100 ఏళ్ల జీవనం: ఈ 5 ప్రాంతాల్లో జన్మిస్తే నూరేళ్లు బతికేసినట్లే
- డేవిడ్ రాబ్సన్
- బీబీసీ ఫ్యూచర్

ఫొటో సోర్స్, Alamy
ఒక పట్టణం చుట్టూ ఉష్ణమండల అడవులు ఉంటాయి. అక్కడి బీచ్‌లు సర్ఫర్లకు చాలా ఇష్టం. మరో రెండు పట్టణాలు మధ్యధరా సముద్ర జలాల్లో ఉండే రాతిదీవులు. నాలుగో పట్టణం జపాన్ దీవుల గొలుసులో చిట్టచివరన ఉంటుంది. చివరిది కాలిఫోర్నియాలోని ఓ చిన్న నగరం. ఆ నగరం పేరుకు ‘అందమైన కొండ’ అని అర్థం.
ఈ ఐదు ప్రాంతాలు - కోస్టారికా లోని నికోయా, ఇటలీలోని సార్డీనియా, గ్రీస్‌లోని ఇకారియా, జపాన్‌లోని ఒకినావా, కాలిఫోర్నియాలోని లోమా లిండా - మధ్య మామూలుగా చూస్తే ఏ సంబంధం ఉన్నట్లు కనిపించకపోవచ్చు.
కానీ దీర్ఘాయువుతో ఆరోగ్యంగా జీవించాలనకునే వారెవరైనా.. ఈ ఐదు చోట్ల పుట్టి ఉంటే అలాగే జరిగే అవకాశాలు ఎక్కువ. వీటిని ‘బ్లూ జోన్స్’గా వ్యవహరిస్తారు. అమెరికా సగటుతో పోలిస్తే ఈ ఐదు ప్రాంతాల్లో 100 సంవత్సరాలు జీవించే అవకాశం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.
బ్లూ జోన్ అనే మాటను తొలుత ఇటాలియన్ అంటురోగ శాస్త్రవేత్త జియానీ పెస్, బెల్జియం జనసంఖ్య శాస్త్రవేత్త మైఖేల్ పౌలీన్‌లు సార్డీనియాలో మరణాల రేటు మీద పరిశోధన చేస్తున్నపుడు 2000 సంవత్సరంలో రూపొదించారు. దీర్ఘాయువు ఉన్న ప్రాంతాలను నీలి రంగులో గుర్తిస్తూ.. ఆ దీవిలోని నౌరో ప్రావిన్స్‌లో జనం జీవిత కాలం ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నారు.
అమెరికన్ జర్నలిస్ట్ డాన్ బేటనర్‌తో కలిసి ప్రపచంలో ఇంకొన్ని ప్రాంతాలను కూడా గుర్తించి వారు ప్రచురించిన పుస్తకం 2008లో బెస్ట్ సెల్లింగ్ బుక్స్‌లో ఒకటిగా నిలిచింది.
అనంతరం 12 సంవత్సరాలుగా చాలా మంది శాస్త్రవేత్తలు బ్లూ జోన్ల మీద పరిశోధనలు కొనసాగించారు. ఆ ప్రాంతాల్లో జీవితకాలం అధికంగా ఉండటానికి కారణాలేమిటి అనే దాని మీద అనేక సిద్ధాంతాలు రూపొందించారు.

ఫొటో సోర్స్, Alamy
జీవితకాలం లాటరీ
బేటనర్ పుస్తకంలో రాసినట్లు ఈ బ్లూజోన్లలో ప్రజల జీవితాలకు కొన్ని విశిష్ట లక్షణాలున్నాయి.
అందులో మొదటిది ఆహారం. ముఖ్యంగా గతంలో బ్లూ జోన్లలో చాలా మంది జనం మితంగా ఆహారం తినేవారు. ఉదాహరణకు.. ఒకినావాలో వృద్ధులు ‘హరా హాచి బు’ అనే ప్రాచీన నిబంధనను పాటించేవారు. అంటే.. కడుపు 80 శాతం నిండేవరకూ మాత్రమే తినటం. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. ఇది ప్రస్తుతం సగటు వయోజనుడికి సిఫారసు చేసిన కేలరీల్లో సుమారు 10 శాతం తక్కువతో సమానం.
ఇలా చేయటం వల్ల వృద్ధాప్యం నెమ్మదిస్తున్నట్లు కనిపిస్తోంది.
యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో జీర్ణవ్యవస్థ, వృద్ధాప్యం మీద పరిశోధన చేస్తున్న రోజలిన్ ఆండర్సన్ దీర్ఘకాలం పాటు జంతువుల మీద చేసిన అధ్యయనాలు.. మకాక్ కోతులు ఇదే తరహా పరిమిత కేలరీల ఆహారం తీసుకుంటాయని, దానివల్ల వయసుతో పాటు వచ్చే క్యాన్సర్, డయాబెటిస్, హృద్రోగాల వంటి జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గిందని చూపుతున్నాయి. అంతేకాదు ఆ కోతులు యవ్వనంగా కూడా కనిపిస్తాయి. మకాక్‌ల బొచ్చు తెల్లబడటానికి ఇంకా ఎక్కువ సమయం పట్టింది.
ఈ ప్రభావాల వెనుక ప్రక్రియల గురించి మనకు ఇంకా పూర్తిగా అర్థంకాలేదు. అయితే కేలరీలను పరిమితం చేయటం వల్ల విషపూరిత ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవటం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇవి మన జీర్ణవ్యవస్థ ఫలితంగా తయారవుతుంటాయి. మన జీవకణాలను దెబ్బతీయగలవు. కేలరీల వినియోగం తగ్గించటం వల్ల మన శరీరం చాలా తక్కువ స్థాయి ఒత్తిడిని ఎదుర్కొంటుందని, అందువల్ల కొత్త టిష్యూలను నిర్మించటానికి బదులుగా ఉన్న జీవకణాలను సక్రమంగా నిర్వహించటం మీదకు సంకేతాలను మళ్లిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదించారు.
దీనివల్ల మన డీఎన్ఏలో క్యాన్సర్ వంటి రోగాలకు కారణమయ్యే నష్టదాయక పరివర్తనల ప్రమాదం తగ్గుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ జన్యుశాస్త్రవేత్త దిద్దహళ్లి గోవిందరాజు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Alamy
ఆధ్యాత్మిక సంబంధం
ఈ శతవర్ష మానవులు ఆహార అలవాట్లతో పాటు సామాజిక జీవితాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తారు. బ్లూ జోన్లలోని జనం నివసించే సమాజాలు చాలా లోతుగా కలిసిపోయి ఉంటాయి. సామాజిక సంబంధం ఉందన్న ఎరుక.. ఒత్తిడి ప్రభావాలను తగ్గిస్తుందన్న విషయాన్ని ఇప్పుడు అందరూ అంగీకరిస్తారు. ఆ స్నేహసంబంధాలను కొనసాగించాల్సిన బాధ్యత.. మొత్తంగా మానసిక, శారీరక కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహిస్తుంది.
ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో మన స్నేహాల నాణ్యత కూడా అంతే ముఖ్యమని సైకాలజిస్ట్ జూలియన్ హోల్ట్ విశ్లేషణ చెప్తుంది.
బ్లూ జోన్లలో సామాజిక అనుసంధానాలకు ఒక ముఖ్యమైన ఆధారంగా మతం పనిచేస్తోంది. ఉదాహరణకు లోమా లిండా ప్రజల్లో ఎక్కువ మంది సెవన్త్ డే అడ్వెంటిస్టులు. నికోయన్లు, సార్డీనియన్లు క్యాథలిక్కులు. ఇకారియన్లు గ్రీక్ సనాతనులు. ఒకినావాలో స్థానికులు రికియువాన్ మతాన్ని ఆచరిస్తారు.
బీటనర్ అమెరికన్ జర్నల్ ఆఫ్ లైఫ్‌స్టైల్ మెడిసిన్‌లో రాసిన ఒక అధ్యయన పత్రంలో.. ఈ బ్లూ జోన్లలో తాను ఇంటర్వ్యూ చేసిన 263 మందిలో ఐదుగురు మినహా అందరూ ఏదో ఒకరకమైన ఆధ్యాత్మిక సమూహంలో భాగంగా ఉన్నారని చెప్పారు.
మత సంబంధాల వల్ల సామాజిక సంబంధాలతో పాటు జీవితానికి ఒక ప్రయోజనం ఉందన్న భావన కూడా వారికి లభిస్తుంది. మానసికంగా ఎదురుదెబ్బలు తగిలినపుడు సాంత్వన లభిస్తుంది. వీటిద్వారా మత విశ్వాసకుల జీవితకాలం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకూ పెరుగుతుందని భావిస్తున్నారు. హేతువాదులకు ఇతర మార్గాల్లో ఇవే ఫలితాలు రావచ్చు. కొన్ని నగరాల్లో ఇప్పటికే భావసారూప్య వ్యక్తులు కలిసి ఆలోచించటానికి, ధ్యానం చేయటానికి, సామాజిక మద్దతు పొందటానికి లౌకిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Alamy
టీ, కాఫీల సమయం
బ్లూ జోన్లలో ఈ విస్తృత సారూప్యతలే కాకుండా మరికొన్ని విశిష్ట లక్షణాలు కూడా ఉన్నాయి.
ఆహారం విషయానికి వస్తే గ్రీక్ దీవి ఇకారియాలో.. జనం రోజుకు కొన్ని కప్పులు టీ, కాఫీలు తాగుతుంటారు. దీనివల్ల ఈ ప్రాంతంలో హృద్రోగాలు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వేడి పానీయాల్లో.. యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే మాగ్నీసియం, పొటాసియం, నియాసిన్, విటమిన్ ఇ వంటి సూక్ష్మపోషకాలు.. పలు జబ్బులకు కారణమయ్యే విషపూరిత ఫ్రీ రాడికల్స్‌ను తుడిచిపెడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రత్యేకించి పొడవాటి సన్నని కుండలో కాచే గ్రీక్ కాఫీ.. మంచిదని భావిస్తున్నారు. అందులో క్లోరోజెనిక్ యాసిడ్లుగా పిలిచే పాలీఫినాల్స్ విడుదలవుతాయి. అవి శరీరంలో వాపును తగ్గిస్తాయి. శరీరంలో వాపు వల్ల వయసు సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ వాపును తగ్గించే పాలీఫినాల్స్‌ను అందించే పానీయాలు తరచుగా సేవించటం వల్ల ఆయువు పెరుగుతుందని చెప్తున్నారు.
టైప్-2 డయాబెటిస్‌కు సంబంధించిన ముప్పును కూడా ఈ పానీయాల వల్ల తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. క్లోరోజెనిక్ యాసిడ్ల వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ల మిశ్రమాలు వివిధ మార్గాల్లో మన రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకృతం చేస్తాయి.
కాఫీతో కూడి పానీయాలు జీవితానికి సంజీవని అనే గ్యారంటీ లేదు. కానీ మితమైన, తక్కువ కేలరీ ఆహారంతో కలిపి తీసుకుంటే సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితానికి అవి దోహదం చేయగలవు.
ఒకినావా, సార్డీనియాల్లో ఆహారం లాగా.. ఇకారియాలో కూడా మాంసాహారం తక్కువగా, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు. చేపలు సైతం.. ఒక దీవిలో నివసించే వారు తింటారనుకునేంత మోతాదులో కూడా వీరు తినరు.

ఫొటో సోర్స్, Getty Images
చేదు – తీపి పరిష్కారాలు
అలాగే ఒకినావా నివాసుల ఆహారంలోని మరో రెండు పదార్థాలు కూడా చాలా ఆసక్తిని కలిగిస్తాయి: స్వీట్ పొటాటో (చిలగడదుంప), బిట్టర్ మెలన్ (చేదు పుచ్చకాయ). వీటిలో జీవితకాలాన్ని పెంచే పోషకాలు ఉండొచ్చు.
జపాన్‌లో అత్యధిక జనాభా తినే ఆహారం అన్నం (బియ్యం). అయితే ఒకినావాలో 1600 సంవత్సరంలో చిలగడదుంప ప్రవేశించినప్పటి నుంచీ అది నిత్యాహారంగా మారింది. వైట్ బ్రెడ్ వంటి ఆహారంలో లాగా కాకుండా.. ఇందులో గ్లైకోమిక్ సూచీ తక్కువగా ఉంటుంది. అంటే దీని శక్తి రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదలవుతుంది. విటమిన్లు ఎ, సి, ఇ వంటి పోషకాలు కూడా ఇందులో మెండుగా ఉంటాయి. ఇవి కూడా యాంటీఆక్సిడెంట్లు. నష్టదాయకమైన ఫ్రీ రాడికల్స్‌ని శుభ్రంచేస్తాయి.
స్వీట్ పొటాటలోని పొటాసియం.. రక్తపోటును తగ్గించటానికి తోడ్పడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి, కొలెస్టరాల్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. ఇవి తరచుగా వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఇక బిట్టర్ మెలన్.. బొడిపలతో కూడిన దోసకాయలాగా కనిపిస్తుంది. రుచి బ్లాక్ టీలాగా ఉంటుంది. దీనిని సలాడ్ల నుంచి పలు రకాల జ్యూస్ పానీయాల్లో ఉపయోగిస్తారు. ఇకారియాలో గ్రీఫ్ కాఫీ లాగా ఇది కూడా గ్లూకోజ్ వినియోగాన్ని, జీర్ణవ్యవస్థను నియంత్రించే పదార్థాలు ఇందులో ఉన్నాయి. వాటివల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది.
మున్ముందు మరిన్ని ఉదాహరణలు వెలుగులోకి రావచ్చు. ఒకినావాలో తినే పోషకాలతో నిండిన సముద్రనాచు, ఆల్గే, కెల్ప్ వంటి సాగర ఆహారాల మీద అధ్యయనాలు చేస్తున్నారు.
సజీవ పరిసరాలు
దీనిపై ఎక్కువగా పరిశోధనలు జరగలేదు కానీ.. ఈ జనం జీవించే ప్రాంతాల్లోనో వారి దీర్ఘాయువకు సంబంధించిన రహస్యాలు ఉండొచ్చు.
సార్డీనియా బ్లూ జోన్.. ఆ దీవి మీద అద్భుతమైన పర్వత ప్రాంతాల్లో, నిర్ఘాంతపరచేంత సుందరమైన ప్రదేశంలో ఉంటుంది. దీనిని ‘సెల్వాజియో బ్లూ’ (నీలి అడవి) అని అభివర్ణిస్తుంటారు. ఇక్కడ జీవించే శతవర్ష వృద్ధులు చాలా మంది పొలాల్లో పనిచేస్తారు. అందువల్ల ఎత్తుపల్లాలతో నిండిన ఈ ప్రాంతంలో వారి దైనందిన జీవితాల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుందని పెస్, పౌలీన్‌లు అంచనా వేశారు.
ఇక ఇకారియాలో తూర్పు భాగం పురాతన రాతి ప్రాంతం కాగా.. పశ్చిమ భాగం అతి తక్కువ స్థాయిలో అణుధార్మికత విడుదలయ్యే గ్రానైట్ మీద ఉంటుంది. స్వల్పంగా అణుధార్మికత ఉన్న ప్రాంతాల జనంలో జీవితకాలం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీవి పశ్చిమ ప్రాంతంలో అణుధార్మికతతో కూడిన జలపాతాలు ‘అమర జలాల’ను అందిస్తాయని స్థానికులు అంటుంటారు. ఇది కేవలం కాకతాళీయం కావచ్చు. కానీ.. అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం తక్కువస్థాయి పర్యావరణ అణుధార్మికతకు – దీర్ఘాయువుకు మధ్య అర్థంకాని సంబంధం ఉందని గుర్తించారు.
‘‘ఉదాహరణకు.. గల్ఫ్ రాష్ట్రాలతో పోలిస్తే రాకీ మౌంటైన్ రాష్ట్రాల్లో క్యాన్సర్ మరణాలు తక్కువగా ఉన్నాయి’’ అని పరిశోధకుడు క్రిసోహూ పేర్కొన్నారు. ఇప్పటికైతే ఈ పరిశోధన ఇంకా ఆసక్తికరంగానే ఉంది.
అనేక అంశాల సమాహారం...
ఈ బ్లూజోన్లకు ప్రత్యేకమైన దీర్ఘాయువుకు ఏదో ఒక్క మ్యాజిక్ పదార్థమే కారణమని పరిమితం చేసి చెప్పలేమన్నది స్పష్టం. అది అనేక అంశాల మిశ్రమ ఫలితం. అందులో కొన్ని ఈ ప్రాంతాల్లో సామాన్యంగా ఉన్నయి. ఇంకొన్ని అంశాలు ఒక్కో ప్రాంతానికి విశిష్టమైనవి. ఈ పరిశోధనల నుంచి మనం నేర్చుకోగల మార్గాలు చాలా ఉన్నాయి.
ఎక్కువగా పండ్లు, కూరగాయలతో మితంగా ఆహారం తీసుకోవటం, వ్యాయామం ఎక్కువగా చేయటం, కాఫీ, టీలు తాగటం, ఆధ్యాత్మిక స్వాంతన పొందటం – వీటిని మన రోజు వారీ జీవితాల్లో భాగంగా చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి? వేటిని దూరం పెట్టాలి?
- ప్రమాదంలో బంగ్లాదేశ్ ‘పులస’.. మితిమీరిన వేటతో అంతరించిపోతున్న అన్ని రకాల చేపలు
- వెదురు చిగురు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టాప్ ట్రెండ్‌లో ఉన్న వంటకం ఇదే
- పసుపు, మిరప వంటి మసాలా దినుసుల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)