు!

ప్రతి పది నిమిషాలకూ ఆమె భర్త నాకు ఫోన్ చేస్తున్నారు.

నేను డెలివరీ చేస్తుండగా రెండు సార్లు ఫోన్ మోగింది. నేను ఫోన్ తీయకపోవడంతో ఆయనలో ఆందోళన పెరుగుతూ ఉండి ఉంటుంది. మూడో ఫోన్‌కు జవాబిచ్చాను.

"డెలివరీ అయింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ బాగున్నారు" అని చెప్పాను.

మా డైరెక్టర్‌కు మెసేజ్ పెట్టాను. జమీల భర్తతో సమానంగా ఆయన కూడా ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నారు.

కాన్పు అన్నది కరోనాకు ట్రీట్మెంట్ కాదు. కానీ, త్వరగా డెలివరీ అయితే, ఆమెను త్వరగా ఇంటికి పంపించెయ్యడం వల్ల హాస్పిటల్‌లో ఉన్న ఇతరులకు ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చన్నది మా ఉద్దేశం.

Image copyright Getty Images

నేను డెలివరీ చేస్తున్న సమయంలో వేసుకున్న దుస్తుల్ని ఒక కవర్‌లో పెట్టి హాస్పిటల్ స్టాఫ్ లాండ్రీకి పంపించాం. ముందున్న గదిలో మమ్మల్ని మేం శుభ్రపరచుకుని వైరస్‌ను బయటకు తీసుకెళ్లనీయకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం.

డెలివరీ అయిన ఎనిమిది గంటల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశాం. ఆమె ఇంటికెళ్లబోతున్నారని తెలిసి జమీలకు ఫోన్ చేశాను. బాగున్నాను అని ఆమె చెప్పారు.

బిడ్డకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి జమీల అడిగారు.

"బిడ్డకు తల్లి పాలివ్వడం మంచిదేనా? లేదా డబ్బా పాలు పట్టమంటారా?" అని అంటే...

"వైరస్ సోకిన చైనా గర్భిణులందరిలోనూ తల్లిపాల శాంపిల్ పరీక్ష చేస్తే, నెగటివ్ వచ్చింది. కానీ పాలివ్వబోయే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాస్క్ ధరించాలి. దగ్గు బాగా వస్తుంటే, బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వకపోవడమే మంచిది. పాలు బ్రెస్ట్ పంప్ ద్వారా సేకరించి ఇవ్వాలి."

క్లిష్టమైన ఆపరేషన్ ఏదీ ఇవ్వలేనంత సంతృప్తి ఈ మామూలు డెలివరీ తర్వాత కలిగింది.

వ్యాధి పట్ల భయం, మనిషి పట్ల చూపించలేదన్న తృప్తి.

మా ఉద్యోగం సరిగానే చేశామన్న సంతోషం.

ఇదే పరిస్థితిలో ఇంకెవరైనా వచ్చినా మరింత మెరుగ్గా చేయగలమన్న ఆత్మవిశ్వాసం.

ఇదంతా జరిగి రెండు వారాలు దాటింది.

జమీల కుటుంబం క్షేమంగా ఉంది.

మేం కూడా క్షేమంగా ఉన్నాం.

మేమున్న చోట కొత్త కేసుల సంఖ్య తగ్గుతోంది. మనుషులందరికీ కొత్తగా అలవడిన క్రమశిక్షణ ధైర్యాన్నిస్తోంది. విపత్తు తగ్గుముఖం పడుతుందన్న ఆశ మొలకెత్తుతోంది.

మనుషుల పట్ల ప్రేమ చూపించే అవకాశమున్న వృత్తిలో ఉన్నందుకు సదా సంతోషం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది బాధితులు, 70 వేల మంది మృతి

అమెరికాలో ఓ ఆడపులికి కరోనావైరస్

లక్ష మంది సినీ కార్మికులను ఆదుకుంటా: అమితాబ్ బచ్చన్

కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?

కరోనావైరస్: కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ ఎవరెస్ట్ ఎక్కుతున్న చైనా పర్వతారోహకులు

కరోనావైరస్‌: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం

కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా

కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి

కరోనా వైరస్‌: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..