కరోనావైరస్: ఇంటికి డబ్బు పంపించడానికి అవస్థలు పడుతున్న ప్రవాసులు
- ఫ్రే లిండ్సే
- బిజినెస్ రిపోర్టర్, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఫొటో సోర్స్, Smitha Girish
ఇషాన్ గిరీశ్, గిరీశ్ సదానందన్, స్మితా గిరీశ్
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు.. విదేశాల్లో పనిచేసే తమ వారు పంపించే డబ్బులే జీవనాధారం.
కానీ.. కరోనావైరస్ కారణంగా విదేశాలకు వలస వెళ్లిన వారిలో అత్యధికులు అక్కడ ఉద్యోగాలు, ఉపాధి కొనసాగించే పరిస్థితులు మృగ్యమయ్యాయి. దీంతో వేతనాలు లేక తమ ఇళ్లకు డబ్బులు పంపించలేకపోతున్నారు. వారి కుటుంబాలు ఎన్నో వెతలు పడుతున్నాయి.
స్మితా గిరీష్ తన చిన్నారి కుమారుడితో కలిసి కేరళలో నివసిస్తున్నారు.
ఆమె భర్త యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఉన్నారు. ఇటీవలి వరకూ ఆయన సేల్స్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. కానీ కోవిడ్-19 కారణంగా నిరుద్యోగిగా మారారు. తన బసకే పరిమితయ్యారు.
‘‘నెల రోజులుగా ఆయన ఫ్లాట్‌లో కూర్చుని ఉన్నారు. కొత్త ఉద్యోగంలో చేరలేకపోయారు. బ్యాంకు నుంచి డబ్బులు తేలేకపోయారు. పరిస్థితి చాలా కష్టంగా మారింది. మా ఫ్లాట్ ఈఎంఐ డబ్బులు చాలా కట్టాల్సి ఉంది’’ అని చెప్పారు స్మిత.
స్మితకు ప్రతి నెలా ఆమె భర్త నుంచి వచ్చే డబ్బులే ప్రధాన ఆదాయ మార్గం.
ఆమె వృత్తి రీత్యా క్రిమినల్ లాయర్ అయినా.. ఆటిజం ఉన్న తన కొడుకు బాధ్యతలు చూసుకోవటానికి ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అతి తక్కువ డబ్బులతో సాగాల్సి వస్తోంది. కేరళలో చాలా మంది పరిస్థితి ఇది.
‘‘మేమంతా నిస్పృహలో కూరుకుపోయాం’’ అన్నారామె.
ఫొటో సోర్స్, Michael Clemens
కరోనావైరస్ ప్రభావం దశాబ్దాలు కొనసాగుతుందంటున్న మైకేల్ క్లెమెన్స్
ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో 80 కోట్ల మంది ప్రజలు తమ బంధువులు పంపించే డబ్బుపై ఆధారపడి జీవిస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చే డబ్బుల మొత్తం గత కొన్ని దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. 2019లో 55,400 కోట్ల డాలర్లకు చేరింది. ఇది ప్రపంచ విదేశీ సాయం బడ్జెట్ కన్నా మూడు రెట్లు అధికం.
ఈ ఆదాయం విదేశీ సాయం లాగా కాకుండా నేరుగా పేద ప్రజల జేబుల్లోకి చేరతుందని వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రతినిధి మైకేల్ క్లెమెన్స్ అన్నారు.
విదేశాల నుంచి వచ్చే ఈ నిధులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలకు ‘జీవనాధారం’ అని, పేదరికాన్ని తగ్గించటానికి చాలా కీలకమని ఆయన చెప్పారు.
కేవలం కుటుంబాలు గడవటానికే కాదు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా ఈ నిధులు వెచ్చిస్తారు.
ఈ ఏడాది చాలా కుటుంబాలు ఇటువంటి పెట్టుబడులు పెట్టలేవు. ప్రపంచవ్యాప్తంగా ఇలా పంపించే ప్రవాసుల ఆదాయాలు 2020 సంవత్సరంలో 20 శాతం తగ్గి 44,600 కోట్ల డాలర్లకు పడిపోతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది.
ఇంతగా పతనమవటం చరిత్రలో ఎన్నడూ లేదని ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త దిలీప్ రాథా పేర్కొన్నారు. గతంలో 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఈ నగదు బదిలీలు 5 శాతం పడిపోయాయని, ఆ తర్వాత 2016లో కొంత తగ్గిందని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Arthur Beare
లైబీరియాలో డబ్బు డ్రా చేసుకోవడం కష్టంగా మారిందంటున్న ఆర్థర్ బీర్
రెమిటెన్సుల మీద కరోనావైరస్ ప్రభావం అనేక రకాలుగా ఉంది. సుమిత విషయంలో ఆమె భర్త పని చేయలేక, డబ్బులు పంపించలేకపోతున్నారు. మరికొన్ని ఉదంతాల్లో.. ప్రవాసులు డబ్బులు పంపించినా కూడా వారి కుటుంబాలకు నిధులు అందటం లేదు. ఎందుకంటే లాక్డౌన్ల కారణంగా నగదు బదిలీ వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. జనం బయటకు అడుగుపెట్టే వీలూ లేదు.
ఆర్థర్ బీర్ పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాలో మోన్రోవియాలో నివసిస్తున్నారు. మార్చి 27వ తేదీ నుంచి తాము బ్యాంకుల నుంచి కానీ, నగదు బదిలీ వ్యాపారాల నుంచి కానీ డబ్బులు తీసుకోవటం అసాధ్యంగా మారిందని ఆయన చెప్పారు.
దేశం ప్రస్తుతం అత్యవసర పరిస్థితిలో ఉందని, ఇప్పుడు ఈ రెమిటెన్సులు ఇంకా చాలా ముఖ్యమని.. కేవలం జీవించటానికే కాకుండా, జనం క్వారంటీన్లో ఉండటానికి కూడా డబ్బులు అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Chandra Ceeka
నగదు బదిలీ చాలా కష్టంగా మారిందంటున్న చంద్ర సీకా
హైదరాబాద్‌కు చెందిన ఐటీ కన్సల్టెంట్ చంద్ర సీకా గత 18 ఏళ్లుగా బ్రిటన్‌లో పనిచేస్తున్నారు. ఇండియాలోని తన కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు పంపించే ఆయన ఇప్పుడు.. అలా పంపటానికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
డిజిటల్ రెమిటెన్స్ సర్వీసులు అందుబాటులో ఉన్నా కూడా.. స్థానిక బదిలీ దుకాణాలు లేనందువల్ల తనకు ఇంతకుముందు లభించే రాయితీలు దక్కటం లేదని ఆయన చెప్పారు. ఆన్లైన్ బదిలీల్లో రాయితీల కోసం బేరమాడే అవకాశం లేదన్నారు.
అయితే, మొబైల్ చెల్లింపుల వల్ల నగదు బదిలీ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని డిజిటల్ చెల్లింపుల యాప్ ‘అజిమో’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైకేల్ కెంట్ చెప్తున్నారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
‘‘హైస్ట్రీట్లోని సంప్రదాయ నగదు బదిలీ కంపెనీల ద్వారా పంపించటానికి అయ్యే ఖర్చు కన్నా 70-80 శాతం తక్కువ ఖర్చుకే ఆ పని చేయటం మా లక్ష్యం. మాకు స్టోరు ఖర్చులు, ఏజెంట్ ఖర్చులు, ఇంకా చాలా రకలా కార్పొరేట్ ఖర్చులు ఉండవు’’ అని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కరోనావైరస్ ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని క్లెమెన్స్ చెప్పారు.
జర్నల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ చేపట్టిన ఒక చరిత్రాత్మక అధ్యయనంలో.. అమెరికాలో 1918 నాటి ఇన్ఫ్లుయెంజా మహమ్మారి ప్రతికూల ఆర్థిక ప్రభావాలు 1980 జనాభా లెక్కల్లో కూడా గుర్తించిన విషయాన్ని ఆయన ఉటంకించారు.
ఆ మహమ్మారి సమయంలో ఇంకా పుట్టని చిన్నారుల విద్యా స్థాయి తగ్గిపోయింది. శారీరక వైకల్యాల రేటు పెరిగింది. ఆదాయాలు తక్కువగా ఉండటం, ఆర్థిక హోదా తక్కువగా ఉండటంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడే పరిస్థితి ఎక్కువగా ఉంది.
ఇప్పుడు కూడా.. విదేశీ రెమిటెన్సులు తగ్గిపోయిన కుటుంబాల్లో చిన్నారులు, ఇంకా పుట్టని పిల్లలు.. పోషకాహార లోపంతో బాధపడటం, బడి మానేయటమే కాదు.. చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని క్లెమెన్స్ పేర్కొన్నారు.
స్మిత భర్త గిరీష్ సదానందన్ గత 15 ఏళ్లుగా ఎక్కువగా ప్రవాసంలోనే ఉంటూ పనిచేస్తున్నారు. కానీ ఆ త్యాగం ఇప్పుడిక అనవసరమని ఆమె భావిస్తున్నారు. వచ్చే ఏడాది తాను పని చేయటం ప్రారంభిస్తే తన భర్త ఇంటికి తిరిగి రావటానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.
‘‘కేవలం డబ్బుల కోసమే ఆయన అక్కడ, నేను ఇక్కడ ఉంటున్నాం. డబ్బులే అన్నిటికీ ఆధారం. అవి లేకపోతే ఏమీ చేయలేం. కానీ, ఈ కరోనావైరస్ వల్ల మా ఆశలన్నీ ఆవిరయ్యాయి’’ అంటారామె.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులని పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలని వేధిస్తున్న ప్రశ్న
- విశ్వ రహస్యం గుట్టు విప్పే ప్రయత్నంలో మరో 'ముందడుగు'
- కిమ్ జోంగ్ ఉన్‌కు గుండె ఆపరేషన్ జరిగిందా? లేదా?.. దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందంటే..
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా
- కరోనావైరస్తో మనుషులు చనిపోతుంటే... మరో వైపు మాఫియా డాన్లు ఏం చేస్తున్నారు?
- కరోనావైరస్: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై ఫిర్యాదు చేస్తారా
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)