కరోనావైరస్: అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న ముగ్గురు వ్యోమగాములు, వారికి వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు

  • ఓల్గా ఇవ్షినా
  • బీబీసీ రష్యా
అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం నుంచి తిరిగి వస్తున్న ముగ్గురు వ్యోమగాములు

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్,

అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం నుంచి తిరిగి వస్తున్న ముగ్గురు వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ముగ్గురు వ్యోమగాములు శుక్రవారం ఉదయం తిరిగి వస్తున్నారు. వారు ఇప్పుడు పూర్తిగా మారిపోయిన భూగోళంపై అడుగుపెడుతున్నారు.

అంతరిక్షంలో ఐసోలేషన్ (ఒంటరిగా ఉండటం) వారికి కొత్తేం కాదు. కానీ, ఇప్పుడు భూమి మీదకి వచ్చాక కూడా ఈ వ్యోమగాములు ఎవరినీ కలిసే వీలుండదు. అందుకు కారణం కరోనావైరస్.

రష్యాకు చెందిన ఓలెగ్ స్క్రిపోచ్‌కా, అమెరికాకు చెందిన జెస్సికా మెయిర్‌ 2019 సెప్టెంబర్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. అప్పటికి కోవిడ్-19 వ్యాప్తి మొదలు కాలేదు.

అమెరికాకు చెందిన మరో వ్యోమగామి ఆండ్రూ మోర్గాన్, 2019 జులై నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఇప్పుడు తిరిగి వస్తున్నారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా అంతరిక్షం నుంచి వస్తున్న వీరి ప్రయాణంలోనూ అనేక మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.

"భూమి మీద చోటుచేసుకుంటున్న పరిణామాలను అసలు నమ్మలేకపోతున్నాం. మేము అంతరిక్షంలోకి వెళ్లక ముందు కరోనా అన్నదే లేదు. ఇప్పుడు దాని వల్ల ప్రపంచమంతా మారిపోయిందంటే విచిత్రంగా ఉంది” అని జెస్సికా మెయిర్ ఇటీవల వీడియో కాల్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

ఈ ముగ్గురు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు భూమి మీద దిగనున్నారు. ఇప్పటికి స్క్రైపోచ్‌కా, జెస్సికా మెయిర్ 205 రోజులు, మోర్గాన్ 272 రోజులు అంతరిక్షంలో గడిపారు.

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్,

ఐఎస్ఎస్‌లో ఉండటం కన్నా భూమి మీద ఐసోలేషన్‌లో ఉండటమే చాలా కష్టం అని జెస్సికా అంటున్నారు.

కరోనా భయంతో ప్రత్యేక ఏర్పాట్లు

సాధారణంగా వారు ప్రయాణించే అంతరిక్ష వాహక నౌక (స్పేస్ క్యాప్సూల్) కజకిస్థాన్‌ దేశంలో ఎక్కడో ఒక చోట దిగుతుంది. సహాయక సిబ్బంది వెళ్లి వారిని సమీపంలోని విమానాశ్రయానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఆ వ్యోమగాములు తమ స్వస్థలాలకు ప్రత్యేక విమానాల్లో బయలుదేరతారు.

అయితే, కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం కజకిస్థాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. చాలా విమానాశ్రయాలను మూసివేశారు.

వారు ఎక్కడ దిగారో గుర్తించి విమానాశ్రయానికి తీసుకెళ్లే సహాయక బృందాన్ని ప్రస్తుతం కఠినమైన నిర్బంధంలో ఉంచారు. ఆ వ్యోమగాముల దగ్గరికి వెళ్లేముందు, వారికి కరోనా పరీక్షలు చేస్తారు.

ఏప్రిల్ 9న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన రష్యా, అమెరికా వ్యోమగాములు కూడా తమ ద్వారా వైరస్‌ అంతరిక్షంలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్లు భూమి నుంచి బయలుదేరడానికి ముందు నెలన్నర పాటు క్వారంటైన్‌లో ఉన్నారు.

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్,

ఐఎస్ఎస్ నుంచి గత గురువారం వారు భూమికి తిరుగు ప్రయాణమయ్యారు.

రష్యా లీజుకు తీసుకున్న కజకిస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇంకా పనిచేస్తోంది. భూమి మీద దిగిన తర్వాత ముగ్గురు వ్యోమగాములు ఆ కేంద్రానికి వెళ్తారు. అక్కడి నుంచి ఒకరు రష్యాకు ప్రత్యేక విమానంలో వెళ్లిపోతారు. అమెరికాకు చెందిన ఇద్దరు మాత్రం మొదట కజకిస్థాన్‌లోని కిజిలోర్డా పట్టణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నాసా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్తారు.

సాధారణంగా, అంతరిక్షం నుంచి వచ్చే వ్యోమగాముల బృందాలు భూమిపై దిగిన తర్వాత కొన్ని వారాల పాటు ప్రత్యేక ఏర్పాట్లున్న ఇంటిలో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే, వారు చాలా కాలంపాటు గురుత్వాకర్షణలేని అంతరిక్ష కేంద్రంలో గడిపి ఉంటారు. భూమిపై ఉండే స్థిరమైన గురుత్వాకర్షణకు వారి శరీరం అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది.

బంధువులను కలవడం బంద్

అంతరిక్షంలోకి వెళ్లి వచ్చేవారంటే ఎప్పుడైనా సమాజంలో ఎంతో క్రేజ్ ఉంటుంది. వారిని కలిసేందుకు కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు, స్నేహితులు, ప్రముఖులు క్యూ కడుతుంటారు.

కానీ, కరోనావైరస్ కారణంగా ఇప్పుడు అలా ఆప్యాయంగా కుటుంబ సభ్యులను, స్నేహితులను కలుసుకోవడం కష్టంగా ఉంటుందని జెస్సికా మెయిర్ అంటున్నారు.

గత ఏడాది తొలిసారి అంతరిక్ష నడకను పూర్తి చేసి చరిత్ర సృష్టించిన మహిళల బృందంలో జెస్సికా కూడా ఉన్నారు. ఆ నడకలో జెస్సికాతో పాటు మరో వ్యోమగామి క్రిస్టినా కోచ్‌ ఉన్నారు.

"నేను అంతరిక్షంలో కంటే భూమి మీదే ఎక్కువ ఒంటరితనాన్ని భరించాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. అంతరిక్ష కేంద్రంలో ఎప్పుడూ అద్భుతమైన అన్వేషణలు, ప్రయోగాలతో బిజీగా ఉంటాం. ఇక్కడ ఒంటరితనం అన్నదే లేదు. భూమి మీదికి వచ్చాక కరోనావైరస్ వల్ల ఒంటరితనంతో ఇబ్బంది పడాల్సి వస్తుందేమో" అని ఆమె అన్నారు.

1998 నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌) భూమి చుట్టూ తిరుగుతోంది. ఈ ప్రాజెక్టులో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)