క‌రోనావైర‌స్: టీ-క‌ణాల సంఖ్యను పెంచితే... కోవిడ్ ఇన్పెక్షన్ పారిపోతుందా?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

క‌రోనావైర‌స్‌కు క‌ళ్లెంవేసే ఓ చికిత్సా విధానాన్ని బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షిస్తున్నారు. కోవిడ్‌-19 ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్న రోగులు ఈ విధానంతో కోలుకునే అవ‌కాశ‌ముంది.

ఇన్ఫెక్ష‌న్ బాగా ఎక్కువైన రోగుల్లో వ్యాధి నిరోధ‌క టీ-కణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటున్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.

ఇన్ఫెక్ష‌న్‌ను త‌గ్గించ‌డంలో టీ-క‌ణాలు కీల‌క‌మైన పాత్ర పోషిస్తాయి.

ఇంట‌ర్‌ల్యూకిన్‌-7గా పిలుస్తున్న ఓ ఔష‌ధం.. టీ క‌ణాల సంఖ్య‌ను పెంచ‌గ‌ల‌దా? అనే అంశంపై ప్ర‌స్తుతం ప‌రిశోధ‌కులు దృష్టి సారిస్తున్నారు. ఈ ఔష‌ధం ప‌నిచేస్తే.. ఇన్ఫెక్ష‌న్ తీవ్ర‌మైన రోగులు కోలుకునే అవ‌కాశ‌ముంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

లండ‌న్ కింగ్స్ కాలేజీ, గ‌య్స్ అండ్ సెయింట్ థామ‌స్ హాస్పిట‌ల్ వైద్యులు తాజా ప‌రిశోధ‌న చేప‌డుతున్నారు. కోవిడ్‌-19 రోగుల ర‌క్తంలోని రోగ నిరోధ‌క టీ-క‌ణాల‌ను వారు ప‌రిశీలించారు. దీంతో వీటి సంఖ్య బాగా త‌గ్గిపోయిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

రోగ నిరోధ‌క క‌ణాలు ఏమ‌వుతున్నాయో చూస్తుంటే చాలా ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంద‌ని క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెస‌ర్ ఆడ్రియ‌న్ హేడే వివ‌రించారు.

"టీ-క‌ణాలు మ‌న‌ల్ని కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి. అయితే ఆ క‌ణాల కింద ఉండే పొర‌ను వైర‌స్ ధ్వంసం చేస్తున్న‌ట్లు అనిపిస్తోంది. ఇందువ‌ల్లే టీ-క‌ణాల సంఖ్య త‌గ్గిపోతూ ఉండొచ్చు"

ఆరోగ్య‌వంతుల‌కు చెందిన‌ ఒక మైక్రో లీట‌రు (0.001ఎంఎల్‌) చుక్క ర‌క్తంలో సాధార‌ణంగా లింఫోసైట్లుగా పిలిచే టీ-క‌ణాలు 2,000 నుంచి 4,000 వ‌ర‌కు ఉంటాయి.

ప‌రిశోధ‌న‌లో పాలుపంచుకున్న క‌రోనా రోగుల్లో మాత్రం ఇవి 200 నుంచి 1,200 మ‌ధ్య ఉన్నాయి.

"చాలా మంచి పురోగ‌తి"

తాజా ప‌రిశోధ‌న ఫ‌లితాల ఆధారంగా ర‌క్తంలోని టీ-క‌ణాల సంఖ్య‌ను ప‌రిశీలించేందుకు ఓ "ఫింగ‌ర్‌ప్రింట్ టెస్ట్"ను అభివృద్ధి చేసిన‌ట్లు ప‌రి‌శోధ‌కులు తెలిపారు. క‌రోనావైర‌స్ ఇన్ఫెక్ష‌న్ ఎవ‌రిలో తీవ్రంగా అవ్వ‌బోతుందో ముందుగానే గుర్తించ‌డంలో ఇది సాయం అందించే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు రోగ నిరోధ‌క క‌ణాల సంఖ్య‌ను మ‌ళ్లీ పెంచేందుకు తోడ్ప‌డే చికిత్స‌కూ తాజా ప‌రిశోధ‌న బాట‌లు వేస్తోంది.

"ఇంటెన్సివ్ కేర్‌లో క‌నిపిస్తున్న రోగుల్లో 70 శాతం మంది ర‌క్తంలోని లింఫోసైట్ల సంఖ్య‌ ఒక మిల్లీ లీట‌రు ర‌క్తంలో 800 నుంచి 400 వ‌ర‌కూ ప‌డిపోతోంది"అని సెయింట్ థామ‌స్ హాస్పిట‌ల్‌లోని క్రిట‌క‌ల్ కేర్ నిపుణుడు మ‌ను శంక‌ర్ హ‌రి తెలిపారు.

"రోగులు కోలుకునేట‌ప్పుడు.. వారిలోని లింఫోసైట్ స్థాయిలు కూడా పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది"

సెప్సిస్ రోగుల బృందంపై ఇప్ప‌టికే ఇంటెర్‌ల్యూకిన్‌-7ను ప‌రీక్షించారు. ఇది టీ-క‌ణాల సంఖ్య‌ను పెంచుతున్న‌ట్లు రుజువైంది.

తాజా ప‌రిశోధ‌న‌ను మూడు కంటే ఎక్కువ రోజులు ఇంటెన్సివ్ కేర్‌లో గ‌డిపిన‌, లింఫోసైట్‌ల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న వారిపై చేప‌డుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

"టీ-క‌ణాల సంఖ్య పెరిగితే.. ఈ ఇన్ఫెక్ష‌న్ న‌యం అవుతుంద‌ని ఆశిస్తున్నా" అని శంక‌ర్ వివ‌రించారు.

"ఓ క్రిటిక‌ల్ కేర్ నిపుణుడిగా.. ఇన్ఫెక్ష‌న్ తీవ్ర‌మైన రోగుల‌ను చూస్తుంటాను. అయితే ప్ర‌స్తుతం వారికి న‌యంచేసే చికిత్స ఏదీ మా ద‌గ్గ‌ర లేదు"

"తాజా పరిశోధ‌న చాలా మంచి పురోగ‌తి. ప్ర‌యోగ ప‌రీక్ష‌ల అనంత‌రం తాజా ఔష‌ధం విజ‌య‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు రుజువైతే.. క్రిటిక‌ల్ కేర్ నిపుణుల‌కు చాలా ప్రోత్సాహం ల‌భించిన‌ట్లు అవుతుంది"

రోగ నిరోధక వ్య‌వ‌స్థ‌పై క‌రోనావైర‌స్ ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో కూడా తాజా ప‌రిశోధ‌న వివ‌రిస్తోంద‌ని ప్రొఫెస‌ర్ హేడే చెప్పారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌చ్చిత‌మైన స‌మాచారం కోసం ఎదురుచూస్తున్న శాస్త్ర‌వేత్త‌ల‌కు ఇది కీల‌కంగా మారుతుంద‌ని అన్నారు.

"ప్ర‌పంచం మొత్తాన్నీ గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఈ వైర‌స్ చాలా భిన్న‌మైన‌ది. ముందెన్న‌డూ ఇలాంటిది మ‌నం చూడ‌లేదు. టీ-క‌ణాల వ్య‌వ‌స్థ‌ను వైర‌స్ ఎలా దెబ్బ‌తీస్తుందో స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు. ఇలాంటి ఇన్ఫెక్ష‌న్‌కు కార‌ణ‌మ‌య్యేలా వైర‌స్ ఏం చేస్తుందో క‌నిపెట్టడంపై భ‌విష్య‌త్ ప‌రిశోధ‌న‌లు దృష్టి సారించాలి" అని సూచించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)