జ‌మాల్ ఖ‌షోగ్జీ కేసు: "ఆయ‌న్ను హ‌త్య ‌చేసినవారిని క్ష‌మించే హ‌క్కు ఎవ‌రికీ లేదు"

ఖ‌షోగ్జీని ఉద్దేశ‌పూర్వ‌కంగానే హ‌త్య చేసిన‌ట్లు ఐరాస నివేదిక తెలిపింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ఖ‌షోగ్జీని ఉద్దేశ‌పూర్వ‌కంగానే హ‌త్య చేసిన‌ట్లు ఐరాస నివేదిక తెలిపింది.

సౌదీ అరేబియా జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్జీని హ‌త్య‌చేసిన వారిని క్ష‌మించే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని ఆయ‌న పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న హెతిస్ చెంగిజ్ వ్యాఖ్యానించారు.

ఖ‌షోగ్జీని హ‌త్య‌చేసిన వారిని క్ష‌మిస్తున్న‌ట్లు ఆయ‌న కుమారుడు వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో ఆమె స్పందించారు.

"ఇది క్రూర‌మైన హ‌త్య‌. దీని వెన‌కున్న‌వారిని వెంట‌నే శిక్షించాలి"అని ఆమె ట్వీట్‌చేశారు.

సౌదీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ఖ‌షోగ్జీ.. 2018లో ట‌ర్కీలోని సౌదీ కాన్సులేట్‌లో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

అయితే ఈ హ‌త్య‌ను ప్ర‌భుత్వం చేయించ‌లేద‌ని, ఇదొక "వంచ‌కుల ఆప‌రేష‌న్" అని సౌదీ అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్ర‌పంచ దేశాలు సందేహాలు లేవ‌నెత్తుతున్నాయి.

సౌదీ చెబుతున్న స‌మాధానాల‌పై ప్ర‌శ్న‌లు కురిపిస్తున్న వారిలో ఐరాస‌తోపాటు కొన్ని దేశాల నిఘా సంస్థ‌లూ ఉన్నాయి.

ఖ‌షోగ్జీ.. వాషింగ్ట‌న్ పోస్ట్ ప‌త్రిక‌కు వ్యాసాలు రాసేవారు. చ‌నిపోయే ముందు ఆయ‌న అమెరికాలో ఉండేవారు.

ఆయ‌న అదృశ్యం కావ‌డంపై చాలా మాట‌లు మార్చిన సౌదీ అధికారులు.. చివ‌ర‌గా ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యార‌ని ఒప్పుకొన్నారు. ఆయ‌న్ను సౌదీకి తిరిగి తీసుకురావాల‌నే బాధ్య‌త అప్ప‌గించిన ఓ బృంద‌మే ఆయ‌న్ను హ‌త్య చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

ఈ కేసుకు సంబంధించి రియాద్‌లో ర‌హ‌స్యంగా విచార‌ణ చేప‌ట్టిన అనంత‌రం డిసెంబ‌రు 2019లో ఐదుగురు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌కు కోర్టు మ‌ర‌ణ శిక్ష విధించింది.

సౌదీ చేప‌ట్టిన విచార‌ణలో ఎలాంటి న్యాయ‌మూలేద‌ని, ఈ కేసుపై స్వ‌తంత్ర సంస్థ‌తో ద‌ర్యాప్తు చేప‌ట్టించాల‌ని ఐరాస ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏంజెస్ కాలామార్డ్ వ్యాఖ్యానించారు.

చెంగిస్ ఏమ‌న్నారు?

"ఖ‌షోగ్జీకి అంత‌ర్జాతీయ గుర్తింపు ఉంది. ఆయ‌న్ను ఎంద‌రో ప్రేమిస్తున్నారు. గౌర‌విస్తున్నారు. ఆయ‌న మ‌నంద‌రి కంటే గొప్ప‌వారు" అని ఆయ‌న్ను పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న చెంగిస్ ట్వీట‌ర్‌లో వ్యాఖ్యానించారు.‌

"మా పెళ్లికి అవ‌స‌ర‌మైన ప‌త్రాలు తెచ్చేందుకు వెళ్లిన‌ప్పుడు సొంత దేశానికి చెందిన కాన్సులేట్‌లోనే ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు. ఆయ‌న్ను హ‌త్య చేసేందుకు హంత‌కులు సౌదీ నుంచే వ‌చ్చారు"

విశ్లేష‌ణ‌

ఫ్రాంక్ గార్డెన‌ర్‌, భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల ప్ర‌తినిధి

ఈ కేసులో రెండు ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన వాద‌న‌లున్నాయి.

వాటిలో మొద‌టిది.. హంత‌కుల‌ను జ‌మాల్ ఖ‌షోగ్జీ కుటుంబం క్ష‌మించింద‌నే వార్త‌‌. దీన్ని సౌదీ ఆధీనంలోని మీడియా సంస్థ‌లు ప‌దేప‌దే ప్రచారం చేశాయి. ఖ‌షోగ్జీ కుమారుడు సాలెహ్ కూడా బ‌హిరంగంగా దీన్ని ఒప్పుకున్నారు. ఈ హ‌త్య‌కు సూత్ర‌ధారిగా భావిస్తున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ సంతాపాన్నీ ఆయ‌న ఆమోదించిన‌ట్లు సౌదీ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

అయితే సాలెహ్‌.. సౌదీ అరేబియాలో ఉంటున్నారు. స‌ల్మాన్ చెప్పిన మాట‌కు ఒప్పుకోవాల‌ని ఆయ‌న‌పై ఒత్తిడి చేసిన‌ట్లు చాలా మంది అనుమానిస్తున్నారు.

ఖ‌షోగ్జీని పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న చెంగిస్‌తోపాటు, విచార‌ణ కోసం నియ‌మితులైన ఐరాస ప్ర‌త్యేక ప్ర‌తినిధి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. హ‌త్య‌ను క‌ప్పి పుచ్చేందుకే సౌదీ ఇలాంటి ప‌నులు చేస్తోంద‌ని వారు అంటున్నారు. నిజ‌మైన నేర‌స్థులకు ఇంకా శిక్ష ప‌డ‌లేద‌ని వారు న‌మ్ముతున్నారు. అయితే వీరు చెప్పేదాన్ని సౌదీ మీడియా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఒక‌వైపు క‌రోనావైరస్, మ‌రోవైపు ఆర్థిక సంక్షోభంతో ప్ర‌స్తుతం సౌదీ స‌త‌మ‌తం అవుతోంది.

ఫొటో సోర్స్, Handout/AFP

ఫొటో క్యాప్షన్,

తండ్రి మ‌ర‌ణం అనంతరం ప్రిన్స్ స‌ల్మాన్‌ను క‌లిసిన‌ సాలెహ్ ఖ‌షోగ్జీ (ఎడ‌మ‌వైపు).

ఖ‌షోగ్జీ కుమారుడు ఏమ‌న్నారు?

జెడ్డాలో ఉంటున్న సాలెహ్ ఖ‌షోగ్జీ.. ఇటీవ‌ల ట్విట‌ర్‌లో ఓ ప్ర‌క‌ట‌న ట్వీట్‌చేశారు.

"ఈ రంజాన్ స‌మ‌యంలో దేవుడు చెప్పిన మాట‌లు గుర్తు చేసుకోవాలి: త‌ప్పు చేసిన వారిని క్ష‌మించినా, మ‌ళ్లీ ఆద‌రించినా అల్లా వారిని ఆశీర్వ‌దిస్తారు" అని ఆయ‌న ట్వీట్‌చేశారు.

"అందుకే అమ‌రుడైన జ‌మాల్ ఖ‌షోగ్జీ కుమారులుగా.. మేం మా నాన్న‌గారి హంత‌కుల‌ను క్ష‌మిస్తున్నాం"

ఇస్లామిక్ చ‌ట్టాల ప్ర‌కారం బాధితుల కుటుంబ స‌భ్యులు క్ష‌మిస్తే... మ‌ర‌ణ శిక్ష త‌గ్గిస్తారు లేదా ర‌ద్దు చేస్తారు. అయితే ప్ర‌స్తుత కేసులో ఆ నిబంధ‌న వ‌ర్తిస్తుందో లేదో స్ప‌ష్ట‌మైన స‌మాచారం లేదు.

ఇదివ‌ర‌కు సౌదీ ద‌ర్యాప్తుపై పూర్తి న‌మ్మ‌క‌ముంద‌ని సాలెహ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

సౌదీ నాయ‌క‌త్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించేందుకు త‌మ తండ్రి మ‌ర‌ణాన్ని ఉప‌యోగించుకుంటున్నార‌ని సౌదీ ప్ర‌త్య‌ర్థులు, శ‌త్రువుల‌నూ ఆయ‌న విమ‌ర్శించారు.

ఖ‌షోగ్జీ మ‌ర‌ణం అనంత‌రం ఆయ‌న పిల్ల‌ల‌కు ప‌రిహారంగా ఇళ్లు, న‌గ‌దు అందుతున్న‌ట్లు గ‌త ఏడాది వాషింగ్ట‌న్ పోస్ట్ తెలిపింది.

అయితే ఖ‌షోగ్జీ పిల్ల‌ల్లో పెద్ద‌ కుమారుడైన సాలెహ్ మ‌త్ర‌మే.. సౌదీలో ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ని పేర్కొంది.

ఫొటో సోర్స్, POMED

ఖ‌షోగ్జీకి ఏమైంది?

జ‌ర్న‌లిస్టు అయిన ఖ‌షోగ్జీ 2017లో అమెరికాకు వెళ్లిపోయారు. అయితే 2018 అక్టోబ‌రు 2న చెంగిస్‌తో పెళ్లికి అవ‌స‌ర‌మైన ప‌త్రాల కోసం ఆయ‌న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌కు వ‌చ్చారు.

చెంగిస్ బ‌య‌ట ఎదురుచూస్తున్న స‌మ‌యంలోనే.. కాన్సులేట్ లోప‌ల ఆయ‌న్ను హ‌త్య చేశార‌ని విచార‌ణ‌క‌ర్త‌లు భావిస్తున్నారు.

మొద‌ట్లో ఖ‌షోగ్జీ.. కాన్సులేట్ వ‌దిలి వెళ్లిపోయార‌ని సౌదీ అధికారులు చెప్పారు. ఆయ‌న అదృశ్య‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌చ్చిన వారాల‌పాటు వారు చాలా మాట‌లు మార్చారు.

ఆయ‌న్ను దారుణంగా హ‌త‌మార్చార‌నే వార్త‌ను విని ప్ర‌పంచ దేశాలు విశ్మ‌యానికి గుర‌య్యాయి. ఈ కేసుతో సౌదీ క్రౌన్ ప్రిన్స్‌, ఉన్న‌త స్థాయి అధికారుల‌కు సంబంధ‌ముంద‌ని చెప్పేందుకు త‌గిన ఆధారాలు ఉన్నాయ‌ని ఐరాస కూడా వెల్ల‌డించింది.

ఈ హ‌త్య‌లో త‌న‌కు కూడా పాత్ర ఉంద‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను ప్రిన్స్ స‌ల్మాన్ ఖండించారు. అయితే "సౌదీ అరేబియా కోసం ప‌నిచేస్తున్న కొంద‌రు వ్య‌క్తులు ఈ హ‌త్య చేశారు. అందుకే ఓ సౌదీ నాయ‌కుడిగా ఈ హ‌త్య‌కు పూర్తి బాధ్య‌త తీసుకుంటున్నా"అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)