కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న మిస్సోరీలోని ఆస్పత్రిని పేల్చేసేందుకు కుట్ర... అనుమానితుడి కాల్చివేత

కరోనావైరస్ ఆస్పత్రి

ఫొటో సోర్స్, Epa

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో కరోనావైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రిపై బాంబు దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని కాల్చి చంపినట్లు ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు.

ఉగ్రవాద దర్యాప్తులో భాగంగా బెల్టన్ పట్టణంలో 36 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసేందుకు తమ ఏజెంట్లు ప్రయత్నించడంతో అతడు ప్రతిఘటించడంతో ఘర్షణ జరిగిందని ఎఫ్‌బీఐ తెలిపింది.

అతడు జాత్యహంకార కార్యకలాపాలకు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రేరేపితమయ్యాడని అధికారులు తెలిపారు.

నిందితుడి పేరు, తిమోతి ఆర్ విల్సన్ అని గుర్తించారు. అతని కదలికలపై కొన్ని నెలలుగా ఎఫ్‌బీఐ నిఘా పెట్టిది. అతడు జాతి, మత విద్వేషాలు కలిగిన "హింసాత్మక తీవ్రవాది" అని ఎఫ్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

విల్సన్ ఇంతకుముందు పెద్ద సంఖ్యలో నల్లజాతి విద్యార్థులున్న ఓ పాఠశాలపై, మరో మసీదుపై, ప్రార్థనా మందిరంపై దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.

ఎక్కువ మందికి హాని తలపెట్టవచ్చన్న ఆలోచనతో అతడు బెల్టన్ పట్టనంలోని రద్దీ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకున్నాడని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

కరోనావైరస్ బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్న ఆస్పత్రిని దుండగుడు లక్ష్యంగా చేసుకున్నాడని ఎఫ్‌బీఐ తెలిపింది

"విల్సన్ వివిధ ప్రదేశాలను పరిశీలిచాడు. చివరికి ఎక్కువ మందికి హాని కలిగించవచ్చని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకున్నాడు" అని ఎఫ్‌బీఐ పేర్కొంది.

ఆస్పత్రిలో బాంబు అమర్చేందుకు నిందితుడు "అవసరమైన పదార్థాలను సిద్ధం చేశాడు" అని అధికారులు తెలిపారు. సాయుధుడైన విల్సన్‌ను అరెస్టు చేసేందుకు ఎఫ్‌బీఐ ఏజెంట్లు వెళ్లగా, అతడు కాల్పులకు దిగాడని చెప్పారు.

ఘర్షణ తరువాత అతన్ని ఆసుపత్రికి తరలించాక చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

మిస్సోరీ రాష్ట్రంలో 356 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటికి ఇక్కడ ఎనిమిది మంది చనిపోయారు.

అమెరికాలో కరోనావైరస్ వల్ల 1,000 మందికి పైగా మరణించారు. దాదాపు 70,000 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)