కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా?
- ఫెర్నాండో డ్యూటర్ట్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ఫార్మా సంస్థలకు వ్యాక్సిన్లు అంత లాభదాయకం కావు
కరోనావైరస్కు వ్యాక్సీన్ తయారుచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కానీ, అది ఎప్పటికి సాధ్యమవుతుంది? సిద్ధమైనా, పేద దేశాల్లోని రోగులకు ఇది అందుబాటులోకి వస్తుందా? ధనిక దేశాలే దాన్ని అట్టి పెట్టుకుంటాయా? ఇలా చాలా మందికి అనేక సందేహాలు.
మాలిక్యులర్ జెనెటిసిస్ట్ డాక్టర్ కేట్ బ్రాడరిక్ కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను తయరు చేసే ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 44 ప్రాజెక్టులు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి.
అమెరికాలోని ఇనోవాయో అనే బయెటెక్నాలజీ సంస్థలోని పరిశోధక బృందంలో బ్రాడరిక్ సభ్యురాలు. వారి బృందం డిసెంబర్ కల్లా 10 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వ్యాక్సీన్ ప్రపంచంలోని అన్ని దేశాలకూ అందుతుందా అన్న సందేహం బ్రాడరిక్కు కూడా పదేపదే వస్తూ ఉంటుంది. ఆమెది స్కాట్లాండ్. ఆమె సోదరి బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో భాగంగా నర్సుగా పనిచేస్తున్నారు.
‘‘రోజూ ఆ రోగంతో పోరాడుతున్నవారికి నా సోదరి సాయం చేస్తూ ఉంటుంది. అందుకే ఈ వ్యాక్సీన్ అందరికీ అందుతుందా, లేదా అన్న ఆందోళన నాకు ఉంది. కచ్చితంగా మేం ఈ వ్యాక్సిన్ తయారు చేయాల్సిందే’’ అని బ్రాడరిక్ బీబీసీతో అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
బిల్ అండ్ మెలిండ్ గేట్స్ ఫౌండేషన్ వ్యాక్సిన్ల తయారీ కోసం ఆర్థిక సాయం చేస్తోంది
ఇమ్యునైజేషన్ గ్యాప్
ఇనోవాయో లాంటి సంస్థలు చూపించే పరిష్కారాలను ధనిక దేశాలు అట్టిపెట్టుకుంటాయన్న ఆందోళనలు ఉన్నాయి. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (గావీ) సీఈఓ సేత్ బెర్కెల్ ‘ఇమ్యునైజేషన్ గ్యాప్ గురించి హెచ్చరించారు.
గావీ ప్రపంచంలోని 73 అత్యంత పేద దేశాలకు వ్యాక్సిన్లు చేరవేసేందుకు ఏర్పాటైంది. వివిధ దేశాల్లోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.
‘‘ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో లేకున్నా, దాని గురించి చర్చైతే మొదలు కావాలి. ధనిక దేశాలతోపాటు పేద దేశాల్లోనూ అవసరమైనవారికి వ్యాక్సిన్ చేరేలా చూడటం మనం ముందున్న సవాలు. నాకు ఆందోళనగా ఉంది. తక్కువగా దొరికే వస్తువుల విషయంలో చాలా సార్లు తప్పుడు వ్యవహార శైలి చూశాం. అందుకే ఈ విషయంపై మనం పనిచేయాలి’’ అని బెర్కెల్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
హెపటైటిస్ బీ వ్యాక్సిన్
బెర్కెల్ అనవసరంగా ఆందోళనపడటం లేదు. ఇదివరకటి వ్యాక్సిన్ల విషయంలో ఆయన చెప్పినట్లే జరిగింది.
జర్మన్ బయోటెక్నాలజీ సంస్థ క్యోర్వైక్ అభివృద్ధి చేస్తున్న ఓ వ్యాక్సిన్‌ను ప్రత్యేకంగా అమెరికన్ల కోసమే పొందేందుకు వారి దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రయత్నించి విఫలమైనట్లు సీనియర్ అధికారుల ద్వారా తమకు తెలిసిందని జర్మన్ దినపత్రిక వెల్ట్ ఎమ్ సోంటెగ్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది.
‘ఇమ్యునైజేషన్ గ్యాప్’కు హెపటైటిస్ బీ ఒక మంచి ఉదాహరణ.
హెపటైటిస్ బీ వల్ల లివర్ క్యాన్సర్ వస్తుందని, హెచ్ఐవీ కన్నా దీని సంక్రమణ 50 రెట్లు ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది.
2015లో ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బీతో బాధపడుతున్న వాళ్లు 25.7 కోట్ల మంది ఉన్నారని ఓ అంచనా ఉంది.
ధనిక దేశాల్లో 1982 నుంచే హెపటైటిస్ బీ వ్యాక్సిన్లు వేయడం మొదలైంది. కానీ, 2000 వరకూ పేద దేశాల్లో కనీసం పది శాతం మందికి కూడా ఇది అందలేదు.
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తోడ్పాటుతో నడుస్తున్న గావీ మిగతా వ్యాక్సిన్ల విషయంలో ఈ అంతరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ విషయంలో బాగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో కోఅలైషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపెర్డ్‌నెస్ ఇనోవేషన్స్ (సీఈపీఐ) కూడా ఒకటి. నార్వేలో ఉన్న ఈ సంస్థ తమకు వివిధ దేశాల ప్రభుత్వాలు, ఇతరుల నుంచి అందిన నిధులను వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం పెట్టుబడులుగా పెడుతుంది.
సరైన కేటాయింపులు లేకుండా కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయలేమని ఆ సంస్థ పేర్కొంది.
హూమన్ పైపిలోమా వైరస్ (హెచ్‌పీవీ)ని నిరోధించే గార్డిసిల్ వినియోగానికి 2007లో అమెరికా సంస్థ మర్క్ అక్కడి ప్రభుత్వం ఆమోదం కోరింది. 2014లో గానీ ప్రభుత్వం ఆమోదం తెలపలేదు.హెచ్‌పీవీ కారణంగా సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరిగాయి. 2019 వరకూ ఈ వ్యాక్సిన్ కేవలం 13 పేద దేశాలకు మాత్రమే చేరింది. దీనికి దోషులు ఎవరు?
విపరీతమైన డిమాండ్ ఉన్నా, అంతర్జాతీయ స్థాయిలో తక్కువ సరఫరా జరగడమే దీనికి కారణం.
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
లాభాలు తక్కువ
సర్వైకల్ క్యాన్సర్ వల్ల సంభవించే మరణాల్లో 85 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరుగుతున్నా ఈ పరిస్థితులే ఉన్నాయి.
ఈ కొరత గురించి తెలుసుకోవాలంటే మనం వ్యాక్సీన్ల వ్యాపారపరమైన అంశాల గురించి తెలుసుకోవాలి. ఫార్మా ఇండస్ట్రీ వ్యాక్సిన్లపై బతకదు.
2018లో ఫార్మాసూటికల్స్ ప్రపంచవ్యాప్త మార్కెట్ రూ. 90 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో వ్యాక్సీన్ల వాటా సుమారు రూ.3 లక్షల కోట్లు.
ఈ తేడాను బట్టే అర్థం చేసుకోవచ్చు ఔషధ ఉత్పత్తి సంస్థలకు వ్యాక్సీన్లు ఎందుకు చేయవో. వ్యాక్సీన్ తయారీ రిస్క్‌తో కూడుకున్నది. చాలా పరిశోధనలు అవసరం. ఖర్చు కూడా చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. వ్యాక్సీన్ల పరీక్షలపైనా చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి.
వ్యాక్సీన్లకు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలే అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉంటుంటాయి. ప్రైవేటు వినియోగదారులతో పోలిస్తే వాళ్లు చెల్లించే రేటు కూడా తక్కువ.
మిగతా ఔషధాలతో పోలిస్తే వ్యాక్సీన్లు అంత లాభదాయకం కాదు. జీవితంలో ఒక్కేసారే వినియోగించే అవసరమున్న వ్యాక్సిన్ల విషయంలో ఈ పరిస్థితి ఇంకా ఎక్కువ.
అమెరికాలో 1967లో 26 వ్యాక్సీన్ తయారీ సంస్థలు ఉండేవి. 2004కు వచ్చేసరికి వాటి సంఖ్య నాలుగుకు పడిపోయింది.
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఇతరులు వ్యాక్సిన్ల తయారీకి తోడ్పాటును అందిస్తుండటంతో ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వ్యాక్సిన్ల తయారీ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను వీళ్లు సాయంగా అందిస్తున్నారు. ఫలితంగా వీటికి డిమాండ్ పెరిగింది.
ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సిన్లకు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలే అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉంటుంటాయి.
వయాగ్రాను దాటేసింది
ప్రీవెనార్ లాంటి వ్యాక్సిన్ల తయారీతో ఈ రంగానికి చాలా ప్రయోజనం కలిగింది. న్యూమోనియా కలిగించే బ్యాక్టీరియా నుంచి చిన్నారులకు, యువతకు రక్షణ కలిగించే వ్యాక్సీన్ ఇది.
2019లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఔషధాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఆ ఏడాదిలో ఈ ఔషధం సుమారు రూ.4,3761 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
ఫైజర్ సంస్థ దీన్ని రూపొందించింది. వయాగ్రా కూడా ఈ సంస్థ ఉత్పత్తే. దాని అమ్మకాలను కూడా ప్రీవెనార్ దాటేసింది.
గావీ సభ్యులైన పేద దేశాలకు ప్రీవెనార్ ఒక్కో డోస్ దాదాపు రూ.226 ధరకు వస్తుంది. అమెరికాలో ఒక్క డోస్ ధర సుమారు రూ.13,500.
వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
ఓపెన్ మార్కెట్ అయితే...
హెచ్‌పీవీ రెండు డోసుల కోర్సు ధర బ్రిటన్‌లో రూ.26వేలు. గావీ మాత్రం రూ377కే దీన్ని అందిస్తోంది. ధనిక దేశాల్లో వ్యాక్సిన్లపై పెద్ద స్థాయిలో లాభాలు వస్తున్నాయి. అందుకే పరిశోధన, అభివృద్ధికి ఖర్చు పెట్టే మార్గం దొరకుతుంది.
అసోసియేషన్ ఆఫ్ బ్రిటీష్ ఫార్మసూటికల్ ఇండస్ట్రీ అంచనా ప్రకారం ఏదైనా కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే రూ.135 కోట్లు ఖర్చు చేయాల్సి రావొచ్చు.
‘‘మనం ఓపెన్ మార్కెట్‌కే వదిలేస్తే, కోవిడ్-19 వ్యాక్సిన్ ధనిక దేశాలకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది’’ అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ మార్క్ జిట్ అభిప్రాయపడ్డారు.
డబ్లూహెచ్ఓ గణాంకాల ప్రకారం తక్కువ లాభాలున్నా ఫైజర్, మర్క్ లాంటి భారీ ఔషధ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లలో 80 శాతం అమ్మకాలు సాగిస్తున్నాయి. కరోనావైరస్ వ్యాక్సిన్ విషయంలో ఇలాంటి పెద్ద సంస్థలు పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఉదాహరణకు ఇనోవాయో లాంటి సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌ను కోట్ల డోసుల స్థాయికి తీసుకువెళ్లాలంటే ఏదైనా ఫార్మా సంస్థతో భాగస్వామ్యం అవసరం.
బ్రిటన్‌లో గ్లాస్కోస్మిత్‌క్లైన్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం చాలా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కోవిడ్-19ను ఓడించాలంటే అంతా కలిసి పనిచేయాల్సిందేనని ప్రకటించారు ఆ సంస్థ సీఈఓ ఎమ్మా వాల్మ్స్లే.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లాక్డౌన్ భారతదేశంలో ఆహార కొరతకు దారి తీస్తుందా?
- కరోనావైరస్ లేనివాళ్లే దేశంలో ఎక్కువగా చనిపోతారా? ఎందుకు?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- లాక్డౌన్ ఎఫెక్ట్: 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)