కరోనావైరస్: మానవ ఉద్యోగులు, కార్మికుల స్థానంలో రోబోలు రాకను కోవిడ్-19 వేగవంతం చేస్తోందా?

  • జో థామస్
  • టెక్నాలజీ రిపోర్టర్
కీబోర్డు మీద రోబో చేయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కీబోర్డు మీద రోబో చేయి

ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి గుప్పిట బంధిస్తున్న సమయంలో.. మానవాళి జీవన విధానాన్ని సమూలంగా మార్చేస్తున్న మరో అంశం చాలా మంది మరచిపోతున్నారు.. అది రోబోల విజృంభణ.

మంచికో చెడుకో మనుషుల స్థానాలను రోబోలు భర్తీ చేస్తున్నాయని.. ఈ ప్రక్రియను కరోనావైరస్ మహమ్మారి వేగవంతం చేస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.

‘‘మనుషుల సంబంధాల్లో మానవ నైజం ఉండాలని జనం సాధారణంగా అంటుంటారు.. కానీ కోవిడ్-19 దానిని మార్చేసింది’’ అని మార్టిన్ ఫోర్డ్ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాల్లో ఆర్థిక వ్యవస్థలో రోబోలు ఎంతగా సంలీనం కాబోతున్నాయనే అంశం గురించి ఆయన పలు విశ్లేషణలు రాశారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

‘‘వినియోగదారుల ప్రాధాన్యతలను కోవిడ్-29 మార్చేయబోతోంది. ఆటోమేషన్‌లో కొత్త అవకాశాలకు తెరతీస్తోంది’’ అంటారాయన.

సామాజిక దూరాన్ని పెంచటానికి, భౌతికంగా పని చేయటానికి వచ్చే సిబ్బంది సంఖ్యను తగ్గించటానికి పెద్ద, చిన్న కంపెనీలు రోబోల వినియోగాన్ని విస్తరిస్తున్నాయి. ఉద్యోగులు, కార్మికులు ఇంటి దగ్గర చేయలేని పనులను చేయటానికి కూడా రోబోలను ఉపయోగిస్తున్నారు.

అమెరికాలో అతిపెద్ద రిటైల్ విక్రయాల సంస్థ వాల్‌మార్ట్.. తన మాల్స్‌లో నేలను తుడిచి శుభ్రం చేయటానికి రోబోలను వాడుతోంది.

దక్షిణ కొరియాలో మనుషులకు జ్వరం ఉందో లేదో తనిఖీ చేయటానికి, సానిటైజర్‌ అందించటానికి కూడా రోబోలను ఉపయోగిస్తున్నారు.

సామాజిక దూరం పాటించే చర్యలు 2021 వరకూ అమలు చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. రోబో కార్మికులకు డిమాండ్ మరింతగా పెరగవచ్చు.

ఫొటో సోర్స్, UVD-Robots

ఫొటో క్యాప్షన్,

కోవిడ్-19 వ్యాప్తి తరువాత ఆస్పత్రులను శుభ్రం చేసే యూవీడీ రోబోలకు ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి

రంగంలోకి రోబో క్లీనర్లు

శుభ్రం చేసే, ప్రక్షాళన చేసే ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

అల్ట్రావయొలెట్ లైట్ డిజిన్ఫెక్షన్ రోబోలను తయారు చేసే డెన్మార్క్‌కు చెందిన యూవీడీ రోబోస్.. వందలాది రోబోలను చైనా, యూరప్‌లలోని ఆస్పత్రులకు ఎగుమతి చేసింది.

సరకుల దుకాణాలు, పార్సిళ్లు అందించే రెస్టారెంట్లు కూడా ఈ యంత్రాలను మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.

వ్యాపారాలు మళ్లీ మొదలవుతున్న కొద్దీ.. ఈ టెక్నాలజీ వినియోగం ఇంకా పెరుగుతుందని, మన స్కూళ్లు, ఆఫీసుల్లో కూడా నేలలు, గోడలు, అద్దాలను శుభ్రం చేసే పనులు చేస్తూ రోబోలు కనిపించవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

‘‘వినియోగదారులు ఇప్పుడు తమ భద్రత గురించి, కార్మికుల భద్రత, ఆరోగ్యం గురించి మరింత ఎక్కువగా పట్టించుకుంటున్నారు’’ అని ‘ద కస్టమర్ ఆఫ్ ద ఫ్యూచర్’ రచయిత బ్లేక్ మోర్గాన్ పేర్కొన్నారు.

‘‘ఆటోమేషన్ దిశగా పయనించటం.. వారందరనీ ఆరోగ్యవంతంగా ఉంచవచ్చు. ఇలా చేసే సంస్థలను వినియోగదారులు ఆదరిస్తారు’’ అని ఆమె చెప్పారు.

అయినా ఇందుకు ఇంకా పరిమితులు ఉన్నాయి. మాల్స్, సరకుల దుకాణాల్లో ఆటోమేటెడ్ బిల్లు చెల్లింపుల్లో మనుషుల కలయిక తగ్గాల్సి ఉంటుందని.. కానీ ఆ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవటం, త్వరగా పాడవుతుండటం వల్ల వినియోగదారులు వాటికి బదులుగా మనుషులు క్యాషియర్లుగా ఉన్న చోటుకే వెళుతుంటారని బ్లేక్ వివరించారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

అమెజాన్ వేర్ హౌజ్‌లో ఉత్పత్తులను తరలించే రోబోలను ఇప్పటికే వాడుతున్నారు.

సామాజిక దూరానికి సాయం

ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనల రీత్యా.. రోబోల వినియోగం పెరిగే అవకాశమున్న మరో రంగం ఆహార సేవలు.

మెక్‌డోనల్డ్స్ వంటి ఫాస్ట్-ఫుడ్ చైన్లు.. ఇప్పటికే రోబో కుక్‌లు, రోబో సర్వర్లను ప్రయోగాత్మకంగా పరీక్షించాయి.

అమెజాన్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు నిర్వహించే గిడ్డంగుల్లో.. సామర్థ్యాన్ని పెంచటానికి రోబోలను ముందు నుంచే వినియోగిస్తున్నారు. ఇప్పుడు కోవిడ్-19 విజృంభణతో సరకుల వర్గీకరణ, ప్యాకింగ్, షిప్పింగ్‌లలోనూ రోబోలను వినియోగం పెంచటం మీద ఆ సంస్థలు దృష్టి పెట్టాయి.

దీనివల్ల.. ప్రస్తుత పరిస్థితుల్లో తమ సహోద్యోగులతో సామాజిక దూరం పాటించలేకపోతున్నామని కార్మికులు ఫిర్యాదులు తగ్గవచ్చు. కానీ.. దీనివల్ల కొంత మంది ఉద్యోగాలు పోవచ్చునని టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు.

ఒక కార్మికుడి స్థానంలో రోబోను తెచ్చి పెట్టటానికి ఏదైనా ఒక సంస్థ పెట్టుబడులు పెట్టినట్లయితే.. ఆ స్థానంలో మళ్లీ ఒక మనిషిని నియమించుకునే అవకాశం ఉండదు.

రోబోలను తయారు చేయటానికి, వాటిని వ్యాపారాల్లోకి అనుగుణంగా తీసుకురావటానికి చాలా ఖర్చవుతుంది. కానీ.. ఒకసారి అవి రంగంలోకి దిగి పని చేయటం మొదలైన తర్వాత మానవ కార్మికుల కన్నా చాలా చౌకగా పనిచేస్తాయి.

కోవిడ్-19 అనంతర కాలంలో రోబోలను ఉపయోగించటం వల్ల.. కొన్ని మార్కెటింగ్ ప్రయోజనాలు కూడా ఉంటాయని భవిష్యత్ విశ్లేషకుడు మార్టిన్ ఫోర్డ్ చెప్తున్నారు.

‘‘మానవ కార్మికులు తక్కువగా ఉండే, యంత్రాలు ఎక్కువగా ఉండే చోటుకు వెళ్లటానికి మనుషులు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే.. వాటివల్ల తమకు ప్రమాదం తక్కువగా ఉంటుందని వారు భావిస్తారు’’ అని ఆయన విశ్లేషించారు.

అచ్చం మనుషుల్లాగే...

మరి.. పాఠాలు చెప్పటమో, సలహాలు, మార్గదర్శకాలు ఇవ్వటమో అవసరమైన సేవా పాత్రల సంగతేమిటి?

స్కూళ్లలో ఉపాధ్యాయులు, వ్యాయామ శిక్షకులు, ఆర్థిక సలహాదారుల స్థానంలో వినియోగించటానికి కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను అభివృద్ధి చేస్తున్నారు.

బడా బడా టెక్ కంపెనీలు కృత్రిమ మేథస్సు వినియోగాన్ని విస్తరిస్తున్నాయి. ఫేస్‌బుక్, గూగుల్ వంటివి అవాంఛిత పోస్టులను తొలగించటానికి ఏఐ మీద మరింత ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఎందుకంటే.. ఈ సంస్థల మానవ మోడరేటర్లు.. తమ ఇళ్ల నుంచి కొన్నిటిని సమీక్షించలేరు.

ఇటువంటి ఉద్యోగాల్లో మనుషులకు ఎక్కువ అవకాశం ఉంటుందని.. ‘రోబో సందేహకులు’ ఇప్పటివరకూ విశ్వసించారు. కానీ లాక్‌డౌన్ వల్ల మనుషులకు దూరంగా ఉండి అనుసంధానం అవటమే సౌకర్యవంతంగా ఉండటంతో.. ఈ పరిస్థితి మారిపోతోంది.

స్క్రీన్ మీద కనిపించే బోధకుడు కానీ సలహాదారు కానీ నిజమైన వ్యక్తే కానవసరం లేదు. అది ఒక వ్యక్తి లాగా ఆలోచించి, ప్రవర్తిస్తే సరిపోతుంది.

అంతర్జాతీయ కన్సెల్టింగ్ సంస్థ మెకిన్సే 2017లో ఇచ్చిన ఒక నివేదికలో.. అమెరికాలో 2030 నాటికి మూడో వంతు కార్మికులు, ఉద్యోగుల స్థానాలను ఆటోమేషన్, రోబోలు భర్తీ చేస్తాయని జోస్యం చెప్పింది. కానీ మహమ్మారుల విజృంభణ వంటి పరిణామాలతో ఈ కాల పరిమితులన్నీ మారిపోయే అవకాశముంది.

ఈ సాంకేతికతలను ప్రపంచంలో ఎలా సమ్మిళతం చేయాలనేది నిర్ణయించుకోవాల్సింది మనుషులేనని నిపుణులు అంటున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)