కరోనావైరస్: ఈక్వెడార్‌ గ్వాయాక్విల్‌లో వేలల్లో మృతులు... మార్చురీలు మూసేయడంతో రోడ్ల మీద మృతదేహాలు

గయాక్విల్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

గయాక్విల్‌లో రక్షణ దుస్తులతో శవాలను తరలిస్తున్న వ్యక్తి.

ఈక్వెడార్‌లోని గ్వాయాస్ ప్రాంతం కరోనా మహమ్మారికి అత్యంత ప్రభావితం అయ్యింది.

ప్రభుత్వ రికార్డుల్లో కోవిడ్-19 మహమ్మారితో చనిపోయిన వారి సంఖ్యను తనిఖీ చేస్తున్నప్పుడు, ఒక కఠోరమైన వాస్తవం ప్రజల ముందుకు వచ్చింది.

గ్వాయాస్‌లో ఏప్రిల్ ముందు రెండు వారాల్లో 6700 మంది చనిపోయారు. గ్వాయాస్‌లో చనిపోయినవారి సగటు గణాంకాలతో పోలిస్తే ఈ సంఖ్య 5 వేలకు పైనే ఉంది.

అందుకే గ్వాయాస్, ఈక్వెడార్‌లోనే కాకుండా, మొత్తం లాటిన్ అమెరికాలో కోవిడ్-19 వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం అయ్యింది.

ఇక్కడ కరోనా వ్యాపించడం వల్ల మాత్రమే జనం చనిపోలేదు. మహమ్మారి వల్ల నగరంలో వైద్య సదుపాయాలు చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి.

దాంతో, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వెంటనే అవసరమైన వైద్య సహాయం అందించలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

శవాల సంఖ్య పెరగడంతో అట్ట డబ్బాలను తయారు చేయడం ప్రారంభించారు.

గ్వాయాక్విల్, శవాల పట్టణం

ఈక్వెడార్‌లోనే అత్యంత పెద్ద పట్టణం, గ్వాయాస్ రాజధాని అయిన గ్వాయాక్విల్ మార్చురీలో పనిచేసే కేటీ మేజికా “మేం కార్లలో, అంబులెన్సుల్లో, ఇళ్లలో, రోడ్లపై ఉన్న ఎన్నో శవాలను చూశాం అని చెప్పారు.

“ఆస్పత్రుల్లో తగినన్ని పడకలు లేకపోవడం దీనికి ఒక కారణం. అందుకే వేరే రోగులను అడ్మిట్ చేసుకోలేదు. వారందరూ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటే అక్కడ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వారికి అంత స్తోమత కూడా లేదు” అన్నారు.

25 లక్షల మంది ఉన్న నగరంలో కరోనావైరస్ వల్ల ఎన్ని మరణాలు సంభవించాయంటే, నగరంలో మార్చురీలు నిండిపోయాయి. మార్చురీ సిబ్బంది ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని భయపడిపోయారు. దాంతో చాలా మార్చురీలను మూసేశారు.

ఫొటో సోర్స్, Getty Images

నైరాశ్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న బంధువులు, తమవారి శవాలను ఇళ్ల బయటే వదిలేశారు. కొన్ని శవాలు చాలా రోజులవరకూ అలాగే ఉండిపోయాయి. గ్యాయాక్విల్ శ్మశానంలో వాటిని పూడ్చిపెట్టడానికి తగిన చోటు కూడా లేకపోవడంతో అంత్యక్రియలు చేయడానికి కొందరు వాటిని సమీప నగరాలకు తీసుళ్లాల్సి వచ్చింది.

నగరంలో మృతులను ఖననం చేయడానికి శవపేటికల కొరత కూడా ఎదురైంది. దాంతో చాలా శవాలను అట్ట పెట్టెల్లో పెట్టి ఖననం చేశారు. స్థానిక జైళ్లలో ఉన్న ఖైదీలతో శవపేటికలు తయారుచేయించారు.

ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో తమ ఆరోగ్య అత్యవసర వ్యవస్థ ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైందని భావించారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

గ్వాయాక్విల్‌లో కొత్తగా నిర్మిస్తున్న సమాధులు

అసలు లెక్క వేరే

ఏప్రిల్ 16 నాటికి ఈక్వెడార్‌లో కరోనా వైరస్ వల్ల కేవలం 421 మంది చనిపోయారని చెప్పగలిగింది.

కానీ, కరోనా వైరస్ సంక్షోభం నుంచి బయటపడ్డానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్ ఫోర్స్ అన్ని గణాంకాలను పరిశీలించాక మరో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

“హోం శాఖ, మార్చురీలు, సివిల్ రిజిస్టర్, మా టీమ్ నుంచి లభించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ ముందు 15 రోజుల్లో గ్వాయాస్‌లో 6703 మంది చనిపోయారని తెలిసింది. ఇక్కడ ప్రతి నెలా సగటున రెండు వేల మంది చనిపోతున్నారు. అందుకే మా దగ్గర గణాంకాల్లో మరణాలు, ప్రస్తుతం చెప్పిన వాటికంటే 5700 ఎక్కువగా ఉంటాయి” అని టాస్క్ ఫోర్స్ చీఫ్ జార్జ్ వాటెడ్ చెప్పారు.

కానీ, గ్వాయాస్‌లో అందరూ కోవిడ్-19 వ్యాపించడం వల్ల చనిపోలేదు. కొంతమంది గుండెపోటుతో చనిపోగా, కొందరు కిడ్నీలు పాడవడం వల్ల, లేదంటే ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మరణించారు. కొందరు సరైన చికిత్స అందక చనిపోయారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

లాస్ సెలిబోస్ కోవిడ్-19 పీల్డ్ ఆస్పత్రి

మిగతా దేశాల్లో పరిస్థితి?

గ్వాయాస్‌లో పరిస్థితి బయటపడిన తర్వాత, ఆ మొత్తం ప్రాంతం గురించి ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తాయి. లాటిన్ అమెరికాలో మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉందో అని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే వైద్య సదుపాయాలు ఘోరంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంటుందా?

చైనా వుహాన్ నగరంలో అధికారిక మరణాల గణాంకాలను సవరించినప్పటి నుంచి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. యూరప్‌లో అత్యంత ప్రభావితమైన దేశాల్లో ఒకటైన స్పెయిన్‌లో మృతుల గణాంకాలను లెక్కగట్టడంలో, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో సేకరించిన గణాంకాల్లో తేడాలు ఉండడం కూడా గుర్తించారు.

గ్వాయాక్విల్ నగరంలో డాక్టర్ కార్లోస్ మావయిన్ బీబీసీతో “ఈక్వెడార్‌లో ప్రభుత్వ వైద్య సదుపాయాలు ఎప్పుడూ బలహీనంగానే ఉంటూ వచ్చాయి. చాలా ప్రభుత్వాలకు ఇది అత్యంత బలహీనమైన సమయంగా మారింది” అన్నారు.

“కోవిడ్-19 మహమ్మారికి గురైన వాటిలో ఈక్వెడార్ అత్యంత బలహీనమైన బాధిత దేశం. రోగుల సంఖ్య భారీగా ఉండడంతో ఈక్వెడార్ వైద్య సదుపాయాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి” అన్నారు

ఈక్వెడార్ రాత్రి పూట కర్ఫ్యూ మరింత కఠినం చేసింది. ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ గ్వాయాక్విల్ ప్రజల దృష్టిలో ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)