ఇకిగాయ్: జీవితంలో సంతృప్తి పొందడం, పనిలో ఆనందం వెతుక్కోవడం ఎలా?

జీవితానికి పరమార్థం ఏంటి? పనిలో ఆనందం వెతుక్కోవడం ఎలా?

ఫొటో సోర్స్, JGalione/Getty Images

ఇకిగాయ్.. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే ఉద‌యం మిమ్మ‌ల్ని నిద్ర లేచేలా ప్రేరేపించేదని అర్థం. అది ప‌ని కావొచ్చు. కుటుంబం అవ్వొచ్చు. లేదా అమితంగా ప్రేమించే అల‌వాటు అయ్యుండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇది ఫ్రెంచ్ ప‌దం రైస‌న్ డెట్ లాంటిది. అంటే జీవిత ప‌రమా‌ర్థం. మనం దేని కోసం బ‌తుకుతున్నామో చెప్పేది.

పొద్దుపోయాక ప‌రుగులు తీస్తున్న‌ రైలులో నిస్సారంగా నిద్రలోకి జారుకున్న అత‌ణ్ని మోగుతున్న ఫోన్ రింగ్‌టోన్‌ కూడా చేరుకోలేక‌పోతోంది. తోటి ప్ర‌యాణికుల వ్య‌థ‌లూ ఆయ‌న్ను తాక‌డంలేదు. నా ఎదురుగా ఆయ‌న లోకంలో ఆయ‌న ఉన్నాడు. రాత్రంతా పీక‌ల దాకా తాగి వ‌చ్చిన తాగుబోతులానూ ఆయ‌న క‌నిపించ‌ట్లేదు. ఆయ‌న స్మార్ట్ సూట్ చింద‌ర‌వంద‌ర‌గా ఉంది. పాలిష్ చేసిన‌ షూస్ త‌న‌తో సంబంధం లేనట్టు నేల‌పై నిట్టూరుస్తున్నాయి. చూడ్డానికి ఆయ‌న రెండు చేతులా సంపాదిస్తున్న మంచి ఉద్యోగిలా క‌నిపిస్తున్నాడు.

టోక్యోలో సాయంత్రం దాటాక‌ ఎటుచూసినా క‌ళ్ల‌కు తార‌స‌ప‌డే దృశ్యాలివి. రైల్వే స్టేష‌న్ల‌లో, రోడ్డు ప‌క్క‌న కూర్చునే బెంచీల‌పై నిస్స‌త్తువ ఆవ‌రించిన కార్పొరేట్ వ‌ర్క‌ర్లు క‌నిపిస్తుంటారు. ప‌రిస‌రాల‌తో ప‌నిలేని వీరి క‌థ‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. ఎక్కువ గంట‌లు ప‌నిచేసిన అనంత‌రం తోటి ఉద్యోగుల‌తో క‌లిసి తాగ‌డానికి వెళ్లేందుకు ఇక్క‌డ ఇష్ట‌ప‌డుతుంటారు. దీంతో చాలా మంది ట్రైన్లు మిస్ అవుతుంటారు. ఫ‌లితంగా రాత్రిపూట రోడ్లే శ‌ర‌ణ్య‌మ‌వుతాయి. విన‌డానికి కొంచెం స‌ర‌దాగా అనిపిస్తున్నా.. రోడ్ల‌పై ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపించే వీరు ప‌నిలో మునిగితేలే జ‌పాన్ సంసృతికి ప్ర‌తిబింబాలు.

ఫొటో సోర్స్, AzmanL/Getty Images

ప‌ర్య‌ట‌కుల‌కు కూడా వీరిని చూసిచూసి ష‌రా మామూలే అనిపిస్తుంది. అయితే ఎనిమిది ప‌దుల వ‌య‌సు దాటిన ట్యాక్సీ డ్రైవ‌ర్లు, 24 గంట‌లూ తెర‌చివుంచే స్టోర్ వ‌ర్క‌ర్లనూ క‌లిపి చూసిన‌ప్పుడు.. జపాన్ కార్మికుల క‌ష్టాలు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తాయి. జ‌పాన్ ఉద్యోగ‌ జీవితాల్లో ఈ అస‌మ‌తౌల్యానికి "ఇకిగాయ్" కార‌ణం. అంతేకాదు దీన్ని స‌రిచేసే సత్తా కూడా ఇకిగాయ్‌కే ఉంది.

"ఇకి" అంటే జీవితం, "గాయ్" అంటే అమూల్య‌మైన‌దిగా మార్చుకోవ‌డం.. అంటే జీవితాన్ని అమూల్య‌మైన‌దిగా మార్చుకోవ‌డం. ఉద్యోగం, అల‌వాట్లు, జీవిత భాగ‌స్వామి, కుటుంబం లేదా ఇంకేదైనా కావొచ్చు.. ఏదైనా మ‌న జీవితాన్ని ప్రేరేపించేలా చేసుకోవ‌డానికి ఇకిగాయ్ తోడ్ప‌డుతుంది.

ఇకిగాయ్ అంటే ఏమిట‌ని ప్ర‌శ్నిస్తే.. "అది మ‌న జీవిత ప‌ర‌మార్థం" అంటారు మాజీ కార్పొరేట్ ఉద్యోగి స‌మ‌ట‌క షింటోకు. ప‌ని చేసేట‌ప్పుడు మీరు సంతోషంగా, సంతృప్తితో ఉంటే అది ఇకిగాయ్‌. మీరు అమితంగా ప్రేమించే కుటుంబం మీతో ఉంటే.. వారి కోసం మీరు ఏదైనా చేస్తుంటే.. అది కూడా ఇకిగాయ్‌"అని ఆయ‌న బ‌దులిచ్చారు.

స్ఫూర్తిదాయ‌క‌ ప‌దాల జాబితాలో చేరిన‌ప్పుడు "ఇకిగాయ్"‌పై ప్ర‌పంచ దేశాల దృష్టి ప‌డింది. జ‌పాన్ మాత్రం ఈ విధానానికి ఒక‌ రూపమిచ్చి ఆచ‌ర‌ణ ‌సాధ్యంగా మ‌లిచేందుకు శ్ర‌మిస్తోంది. జీవితాన్ని న‌డిపించే అమూల్య‌మైన ప్రేర‌ణ‌తో 14 గంట‌లు కంప్యూట‌ర్ తెర‌కు అతుక్కుపోయే ప‌ని జీవితానికి లంకె కుద‌ర్చ‌డం కొంచెం క‌ష్ట‌మే. అయితే 20వ శతాబ్దంనాటి జ‌పాన్ అభివృద్ధి కోణంలో చూస్తే ఇక్క‌డ అర్థంకాని విష‌యం ఇంకేదో ఉంద‌ని అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Tunart/Getty Images

14వ శ‌తాబ్దంనాటి ఈ ప‌దం 1912లో న‌ట్సుమే సొసెకీ న‌వ‌ల "కొరొకో"తో వెలుగులోకి వ‌చ్చింది. కొరొ‌కో అంటే అన్నింటికీ మూలం. ఓ వృద్ధుడి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌ను తాను అన్వేషించుకునే ఓ విద్యార్థి క‌థ ఇది. మైజీ పాల‌నా కాలం చివ‌రి ఏట‌ ఇది ప్ర‌చురిత‌మైంది. జ‌పాన్ ఒంట‌రిత‌నాన్ని వీడి అంత‌ర్జాతీయ‌వాదం, పారిశ్రామికీక‌ర‌ణ‌ బాట‌లో న‌డుస్తున్న స‌మ‌యం అది. జాతీయ ప్ర‌యోజ‌నాల‌ను అనుగుణంగా న‌వ‌ జీవ‌న విధానాన్ని కొరొకోలో న‌ట్సుమే క‌ళ్ల‌కు క‌ట్టారు.

శ‌తాబ్దం సగం పూర్త‌య్యేనాటికి రెండో ప్ర‌పంచ యుద్ధంలో జ‌పాన్ చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయింది. అయితే కొద్దికాలంలోనే మ‌ళ్లీ అద్భుత ఆర్థిక ప్ర‌గ‌తి వైపు ప‌రుగులు తీసింది. జీవిత కాలం పెర‌గ‌డం, ఆర్థిక సాయం చేసే స్థాయికి ఎదగ‌డం, కొత్త‌గా ఊపిరి పోసుకున్న స్వేచ్ఛ.. మ‌ళ్లీ ఇకిగాయ్‌పై చ‌ర్చ‌కు దారితీశాయి.

ప్ర‌జ‌ల్లో దీనికున్న అర్థం, భావంపై ఇప్ప‌టివ‌ర‌కూ చాలా అధ్య‌య‌నాలు జ‌రిగాయి. చాలా వార్త‌లూ ప్ర‌చురితం అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ ప‌దానికి విసృత అర్థం వ‌చ్చేలా కొత్త భాష్యాలూ చెబుతున్నారు. కొన్ని ప‌రిమితులు విధిస్తూ లేదా ప్రోత్సాహ‌కాల‌ను ఇస్తూ సామాజిక అవ‌స‌రాల‌కు స‌రిప‌డే ఇకిగాయ్ దారిలో వ్య‌క్తుల్ని ప్రోత్స‌హించొచ్చ‌ని హాంకాంగ్‌లోని చైనీస్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ గార్డ‌న్ మాథ్యూ అన్నారు.

ఫొటో సోర్స్, Charly Triballeau/Getty Images

ఫొటో క్యాప్షన్,

జ‌పాన్‌లో చాలా షాప్‌లు 24 గంట‌లూ తెరిచే ఉంటాయి

"ఆర్థిక పురోగ‌తే ల‌క్ష్యంగా క‌దిలే కాలంలో ప‌ని ఉత్పాద‌క‌త చాలా కీల‌కంగా ఉండేది. అప్పుడు ఇకిగాయ్ ఒత్తిడి ఎక్కువ ఉండేది" అని మాథ్యూ అన్నారు. "ఓ సంస్థ కోసం మీరు ప‌నిచేస్తే.. ఆ సంస్థ‌నే ఇకిగాయ్‌గా చేసుకోమ‌ని చాలా గ‌ట్టిగా చెప్పేవారు. అలా చేయ‌క‌పోతే.. మీలో ఏదో లోపం ఉన్న‌ట్లు చూసేవారు"

ఈ విధానాన్ని సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకోవ‌డం చాలా తేలిక‌. ఎందుకంటే దీనికి చాలా ర‌కాలుగా భాష్యం చెప్పొచ్చు. ఇది "ఇట్టైకాన్‌"గా కూడా జ‌పాన్‌వాసుల‌కు సుప‌రిచిత‌మే. అంటే త‌మ గ్రూప్‌కు సంపూర్ణ‌ నిబ‌ద్ధ‌త‌తో ఉండ‌టం. జ‌పాన్‌లో ఆర్థిక పురోగ‌తి, వ్య‌క్తిగ‌త జీవితంలో ఇకిగాయ్ పున‌రుజ్జీవం పోసుకోవ‌డం ఒకేసారి జ‌రిగాయి. ఈ రెండూ పెన‌వేసుకుపోయి మ‌గవారికి ఆఫీసుల్లో, ఆడ‌వారికి ఇంట్లో.. ప‌ని, జీవిత స‌మ‌తౌల్యాన్ని సుస్థిరం చేశాయి.

కంపెనీకి నిబ‌ద్ధుడిగా ఉండ‌టంతోపాటు ఫ‌లితాలు, పురోగ‌తి కంటే.. స‌మ‌యం, క‌ష్టాల‌కు విలువ‌నిచ్చే ప‌ని విధానానికి మ‌గ‌వారి ఉద్యోగ‌ ప్రాధాన్యాలు క‌లిశాయి. ఎక్కువ‌సేపు ప‌ని చేయడాన్ని, ఖాళీ స‌మ‌యాన్ని త్యాగం చేయ‌డాన్ని మంచి గుణాలుగా చూసేవారు. అలాగే శ్ర‌మించేత‌త్వానికి అన్నింటికంటే ఎక్కువ విలువిచ్చేవారు. ఈ విలువ‌ల‌తోపాటు "అంకితభావం".. ప‌నిచేసే ప్ర‌తిఒక్క‌రికీ ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచింది.

ఈ అంకిత‌భావం పెద్ద ఉద్యోగాలు చేసేవారికి మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. వంట‌చేసే వారి నుంచి క‌ళాకారుల వ‌ర‌కూ.. వారు ఎంచుకున్న రంగాల్లో ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించే త‌త్వాన్ని ఎప్పుడూ గౌర‌విస్తుంటారు. కెరియ‌ర్‌నైనా, అభిరుచినైనా.. దేన్నైనా ఎంచుకునేట‌ప్పుడు దానిపైనే సంపూర్ణ దృష్టి కేంద్రీక‌రించ‌డాన్ని ఆది నుంచే ప్రోత్స‌హిస్తారు. ఇది జ‌పాన్‌లోని రెస్టారెంట్లు మొద‌లుకొని ప్ర‌త్యేక నైపుణ్యం క‌లిగిన దుకాణాల వ‌ర‌కూ అన్నింటా క‌నిపిస్తుంది. నూడుల్స్ అమ్మే చిన్న షాప్ అయినా, తాజా చిప్స్ అందించే షాప్ అయినా.. అంద‌రూ తాము చేసే వంట‌ల‌పై పూర్తి శ్ర‌ద్ధ పెట్టి చేస్తారు.

ఫొటో సోర్స్, RichVintage/Getty Images

ఫొటో క్యాప్షన్,

ఎంచుకున్న వృత్తిలో క‌ఠోరంగా శ్ర‌మించ‌డాన్ని జ‌పాన్‌లో ఎప్పుడూ గౌర‌విస్తుంటారు

ఇలానే క‌ళాకారుల నైపుణ్యాలు త‌ర‌త‌రాలు దాటుతూ వ‌స్తున్నాయి. కొన్నిసార్లు వారి ఇంటిపేరే ఉత్ప‌త్తులకు మారుపేరు అవుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు టోక్యోలోని ఉబుకేయ క‌త్తెర‌లను 200 ఏళ్ల‌నాటి నైపుణ్యంతో త‌యారుచేస్తుంటారు. అలాగే క్యోటోలోని అరిత్సుగు క‌త్తులు చేసేవారి చ‌రిత్ర 16వ శ‌తాబ్దంనాటిది. అయితే నిబద్ధ‌త చాటుకోవ‌డం జపాన్‌కు మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన‌దేమీకాదు. త‌మ జీవితాన్ని ఒకే క‌ళ‌కు అంకింతంచేసినవారు అద్భుతమైన కళాకారులుగా మార‌డాన్ని మ‌నం ఎక్క‌డైనా చూడొచ్చు.

ప‌ని గంట‌లు, లీవ్ లాంటి విష‌యాల్లో సంప్ర‌దాయ‌ ప‌ని వాతావ‌ర‌ణం క‌ఠినంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆర్థిక సంక్షోభం వారికి కొత్త అవ‌కాశాల‌ను తెరిచింది. అయితే ప‌నిని ఇకిగాయ్‌తో అనుసంధానం చేసుకునేవారు.. స్టార్ట‌ప్‌ల‌లో సంప్ర‌దాయేత‌ర ఉద్యోగాలు, ఫ్రీలాన్సింగ్‌ లాంటి వాటిని ఎంచుకుంటున్నారు. దీంతో టోక్యోలో కో-వ‌ర్కింగ్ సంస్కృతి కూడా పెరుగుతోంది.

"నేడు జ‌పాన్‌లో మ‌రొక‌ ప్ర‌పంచం ఉంది. అక్క‌డ ప్ర‌జ‌ల‌కు అనేక విధాలుగా త‌మ సొంత ఇకిగాయ్‌ను అన్వేషించుకొనేందుకు స్వేచ్ఛ ఉంటుంది" అని మాథ్యూస్ వివ‌రించారు.

"జ‌పాన్ ఆర్థికాభివృద్ధి మంద‌గిస్తున్న‌ప్పుడు.. బ‌హుశా స‌మాజం మ‌రింత సంతోషంగా, మ‌రింత ఇకిగాయ్ బాట‌లో న‌డుస్తూ ఉండొచ్చు. ఎందుకంటే జీవించ‌డానికి కొత్త విధానాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి"

జ‌పాన్‌లో స‌మ‌తౌల్యం స‌ముచిత స్థాయిలో లేన‌ప్ప‌టికీ.. అవ‌కాశాల విష‌యానికి వ‌చ్చేసరికి ప‌రిస్థితి మెరుగుప‌డుతోంది.

వ్య‌క్తుల‌కు విలువ ఇవ్వ‌డంపై జ‌పాన్‌లో అవ‌గాహ‌న పెరుగుతోంది. ఒక‌ప్ప‌టిలా ఒక ఉద్యోగం నుంచి మ‌రొక ఉద్యోగానికి మార‌డాన్ని ఇప్పుడు త‌ప్పుగా చూడ‌ట్లేదు.

త‌మ నైపుణ్యాలకు ప‌దునుపెడుతూ కొత్త ఉద్యోగాల్లో త‌మ ఇకిగాయ్‌ను ఎంచుకొనే స్వేచ్ఛ కార్మికుల‌కు ఉంటోంది. ఇది కార్పొరేట్ ఉద్యోగుల‌నే కాదు.. అన్ని రంగాల‌నూ ప్ర‌భావితం చేసింది.

ఫొటో సోర్స్, Torsakarin/Getty Images

"నేను వారానికి ఆరు నుంచి ఏడు రోజులు పనిచేసేవాణ్ని. ఎక్కువ గంట‌లు ప‌నికే కేటాయించాల్సి వ‌చ్చేది. పూర్తికాల టీచ‌ర్‌గా నేను ఎప్పుడూ అక్క‌డ అందుబాటులో ఉండాల్సి వ‌చ్చేది. ఇది జ‌పాన్ సంప్ర‌దాయ ప‌ని విధానం. కానీ చాలా ఒత్తిడి ఉండేది" అని జ‌పాన్‌లో తొలి వంట‌ల స్కూల్ ప్రారంభించిన మాజీ ఇంగ్లిష్ టీచ‌ర్ ఆయుకో కొకాడో చెప్పారు.

ఆమెకు బోధ‌న అంటే చాలా ఇష్టం ఉన్న‌ప్ప‌టికీ.. ఆహారం, ప‌ర్య‌టకం లాంటి ఇత‌ర రంగాల‌పైనున్న ఆస‌క్తిని క‌ల‌గలిపి ఓ కొత్త జీవ‌న విధానాన్ని ఆమె ఎంచుకున్నారు. ఇప్పుడు ఆమె ఓ సూషి వంట‌ల‌ నిపుణురాలిగా మార‌డంతోపాటు.. బుద్ధ బెల్లీస్ కుకింగ్ స్కూల్‌లో ప్ర‌పంచ దేశాల నుంచి వ‌చ్చే విద్యార్థుల‌కు పాఠాలు చెబుతున్నారు. అప్పుడ‌ప్పుడు విదేశాల‌కూ వెళ్తుంటారు.

ప‌ని, ఇకిగాయ్‌ల‌ను స‌మ‌తౌల్యం చేసుకునేందుకు కెరియ‌ర్‌ను భిన్న కోణాల్లో అన్వేషించ‌డం చాలా ముఖ్య‌మ‌ని ఆమె అంటారు. "ఇకిగాయ్ ఇలా ఉండాల‌ని గిరిగీసుకోకూడ‌దు. అలా నిబంధ‌న‌లు విధించుకుంటే.. మీపై మీరు చాలా ఒత్తిడి పెట్టుకుంటారు. ఫ‌లితంగా ఉత్సాహం త‌గ్గిపోతుంది. మీకు భిన్న‌ర‌కాల నైపుణ్యాలుంటే.. మీరు దీర్ఘ‌కాలం ఎలాంటి నిరుత్సాహం లేకుండా ఉంటారు. అదే నేను అనుస‌రించే ఇకిగాయ్‌"

నిజ‌మైన ఇకిగాయ్‌, ప‌ని మ‌ధ్య సంబంధాన్ని వారికి అర్థ‌మైన రీతిలో కొత్త భాష్యం ఇచ్చుకుంటూ న‌వ‌త‌రం ముందుకు వెళ్తోంది. ఇది చూస్తుంటే భ‌విష్య‌త్‌లో జ‌పాన్ ఉద్యోగ జీవిత స‌మ‌తౌల్యం మ‌రింత గాడిన‌ ప‌డేలా క‌నిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)