కరోనావైరస్ లాక్ డౌన్: మా కార్మికులు కరోనావైరస్ కన్నా ముందు ఆకలితో చనిపోయేలా ఉన్నారు

  • మారికో ఓయ్, పీటర్ హాస్కిన్స్
  • బీబీసీ న్యూస్
వస్త్ర పరిశ్రమ

ఫొటో సోర్స్, Getty Images

"మా కార్మికులు కరోనా వైరస్ బారిన పడి చనిపోకపోయినా, ఆకలితో చనిపోయేలా ఉన్నారు."

ఇదే ఇప్పుడున్న పరిస్థితి అని అంబత్తూరు ఫ్యాషన్ ఇండియా ఛైర్మన్ విజయ్ మహాతనే అన్నారు.

సాధారణ పరిస్థితుల్లో అయితే విజయ్ మహ్తానే ఆయన వ్యాపార భాగస్వాములు షాన్ ఇస్లాం, అమిత్ మహ్తానే కలిసి ఇండియా, బంగ్లాదేశ్, జోర్డాన్ దేశాలలో మొత్తం 18000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తారు.

కానీ, కరోనావైరస్ వీరి వ్యాపారాలను మూత పడేలా చేసింది. ఢాకాలో ఉన్న ఒక్క ఫ్యాక్టరీ మాత్రం పాక్షికంగా పని చేస్తోంది.

వారి సమస్య కేవలం కరోనావైరస్ లాక్ డౌన్ మాత్రమే కాదు. యూఎస్, యూకేలో ఉన్న తమ కొనుగోలుదారుల నుంచి వస్తున్న డిమాండ్లు కూడా వారిని ఇబ్బంది పెడుతున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

వస్త్ర పరిశ్రమ

ఈ సమయంలో కొన్ని వస్త్ర పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం తమ కార్మికులకు జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తూ కార్మికుల పట్ల అభిమానం, వృత్తి విలువలు పాటిస్తున్నారని జోర్డాన్‌లోని టస్కర్ బ్రాండ్ ముఖ్య అధినేత అమిత్ మహ్తానే చెప్పారు.

కొంత మంది సరకు పూర్తిగా తయారయ్యాక ఇచ్చిన ఆర్డర్లు కూడా వాపసు తీసుకున్నారని, కొనుక్కున్న సరకుకు డిస్కౌంట్లు అడిగారని చెప్పారు. కొంత మంది ముందు చెల్లింపులు చేస్తామని చెప్పి, తర్వాతేమో 30 నుంచి 120 రోజుల పొడిగింపు అడిగారని చెప్పారు.

ఒక యూఎస్ రిటైలర్ వాళ్ళు తాము తీసుకున్న అన్ని ఆర్డర్ల మీద 30 శాతం డిస్కౌంట్ ఇమ్మని కోరుతూ రాసిన ఈ-మెయిల్‌ను బీబీసీ పరిశీలించింది. ఈ అనుకోని విపత్తు నుంచి బయటపడాలంటే డిస్కౌంట్ కావాలని వాళ్ళు అందులో రాశారు.

వాళ్ళు వాటాదారుల లాభ నష్టాల గురించి ఆలోచిస్తున్నారు కానీ వస్త్ర పరిశ్రమలో పని చేసే కార్మికుడి గురించి ఆలోచించటం లేదని విజయ్ మహ్తానే అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ప్రతి బ్రాండ్ తమ షేర్ ధరను దృష్టిలో పెట్టుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సప్లై చైన్‌లో బలహీనమైన చోట్ల నుంచి రాయితీలు కోరే బదులు యూఎస్ ప్రభుత్వం నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ అడిగితే బాగుంటుందని విజయ్ మహ్తానే అన్నారు.

కరోనావైరస్ లాక్ డౌన్ వలన వస్త్ర ఉత్పత్తిదారులు ఒకేసారి రెండు సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చైనా నుంచి వస్త్రాల తయారీకి కావల్సిన ముడి సరకు ఆగిపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక వస్త్రాలను ఎగుమతి చేసే దేశంగా చైనా (2018లో దీని విలువ 118 బిలియన్ డాలర్లు) నిలిచింది.

ఇటీవల వారాల్లో చైనాలో వస్త్ర పరిశ్రమలు తెరుచుకున్నాక ఆశలు చిగురించినా, లాక్ డౌన్‌తో అనేక రిటైల్ వ్యాపారాలు మూతపడటంతో మళ్ళీ వస్త్ర ఉత్పత్తిదారులకు నిరాశే మిగిలింది.

చైనా ప్రపంచ కర్మాగారంలా కన్పించవచ్చు కానీ, వస్త్రాల ఉత్పత్తి దగ్గరకి వచ్చేసరికి బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా, మయాన్మార్ ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

"గత పదేళ్లుగా చైనాలో పెరుగుతున్న ధరల వలన వస్త్రాల ఉత్పత్తి చైనా నుంచి ఇతర దేశాలకి తరలి వెళ్తోందని లివర్ స్టైల్ వస్త్ర వ్యాపారి స్టాన్లీ జీటో చెప్పారు. హ్యూగో బాస్, థియరీ, విన్స్ అండ్ కోచ్, ఆన్‌లైన్ బ్రాండ్లు బొనొబోస్, స్టిచ్ ఫిక్స్, ఎవర్‌లేన్ లాంటి బ్రాండ్లను లివర్ స్టైల్ తయారు చేస్తుంది.

ప్రపంచ వాణిజ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో వస్త్రాలను ఎగుమతి చేసే తొలి నాలుగు దేశాలలో బంగ్లాదేశ్, వియత్నాం ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో బంగ్లాదేశ్ వాటా 6.7 శాతం ఉండగా వియత్నాం వాటా 5.7 శాతం ఉంది.

దీనిని బట్టి ఆసియాలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో వస్త్రాల తయారీ ఒక కీలక పరిశ్రమగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమల్లో పని చేసే కార్మికులు 40 లక్షలకి పైగా ఉన్నారు.

గత సంవత్సరం దేశ ఎగుమతుల్లో వస్త్రాలు, వస్త్ర ఉత్పత్తులు వాటా 90 శాతంగా ఉంది.

కంబోడియా, శ్రీలంక ఎగుమతుల్లో కూడా 60 శాతం వస్త్ర ఉత్పత్తులే ఉంటాయని, డెలావర్ యూనివర్సిటీలో ఫ్యాషన్ అండ్ అప్పారెల్ స్టడీస్ విభాగానికి చెందిన షెంగ్ లు చెప్పారు.

బంగ్లాదేశ్‌లో తయారీరంగంలో సగానికి పైగా, కంబోడియాలో 60 శాతం వరకూ మహిళలే ఈ పరిశ్రమల్లో పని చేస్తూ ఉంటారు. కరోనావైరస్ విపత్తు వలన బంగ్లాదేశ్, ఇండియా, కంబోడియా, వియత్నాం వస్త్ర పరిశ్రమలలో కనీసం 4 నుంచి 9 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉండవచ్చని అసోసియేట్ ప్రొఫెసర్ షెంగ్ లు అంచనా వేస్తున్నారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వం వస్త్రతయారీ రంగానికి సహకారం అందించే ప్రయత్నం చేస్తోంది.

వేతన సబ్సిడీ, చిన్న రుణాలని దీర్ఘకాలిక రుణాలుగా మార్చడం, రుణాలపై తక్కువ వడ్డీలు ఇవ్వడం లాంటివి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని బంగ్లాదేశ్‌లోని స్పారో అప్పారెల్ మేనేజింగ్ డైరెక్టర్ షాన్ ఇస్లాం చెప్పారు. అయితే, ఈ కష్టాన్ని దాటడానికి ఇది సరిపోదని అన్నారు.

కంబోడియా ప్రభుత్వం వస్త్రాలను ఉత్పత్తి చేసే కర్మాగారాలకు పన్ను రాయితీలు, కార్మికులకు వేతన సబ్సిడీలు ప్రకటించింది. ఈ మహమ్మారి వలన కార్మికుల కొరత, ముడి సరకుల ధరల పెరుగుదల, ఉత్పత్తి సామర్ధ్యం తగ్గుదల లాంటి దీర్ఘకాలిక ప్రభావం చూపించవచ్చని లు చెప్పారు.

పెరుగుతున్న విమర్శలు, ఒత్తిడి కారణంగా హెచ్&ఎం, జార వంటి కొన్ని సంస్థలు వస్త్ర ఉత్పత్తిదారులకు పూర్తి చెల్లింపులు చేయడానికి అంగీకరించారు.

సరైన సామాజిక భద్రత కూడా ఇవ్వకుండా చాలా బ్రాండ్లు తక్కువ జీతాలు చెల్లించే దేశాలలో తమ ఉత్పత్తులను తయారు చేయించుకుని ఇప్పటి వరకు చాలా లాభాలు పొందాయని, ఈ మోడల్ అవలంబించి వ్యాపార సామ్రాజ్యాలని విస్తరించుకున్నాయని 'లేబర్ బిహైండ్ ది లేబిల్'కు చెందిన డొమినిక్ ముల్లర్ అన్నారు. దశాబ్దాలుగా సాగిన అణచివేతని ఆపి, కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని అన్నారు.

అమిత్ మహ్తానే ఈ వాదనతో ఏకీభవించారు.

"రిటైల్ వ్యాపారులు కూడా సహాయం చేయాలి. ఆర్థికంగా బలమైన ప్రభుత్వాలు తాత్కాలికంగా పరిశ్రమని అదుపులోకి తీసుకోవడం కూడా అవసరమే, లేని పక్షంలో పరిశ్రమ పూర్తిగా నాశనమైపోతుంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)