నేపాల్ లిపులేఖ్ మ్యాప్ వివాదంపై మ‌నీషా కోయిరాలా ట్వీట్‌కు సుష్మా స్వ‌రాజ్ భ‌ర్త ఎలా స‌మాధానం ఇచ్చారు?

మ‌నీషా కోయిరాలా

ఫొటో సోర్స్, Getty Images

భార‌త్‌-నేపాల్ సంబంధాలపై బాలీవుడ్ న‌టీమ‌ణి మ‌నీషా కోయిరాలా చేసిన ట్వీట్‌పై ముసురుకున్న వివాదం మ‌రింత ముదురుతోంది. తాజాగా మ‌నీషా ట్వీట్‌కు స్పంద‌న‌గా సుష్మా స్వ‌రాజ్ భ‌ర్త‌, మాజీ గ‌వ‌ర్న‌ర్ స్వ‌రాజ్ కౌశ‌ల్ వ‌రుస ట్వీట్లు చేశారు.

కౌశ‌ల్ చేసిన ట్వీట్లు ఇవి:

"మ‌నీషా నేను నీతో వాదించ‌లేన‌మ్మా. నేనెప్పుడూ నిన్ను నా కూతురిలానే చూశాను. 1942 ఎ ల‌వ్ స్టోరీ సినిమా ప్రీమియ‌ర్‌కు మ‌మ్మ‌ల్ని పిలిచిన‌ప్పుడు.. సినిమా చూడ‌టం నాకు కుద‌ర‌లేదు. అయితే, సుష్మ‌, నా కూతురు భాన్‌సురీ సినిమా చూశారు. భాన్‌సురీని నువ్వు ఒళ్లో కూర్చోపెట్టుకున్నావు"అని కౌశ‌ల్ ట్వీట్ చేశారు.

"27ఏళ్ల క్రితం.. మీరు సౌత్ ఎక్స్‌టెన్ష‌న్‌లో ఉండేవారు. నువ్వు సాకేత్‌లోని ఏపీజే స్కూల్‌కు వెళ్లేదానివి. మీ నాన్న ప్ర‌కాశ్ కోయిరాలా నాకు సోద‌రుడు లాంటివారు. మీ అమ్మ సుష్మ కోయిరాలా నాకు మంచి స్నేహితురాలు. క‌ష్ట‌సుఖాల‌న్నీ మేమంతా క‌లిసేచూశాం".

"మీ తాత‌గారు బీపీ కోయిరాలాకు క్యాన్స‌ర్ సోకిన‌ట్లు తెలిసిన‌ప్పుడు నేను వారితోనే ఉన్నాను. 'క్యాన్స‌ర్ చివ‌రి ద‌శ‌లో ఉన్నాను. కేవ‌లం ఆరు నెల‌లే బ‌తుకుతాను'అని ఆయ‌న చెప్పారు. బీపీ అలా చెప్పిన‌ప్పుడు చాలా బాధ‌నిపించింది. కానీ బీపీ మొహంలో ఎలాంటి నిరాశ క‌నిపించ‌లేదు".

"మీ కుటుంబ పేరు ప్ర‌తిష్ఠ‌లు, గొప్ప సంప్ర‌దాయాల గురించి నాకు తెలుసు. మీ తాత‌గారు బీపీ కోయిరాలా, అదే పేరు పెట్టుకున్న ఆయ‌న‌ సోద‌రుడు బీపీ కోయిరాలా, చిన్న త‌మ్ముడు జీపీ కోయిరాలా అంద‌రూ నేపాల్‌కు ప్ర‌ధాన మంత్రులుగా ప‌నిచేశారు. మీ అత్త‌య్య‌, నాకు స్నేహితురాలు శైల‌జా ఆచార్య‌.. ఉప ప్ర‌ధానిగా ప‌నిచేశారు""మీ కుటుంబం ఎన్ని క‌ష్టాల‌ను ఎదుర్కొందో కూడా నాకు తెలుసు. మీ తాత‌గారు బీపీ.. 18ఏళ్లు జైలులో గ‌డిపారు. బ్రాహ్మ‌ణుల‌ను హిందూ దేశ‌మైన నేపాల్ ఉరితీయ‌దు కాబ‌ట్టి.. ఆయ‌న్ను వ‌దిలిపెట్టారు. 26ఏళ్ల వ‌య‌సులోనే మీ అత్త‌య్య శైల‌జ ఎనిమిదేళ్లు జైలులో గ‌డ‌పాల్సి వ‌చ్చింది".

ఫొటో క్యాప్షన్,

భార‌త్‌, నేపాల్ జెండాలు

"ఇక మీ నాన్న ప్ర‌కాశ్ కోయిరాలా విష‌యానికి వ‌స్తే.. అప్ప‌ట్లో ఆయ‌న నేపాలీ కాంగ్రెస్‌లో ఉండేవారు. జేపీ, లోహియా, చంద్ర‌శేఖర్‌జీ, జార్జ్ ఫెర్నాండేజ్ అంద‌రమూ.. క‌ష్ట‌కాలంలో నేపాలీ కాంగ్రెస్ వెన‌క నిల‌బ‌డ్డాం. చంద్ర‌శేఖ‌ర్‌జీ చాలా శ్ర‌మించారు. నేను నేపాల్‌లో చాలా రోజులున్నాను. ప్యాలెస్ లోప‌ల‌కు కూడా వెళ్లాను".

"ప్ర‌జాస్వామ్యం కోసం చేసిన పోరాటంలో మేం మీకు తోడుగా నిల‌బడ్డాం. అక్క‌డ భార‌త్‌ గానీ.. భార‌తీయులు గానీ ఎలాంటి ప్ర‌తిఫ‌లం ఆశించ‌లేదు. రాజుతో మీ ఒప్పందం కుదిరిన త‌ర్వాత.. మేము అస‌లు ఏమీ కోరుకోలేదు. నీ అభిప్రాయం గురించి తెలిసినప్పుడు.. ఒక ఎంపీగా నాకు బాధ‌నిపించింది. నేపాలీ రాజ‌కీయాల్లో భాగంగా ఇలా చేయటం నీకు తప్పదేమో అనిపించింది".

"ప్ర‌పంచంలో ఒక్క‌ హిందూ దేశాన్నీ లేకుండా చేసేందుకు కుట్ర జ‌రిగింద‌ని భార‌తీయులు తెలుసుకోవాలి. కొంద‌రు మావోయిస్టుల‌తో చేతులు క‌లిపారు. ప్ర‌చండ‌, బాబూ రామ్ భ‌ట్టారాయ్ లాంటి వారికి వారు ఇక్క‌డ ఆశ్ర‌యం ఇచ్చారు. వారంతా క‌లిసి హిందూ దేశాన్ని ధ్వంసం చేశారు. వారి మిష‌న్ పూర్త‌యింది".

"క‌మ్యూనిస్టులు భార‌త్‌కు వ్య‌తిరేకంగా చైనాను ఉప‌యోగించుకుంటున్నారు. లేదా భార‌త్‌కు వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టుల‌ను చైనా ఉప‌యోగించుకుంటోంది. ఫ‌లితంగా హిమాల‌యాల వ‌ర‌కు ఉండే భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు.. ఇప్పుడు బీర్‌గంజ్‌కు చేరింది".

"నేపాల్‌తో భార‌త్‌కు ఇబ్బందులు ఉండొచ్చు లేదా నేపాల్‌కే భార‌త్‌తో తీవ్ర‌మైన చిక్కులు ఉండొచ్చు. అది భార‌త్‌- నేపాల్‌ల మ‌ధ్య సంబంధం. దీని మ‌ధ్య‌లోకి నువ్వు చైనాను ఎలా తీసుకొస్తావు? అది మ‌నంద‌రికీ చేటే. నేపాల్‌కు కూడా అది మంచిది కాదు".

"చైనాను ఇప్పుడు మ‌ధ్య‌లోకి తీసుకురావ‌డ‌మంటే.. వెయ్యేళ్ల‌నాటి మ‌న రెండు దేశాల బంధాల‌నూ నాశ‌నం చేస్తున్న‌ట్టే. రెండు దేశాల ఉమ్మ‌డి వార‌స‌త్వ సంప‌దా దెబ్బ‌తింటుంది. ముఖ్యంగా ఒక సార్వ‌భౌమ దేశంగా మీ దేశ స్థాయిని మీరు త‌గ్గించుకుంటున్నారు".

మనీషా కొరియాలా ట్వీట్‌లో ఏముంది?

నేపాల్ విదేశాంగ మంత్రి ప్ర‌దీప్ గైవాలీ చేసిన ట్వీట్‌ను ఇటీవ‌ల మ‌నీషా రీట్వీట్ చేశారు.

త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోయే మ్యాప్‌లో లింపియాధురా, లిపులేఖ్‌, కాలాపానీ ప్రాంతాల‌ను నేపాల్ భాగంగా చూపించాల‌ని మంత్రి మండ‌లి నిర్ణయించిన‌ట్లు నేపాల్ విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. "చిన్న దేశం గౌర‌వాన్ని కాపాడినందుకు ధ‌న్య‌వాదాలు.. మూడు దేశాల మ‌ధ్య అర్థ‌వంత‌మైన‌ చ‌ర్చ‌ల కోసం ఎదురుచూస్తున్నాం"అని మ‌నీషా రాసుకొచ్చారు.

లింపియాధురా, లిపులేఖ్‌, కాలాపానీ ప్రాంతాల‌ను నేపాల్‌లో క‌ల‌ప‌డానికి మ‌ద్ద‌తు తెలుపుతూ నేపాల్ మాజీ రాజు గ్యానేంద్ర బిక్ర‌మ్ షా చేసిన ట్వీట్‌ను కూడా మ‌నీషా రీట్వీట్ చేశారు.

మంచి న‌టిగా పేరు పొందిన మ‌నీషాకు నేపాల్ పౌర‌సత్వ‌ముంది. నేపాల్ రాజ కుటుంబానికి చెందిన ఆమె 30ఏళ్లుగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్ సినిమా మ‌స్కాలో ఆమె క‌నిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)