కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?

  • మారియా ఎలీనా నవాస్
  • బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్

ఫొటో సోర్స్, ANNA GROVE PHOTOGRAPHY

ఫొటో క్యాప్షన్,

బేయలర్ కాలేజి ఆఫ్ మెడిసిన్‌ - నేషనల్ ట్రాపికల్ మెడిసిన్‌ స్కూల్ ప్రయోగశాలలో డాక్టర్ మారియా ఎలీనా, డాక్టర్ పీటర్ హోటెజ్

2002లో చైనా, గ్వాంఝోలో ఒక గుర్తుతెలియని ప్రాంతంలో వైరస్‌తో ఒక మహమ్మారి వ్యాపించింది. శాస్త్రవేత్తలు దానికి సార్స్(SARS) అనే పేరు పెట్టారు.

సార్స్ అంటే ‘సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అంటే శ్వాస ఇబ్బందులకు కారణమయ్యే ఒక వ్యాధి అని అర్థం.

తర్వాత సార్స్ వ్యాధి కరోనావైరస్ వల్లే వస్తుందని, అది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందనే విషయం శాస్త్రవేత్తలకు తెలిసింది.

ఆ సమయంలో ఆ వైరస్ కొన్ని నెలల్లోనే 29 దేశాలకు వ్యాపించింది. ఆ వ్యాధి 8 వేల మందికి పైగా సోకింది. దీనివల్ల 800కు పైగా మృతిచెందారు.

అప్పుడు దీనికి టీకా ఎప్పుడు తయారు చేస్తారా, అని ప్రపంచమంతా ఎదురుచూసింది. యూరప్, అమెరికా, ఆసియాలోని ఎంతోమంది శాస్త్రవేత్తలు చాలా వేగంగా దానికి వ్యాక్సీన్ తయారు చేసే పనిని ప్రారంభించారు.

ఎంతో మంది దానికి పోటీపడ్డారు. వారిలో కొందరు తాము క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

టీకా తయారీ అవసరం

కానీ, అప్పుడే సార్స్ మహమ్మారి అదుపులోకి వచ్చింది. దాంతో, కరోనా వ్యాక్సీన్ గురించి కొనసాగుతున్న అన్ని అధ్యయనాలూ ఆగిపోయాయి.

కొన్నేళ్ల తర్వాత 2012లో మరో ప్రాణాంతక కరోనావైరస్ మర్స్-కోవ్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) పుట్టుకొచ్చింది. ఇది ఒంటెల నుంచి మనుషులను చేరింది.

అప్పుడు కూడా చాలామంది శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను నాశనం చేసే టీకాను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని మరోసారి భావించారు.

దాదాపు 20 ఏళ్ల తర్వాత కరోనావైరస్ SARS-Cov-2 సుమారు 15 లక్షల మంది రోగులకు వ్యాపించాక, ఇప్పుడు మరోసారి దీనికి వ్యాక్సీన్ ఎప్పటికి తయారవుతుందనే ప్రశ్నలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయి.

ఈ వైరస్ వల్ల కోవిడ్-19 లాంటి ప్రాణాంతక వ్యాధులు రావచ్చని మనకు అప్పటికే తెలిసినప్పటికీ, గత ఘటనల నుంచి మనం గుణపాఠం ఎందుకు నేర్చుకోలేకపోయాం?

టీకా తయారు చేసే పరిశోధనలను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్‌పై ఆసక్తి లేదని అన్నారు

కానీ, అమెరికా హ్యూస్టన్‌లో ఒక శాస్త్రవేత్తల బృందం కరోనావైరస్‌కు టీకా తయారు చేసే పనిని విడిచిపెట్టలేదు. 2016లో వారు తమ ప్రయత్నాల్లో విజయం సాధించారు. కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేశారు.

బేయలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లోని నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ కో డైరెక్టర్ డాక్టర్ మారియా ఎలీనా బోట్టాజ్జీ బీబీసీకి తమ ప్రయోగాల గురించి చెప్పారు.

“మేం ట్రయల్స్ పూర్తి చేశాం. వ్యాక్సీన్ ఉత్పత్తిని ప్రారంభించే ప్రక్రియలో కీలకమైన దశను కూడా దాటేశాం. తర్వాత, ఎన్ఐఈహెచ్ (యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్) దగ్గరకు వెళ్లి ‘మేం ఈ వ్యాక్సిన్‌ను త్వరలో వైద్యుల దగ్గరకు చేర్చడానికి ఏం చేయచ్చు?’ అని అడిగాం. వారు ‘చూడండి, ప్రస్తుతానికి మాకు దీనిపై ఆసక్తి లేదు’ అన్నారు” అని చెప్పారు.

డాక్టర్ మారియా ఎలీనా టెక్సాస్ పిల్లల ఆస్పత్రిలో వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో కో-డైరెక్టర్ కూడా.

ఫొటో సోర్స్, Getty Images

మహమ్మారి అంతం అయ్యాక...

మేం ఈ టీకాను 2002లో వ్యాపించిన సార్స్ మహమ్మారి కోసం తయారుచేశాం. కానీ, ఏ దేశంలో అది మొదలైందో అక్కడ దానిని అదుపులోకి తీసుకొచ్చేయడంతో, ఆ వ్యాక్సీన్ మీద రీసెర్చ్ చేస్తున్న శాస్త్రవేత్తలు మరిన్ని నిధులు పొందలేకపోయారు.

అప్పుడు ఆగింది, కరోనావైరస్ టీకా మీద జరుగుతున్న పరిశోధనలు మాత్రమే కాదు. ఇంకా చాలా పరిశోధనలు నిలిచిపోయాయి.

ప్రజలకు ఆసక్తి తగ్గిపోవడం, రీసెర్చ్ కోసం నిధుల సేకరణ కష్టం కావడంతో ప్రపంచవ్యాప్తంగా డజన్ల మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను మధ్యలోనే ఆపేశారు.

“ఏడెనిమిది నెలల తర్వాత ఈ మహమ్మారి అంతమైనప్పుడు ప్రభుత్వాలకు, మందుల కంపెనీలకు కరోనావైరస్ మీద జరుగుతున్న అధ్యయనాలపై వెంటనే ఆసక్తి తగ్గిపోయింది” అని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ సుజైన్ వీజ్ చెప్పారు.

“సార్స్ ప్రభావం ఆసియాలో చాలా కనిపించింది. కెనెడాలో కూడా ఈ కేసులు కొన్ని బయటపడ్డాయి. కానీ ఇప్పుడు కరోనావైరస్ వ్యాపించినట్టు, అది యూరప్ వరకూ చేరలేకపోయింది. ఆ తర్వాత మర్స్ వైరస్ వచ్చింది. కానీ దాని ప్రభావం మధ్యప్రాచ్యం వరకే పరిమితం అయ్యింది. తర్వాత కరోనావైరస్ పరిశోధనలపై జనాలకు ఆసక్తి తగ్గిపోయింది. కొన్ని రోజుల క్రితం వరకూ అదే పరిస్థితి కనిపించింది. నాకు మాత్రం మనం మరింత అప్రమత్తంగా ఉండాలని నిజంగా అనిపించింది” అన్నారు.

ఫొటో సోర్స్, ANNA GROVE PHOTOGRAPHY

ఫొటో క్యాప్షన్,

నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ లేబొరేటరీలో శాస్త్రవేత్తలు

వ్యాక్సీన్ తయారై ఉంటే...

సార్స్, మర్స్ గురించి చెప్పిన నిపుణులు “ఈ రెండు కరోనావైరస్ ప్రమాదం గురించి అప్రమత్తం చేసే ఒక హెచ్చరికల్లాంటివి, వాటిని నిర్లక్ష్యం చేసుండకూడదు. అందుకే, వాటిపై రీసెర్చ్ కొనసాగించి ఉండాల్సింది” అన్నారు.

అయితే, అప్పుడు డాక్టర్ మారియా ఎలీనా రూపొందించిన వాక్సీన్, ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించి భయపెడుతున్న ఈ కరోనావైరస్ కోసం కాదు. అది సార్స్ వ్యాధి కోసం.

కానీ, “ఆ వ్యాక్సిన్ సిద్ధం చేసి ఉంటే.. భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కోడానికి కొత్త టీకాలను వేగంగా అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలకు వీలుగా ఉండేది” అని నిపుణులు చెబుతున్నారు.

“కోవిడ్-19ను అడ్డుకునే సన్నాహాలు 2002లో సార్స్ మహమ్మారి వ్యాపించిన సమయంలోనే మొదలై ఉండాలని” థేల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ జాసన్ స్కాట్జ్ చెబుతున్నారు

“మేం సార్స్ వాక్సిన్ ప్రోగ్రాం మధ్యలో వదిలేయకుండా ఉంటే, కొత్త కరోనా వైరస్ కోసం రీసెర్చ్ చేయడానికి మా దగ్గర చాలా ప్రాథమిక అధ్యయనాలు అందుబాటులో ఉండేవి” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కరోనావైరస్ వ్యాక్సీన్ తయారవడానికి ఇంకా చాలా కాలమే పట్టవచ్చు.

కరోనా కుటుంబంలోని వైరస్

కొత్త వైరస్ Sars-Cov-2 కూడా 2002లో సార్స్ మహమ్మారికి కారణమైన అదే కరోనా కుటుంబానికి సంబంధించిన ఒక వైరస్.

జన్యుపరంగా ఈ రెండు వైరస్‌లు 80 శాతం ఒకేలా ఉంటాయని డాక్టర్ మారియా ఎలీనా చెప్పారు. “మా వ్యాక్సిన్ ప్రాథమిక ఆమోద ప్రక్రియ పూర్తైపోయింది కాబట్టి, కొత్త కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు దానిని త్వరగా సిద్దం చేయచ్చు” అన్నారు.

“మా దగ్గర ఆ వ్యాక్సిన్ ఎలా ప్రవర్తిస్తుంది అనడానికి ఉదాహరణలు ఉన్నాయి. వేరు వేరుగా ఉన్నప్పటికీ ఆ వైరస్‌లు ఒకే వర్గం నుంచి వస్తాయి. మా దగ్గర ఆ సమస్యకు మూలం ఏంటి, దానిని ఎలా పరిష్కరించాలి? అనే ఒక అనుభవం ఉంటుంది. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్ చేసినపుడు సార్స్ వాక్సీన్ ఎలా స్పందిస్తుందో మేం మొదట్లో చూశాం. కొత్త వ్యాక్సిన్ దాదాపుగా అదే విధంగా పనిచేస్తుందనే భావిస్తున్నాం” అంటారు ఎలీనా.

పారిశ్రామిక ప్రోత్సాహం లేదు

ఇంత సమాచారం ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ స మయంలో కరోనావైరస్ మీద జరుగుతున్న రీసెర్చ్ ఎందుకు ఆపేశారు?

రీసెర్చ్ కోసం ఏ మేరకు నిధులు అందాయి అనే దానిపై, దీనికి సంబంధించిన ప్రతి అంశం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

“మేం వంద డాలర్లో లేదంటే ఒక బిలియన్ డాలర్ల గురించో మాట్లాడడం లేదు. మేం 30 నుంచి 40 లక్షల డాలర్ల గురించి చెబుతున్నాం. 15 లక్షల డాలర్లతో మేం మనుషులపై ఈ వ్యాక్సీన్ ప్రభావం గురించి క్లినికల్ స్టడీని పూర్తి చేసుండేవాళ్లం. కానీ, ఆసక్తికరమైన ఫలితాలకు దగ్గరగా చేరుకున్న సమయంలో వారు మా పరిశోధనలకు బ్రేక్ వేశారు” అని డాక్టర్ మారియా చెప్పారు.

బయోటెక్ కంపెనీ ఆర్ఏ కాపిటల్ డైరెక్టర్, వీరోలాజిస్ట్(వైరస్ నిపుణులు) పీటర్ కోల్‌చింస్కీ “ఈ వ్యాక్సిన్ కోసం ఎలాంటి మార్కెట్ లేదు కాబట్టి, దానికోసం డబ్బులు ఇవ్వడం ఆపేశారు. వాస్తవం ఏంటంటే దేనికైనా ఒక మార్కెట్ ఉంటే దానికి ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఈరోజు మన దగ్గర కరోనావైరస్‌కు వందలాది వ్యాక్సిన్లు ఉన్నాయి. కానీ, అవన్నీ పందులు, కోళ్లు, ఆవులు లాంటి జంతువులకు సంబంధించనవి” అన్నారు.

ఇవన్నీ పౌల్ట్రీ, పెంపుడు జంతువులను వ్యాధుల నుంచి కాపాడ్డానికి ఉపయోగించే వ్యాక్సీన్లు. ఎందుకంటే వాటికి కోట్ల డాలర్ల మార్కెట్ ఉంది. ఇంత జరుగుతున్నా, మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారిని అదుపు చేయగలం అని భావిస్తున్నారు.

ఇక్కడ సమస్య ఏంటంటే, దశాబ్దాలుగా, బహుశా ఎప్పుడూ ఉపయోగించని ఏదైనా ఒక ఉత్పత్తిని తయారు చేయడం అనేదానిని ఒక చెత్త పారిశ్రామిక ఆఫర్‌గా భావిస్తారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలి. దానికి వారు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే, ప్రభుత్వ సంస్థలకు సార్స్ మహమ్మారికి వ్యాక్సీన్ కనిపెట్టడానికి జరుగుతున్న రీసెర్చికి డబ్బులు ఇవ్వడం కొనసాగించి ఉంటే.. నిస్సందేహంగా అప్పుడే మనం కోవిడ్-19 కోసం సన్నద్ధంగా ఉండేవాళ్లం అని పీటర్ కోల్‌చింస్కీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

కొత్త వ్యాక్సిన్ పరిస్థితి

ఇప్పుడు మనకు కావల్సింది ఒక్కటే. అది కోవిడ్-19 వ్యాక్సీన్. రాబోయే 12 -18 నెలల్లో బహుశా ఇది తయారవుతుందన్న ఆశలు కూడా పెద్దగా లేవు.

అప్పటివరకూ కరోనా మహమ్మారిని నియంత్రణలో ఉంచే ప్రయత్నాలే కొనసాగాలి. డాక్టర్ మారియా, ఆమె టీమ్ కోవిడ్-19 కొత్త టీకాను సిద్ధం చేయడానికి 2016లో సిద్ధం చేసిన వ్యాక్సీన్ అప్‌డేట్ కోసం పనిచేస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఆ రీసెర్చ్ కోసం నిధులు పోగుచేయడానికి నానా తంటాలూ పడుతున్నారు.

“2016 వ్యాక్సిన్ అప్‌డేట్ వేగవంతం చేయడానికి నిధులు అందాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా నాలుగు లక్షల డాలర్ల మొత్తం ఇచ్చింది. కానీ మేం దీనిని ఇప్పుడు మరింత వేగవంతం చేయాలంటే, మరిన్ని నిధులు అవసరం. కానీ ఈ మొత్తం ప్రక్రియ చాలా నిరాశపరిచేలా ఉంది” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)