పోర్న్ సైట్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఆపండి: స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి

  • మేఘ మోహన్
  • బీబీసీ జెండర్ అండ్ ఐడెంటిటీ కరస్పాండెంట్
పోర్నోగ్రఫీ

పోర్న్ సైట్లలో సమాచారం కోసం చేసే క్రెడిట్ కార్డు చెల్లింపులని ఫ్రీజ్ చెయ్యాలని లైంగిక హింస నిర్మూలన కోసం పని చేసే ప్రచారకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

పోర్న్ సైట్లు లైంగిక హింసని ప్రేరేపించి, జాత్యహంకారాన్ని పెంచుతాయని, పిల్లలపై లైంగిక హింసని ప్రేరేపించే సమాచారాన్ని ప్రచురిస్తాయని పేర్కొంటూ 10 మంది ప్రచార కర్తలు, ప్రచార సంస్థలు సంతకం చేసిన ఒక లేఖను బీబీసీ పరిశీలించింది. దీన్ని బిగ్ త్రీ, వీసా, మాస్టర్ కార్డుతో సహా 10 క్రెడిట్ కార్డు సంస్థలకి పంపించారు.

అయితే, ఈ లేఖలో పేర్కొన్న అంశాలు దురుద్దేశంతో రాసినట్లు కనిపిస్తున్నాయని, ఇందులో నిజాలు లేవని, పోర్న్ వెబ్ సైట్ 'పోర్న్ హబ్' అంటోంది.

పోర్నోగ్రఫీ సైట్ల గురించి ఈ లేఖలో రాసిన అంశాలపై మాస్టర్ కార్డ్ యాజమాన్యం విచారణ చేపట్టింది.

తప్పుడు కార్యకలాపాల కోసం వినియోగదారులు కార్డుని వాడుతున్నట్లు తెలిస్తే ఆ కంపెనీతో పూర్తిగా తమ వ్యాపార సంబంధాలని తెంచుకుంటామని మాస్టర్ కార్డు బీబీసీకి తెలిపింది.

ఈ లేఖపై సంతకం చేసిన వారిలో యూకే, ఇండియా, యుగాండా, యూఎస్, ఆస్ట్రేలియాకి చెందిన వారు ఉన్నారు. పోర్నోగ్రఫీ సైట్లకి జరిగే చెల్లింపులు తక్షణమే ఆపాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఈ లేఖపై సంతకం చేసిన సంస్థల్లో అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఆన్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌తో సహా కొన్ని మతపరమైన సంస్థలు, మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాడే సంస్థలు ఉన్నాయి.

పోర్నోగ్రఫీ సైట్లలో ప్రచురించే వీడియోలలో అందులో చూపించిన వ్యక్తుల ఆమోదం ఉందో, లేదో తెలుసుకోవడం చాలా కష్టమని ఆ లేఖలో రాశారు. దీంతో, మానవ అక్రమ రవాణా చేసేవారు, పిల్లలని వేధించే వాళ్ళు, అనుమతి లేని వీడియోలని తయారు చేసేవారు ఈ సైట్లని లక్ష్యంగా పెట్టుకోవడానికి వీలవుతుందని అన్నారు.

పోర్నోగ్రఫీ సైట్ల వలన కలిగే హాని గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన జరుగుతోందని బ్రిటన్‌కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఆన్ సెక్సువల్ ఎక్సప్లాయిటేషన్ డైరెక్టర్ హేలీ మక్ నమరా అన్నారు. లేఖపై సంతకం చేసిన సంస్థల్లో ఇది కూడా ఒకటి.

ఆర్థిక సంస్థలు పోర్నోగ్రఫీ పరిశ్రమకి అందిస్తున్న సేవల గురించి విచారించి, వారితో వ్యాపార సంబంధాలని తెంచుకోవాలని పిల్లల హక్కుల కోసం, లైంగిక హింసకి వ్యతిరేకంగా పని చేసే తమ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని ఆమె తెలిపారు.

పోర్నోగ్రఫీ సైట్లలో పిల్లలపై హింసకి సంబంధించిన వీడియోలపై ప్రజలకి ఉన్న ఆసక్తి గురించి తెలిపే నివేదికను ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ ఏప్రిల్‌లో ప్రచురించింది. ముఖ్యంగా కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌లో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పోర్నోగ్రఫీ సైట్లలో పిల్లలపై లైంగిక హింసకి సంబంధించిన వీడియోల కోసం వెతకడం ఎక్కువైందని ఈ సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఆన్‌లైన్‌లో పోర్నోగ్రఫీపై పర్యవేక్షణ

పోర్నోగ్రఫీని ప్రచురించే ‘పోర్న్ హబ్’ సైట్ గురించి ఈ లేఖలో ప్రస్తావించారు.

2019లో ఈ సైట్‌కు 420 కోట్ల వ్యూస్ వచ్చాయి. అంటే రోజుకి 11.5 కోట్ల మంది ఈ సైట్‌ను బ్రౌజ్ చేశారు.

ఎఫ్‌బీఐ గత సంవత్సరం ‘గర్ల్స్ డూ పోర్న్’ అనే ప్రొడక్షన్ సంస్థపై చేసిన పరిశోధనలో భాగంగా పోర్న్ హబ్‌పై కూడా నిఘా పెట్టింది. ఈ సంస్థ తయారు చేసే వీడియోలను పోర్న్ హబ్ తమ సైట్లో ప్రసారం చేస్తుంది.

అమ్మాయిలతో పోర్నోగ్రఫీ వీడియోలు తీయించే ఈ సంస్థలో పనిచేసే నలుగురు వ్యక్తులపై ఎఫ్‌బీఐ అభియోగాలు నమోదు చేసింది.

వెంటనే ఆ సంస్థ తయారు చేసిన వీడియోలను పోర్న్ హబ్ తమ సైట్ నుంచి తొలగించింది.

వీడియోలు తొలగించడానికి కారణాలను సమర్థించుకుంటూ ఆమోదయోగ్యం కాని సమాచారాన్ని తొలగించడం తమ సంస్థ పాటించే విధానమని పోర్న్ హబ్ ఫిబ్రవరిలో బీబీసీతో మాట్లాడినప్పుడు తెలియచేసింది.

గత అక్టోబరులో ఫ్లోరిడాకు చెందిన 30 సంవత్సరాల క్రిస్టొఫర్ జాన్సన్ అనే వ్యక్తి 15 సంవత్సరాల బాలికను లైంగికంగా వేధించిన వీడియోలు పోర్న్ హబ్ సైట్లో కనిపించాయి. ఈ వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి.

2017-19 మధ్యలో పిల్లలపై లైంగిక హింస, రేప్ వీడియోలు పోర్న్ హబ్ సైట్లో 118 సార్లు కనిపించినట్లు ఆన్‌లైన్‌లో పిల్లలపై జరుగుతున్న హింసను పర్యవేక్షించే బ్రిటన్ సంస్థ ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ తెలిపింది. ఈ సంస్థ ఆన్‌లైన్‌లో ఉండే అక్రమ సమాచారాన్ని గుర్తించడంలో గ్లోబల్ పోలీస్, వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆమోదం లేకుండా అక్రమంగా తయారు చేసిన వీడియోలు కానీ, వయస్సు పరిమితి పాటించని వీడియోలను గానీ తొలగించడానికి తమ సంస్థ కట్టుబడి ఉందని, పోర్న్ హబ్ బీబీసీకి రాసిన సమాధానంలో తెలిపింది.

అక్రమంగా చిత్రీకరించిన వీడియోలను గుర్తించి, వాటిని తొలగించడానికి తమ వెబ్ సైట్‌లో వాడే సాంకేతికత అత్యుత్తమమైనదని కంపెనీ పేర్కొంది.

స్వచ్ఛంద సంస్థలు పంపిన లేఖలో పేర్కొన్న అంశాలలో నిజం లేదని, అది ప్రజల లైంగిక అవసరాలపై నిఘా పెట్టినట్లుగా ఉందని పోర్న్ హబ్ ఆరోపించింది.

ఆన్‌లైన్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఎటువంటి లావాదేవీలనైనా తమ సంస్థ ఆమోదించదని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరం నుంచి అమలులో ఉందని తెలిపారు.

ఎక్కువ సంఖ్యలో సంస్థకు వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా పిల్లల పోర్నోగ్రఫీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు 2011లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి స్మార్ట్ మనీ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అయినప్పటికీ, లైంగిక హింసకి వ్యతిరేకంగా పోరాడే సంస్థలు తమ లేఖని అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు కూడా పంపించాయి. టీనేజ్ పిల్లలకి సంబంధించిన పోర్నోగ్రఫీ సైట్లలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని ఈ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

దీనిపై వివరణ ఇస్తూ, ప్రపంచవ్యాప్తంగా పోర్నోగ్రఫీ సైట్లకు చెల్లింపులు ఆపే విధానం అమలులో ఉందని వివరిస్తూ, ఇటీవలే ఒక కంపెనీతో అమెరికాలో మాత్రమే పని చేసే కార్డులతో చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

వీసా, మాస్టర్ కార్డు మాత్రం తమ వినియోగదారులకి ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ సైట్లలో తమ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడే సౌలభ్యం కల్పిస్తోంది.

ప్రచారకర్తలు రాసిన లేఖలో అంశాలపై విచారణ జరుపుతున్నట్లు మాస్టర్ కార్డు ప్రతినిధి బీబీసీకి తెలిపారు.

“బ్యాంక్ నెట్‌వర్క్‌తో వ్యాపారి అనుసంధానం అయినపుడు బ్యాంకు కార్డు ద్వారా చెల్లింపులు చేస్తుంది.”

“బ్యాంకు విధించిన నిబంధనల్ని అతిక్రమించడం గాని, ఏదైనా అక్రమ కార్యకలాపాన్ని గాని మేం కనిపెడితే, వ్యాపారి బ్యాంకుతో మేం సంప్రదింపులు జరిపి విధానాలు పాటించేలా చూడటం కానీ, లేదా పూర్తిగా ఆ బ్యాంకుతో వ్యాపార సంబంధాలు తెంచుకోవడం గాని చేస్తాం” అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

న్యాయసంస్థలతో కానీ, పిల్లల కోసం పని చేసే జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కానీ అక్రమ లావాదేవీలను అరికట్టడానికి గతంలో ఎలా పని చేశామో ఇప్పుడు కూడా అలాగే పని చేస్తామని తెలిపారు.

కొన్ని ఆన్‌లైన్ పేమెంట్ సంస్థలు పోర్నోగ్రఫీ పరిశ్రమ నుంచి తమ సంబంధాలు తెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.

పోర్న్ హబ్‌కు చేసే ఎటువంటి చెల్లింపులనూ ఆమోదించబోమని, అంతర్జాతీయ పేమెంట్ సంస్థ పే-పాల్ తెలిపింది.

ఈ నిర్ణయం ఈ-చెల్లింపులపై ఆధారపడి పని చేస్తున్న వేలాది మంది పోర్న్ హబ్ మోడళ్ళను దిగ్భ్రాంతికి గురి చేసిందని పోర్న్ హబ్ తన వెబ్ సైట్‌లో వ్యాఖ్యానించింది.

పే-పాల్ తీసుకున్న ఈ నిర్ణయం తమ ఆదాయానికి పెద్ద గండి పెడుతోందని పోర్నోగ్రఫీ వీడియోలలో పనిచేసే పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఒక వ్యక్తి అన్నారు.

"ఇది నా ఆదాయాన్ని పూర్తిగా హరించేస్తుంది. ఇప్పుడు నేనెలా సంపాదించాలో అర్థం కావటం లేదు. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో” అని ఆమె అన్నారు.

పోర్న్ హబ్ ప్రసారం చేస్తున్న వీడియోలపై విచారణ జరపాలని నెబ్రాస్కా సెనేటర్ బెన్ శాస్, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కి మార్చిలో ఒక లేఖ రాశారు.

అదే నెలలో కెనడాలో వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా పోర్న్ హబ్ పేరెంట్ సంస్థ మైండ్ గీక్‌పై విచారణ చేపట్టాలని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోకి లేఖ రాశారు. మైండ్ గీక్ ప్రధాన కార్యాలయం కెనడాలోని మాంట్రియల్‌లో ఉంది.

లేఖపై సంతకం చేసిన ప్రచార సంస్థల్లో ఇండియాకి చెందిన అప్నే ఆప్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)