హైస్పీడ్ ఇంట‌ర్నెట్ కనిపెట్టిన ఆస్ట్రేలియా... ఒక్క సెకనులో వేయి సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఇంటర్నెట్

ఫొటో సోర్స్, Getty Images

మునుపెన్న‌డూ చూడ‌ని రికార్డు స్థాయి ఇంట‌ర్నెట్ డేటా స్పీడ్‌ను తాము సాధించామ‌ని ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కుల బృందం తెలిపింది.

సెక‌నుకు 44.2 టెరాబైట్ల (44.2 టీబీపీఎస్‌) వేగాన్ని అందుకోగ‌లిగామ‌ని మొనాష్‌, స్విన్‌బ‌ర్న్‌, ఆర్ఎంఐటీ నిపుణుల బృందం వెల్ల‌డించింది.‌

ఈ వేగంతో సెక‌ను కంటే త‌క్కువ స‌మ‌యంలోనే వెయ్యి హై-డెఫినిష‌న్ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఆఫ్‌కామ్ వివ‌రాల ప్ర‌కారం.. బ్రిట‌న్‌లో ప్ర‌స్తుత బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ సెక‌నుకు 64 మెగాబైట్లు(64 ఎంబీపీఎస్‌). తాజాగా ప‌రిశోధ‌కులు సాధించిన స్పీడ్‌తో పోలిస్తే.. ఇది చాలా త‌క్కువ‌.

ఇంట‌ర్నెట్ స్పీడ్ ఆధారంగా ప్ర‌పంచ దేశాల‌కు ప్ర‌క‌టించిన‌ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ఎప్పుడూ మ‌ధ్య‌లోనే ఉంటుంది. బ్రాడ్‌బ్యాండ్ వేగం త‌గ్గిపోతోంద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ఇక్క‌డ‌ నెటిజ‌న్లు ఫిర్యాదులు చేస్తుంటారు.

"మైక్రో-కోంబ్"గా పిలిచే ఒకేఒక్క ప‌రిక‌రంతో తాజా వేగాన్ని అందుకోగ‌లిగామ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. ప్ర‌స్తుత‌మున్న‌ టెలికాం హార్డ్‌వేర్‌లో ఒక 80 లేజ‌ర్ల‌ను తొల‌గించి ఈ ప‌రిక‌రాన్ని అమ‌ర్చ‌డంతో రికార్డు స్పీడ్ వ‌చ్చింద‌ని వివ‌రించారు.

ఆస్ట్రేలియా నేష‌న‌ల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వ‌ర్క్ (ఎన్‌బీఎన్‌) ఉప‌యోగించే నెట్‌వ‌ర్క్‌, స‌దుపాయాల్లో ఈ "మైక్రో-కోంబ్"ను అమ‌ర్చి, ప‌రీక్షించారు.

దీంతో ఒక ఆప్టిక‌ల్ చిప్ ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌లేనంత డేటాను ఉత్ప‌త్తి చేయ‌గ‌లిగారు. ప్రపంచ వ్యాప్తంగా ఫైబ‌ర్ ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ వ్య‌వ‌స్థ‌ల్లో ఇలాంటి ఆప్టిక‌ల్ చిప్‌ల‌నే ఉప‌యోగిస్తుంటారు.‌

భ‌విష్య‌త్‌లో ఇంట‌ర్నెట్ వేగం ఎలా ఉండ‌బోతోందో త‌మ ప‌రిశోధ‌న చూపిస్తోంద‌ని ప‌రిశోధ‌కులు వివ‌రించారు.

నేటి ప్ర‌పంచంలో డేటా అవ‌స‌రాల‌కు ఈ వేగం చాలా ఎక్కువే అయినా.. బ్యాండ్‌విడ్త్‌ సదుపాయాల‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉప‌యోగ‌పడుతుంద‌ని మొనాష్ యూనివ‌ర్సిటీలో ఎల‌క్ట్రిక‌ల్‌, కంప్యూట‌ర్ సిస్ట‌మ్స్ ప్రొఫెస‌ర్ బిల్ కోర్కోర‌న్ వివ‌రించారు. కొన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఇది విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకురాగ‌ల‌ద‌ని అన్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ప్రపంచంలో అత్యధిక మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్న రెండో దేశం భారత్

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను "మైక్రో-కోంబ్"లు తీర్చ‌గ‌ల‌వ్‌

క‌రోనావైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌పంచ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ల‌తో ఇంట‌ర్నెట్ స‌దుపాయాలు తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

"వ‌చ్చే రెండు, మూడేళ్ల‌లో ఇంట‌ర్నెట్ స‌దుపాయాలపై ఒత్తిడి ఎలా ఉంటుందో ఇప్పుడు మ‌నం చూస్తున్నాం. చాలా మంది మారుమూల ప్రాంతాల నుంచి ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగిస్తున్నారు" అని కోర్కోర‌న్ అన్నారు.

"ప్ర‌స్తుతమున్న ఫైబ‌ర్ల‌తో ఎంత వేగం అందుకోవ‌చ్చో మా ప‌రిశోధ‌న చూపించింది. భ‌విష్య‌త్‌లో క‌మ్యూనికేష‌న్ నెట్‌వ‌ర్క్‌ల‌కు తాజా స‌దుపాయాలు వెన్నెముక‌లా మార‌గ‌ల‌వ‌ని నిరూపించింది"

"మ‌న‌మేమీ నెట్‌ఫ్లిక్స్‌లో న‌మ్మ‌లేని సినిమాల గురించి మాట్లాడుకోవ‌ట్లేదు"

"తాజా డేటాను సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ర‌వాణా స‌దుపాయాల్లో ఉప‌యోగించొచ్చు. టెలీ మెడిసిన్‌, విద్య‌, ఫైనాన్స్‌, ఈ-కామ‌ర్స్ రంగాల్లోనూ ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది"

తాజా ప‌రిశోధ‌న ఫ‌లితాల‌ను "సంచ‌ల‌నం"గా స్విన్‌బ‌ర్న్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డేవిడ్ మోస్ అభివ‌ర్ణించారు.

"ప్ర‌పంచ అవ‌స‌రాల‌కు స‌రిప‌డేలా బ్యాండ్‌విడ్త్‌‌ల‌ను అందించే శ‌క్తి మైక్రో-కోంబ్లకు ఉంది"

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)