దక్షిణకొరియా ఎన్నికలు: కరోనావైరస్ సంక్షోభంలో విజయం సాధించిన పాలక పక్షం

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ కొరియా ఎన్నికల్లో మూన్ జే ఇన్ ఘన విజయం
దక్షిణ కొరియాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మూన్ జే ఇన్ నేతృత్వంలోని అధికారపార్టీ ఘన విజయం సాధించింది. దీంతో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వ పని తీరుకు ఓటర్లు తమ మద్దతు ప్రకటించినట్లయింది.
కరోనావైరస్ మహమ్మారి మొదలైన సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన దేశాల్లో దక్షిణ కొరియా మొదటిదని చెప్పవచ్చు.
ఓటింగ్ సమయంలో పూర్తి స్థాయిలో సురక్షిత చర్యలు తీసుకోవడమే కాదు సామాజిక దూరాన్ని కూడా చాలా కచ్చితంగా పాటించేలా అధికారులు, ఓటర్లు జాగ్రత్తలు తీసుకున్నారు.
కౌంటింగ్ దాదాపు పూర్తయ్యే సమయానికి మొత్తం 300 స్థానాలకు గాను 163 స్థానాల్లో మూన్ జే ఇన్ నేతృత్వంలోని డెమొక్రాటిక్ పార్టీ విజయం సాధించింది.
మరో 17 స్థానాల్లో మిత్ర పక్షం ప్లాట్ ఫాం పార్టీ విజయం సాధించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రస్తుత ప్రభుత్వం 180 స్థానాల్లో పాగా వేసిందని చెప్పవచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా మాజీ దౌత్యవేత్త థె యంగ్ హొ దక్షిణ కొరియా ఎన్నికల్లో గెలిచిన తొలి వలస నేతగా చరిత్ర సృష్టించారు.
ప్రతిపక్ష కూటమి నుంచి ఉత్తర కొరియా బహిష్కృత అధికారి విజయం
ప్రతిపక్ష కూటమి యునైటెడ్ ఫ్యూచర్ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులలో ఉత్తర కొరియా బహిష్కృత నేత థె యంగ్ హొ కూడా ఉండటం విశేషం.
ఆయన లండన్‌లో ఉత్తర కొరియా సీనియర్ దౌత్యవేత్తగా గతంలో పని చేశారు. అయితే 2016లో ఆయన్ను కుటుంబంతో సహా ఉత్తర కొరియా బహిష్కరించింది.
ఈ ఎన్నికల్లో ఆయన సోల్‌లోని గంగ్నమ్ జిల్లా నుంచి యునైటెడ్ ఫ్యూచర్ పార్టీ పోటీ చేశారు. మొత్తం 58.4శాతం ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేశారు.
ఈ విజయం ద్వారా తమ భవిష్యత్తుకు కూడా కొత్త దారులున్నాయన్న విషయాన్ని ఉత్తర కొరియా చెప్పాలనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, Reuters
దక్షిణ, ఉత్తర కొరియా అధ్యక్షులు
ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు ఎలా వేశారు?
ఓటింగ్ రోజున ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు చేతులకు గ్లౌజులు ధరించారు. ఆపై చేతుల్ని శానిటైజర్లతో శుభ్రం చేసుకొని క్యూ లైన్లలో కనీసం 3 మీటర్ల దూరంలో నిల్చొని సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించారు.
అంతే కాదు ఓటింగ్ సమయంలో వారి శరీర ఉష్ణోగ్రతలను కూడా పరీక్షించారు అధికారులు. ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్టు పరీక్షల్లో వెల్లడైన వెంటనే అలాంటి వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ బూత్ తరలించారు.
వారు ఓటు వేసిన తర్వాత ఆ ఓటింగ్ యంత్రాన్ని పూర్తిగా ఇన్ఫెక్షన్ రహితం చేశారు. కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం దక్షిణ కోరియాలో 60 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచారు.
ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా జనం భయం లేకుండా ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో గడిచిన 18 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా సుమారు 66శాతం పోలింగ్ నమోదయ్యింది. అయితే 18 ఏళ్లు నిండిన వారికి తొలిసారిగా ఓటు హక్కు కల్పించడం కూడా పోలింగ్ పెరగడానికి మరో కారణం.
సుమారు 26శాతం మంది పోస్ట్ ద్వారా లేదా తమ క్వారంటైన్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రాలలో ముందుగానే ఓటు వేశారు.
ఫొటో సోర్స్, AFP
300 స్థానాలకు గాను 163 స్థానాల్లో విజయం సాధించిన అధికార పార్టీ
కరోనావైరస్‌తో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో కొన్ని నిర్దేశిత సమయాల్లో మాత్రమే ఓటింగ్‌కు అనుమతించారు.
ఆ వ్యక్తులకు ప్రజా రవాణా సౌకర్యాన్ని పూర్తిగా నిషేధించారు. కాలి నడకన లేదా తమ సొంత వాహనాల్లో మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చేందుకు అనుమతించారు.
“ఈ విషయంలో ప్రతి పౌరుడు పరిస్థితి తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకుని పోలింగ్ అధికారులపై ఫిర్యాదులు చెయ్యడం మాని వారిని సమర్థంగా విధులు నిర్వర్తించేలా ప్రోత్సహించారు.” అని సోల్‌లోని యాంగ్సన్ జిల్లా మేయర్ సుంగ్ జంగ్ హ్యున్ బీబీసీతో అన్నారు.
అత్యధిక సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడిన దేశాల్లో మొదట దక్షిణ కొరియా రెండో స్థానంలో ఉండేది. కానీ విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం, వైరస్ బారిన పడిన వ్యక్తుల్ని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను చాలా కఠినంగా అమలు పరచడం ద్వారా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించగల్గింది.
దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు ఏ ఎన్నికలు వాయిదా పడలేదు. 1952లో కొరియా యుద్ధం జరుగుతున్నప్పటికీ అధ్యక్ష ఎన్నికల్ని నిర్వహించారు.
తాజా ఎన్నికల ఫలితాలపై బీబీసీ ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ
నిజానికి జనవరి నాటికి మూన్ జే ఇన్ పరిస్థితి రాజకీయంగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఓ వైపు దేశం ఆర్థిక పరిస్థితి నెమ్మదించడం మరోవైపు ఉత్తర కొరియాతో చర్చలు నిలిచిపోవడం వాటితో పాటు రాజకీయ కుంభకోణాలు ఆయన్ను చిక్కుల్లోకి నెట్టేశాయి.
కానీ కోవిడ్-19 రోగుల్ని గుర్తించడం, పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంది.
ఫలితంగా ఫిబ్రవరి నెలాఖరు నాటికి రోజుకు 900కి పైగా పాజిటివ్ కేసులు నమోదైన దేశంలో 30కి పడిపోయాయి.
సరిగ్గా దీన్నే తమ ప్రచారంలో అస్త్రంగా చేసుకుంది అధికార పార్టీ. అదే మూన్ జే ఇన్ విజయానికి కారణమైంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే.. ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి
- జూన్ అల్మీడా: మొదటి కరోనావైరస్ను కనిపెట్టిన మహిళ
- కరోనావైరస్: లాక్ డౌన్ ఎత్తేస్తే... పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది - ప్రపంచ దేశాలకు WHO హెచ్చరిక
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)