కరోనావైరస్ను చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారుచేశారా? - బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- జాక్ గుడ్‌మెన్
- బీబీసీ రియాలిటీ చెక్

సోషల్ మీడియాలో కరోనావైరస్ గురించి గందరగోళం సృష్టించే వార్తలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. బీబీసీ టీమ్ ఈ నకిలీ వార్తలను ఫ్యాక్ట్ చెక్ చేసి, వాటి వాస్తవాలను పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం చేసింది.
బీబీసీ మానిటరింగ్, ట్రెండింగ్, రియాలిటీ చెక్ టీమ్స్ గత వారం రోజులుగా వచ్చిన వార్తలను పరిశీలించింది. అవేంటో ఒకసారి చూద్దాం.
బీసీజీ వ్యాక్సిన్ గురించి నకిలీ వాదనలు
వాట్సాప్‌లో ఫార్వార్డ్ అవుతున్న కొన్ని సందేశాల్లో బీసీజీ వ్యాక్సిన్ కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుంది అని చెబుతున్నారు. ఈ వాదన నిరాధారమైనది, ఇది పూర్తిగా తప్పు.
బీసీజీ అంటే బసిలస్ కాలెమెట్ గుయెరిన్. ఈ టీకాను క్షయ లేదా టీబీ రాకుండా ఉండడానికి పిల్లలకు వేస్తారు.
2005 వరకు బ్రిటన్ స్కూల్ పిల్లల్లో ఇది ఒక సాధారణ వ్యాధిగా ఉండేది. బ్రిటన్‌లో బీసీజీ టీకా ఇప్పటికీ ఇస్తున్నారు. ప్రపంచంలో సిరియా లాంటి చాలా దేశాల్లో క్షయ ఒక సాధారణ వ్యాధి.
ఎవరైనా క్షయ (టీబీ) టీకా వేసుకుని ఉంటే, వారికి కరోనావైరస్ వ్యాపిస్తుందనే ఆందోళనే అవసరం లేదని, బీసీజీ వేసుకోవడం వల్ల వారిలో కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని కొన్ని దేశాల్లో వందతులు వ్యాపించాయి.
అరబిక్ భాషలో వాట్సాప్ మెసేజ్
వాట్సాప్‌లో అరబిక్ భాషలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది.
“మీ చేతులపై ఇంజెక్షన్ వేసిన గుండ్రటి గుర్తు ఉంటే మీరు కోవిడ్-19 నుంచి 75 శాతం సురక్షితంగా ఉన్నారని అర్థం” అని అందులో చెబుతున్నారు.
అయితే కోవిడ్-19 వ్యాప్తిని బీసీజీ టీకా అడ్డుకుంటుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
కోవిడ్-19 చికిత్స కోసం జరుగుతున్న పరిశోధనల్లో బీసీజీ టీకా గురించి రెండు క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయని, అవి పూర్తి కాగానే, వాటి ఫలితాలను మేం పరిశీలిస్తాం అని డబ్ల్యుహెచ్ఓ చెప్పింది.
వైద్యపరంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా, తమ సెర్చ్ ఇంజన్లో ప్రపంచవ్యాప్తంగా బీసీజీ గురించి సమాచారం వెతికే వారి సంఖ్య హఠాత్తుగా పెరిగిందని గూగుల్ కూడా చెప్పింది.
బీసీజీ టీకా డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనివల్ల నిజంగా టీకా అవసరమైన పిల్లలను క్షయ నుంచి కాపాడడం సమస్య కావచ్చని చెబుతోంది.
జపాన్ కూడా అదే చెబుతోంది. బీసీజీ టీకాలను భారీగా సరఫరా చేసే ఈ దేశం హఠాత్తుగా వాటి డిమాండ్ పెరిగిందని చెప్పింది.
ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్లో ఐఆర్జీసీ చీఫ్ తప్పుడు వాదన
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) చీఫ్ కూడా గత వారం ఒక డివైస్ చూపిస్తూ “ఇది కరోనావైరస్ సోకిన వారిని గుర్తించగలదు” అని చెప్పారు.
కరోనా వ్యాపించిన ఉపరితలాన్ని వంద మీటర్ల దూరం నుంచి కూడా 5 సెకన్లలో ఈ డివైస్ గుర్తించగలదని ఆయన చెప్పారు.
ఈ ప్రకటన ‘సూడోసైన్స్’, ‘నమ్మలేనిది’, ‘ఫిక్షన్ కథ’ అని ఇరాన్ ఫిజిక్స్ సొసైటీ చెప్పింది.
చూడ్డానికి ఈ డివైస్ ఒక ‘నకిలీ బాంబ్ డిటెక్టర్’లా ఉంటుంది. దానిని దశాబ్దం క్రితం కొంతమంది బ్రిటన్ వాసులు విక్రయించారు.
ఈ నకిలీ ‘బాంబ్ డిటెక్టర్’ నిజానికి ఒక ఖాళీ డబ్బా, దానిలో ఒక ఏరియల్ ఉంటుంది. దానిని ఉపయోగించే వ్యక్తి చేతి దిశను బట్టి దాని ఏరియల్ కూడా కదులుతూ ఉంటుంది.
ప్రపంచంలో అంతర్యుద్ధం సమస్య ఉన్న ప్రాంతాలకు ఈ నకిలీ ‘బాంబ్ డిటెక్టర్’ చేరిపోయింది. ఇప్పటికీ కొన్ని దేశాలు ప్రభుత్వాలు వీటిని ఉపయోగిస్తున్నాయి.
ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ చానల్లో దీని డెమో కూడా చూపించారు. ఐసీఆర్డీసీ చీఫ్ చూపించిన ఆ డివైస్ చాలా వరకూ దానిలాగే కనిపిస్తుంది.
కరోనావైరస్ ల్యాబ్‌లో తయారు కాలేదు
ఇపాక్ టైమ్స్ ఒక వీడియో పబ్లిష్ చేసింది. అందులో కరోనా ఒక ల్యాబ్‌లో సృష్టించిన వైరస్ అని చెప్పింది. ఫేస్బుక్లో ఈ వీడియోను నకిలీదిగా చెప్పారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫేస్‌బుక్‌లోనే ఈ వీడియోను 7 కోట్ల మంది చూశారు.
ఈ వీడియో ప్రారంభం చాలా నాటకీయతతో ఉంటుంది. అది ఒక నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలాగా ఉంటుంది. ఒక గంట పాటు సాగే ఆ వీడియోలో “వుహాన్‌లోని ఒక ల్యాబ్‌లో కరోనావైరస్ తయారు చేశారు. అక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ లేకపోవడంతో అది లీక్ అయ్యింది” అని చెప్పారు.
ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరోనావైరస్ను తయారు చేసిందా అనేదాని గురించి చెప్పిన బీబీసీ సైన్స్ ఎడిటర్ పాల్ రికన్... వుహాన్‌లో ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరోనావైరస్ తయారు చేసింది అనడానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు.
కరోనావైరస్ జంతువుల నుంచి ఉనికిలోకి వచ్చిందని శాస్త్రవేత్తల అధ్యయనం ద్వారా తేలింది. దీని ఆవిర్భావానికి మనుషులకు ఎలాంటి సంబంధం లేదు.
మార్చిలో విడుదల చేసిన ఒక అధ్యయన నివేదికలో కూడా అదే విషయం చెప్పారు. కరోనావైరస్ ఒక ఇంజనీరింగ్ ఫలితమే అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.
అదే రిపోర్టులో SARS-CoV-2 అంటే కరోనావైరస్ను ఒక ల్యాబ్‌లో ఏదైనా ప్రయోగం ద్వారా సృష్టించడం అసాధ్యం అని చెప్పారు.
భారత పరిశోధకుల వాదన
కొందరు భారత పరిశోధకులు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కరోనా వైరస్‌లో నాలుగు కొత్త సీక్వెన్స్ జోడించారని, అవి మొదట హెచ్ఐవీలో ఉండేవని చెప్పారని వైరల్ అవుతున్న ఆ వీడియోలో అంటున్నారు. దీని ద్వారా కరోనావైరస్ మానవ సృష్టే అని చెప్పడానికి ప్రయత్నించారు.
కానీ, పరిశోధకులు ఆ రీసెర్చ్ పేపర్‌ను ఎలాంటి రివ్యూ లేకుండానే వెనక్కు తీసుకున్నారు. కరోనావైరస్ జెనెటిక్స్ గురించి ఏమేం సూచించారో, అవన్నీ సాధారణంగా మిగతా ప్రాణుల్లో కూడా ఉంటాయి.
“ఆ సీక్వెన్సులు ఎంత చిన్నవిగా ఉన్నాయంటే, హెచ్ఐవీతోనే కాదు, అవి మిగతా జీవులను కూడా పోలి ఉన్నాయి. అంటే దానర్థం.. అవి ఒకదానికొకటి సంబంధించినవి కాదు” అని యూనివర్సిటీ ఆఫ్ కెంట్ వైరాలజీస్ట్ (వైరస్ శాస్త్రవేత్త) డాక్టర్ జెరెమీ రాజ్మెన్ అన్నారు.
‘ఇపాక్ టైమ్స్’ ఒక అమెరికా న్యూస్ వెబ్సైట్, దీనిని చైనా మూలాలు ఉన్న అమెరికన్లు నడుపుతున్నారు. వీరు చైనాకు సంబంధించిన ఫాలున్ గాంగ్ ధార్మిక సిద్ధాంతాలను విశ్వసిస్తారు.
ఎన్బీసీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఈ వెబ్సైట్ గత ఏడాది డోనల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఫేస్బుక్లో ప్రకటనలు ఇచ్చింది.
కానీ ఆగస్టులో ఫేస్బుక్ వారిని, వారి ప్రకటనలను అడ్డుకుంది. ఫేస్బుక్ ప్రకటన విధానాలను ఉల్లంఘించారని ఇపాక్ టైమ్స్ మీద ఆరోపణలు ఉన్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
బిల్ గేట్స్ గురించి వదంతులు
ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధులు ఆపేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని బిల్ గేట్స్ విమర్శించడంతో ఆయనపై ఈ వారం తప్పుడు, గందరగోళం సృష్టించే వాదనలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ కోసం మద్దతు ఇవ్వడంపై విమర్శలు రావడం లాంటి వదంతులు అందరికీ తెలిసినవే.
బిల్ గేట్స్ నిధులతో నడుస్తున్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర కరోనావైరస్ పేటెంట్ ఉందని చెబుతూ ఎన్నో పోస్టులు ఫేస్బుక్లో కనిపించాయి.
ఈ వాదన పూర్తిగా నిరాధారం. వీటి ద్వారా కరోనా మనిషి సృష్టించిన వైరస్ అని, దాని వెనక బిల్ గేట్స్ హస్తం ఉందని చెప్పడానికి ప్రయత్నించారు. ఇది పూర్తిగా అవాస్తవం.
కరోనావైరస్ మహమ్మారి అబద్ధం కాదు
కొలంబియా న్యూస్ చానల్ ‘కనాల్ మాంటేరియా’ ఒక డాక్టర్ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. అందులో ఆ డాక్టర్ “కరోనా మహమ్మారి పూర్తిగా నకిలీ అని, నిజానికి అది ఒక తమాషా” అని అన్నారు. అయితే ఈ వీడియో గత నెలలో ప్రసారం చేశారు. కానీ ఇప్పటివరకూ దానిని కోటీ 80 లక్షల మంది చూశారు. ఫేస్బుక్లో కొందరు దానిని ఇప్పటికీ షేర్ చేస్తున్నారు.
కరోనావైరస్ ఉనికే లేదు అనే వాదన పూర్తిగా తప్పు.
వీడియోలో 'నేను డాక్టర్' అని చెప్పుకున్న ఆ వ్యక్తి “ఈ వైరస్ గురించి ఎంత థియరీ చెబుతున్నారో, అదంతా తప్పు” అన్నారు. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అతడిని ఒక్కసారి కూడా అడ్డుకోలేదు. ఆయన తను చెప్పింది నిజమని నిరూపించేందుకు యూట్యూబ్‌లో ఒక వీడియో చూడమని చెప్పారు. అందులో హెచ్ఐవీ ఉనికినే కొట్టిపారేస్తారు.
కానీ, ప్రపంచవ్యాప్తంగా జనం ఇంత భారీ సంఖ్యలో ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారో ఆయన అందులో ఒక్కసారి కూడా చెప్పలేదు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై ఎందుకీ వదంతులు... 'బ్రెయిన్ డెడ్' వార్త నిజమేనా?
- లాక్డౌన్లో శానిటరీ నాప్కిన్ల కొరత.. బాలికల ఇబ్బందులు
- సత్తెనపల్లిలో యువకుడి మృతి.. పోలీసుల దాడి కారణమంటూ ఆరోపణలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)