కరోనావైరస్: వ్యాక్సీన్ ప్రయోగాల్లో ఆఫ్రికా వాళ్ళు తప్పకుండా ఉండాలి... ఎందుకంటే?

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్కు విరుగుడు కోసం అందరి సహకారంతో జరిగే వ్యాక్సీన్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వస్తాయని తాము ఆశిస్తున్నామని, కోవిడ్-19ను మనం సమర్ధంగా ఎదుర్కోగలమని గత మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధ్నామ్ గెబ్రియేసస్ ప్రకటించారు.
ఇప్పటి వరకు దీనికి ఎలాంటి మందూ లేదని, వైరస్‌ను అరికట్టడంలో సమర్థమైన ప్రయోగాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు, మనుషులను బలహీనులుగా మార్చకుండా చూసేందుకు మానవ రోగనిరోధక శక్తిని మరింత పెంచాల్సి ఉంది.
ఫొటో సోర్స్, AFP
సెనెగల్‌లోని పేస్టర్ ఇనిస్టిట్యూట్ కరోనావైరస్ మీద పరిశోధనలు చేస్తోంది
వ్యాక్సీన్ ఎలా పని చేస్తుంది?
- వైరస్‌ను అనుకరిస్తూ మనుషుల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తుంది.
- దీనివల్ల మానవశరీర రక్షణ వ్యవస్థలు వైరస్‌తో ఎలా పోరాడాలో నేర్చుకుంటాయి.
- నిజంగా శరీరం వైరస్‌బారిన పడితే, తాను ఏం చేయాలో శరీరానికి తెలుస్తుంది.
- వ్యాక్సిన్ తయారీకి సంవత్సరాలు పట్టొచ్చు లేదంటే దశాబ్దాలు కూడా పట్టొచ్చు.
- కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల లాక్డౌన్లను క్రమంగా ఎత్తేయవచ్చు. సామాజిక దూరం నియమాలను కూడా క్రమంగా సడలించవచ్చు.
ఇప్పటికే దక్షిణాఫ్రికాలో వ్యాక్సీన్ ట్రయల్స్ మొదలయ్యాయి. కెన్యాలో మరొక వ్యాక్సిన్ ట్రయల్స్ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. అయితే ఇప్పుడు ఇదే అంశం వివాదాస్పదమైంది. వ్యాక్సిన్లపై విమర్శలు రావడం, వ్యతిరేకత వ్యక్తంకావడం కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుత చర్చ వ్యాక్సిన్ తయారీపై పోటీ పడుతున్న ఆఫ్రికా కేంద్రాలపై జరుగుతోంది.
ఫొటో సోర్స్, AFP
కానోలో పైజర్ ఔషధ ప్రయోగాలలో పదుల సంఖ్యలో పిల్లలు వికలాంగులయ్యారు.
వలసవాద మనస్తత్వం
యూరప్, ఆస్ట్రేలియాల్లో కరోనా వ్యాధి ట్రయల్స్‌కు టీబీ వ్యాధి వ్యాక్సీన్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ప్రయోగం చేసి చూస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ఇద్దరు ఫ్రెంచ్ డాక్టర్ల మధ్య జరిగిన ఒక టీవీ చర్చతో సమస్య మొదలైంది.
అయితే ఆఫ్రికన్ల మీద కూడా ప్రయోగించి చూడవచ్చన్న అంశంపై ఈ డాక్టర్లు ఇద్దరూ ఏకీభవించారు. అక్కడి ప్రజలు మాస్కులు ధరించరని, చికిత్స కూడా తీసుకోరని, రికవరీ రేటు కూడా లేదని, అలాంటప్పుడు వారిపై ఎందుకు ట్రయల్స్ నిర్వహించకూడదు అని ఓ డాక్టర్ వ్యాఖ్యానించారు.
అయితే ఆ కామెంట్లు చేసిన తీరుపై విమర్శలు మొదలయ్యాయి. ''ఇది కచ్చితంగా అవమానించడమే. 21వ శతాబ్దంలో సైంటిస్టుల నుంచి మనం ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది'' అని ఇథియోపియాకు చెందిన డాక్టర్ టెడ్రోస్ విమర్శించారు. '' దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మేం జరగనివ్వం. సదరు వ్యక్తులు వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.
సహజంగానే ఆఫ్రికాకు చెందిన అనేకమంది ఈ వివాదంపై తమ గొంతును వినిపించడం ప్రారంభించారు. ఇందులో మాజీ ఫుట్‌బాల్ ఆటగాళ్లు డిడైర్ డ్రోగ్బా, శ్యామ్యూల్ ఇటూ కూడా ఉన్నారు.తమ కెరీర్లో వీరిద్దరు యూరప్ దేశాలకు చెందిన వ్యక్తుల నుంచి వర్ణవివక్ష వ్యాఖ్యలను ఎదుర్కొన్నారు.''ఆఫ్రికా మనుషులను మానవ గినియా పందులుగా భావించకండి. ఇది అత్యంత జుగుప్సాకరం'' అని డ్రోగ్బా ట్వీట్ చేశారు.
ఆరోగ్యరంగంలో ఆర్ధిక, వర్ణ వివక్షలపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం చరిత్రలో చాలాకాలం నుంచి ఉంది. మనిషిప్రాణానికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా, నీతి నియమాలను వదిలేసి ఫార్మాకంపెనీలు ఆఫ్రికాలో మనుషులపై అనేకసార్లు ట్రయల్స్ నిర్వహించాయన్నదానికి తగినన్ని ఆధారాలు కూడా ఉన్నాయి.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
పరిహారం చెల్లింపులు
1996లో నైజీరియాలోని ఉత్తర ప్రాంతపు రాష్ట్రం కానోలో ఒక ప్రమాదకరమైన డ్రగ్‌పై ఫైజర్ కంపెనీ ట్రయల్స్ నిర్వహించింది. మెనింజైటిస్ వ్యాధికి సంబంధించి చిన్నారులపై జరిపిన ట్రయల్స్‌లో సదరు కంపెనీ చివరకు కొందరు తల్లిదండ్రులకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. దీనిపై చాలా రోజులపాటు న్యాయపోరాటం కొనసాగింది.
ఆ కంపెనీ ప్రయోగాత్మకంగా ఇచ్చిన యాంటీ బయాటిక్ ట్రీట్మెంట్ కారణంగా 11మంది చిన్నారులు మరణించగా, డజన్లమంది పిల్లలు అంగవికలురుగా మారారు. అసలు ఈ ట్రయల్స్ విషయంలో కంపెనీ అనుమతులు తీసుకుందా, ఇదంతా చిన్నారుల తల్లిదండ్రులకు తెలిసే జరిగిందా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, ఆ ఘటన జరిగిన రెండు దశాబ్దాలు దాటిందని, ఇప్పుడు పరిస్థితులు మారాయని, అంతా పారదర్శకంగా జరుగుతోందని ఉగాండాకు చెందిన శాస్త్రవేత్త క్యాథరిన్ కెయోబుటుంగి అంటున్నారు.''వ్యక్తిగతంగా అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు'' అని ఆఫ్రికన్ పాప్యులేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఏపీహెచ్ఆర్సి) అధినేత డాక్టర్ కెయోబుటుంగి బీబీసీతో అన్నారు.
''మీరొక వ్యాక్సీన్‌ను తయారు చేసే సైంటిస్టు అనుకోండి, మరికొంత కాలం తర్వాత మీరు తయారు చేసిన మందు పనిచేయకుండా పోవాలని, జనం చనిపోవాలని కోరుకోరుగా'' అన్నారామె. ''వారికి తమ పేరు ప్రతిష్టలను కాపాడుకోవడం తెలుసు. కెరీర్లో ఎంతో శ్రమించి పైకి వచ్చారు'' అన్నారామె.
ప్రస్తుతం సంస్థాగత స్థాయిలో, జాతీస్థాయిలో రక్షిత విధానాలు సిద్ధంగా ఉన్నాయి. 'ఉగాండాస్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ''(యూఎన్సీఎస్టీ)లాంటి సంస్థలు దేశస్థాయిలో పని చేస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
''తగినన్ని జాగ్రత్తలు, అనుమతులు లేకుండా ఇక్కడ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించే పరిస్థితులు లేవు'' అని చెప్పారు డాక్టర్ క్యాథరిన్. ఆఫ్రికాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున ఇమ్యునైజేషన్ అండ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ వ్యవహారాలు చూసే రిచర్డ్ మిహిగో దీనితో ఏకీభవిస్తున్నారు. ''వ్యవస్థలో అనేక రక్షణలున్నాయి. ఆఫ్రికన్లు ఇలాంటి ట్రయల్స్ కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటే వారికి పరిహారాలు కూడా అందుతాయి'' అని మిహిగో అంటున్నారు. ''పరిశోధనలో పాల్గొన్నవారిని వ్యాక్సీన్ ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవహరాల్లో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొననివ్వరు'' అని మిహిగో చెప్పారు.
సమాచార మహమ్మారి
నల్లజాతి ప్రజలపై వ్యాక్సినేషన్ ప్రయోగాలు జరుగుతున్నాయంటూ ఎలాంటి నిర్ధారణలు లేకుండా సామాజిక మాధ్యమాల్లో తరచూ వస్తున్నఫేక్న్యూస్ కారణంగా సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ఇలాంటి వార్తల కారణంగా సంస్థలు ఇచ్చే హామీలు బలహీనంగా మారుతున్నాయి. ఉదాహరణకు, కోవిడ్-19 ట్రయల్స్ కారణంగా సెనెగల్ దేశంలో ఏడుగురు చిన్నారులు మరణించారంటూ ఓ ఫేక్ న్యూస్ ఫేస్బుక్లో సంచలనం సృష్టించింది.
సరిగ్గా ఈ ఫేక్‌న్యూస్ ఫ్రెంచ్ డాక్టర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏప్రిల్ నెలలోనే సర్క్యులేట్ కావడం మొదలుపెట్టాయి. డాక్టర్ల వివాదం కారణంగా ఆఫ్రికన్లపై ఇలాంటి ట్రయల్స్ నిజమేనన్న భావనకు బలం చేకూరింది.
ఇలాంటి ఫేక్ వార్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్ఫోడెమిక్గా అభివర్ణించింది. ఇలాంటి సమాచార మహమ్మారులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
దశాబ్దాలుగా నిధుల కొరత
అయితే, ఆఫ్రికాలో ఆరోగ్య వ్యవస్థలు చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. శ్రద్ద లోపించింది. తమ దేశాల వార్షిక బడ్జెట్లలో ఆరోగ్యరంగానికి కనీసం 15శాతం నిధులు కేటాయించాలని 2001లో ఆఫ్రికా దేశాల అధినేతలు నిర్ణయం తీసుకున్నప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. 54 దేశాలున్న ఆఫ్రికా ఖండంలో కేవలం 5దేశాలు మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఇప్పుడు అక్కడే సైంటిఫిక్ పరిశోధనలకు సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి.
ఆఫ్రికాలో మేథస్సుకు కొరత లేదు. కానీ పెట్టుబడి పెట్టేవారు లేకపోవడంతో అక్కడి సైంటిస్టులు వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. అంటే అక్కడ ఆరోగ్యరంగానికి సంబంధించిన సమస్యలు అలాగే ఉండిపోతున్నాయన్నమాట.
అక్కడ ఉన్నవారు భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యరంగంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలున్నప్రాంతాలపట్ల స్పాన్సర్లు మొగ్గు చూపుతుండటంతో ఎక్కువ పరిశోధనలు ఈజిప్టు, దక్షిణాఫ్రికాలకు తరలిపోతున్నాయి.
లైసెన్స్డ్ డ్రగ్స్‌కు క్లినికల్ ట్రయల్స్ ఎక్కువగా ఉత్తర అమెరికా, యూరప్‌లాంటి ధనిక దేశాలలోనే జరుగుతున్నాయి. అంటే అవి ఆఫ్రికావాసులకు సరిపడతాయో లేదో తెలియకుండానే మిగిలిపోతోంది. గత రెండు దశాబ్దాలుగా స్పల్పంగా పెరుగుదల ఉన్నప్పటికీ తూర్పు యూరప్, ఆసియా, మిడిల్ ఈస్ట్లాంటి ప్రాంతాలు కూడా ట్రయల్స్‌లో చాలా వెనకబడి ఉన్నాయి.
'లాక్ అవుట్' ప్రమాదంలో ఆఫ్రికా
అయితే కోవిడ్-19 మహమ్మారిని తరిమికొట్టాలని, ఇందుకు ప్రపంచమంతా పని చేసే వ్యాక్సీన్ అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రయోగాలకు కొన్నిదేశాలు దూరంగా ఉంటే ఆ దేశాలు చీకటిలోనే మిగిలిపోయే చరిత్రను కొనసాగిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.
''వ్యాక్సీన్‌ను యూకేలో టెస్ట్ చేసి, ఆ తర్వాత ఆఫ్రికాకు సరఫరా చేయడం అనేది సరికాదు.ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్కడి మనుషుల జన్యు నిర్మాణం భిన్నంగా ఉంటుంది. అలాంటప్పుడు మందు పని చేసే తీరుపై ప్రభావం ఉండొచ్చు'' అన్నారు డాక్టర్ కెయోబుటుంగి. ''మాలో కొన్ని లక్షణాలు ఉండొచ్చు. వేరే వ్యాధుల ప్రభావం కూడా ఉండొచ్చు. ఉదాహరణకు మా దేశంలో హెచ్ఐవీ బాధితులు ఎక్కువమంది ఉన్నారు'' అని వెల్లడించారు కెయోబుటుంగి.
ఏదిఏమైనా ఆఫ్రికా ఈ వ్యాక్సీన్‌కు దూరమవుతుందని ఆమె భయపడుతున్నారు. చాలాదేశాలు తమ దగ్గరున్న సరుకును దాచుకుంటుండంతో కరోనా టెస్టుల విషయంలో ఆఫ్రికాదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. '' ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే వ్యాక్సిన్ బైటికి రాగానే ధనిక దేశాలు వ్యాక్సిన్‌ను కొని పెట్టుకుంటాయి. ఆఫ్రికన్లకు అది అందుబాటులో ఉండదు'' అన్నారామె.
ఒకపక్క వ్యాక్సీన్‌కు పరిశోధనలు జరుగుతుండగా, అందరికీ ఉపయోగపడే ప్రజా వ్యాక్సిన్ రావాలని దేశాధినేతలు, నిపుణులు బహిరంగ లేఖ ద్వారా కోరారు. రాబోయే వ్యాక్సిన్ పేటెంట్ హక్కులు లేకుండా, త్వరగా తయారై, అందరికీ ఉచితంగా అందేలా ఉండాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్‌కు నాయకత్వం వహిస్తున్న సిరిల్ రమఫోసా ఆ లేఖలో కోరారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- వేడి నీళ్లు, పానీయాలు కోవిడ్-19 బారి నుంచి రక్షిస్తాయా?
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ఖాళీ అయిన మహా నగరాల రోడ్లు మళ్లీ కిక్కిరిసిపోతున్నాయ్
- అఫ్గానిస్తాన్ ప్రసూతి వార్డు మీద దాడి చేసిన వారు 'తల్లుల్ని చంపడానికే వచ్చారు'
- కరోనా వైరస్ ప్రపంచీకరణకు ముగింపు పలుకుతుందా.. దేశాలన్నీ స్వదేశీ బాట పడతాయా
- ఫెలిసియన్ కబుగా: 8 లక్షల మందిని బలితీసుకున్న మారణ హోమం మోస్ట్ వాంటెడ్ అరెస్ట్
- వీడియో, కరోనావైరస్: పాకిస్తాన్లో హాస్పిటల్లో బెడ్ దొరక్క చనిపోయిన డాక్టర్... భార్యకూ సోకిన వైరస్
- కరోనావైరస్: వుహాన్‌లో ప్రజలందరికీ 10 రోజుల్లో పరీక్షలు చేయడం చైనాకు సాధ్యమేనా?
- టిబెట్ పంచెన్ లామా: ఆరేళ్ల బాలుడిని చైనా ఎందుకు మాయం చేసింది.. ఆ బాలుడంటే ఎందుకంత భయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
______________________