కరోనావైరస్: చైనాతో పొడవైన సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియ‌త్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేత‌గా ఎలా నిలిచింది?

  • అన్నా జోన్స్‌
  • బీబీసీ ప్రతినిధి
క‌రోనావైర‌స్‌పై వియ‌త్నాం ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

క‌రోనావైర‌స్‌పై వియ‌త్నాం ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌

చైనాతో పొడ‌వైన స‌రిహ‌ద్దు, 9.7 కోట్ల మంది జ‌నాభా ఉన్న‌ప్ప‌టికీ... వియ‌త్నాంలో 300 క‌రోనావైర‌స్ కేసులే నమోద‌య్యాయి. ఇక్క‌డ ఒక్క‌రు కూడా కోవిడ్‌-19 ఇన్‌ఫెక్ష‌న్‌తో మ‌ర‌ణించ‌లేదు.

నెల రోజుల నుంచీ క‌రోనావైర‌స్ కేసులు ఇక్క‌డ ఒక్క‌టి కూడా బ‌య‌ట‌ప‌డ‌లేదు. మ‌రోవైపు లాక్‌డౌన్ స‌డ‌లింపులు కూడా మొద‌ల‌య్యాయి.‌

భారీ స్థాయిలో కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్న ఇత‌ర దేశాల్లా కాకుండా వియ‌త్నాం.. కాస్త తొంద‌ర‌గానే మేలుకొన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. ఉన్న చిన్న అవ‌కాశాన్ని స‌కాలంలో విజ‌య‌వంతంగా ఉప‌యోగించుకున్న‌ట్లు వివ‌రిస్తున్నారు.

మిత వ్య‌యంతో అంద‌రినీ భాగ‌స్వాముల్ని చేస్తూ వియ‌త్నాం రూపొందించిన వ్యూ‌హాల్లో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నప్పటికీ, వాటిని ఇత‌ర దేశాలు అనుస‌రించేందుకు ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

స్థానికంగా కొన్ని వారాలుగా ఎలాంటి కొత్త కేసులు నమోదు కాక‌పోవ‌డంతో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను వియ‌త్నాం స‌డ‌లిస్తోంది

విప‌రీత‌మే... కానీ త‌ప్ప‌నిస‌రి

"మునుపెన్న‌డూ చూడ‌ని ఇలాంటి కొత్త మ‌హ‌మ్మారులు ముంచుకొచ్చిన‌ప్పుడు కొంచెం అతిగా స్పందించ‌డ‌మే మేలు"అని హ‌నోయ్‌లో హార్వ‌ర్డ్ పార్ట్‌న‌ర్‌షిప్ ఫ‌ర్ హెల్త్ అడ్వాన్స్‌మెంట్‌కు చెందిన డాక్ట‌ర్ టాడ్ పొలాక్ వివ‌రించారు.

స్వ‌ల్ప ల‌క్ష‌ణాలతో రోగులు పోటెత్తితే త‌మ ఆరోగ్య వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంద‌ని ముందే అంచ‌నా వేసిన వియ‌త్నాం తొలి ద‌శ‌లోనే వైర‌స్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు భారీ వ్యూహాల‌ను సిద్ధంచేసింది.

జ‌న‌వ‌రి తొలి వారంలో వూహాన్‌లో ఇద్ద‌రు కొత్త‌ ర‌కం న్యుమోనియాతో మ‌ర‌ణించినప్పుడే క‌ఠిన చ‌ర్య‌ల‌తో వియ‌త్నాం ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అప్ప‌టికి ఇక్క‌డ క‌నీసం ఒక్క కేసు కూడా నిర్ధ‌ర‌ణ కాలేదు.

హోచిమిన్‌ సిటీలోని త‌న కొడుకు చూసేందుకు‌ వూహాన్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తితో జ‌న‌వ‌రి 23న ఇక్క‌డ తొలి క‌రోనావైర‌స్ పాజిటివ్ కేసు న‌మోదైంది. అయితే అప్ప‌టికే ఇక్క‌డ‌ అత్య‌వస‌ర వ్యూహం‌ అమ‌లులో ఉంది.

"చాలా చాలా ముందుగా వియ‌త్నాం స్పందించింది. అప్ప‌టికి ఆ చ‌ర్య‌లు కొంచెం అతిగా అనిపించినా.. ఇప్పుడు చాలా మంచి ప‌నిచేశార‌ని అర్థం అవుతోంది"అని హోచిమిన్ సిటీలోని అక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ క్లినిక‌ల్ రీసెర్చ్ యూనిట్ (ఓయూసీఆర్‌యూ) డైరెక్ట‌ర్‌, ప్రొఫెస‌ర్ గయ్ థ్వైట్స్ వివ‌రించారు. అంటువ్యాధుల క‌ట్ట‌డిపై వియ‌త్నాం ప్ర‌భుత్వంతో ఓయూసీఆర్‌యూ క‌లిసి ప‌నిచేస్తోంది.

ఫొటో సోర్స్, ANH PHONG

ఫొటో క్యాప్షన్,

విదేశాల నుంచి వ‌చ్చేవారిని నేరుగా క్వారంటైన్ కేంద్రానికి తీసుకెళ్తున్న బ‌స్సు

కొన్ని దేశాలు ప్ర‌స్తుతం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వియ‌త్నాం కొన్ని నెల‌ల ముందే మొద‌లుపెట్టింది. క‌ఠిన ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను అమ‌లుచేసింది. విదేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రినీ జాగ్ర‌త్త‌గా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచింది. చైనాతో పొడవైన స‌రిహ‌ద్దును పూర్తిగా మూసివేసింది. స‌రిహ‌ద్దులు, ఇత‌ర ముప్పు పొంచివున్న ప్రాంతాల్లో ఆరోగ్య త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేసింది.

జ‌న‌వ‌రి చివ‌రిలో లూనార్ కొత్త సంవ‌త్స‌రం పేరుతో ఇక్క‌డ స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. అయితే వాటిని మే మ‌ధ్య వ‌ర‌కూ తెర‌వ‌లేదు. వైర‌స్ సోకిన వారితో క‌లిసిన వారిని గుర్తించేందుకు భారీగా సిబ్బందిని మోహ‌రించారు.

"గ‌తంలో చాలా మ‌హ‌మ్మారుల‌ను వియ‌త్నాం ఎదుర్కొంది"అని ప్రొఫెస‌ర్ థ్వైట్స్ చెప్పారు. 2003లో సార్స్ నుంచి 2010లో ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా, డెంగీ, మ‌సూచి లాంటి మ‌హ‌మ్మారుల‌ను ఆయ‌న ఉద‌హ‌రించారు.

"అభివృద్ధి చెందిన దేశాలకంటే ఇక్కడి ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల‌కు.. మ‌హ‌మ్మారులు చుట్టిముట్టిన‌ప్పుడు ఎలా స్పందించాలో తెలుసు".

మార్చి రెండో వారం నాటికి బ‌య‌ట నుంచి దేశంలోకి అడుగుపెట్టినవారిని‌, వారిని క‌లిసిన వారిని త‌ప్ప‌నిస‌రిగా 14 రోజుల క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించింది.

ఈ కేంద్రాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రించింది. అయితే ఇక్క‌డ విలాస‌వంత‌మైన స‌దుపాయాలేవీ ఉండ‌వు. వియత్నాం చాలా సుర‌క్షిత‌మైన ప్రాంత‌మ‌ని ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన ఓ మ‌హిళ.. బీబీసీ న్యూస్ వియ‌త్నామీస్‌కు తెలిపారు. "అయితే, నాకు కేటాయించిన‌ క్వారంటైన్ గ‌ది చాలా వేడిగా ఉంది. అక్క‌డ ఒక ఫ్యానే తిరిగేది. ఒక చాప‌, ఒక త‌ల‌గ‌డ ఇచ్చారు. దుప్ప‌టి కూడా లేదు" అని ఆమె వివ‌రించారు.

ఫొటో సోర్స్, Lan Anh

ఫొటో క్యాప్షన్,

లగ్జరీ ఏర్పాట్లు చేయకపోయినప్పటికీ స్వల్ప లక్షణాలు ఉన్న వారిని కూడా క్వారంటైన్ కేంద్రాలను తరలించి, సామాన్య ప్రజలకు దూరంగా పెట్టారు

ఎలాంటి ల‌క్ష‌ణాలులేని రోగుల విష‌యంలో..

స‌గం మంది రోగుల్లో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇలా భారీ స్థాయిలో క్వారంటైన్‌కు త‌ర‌లించ‌డ‌మే మంచి మార్గ‌మ‌ని ప్రొఫెస‌ర్ థ్వైట్స్ వివ‌రించారు.

ల‌క్ష‌ణాలు ఉన్నా, లేక‌పోయినా క్వారంటైన్‌లో ఉన్న అంద‌రికీ పరీక్ష‌లు నిర్వ‌హించారు. ఇలా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌క‌పోతే వియ‌త్నాంలో 40 శాతం కేసుల‌కు వైర‌స్ సోకింద‌ని తెలుసుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌య్యుండేద‌ని థ్వైట్స్ తెలిపారు.

"ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌ని కేసులు భారీగా ఉంటే వియ‌త్నాం అనుస‌రించిన విధానాన్ని ఎంచుకోవ‌డ‌మే మేలు".

"మీరు వారిని ముందే గుర్తించ‌క‌పోతే... వారు హాయిగా తిరుగుతూ ఇన్ఫెక్ష‌న్‌ను వ్యాపింప‌చేస్తారు".

"ఇక్క‌డ మ‌ర‌ణాలు త‌క్కువ‌గా ఉండ‌టానికి ఇది కూడా ఒక కార‌ణం కావొచ్చు".

విదేశాల నుంచి తిరిగి వ‌స్తున్న వారిలో విద్యార్థులు, ప‌ర్య‌ట‌కులు, వ్యాపారులే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది య‌వ్వ‌నంలో, ఆరోగ్యంగా ఉన్నారు. వీరు క‌రోనావైర‌స్‌పై మెరుగ్గా పోరాడ‌గ‌లిగారు. అంతేకాదు ఇంటిలోని పెద్ద వ‌య‌సున్న వారిని ముప్పుకు గురిచేయ‌కుండా క్వారంటైన్ కేంద్రాల‌కు వ‌చ్చారు. దీంతో కేవ‌లం అత్య‌వ‌స‌ర‌మైన కేసుల‌పైనే వైద్య సిబ్బంది దృష్టిసారించారు.

దేశ వ్యాప్తంగా వియ‌త్నాం లాక్‌డౌన్‌ను విధించ‌లేదు. అయితే వైర‌స్ సోకుతున్న ప్రాంతాల్లో క్ర‌మంగా ఆంక్ష‌లు విధిస్తూ వచ్చింది.

ఫిబ్ర‌వ‌రిలో ఉత్త‌ర హ‌నోయ్‌లోని సోన్ లాయ్‌లో కొన్ని కేసులు బ‌య‌ట‌ప‌డిన వెంట‌నే.. దాదాపు 10,000 మంది ఉండే ప‌రిస‌ర ప్రాంతాల‌ను సీజ్‌చేశారు. హా లోయ్ ప్రాంతంలోనూ ఇలానే 11,000 మంది ఉండే ప్రాంతాన్ని మూసేశారు.

కేసులేవీ న‌మోదు కాలేద‌ని నిర్ధ‌రించిన రెండు వారాల త‌ర్వాతే మ‌ళ్లీ ఈ ప్రాంతాల‌ను తెరిచారు.

వైర‌స్ చెల‌రేగే అవ‌కాశ‌మున్న ప్రాంతాల్లో వియ‌త్నాం ఇలా పెద్ద‌యెత్తున‌ ఆంక్ష‌లు విధిస్తూ వ‌చ్చింది. అయితే భారీ స్థాయిలో టెస్టులు మాత్రం నిర్వ‌హించ‌లేదు.

"మొద‌ట్లో ఇది చాలా హైరిస్క్ వ్యూహం అని అనిపించింది" అని ప్రొఫెస‌ర్ థ్వైట్స్ వివ‌రించారు.

"అయితే ఈ వ్యూహం ఫ‌లించింది. ప్ర‌తి ఒక్క కేసునూ వారు ఐసోలేట్ చేయ‌గ‌లిగారు. వైరస్ వ్యాప్తిపై ప‌ట్టు సాధించారు".

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇరుగుపొరుగువారే కేసులును న‌మోదు చేయించేలా వియ‌త్నాం నిబంధ‌న‌లు తీసుకొచ్చింది

ప్ర‌జ‌ల‌కు విస్ప‌ష్ట సందేశాలు

ఇలాంటి భారీ వ్యూహంలో ప్ర‌జ‌లంద‌రూ పాలు పంచుకొనేలా వియ‌త్నాం కమ్యూనిస్టు ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌లు వ‌హించింది.

"ప్ర‌జ‌ల‌కు స‌మాచారం చేర‌వేయ‌డంలో వియ‌త్నాం ప్ర‌భుత్వం చాలా బాగా ప‌నిచేసింది. అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకొని వారికి సందేశాలు పంపించింది" అని డాక్ట‌ర్ టాడ్ వివ‌రించారు.

తొలి ద‌శ‌ల్లోనే అన్ని ఫోన్ల‌కూ ఇక్క‌డ ఎస్ఎంఎస్‌లు పంపించారు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. త‌మ ప్ర‌భుత్వం గురించి విప‌రీతంగా ప్ర‌చారం చేసుకొనే యంత్రాంగాన్నే.. వైర‌స్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించారు. యుద్ధ స‌మ‌యంలో శ‌త్రువుతో పోరాటాన్ని ప్ర‌తిబింబించే చిత్రాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ.. వైర‌స్‌పై పోరాటానికి ప్ర‌జ‌ల్లో స్ఫూర్తిని నింపారు.

"శ‌త్రువును ఓడించేందుకు స‌మాజం క‌లిసిక‌ట్టుగా పోరాడుతోంద‌నే భావ‌న‌ను వారు క‌లిగించారు"అని టాడ్ చెప్పారు.

"త‌మ ఆదేశాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని ఇక్క‌డి ప్ర‌భుత్వం ప‌దేప‌దే చెప్పింది. ప్ర‌జ‌లు కూడా ప్ర‌భుత్వంవైపు నిల‌బ‌డ్డారు. ఎందుకంటే తాము చేస్తున్న ప‌నుల‌కు ఫ‌లితం క‌నిపిస్తోంది. ఇంకా ప్ర‌భుత్వం చెప్పేవ‌న్నీ త‌మ‌ను కాపాడటానికేన‌ని వారు న‌మ్మారు"అని టాడ్ వివ‌రించారు.

వియ‌త్నాం చెబుతున్న వివ‌రాలు న‌మ్మొచ్చా? ప్ర‌భుత్వం చూపిస్తున్న కేసులు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. అస‌లు ఇవి న‌మ్మొచ్చా? లేదా? అనే ప్ర‌శ్న‌లు పుట్టుకొస్తున్నాయి. అయితే వైద్య సిబ్బంది, దౌత్య ప్ర‌తినిధులు ఎలాంటి సందేహ‌మూ అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

ఇన్ఫెక్ష‌న్ల క‌ట్ట‌డికి ప‌నిచేస్తున్న ప్ర‌ధాన ఆసుప‌త్రిలో ప్రొఫెస‌ర్ థ్వైట్స్ బృందం ప‌నిచేస్తోంది. "ఒక‌వేళ ప్ర‌భుత్వం చూపించ‌ని, నిర్ధ‌ర‌ణకాని కేసులు ఏమైనా ఉండుంటే.. ఆసుప‌త్రి వార్డుల్లో కనిపించాలి. అలాంటి సంకేతాలేవీ మాకు రావ‌డం లేదు" అని థ్వైట్స్ వివ‌రించారు.

త‌న బృందంతో క‌లిసి ఆయ‌న దాదాపు 20,000 ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారి ప‌రీక్ష‌ల వివ‌రాలు ప్ర‌భుత్వం వెల్ల‌డించిన వివ‌రాల‌తో స‌రిపోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వియత్నాంలో పాఠశాలలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి

మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌పై ఆందోళ‌న‌లు

"సామాజిక దూరం నిబంధ‌న‌లు పాటించేలా చూసేందుకు, క్వారంటైన్ కోసం.. ప్ర‌జ‌ల‌పై త‌మ పార్టీ శ్రేణుల‌తో ఇక్క‌డ ఏక పార్టీ ప్ర‌భుత్వం నిఘా పెట్టించింది" అని హ్యూమ‌న్ రైట్స్ వాచ్‌కు చెందిన ఫిల్ రాబ‌ర్ట్‌స‌న్ వ్యాఖ్యానించారు.

ఇక్క‌డ క‌చ్చితంగా మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోంద‌ని ఆయ‌న బీబీసీతో చెప్పారు.

"అయితే చాలా మందికి ఈ విష‌యం తెలియ‌దు. ఎందుకంటే మీడియాపై ఇక్క‌డి ప్ర‌భుత్వానికి పూర్తి ప‌ట్టుంది" అని అన్నారు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే వారిపై జ‌రిమానాలు, శిక్ష‌లు విధించ‌డాన్ని ఆయ‌న ఉద‌హ‌రించారు.

కేవ‌లం వైర‌స్‌పైనే దృష్టి సారించ‌డంతో ఇత‌ర వైద్య, సామాజిక, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌పై ప‌డిన ప్ర‌భావంపై ఎలాంటి స‌మాచార‌మూ అందుబాటులో లేదు.

"కోవిడ్‌-19 ఇన్ఫెక్ష‌న్తో‌ తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్న దేశాల‌కు వియ‌త్నాం పాఠాలతో ఎలాంటి ఉప‌యోగ‌మూ ఉండ‌దు. అయితే ఇప్పుడిప్పుడే కేసులు మొద‌ల‌వుతున్న దేశాలు వియ‌త్నాం చూసి నేర్చుకోవ‌చ్చు"అని ప్రొఫెస‌ర్ థ్వైట్స్ చెప్పారు.

"చికిత్స కంటే నియంత్ర‌ణ ఎప్పుడూ మేలైన‌ది. పైగా వ్య‌య‌మూ త‌క్కువ అవుతుంది".

"ఇక్క‌డ కేసులు విప‌రీతంగా పెరిగుంటే వారి వ్యూహాలు క‌చ్చితంగా త‌ప్ప‌య్యేవి".

అదనపు సమాచారం: గియాంగ్ గుయెన్‌, బియూ థూ, బీబీసీ వియత్నమీస్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)