కరోనావైరస్: అంతరించిపోతున్న కోతి జాతులకూ లాక్డౌన్
- హెలెన్ బ్రిగ్స్
- బీబీసీ ఎన్విరాన్మెంటల్ కరస్పాండెంట్

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ కారణంగా గ్రేట్ ఏప్స్ (కోతి జాతికి చెందినవి)ను కూడా లాక్డౌన్లో ఉంచారు. ఆఫ్రికాలో గొరిల్లా టూరిజాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
ఒరాంగుటాన్ వంటి ఇతర ఏప్స్ ఉన్న జంతుశాలల్లోకి కూడా ప్రజలను అనుమతించడం లేదు.
వీటికి కరోనావైరస్ సోకుతుందా లేదా అన్నది స్పష్టంగా తెలియనప్పటికీ మానవజాతికి సమీప లక్షణాలుండే ఈ కోతి జాతులకు కూడా కరోనా ముప్పుందన్న భయాలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కొద్దిరోజుల కిందట బ్రాంక్స్ జూలో ఒక పులికి కరోనా సోకిందన్న వార్తల నేపథ్యంలో పులి, ఆ జాతి జంతువులున్న చోట కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రువాండా, యుగాండా, కాంగోల్లోని అడవుల్లో గొరిల్లాలకు వైద్యం అందించే ‘గొరిల్లా డాక్టర్స్’లో చీఫ్ వెటర్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ కిరస్టన్ గిలార్డ్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘కొండ గొరిల్లాలకు ఈ వైరస్ సోకుతుందో లేదో మాక్కూడా స్పష్టత లేదు. అలాంటి ఆధారాలు కూడా లేవు. అయితే, మానవుల్లో వ్యాధులు కలిగించే బాక్టీరియాలు, వైరస్ల బారిన ఇవి కూడా పడుతుంటాయి. అంతేకాదు, వాటికి శ్వాసకోశ సమస్యలూ వస్తుంటాయి’’ అన్నారు.
ఫొటో సోర్స్, GORILLA DOCTORS
గాయపడిన గొరిల్లాకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఎడ్డీ బృందం
అంతరించిపోతున్న జీవులు
కొండ గొరిల్లాలు (శాస్త్రీయ నామం: గొరిల్లా బెరింగీ బెరింగీ) అంతరించిపోతున్న జీవుల్లో ఒకటి. ఇప్పుడివి రువాండా, యుగాండా, కాంగో అడవుల్లో మాత్రమే ఉన్నాయి. ఈ మూడు దేశాల్లోనూ ప్రస్తుతం కరోనావైరస్ పాజిటివ్ కేసులున్నాయి.
అందుకే.. ఈ మూడు దేశాల్లోనూ గొరిల్లా టూరిజం నిలిపివేశారు. సామాజిక దూరం పాటించడం.. అడవి గొరిల్లాల కోసం పనిచేసే ఫారెస్ట్ రేంజర్లు, పశువైద్యులు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కరోనా రాకముందు కూడా వీటిని సందర్శించడానికి వచ్చేవారిని కనీసం 7 మీటర్ల దూరం నుంచే చూడనిచ్చేవారు.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు కనీసం 10 మీటర్ల దూరం పాటించాలి.
ఫొటో సోర్స్, Getty Images
వైరస్ల ముప్పు
వేట, ఆవాసాలు తగ్గిపోవడం వంటి కారణాలతో గ్రేట్ ఏప్స్ ఇప్పటికే మనుగడ కోసం పోరాడుతున్నాయి.
వాటికి వైరస్ల ముప్పు ఉంది. గ్రేట్ ఏప్స్కు ప్రధాన ముప్పుగా చెబుతున్న మూడు కారణాలలో వైరస్లు కూడా ఒకటి.
సాధారణంగా వచ్చే ఫ్లూ వంటివి చింపాంజీలకు వస్తాయి.
ఎబోలా వల్ల ఎన్నో చనిపోయాయి
ఇక ఆఫ్రికాను వణికించిన ఎబోలా వైరస్ వల్ల కూడా ఆ ఖండంలో పెద్ద సంఖ్యలో చింపాంజీలు, గొరిల్లాలు మృతిచెందినట్లు చెబుతారు.
బ్రిటన్లోని లివర్పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీలో ప్రిమేట్ బయాలజీ ప్రొఫెసర్ సెర్గీ విచ్ మాట్లాడుతూ.. చాలా దేశాల్లో గ్రేట్ ఏప్స్ టూరిజాన్ని నిలిపివేశారని చెప్పారు.
వాటికి వైరస్ వస్తుందో లేదో తెలియదు కానీ మనుషులకు ఉన్న ముప్పును వీటికీ వ్యాపించకుండా చూడాలనుకుంటున్నామన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఒరాంగుటాన్
బతికి ఉన్నవి నాలుగు రకాలే..
ప్రస్తుతం ప్రపంచంలో గొరిల్లాలు (ఆఫ్రికా), బొనోబోలు (ఆఫ్రికా), ఒరాంగుటాన్ (ఆగ్నేయాసియా), చింపాంజీ (ఆఫ్రికా)లు అనే నాలుగు రకాల గ్రేట్ ఏప్స్ మనుగడలో ఉన్నాయి.
ఇవన్నీ మానవ జాతికి అత్యంత సమీప లక్షణాలున్న జంతువులు. కోట్ల సంవత్సరాల కిందట ఒకే పూర్వీకుల జాతి నుంచి మనిషి, ఈ గ్రేట్ యాప్స్ వచ్చాయి.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: అమెరికాలో ఒక్క రోజులోనే 2 వేలకుపైగా మరణాలు... న్యూయార్క్లో మొబైల్ మార్చురీలు
- కరోనావైరస్: లాక్ డౌన్ ఎత్తేస్తే... పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది - ప్రపంచ దేశాలకు WHO హెచ్చరిక
- కరోనావైరస్: లాక్డౌన్ రోజుల్లో మహిళలే ఈ దక్షిణాది రాష్ట్రాలకు 'ఆశ, శ్వాస'
- కరోనావైరస్: 'ఆరోగ్య సంక్షోభం కాదు, రాజకీయ సంక్షోభం' - 'ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్కైండ్' రచయిత యువల్ నోవా హరారీ
- కరోనావైరస్: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయి-ధారావిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేదెలా?
- కరోనావైరస్: లాక్డౌన్ సమయంలో మద్యం ప్రియులు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)