కరోనావైరస్: 1918లో ఐదు కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...

స్పానిష్ ఫ్లూ ప్రబలిన సమయంలో మాస్క్‌ ధరించిన ఓ మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

స్పానిష్ ఫ్లూ ప్రబలిన సమయంలో మాస్క్‌ ధరించిన ఓ మహిళ

1918లో ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మందిని బలితీసుకున్న స్పానిష్ ఫ్లూతో ప్రస్తుతమున్న కరోనావైరస్‌కు పోలికలు ఎంచడం భయపెట్టే విషయమే.

కోవిడ్-19 పూర్తిగా కొత్త వ్యాధి. వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.

స్పానిష్ ఫ్లూ ఎక్కువగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవాళ్లకు వచ్చింది. ఆ వయసు వాళ్లకు రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది.

కానీ, ఇన్ఫెక్షన్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వాలు, వ్యక్తులు తీసుకున్న చర్యల విషయంలో స్పానిష్ ఫ్లూ, కరోనావైరస్‌ల మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి.

కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టే ప్రణాళికల రూపకల్పన కోసం పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ స్పానిష్ ఫ్లూ వ్యాప్తిపై అధ్యయనం చేసింది. స్పానిష్ ఫ్లూ మొదట విడత కన్నా, రెండో విడత వ్యాపించినప్పుడు ఎక్కువ మందిని బలితీసుకుందని గుర్తించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తాజా గాలి పీల్చుకుంటే ఇన్‌ఫ్లూయెంజా రాదని భావించి, రోజూ ఉదయం, సాయంత్రం బ్రిటన్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ విభాగం ఉద్యోగులు 15 నిమిషాల పాటు బయటకు వచ్చేవారు.

స్పానిష్ ఫ్లూ కారణంగా తొలి మరణం నమోదయ్యేటప్పటికి బ్రిటన్ ఇంకా యుద్ధంలో ఉంది. మిగతా దేశాల్లాగే బ్రిటిష్ ప్రభుత్వం కూడా దాని హడావుడిలో అది ఉంది. ఫ్లూ మరణాల నివారణ కన్నా అప్పుడు యుద్ధ చర్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడుతోంది.

సేనల తరలింపు సమయంలో, ఆయుధ సంబంధిత ఫ్యాక్టరీల్లో, బస్సుల్లో, రైళ్లలో ఫ్లూ కార్చిచ్చులా వ్యాపించినట్లు 1919లో రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్‌కు సర్ ఆర్థర్ న్యూస్‌హోమ్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

అనారోగ్యం అనిపిస్తే ఇళ్లలోనే ఉండాలని, ఎక్కువ మంది ఉండే ప్రదేశాలకు, కార్యక్రమాలకు వెళ్లవద్దని ఆయన 1918లో జులైలో రాసిన ‘మెమొరాండం ఫర్ పబ్లిక్ యూజ్’ను ప్రభుత్వం బయటకు రాకుండా చేసింది.

ఆ నిబంధనలను పాటించి ఉంటే, ఎన్నో ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లమని సర్ ఆర్థర్ అభిప్రాయపడ్డారు. ‘‘కానీ ఆరోగ్యానికి, జీవితాలకు ముప్పు ఉన్నా, ప్రధాన బాధ్యతను నిర్వర్తించాల్సిన జాతీయ పరిస్థితులు అప్పుడు ఉన్నాయి’’ అని కూడా ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇన్‌ఫ్లూయెంజా రాకుండా ఉండేందుకు సర్జికల్ మాస్క్ లాంటిది ధరించిన ఓ మహిళ

1918లో ఇన్‌ఫ్లూయెంజాకు చికిత్సలేవీ లేవు. నిమోనియా లాంటి వాటిని నయం చేసేందుకు యాంటీ బయోటిక్స్ కూడా లేవు. ఆసుపత్రులు చాలా తొందరగానే నిండిపోయాయి.

ఇన్ఫెక్షన్‌లను కట్టడి చేసేందుకు కేంద్ర స్థాయిలో లాక్‌డౌన్ ఏదీ విధించలేదు. అయితే, థియేటర్లు, డ్యాన్సు హాళ్లు, చర్చిలు మూతపడ్డాయి. కొన్నైతే నెలలపాటు తెరుచుకోలేదు.

యుద్ధపరమైన ఆంక్షలతో నడుస్తున్న పబ్‌లు అలాగే కొనసాగాయి. యుద్ధం వల్ల ఫుట్‌బాల్ లీగ్, ఎఫ్ఏ కప్ వాయిదాపడ్డాయి. మిగతా మ్యాచ్‌లను ఆపలేదు. జనాలను తగ్గించే చర్యలు కూడా తీసుకోలేదు. ఫ్లూ ఉన్న సమయమంతా మహిళల ఫుట్‌బాల్ కొనసాగింది. చాలా మంది జనం వచ్చి, చూశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇన్ఫెక్షన్ సోకకుండా పట్టీని చుట్టుకున్న టెలిఫోన్ ఆపరేటర్

ప్రజలకు అందిన సూచనల్లో గందరగోళం ఉంది. ప్రస్తుతం లాగే అప్పుడు కూడా బోలెడు తప్పుడు వార్తలు, కుట్ర సిద్ధాంతాలు ప్రచారమయ్యాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యతను జనం పెద్దగా పట్టించుకోలేదు.

సిగరెట్లు ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయన్న అపోహతో కొన్ని ఫ్యాక్టరీల్లో స్మోకింగ్‌పై ఆంక్షలను తొలగించారు.

‘‘కొకోవాను రోజూ మూడు సార్లు తీసుకుంటే ఇన్‌ఫ్లూయెంజా రాదన్న మాట నిజమేనా?’’ అని బ్రిటన్ పార్లమెంటులో ఎంపీ క్లాడ్ లోథర్ ప్రశ్నించారు కూడా.

తుమ్ములు, దగ్గుల ద్వారా వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకుంటుందని ప్రభుత్వం ప్రచారం చేసింది.

‘‘సబ్బు, నీళ్లతో ముక్కు లోపల రోజూ ఉదయం, సాయంత్రం శుభ్రం చేసుకోండి. ఉదయం, రాత్రి మీకు మీరే గట్టిగా తుమ్మి, ఆ తర్వాత బాగా ఊపిరి తీసుకోండి. మఫ్లర్ ధరించవద్దు. క్రమం తప్పకుండా నడవండి. ఆఫీసు నుంచి ఇంటికి నడిచే వెళ్లండి’’ అని 1918 నవంబర్‌లో న్యూస్ ఆఫ్ ద వరల్డ్ అనే పత్రిక తమ పాఠకులకు సూచన చేసింది.

ఫొటో సోర్స్, MIRRORPIX

ఫొటో క్యాప్షన్,

ప్రజలకు అందుతున్న సూచనల్లో గందరగోళం గురించి డైలీ మిర్రర్ పత్రికలో వచ్చిన కార్టూన్

స్పానిష్ ఫ్లూ ప్రభావానికి గురికాని దేశమంటూ లేదు. కానీ, ప్రభావ తీవ్రత, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో వ్యత్యాసాలు ఉన్నాయి.

అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో పౌరులకు క్వారంటీన్ విధించారు. దాని వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొన్ని చోట్ల మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు, థియేటర్లు, వినోద ప్రదేశాలు మూతపడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇన్ఫెక్షన్ సోకకుండా హెయిర్ సెలూన్లలోనూ జాగ్రత్తలు పాటించారు

మిగతా నగరాలతో పోల్చితే న్యూయార్క్ పరిస్థితి మెరుగ్గా ఉంది. అప్పటికే 20 ఏళ్ల పాటు క్షయ (ట్యూబర్క్యులోసిస్)‌కు వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టిన అనుభవం ఆ నగరానికి ఉండటం వల్ల అక్కడ మరణాల రేటు తక్కువగా నమోదైంది.

అయితే, థియేటర్లు, వినోద ప్రదేశాలు, వ్యాపారాలు నడుపుకోనివ్వాలని వాటి యజమానులు నగర ఆరోగ్య కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

న్యూయార్క్‌లో మాస్క్ ధరించిన పారిశుద్ధ్య కార్మికుడు

ఇప్పటిలాగే అప్పుడూ తాజా గాలి ఇన్ఫెక్షన్లను అరికడుతుందని నమ్మారు. అందుకోసం వాళ్లు కొన్ని కొత్త రకం పద్ధతులు అనుసరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఫ్లూ భయంతో కోర్టు విచారణను బహిరంగంగా ఏర్పాటు చేశారు

అమెరికా నగరాల్లో ముఖ్యంగా ఆరాధన ప్రదేశాల్లో జనాన్ని పోగవ్వకుండా చూడటం అసాధ్యమని అప్పుడు తెలిసివచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

స్పానిష్ ఫ్లూ ప్రబలిన సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని కేథడ్రెల్ ఆఫ్ సెయింట్ మేరీ ఆఫ్ ది అసంప్షన్ మెట్ల వద్ద ప్రార్థనలు చేస్తున్న జనం

ఆ మహమ్మారి వ్యాప్తి ముగింపు దశకు వచ్చేసరికి బ్రిటన్‌లో 2.28 లక్షల మంది బలయ్యారు. దేశ జనాభాలో దాదాపు పావు వంతు మందిని ఆ ఇన్ఫెక్షన్ పీడించినట్లు అంచనాలు ఉన్నాయి.

వైరస్‌ను అంతమొందించేందుకు చర్యలు కొంత కాలం కొనసాగాయి. సీజన్‌లో వచ్చే ఇన్‌ఫ్లూయెంజా ఎంత ప్రాణాంతకంగా మారగలదనే విషయంపై ప్రజల్లో అంతకుముందు కన్నా అవగాహన చాలా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

లండన్‌లో బస్సులో డిస్ఇన్ఫెక్ట్ చల్లుతున్న వ్యక్తి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)