కిమ్ జోంగ్ ఉన్: 20 రోజుల తర్వాత ప్రజలకు కనిపించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

కిమ్

ఫొటో సోర్స్, Reuters

20 రోజుల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రజల ముందుకొచ్చారని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది.

ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశారని కేసీఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది.

ఆయన కనిపించగానే ఫ్యాక్టరీ దగ్గరున్న ప్రజలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారని పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP

ఏప్రిల్ 12న ఆయన ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా వదంతులు వ్యాపించిన తర్వాత కిమ్ బయటకు రావడం ఇదే మొదటిసారి.

అయితే, ఉత్తర కొరియా మీడియాలో వస్తున్న ఈ సమాచారాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు.

ఎరువుల ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేస్తున్న ఫొటోలను జాతీయ మీడియా విడుదల చేసింది.

దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను రిపోర్టర్లు ప్రశ్నించగా తాను ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

తన తాత జయంతి వేడుకలకు కిమ్ గతంలో ఎప్పుడూ హాజరు కాకుండా ఉండలేదు.

ఉత్తర కొరియా మీడియా ఏం చెబుతోంది?

కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ప్రకారం... కిమ్ తన సోదరి కిమ్ యో జోంగ్‌తో సహా కొందరు ఉత్తర కొరియా సీనియర్ అధికారులతో కలిసి ఈ చిత్రాల్లో కనిపించారు.

"ప్యాంగ్‌యాంగ్‌కు ఉత్తరంగా ఉన్న ఓ ప్లాంట్ దగ్గర జరుగుతున్న వేడుకలను కిమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దీంతో అక్కడున్న ప్రజలంతా ఆనందంతో 'హుర్రే' అంటూ అరిచారు" అని కేసీఎన్ఏ వెల్లడించింది.

"ఫ్యాక్టరీ ప్రొడక్షన్ సిస్టమ్‌పై తాను సంతృప్తి చెందినట్లు కిమ్ తెలిపారు. దేశంలో రసాయన పరిశ్రమ, ఆహార ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఫ్యాక్టరీని ప్రశంసించారు" అని కేసీఎన్ఏ తెలిపింది.

ఫొటో సోర్స్, AFP

కిమ్ ఆరోగ్యంపై వదంతులు

తన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్ జయంతి వేడుకలకు ఏప్రిల్ 15న కిమ్ హాజరు కాలేదు. దీంతో ఆయన అనారోగ్యంతో ఉన్నారంటూ ప్రపంచవ్యాప్తంగా వదంతులు మొదలయ్యాయి.

ఉత్తర కొరియాలో ఈ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో జరుగుతాయి. సాధారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఆరోజు తన తాత సమాధిని సందర్శిస్తారు. ఇప్పటివరకూ కిమ్ ఎప్పుడూ ఈ వేడుకలకు హాజరు కాకుండా ఉండలేదు.

దీంతో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారు కొందరు నిర్వహిస్తున్న ఓ వెబ్ సైట్‌లో కిమ్ అనారోగ్యంతో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

గత ఆగస్ట్ నుంచి కిమ్ కార్డియోవాస్కులర్ సమస్యలతో కిమ్ బాధపడుతున్నారని, పేక్తూ పర్వతాన్ని మళ్లీ మళ్లీ అధిరోహించడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి 'డైలీ ఎన్‌కే'కు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

డోనల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌

దీని ఆధారంగా అంతర్జాతీయ మీడియా కిమ్ ఆరోగ్యంపై అనేక కథనాలు ప్రసారం చేసింది.

ఆ తర్వాత ఈ వార్తపై దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయని కొన్ని కథనాలు కూడా వచ్చాయి.

కానీ ఆ తర్వాత మరో విషయం వ్యాప్తిలోకి వచ్చింది. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కిమ్ ఆరోగ్యం విషమించిందని అమెరికన్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే ఏప్రిల్ 29న వీటిని అమెరికా మంత్రి మైక్ పాంపేయో కొట్టిపారేశారు. అమెరికా అధికారులెవరూ ఇటీవలి కాలంలో కిమ్‌ను చూడలేదని స్పష్టం చేశారు.

అయితే, కిమ్ ఆరోగ్యంపై వస్తున్నవన్నీ వదంతులేనని దక్షిణ కొరియా ప్రభుత్వం, చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి తెలిపాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

దక్షిణ కొరియాలోని పేక్తూ పర్వతం మీద కిమ్ జోంగ్ ఉన్, మూన్ జే-ఇన్‌

గతంలో ఎప్పుడైనా కిమ్ కనిపించకపోవడం జరిగిందా?

గతంలో కూడా ఓసారి ఇలానే జరిగింది. 2014 సెప్టెంబర్‌లో ఓ కచేరీకి హాజరైన తర్వాత నుంచి దాదాపు 40 రోజుల పాటు కిమ్ కనిపించలేదు. మళ్లీ అక్టోబర్ నెలలో ఆయన తిరిగి కనిపించారు.

అయితే, ఆయన ఎక్కడకు వెళ్లారనే విషయాన్ని జాతీయ మీడియా వెల్లడించలేదు. కానీ, కిమ్ తన ఎడమ కాలి మడమకు ఆపరేషన్ చేయించుకుని ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం తెలిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)