రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే

  • బాసిలియో ముతాహి
  • బీబీసీ న్యూస్, నైరోబి
కబుగా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

కబుగా

సంపన్న వ్యాపారవేత్త ఫెలిసియన్ కబుగా రువాండా మారణహోమం ట్రైబ్యునల్ ప్రాసిక్యూటర్లకు దొరకకుండా రెండున్నర దశాబ్దాలకు పైగా తప్పించుకుతిరిగాడు. రెండు ఖండాలలో 28 మారు పేర్లు వాడుకుంటూ.. శక్తివంతమైన సంబంధాలను ఉపయోగించుకుంటూ పట్టుబడకుండా దాక్కున్నాడు.

రువాండా మారణహోమానికి నిధులు సమకూర్చిన ప్రధాన ఫైనాన్షియర్‌గా ఆరోపణలున్న ఫెలిసియన్ వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు. 1994లో జరిగిన మారణహోమానికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టటానికి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ పనిచేయడం ఆగిపోయినా కూడా ఆయన దొరకలేదు.

చివరికి అతడ్ని గత వారాంతంలో ఫ్రెంచ్ రాజధాని శివారులోని ఒక రహస్య ప్రదేశంలో పట్టుకున్నారు. రువాండా, యుగోస్లేవియాల్లో అపరిష్కృతంగా మిగిలిపోయిన యుద్ధ నేరాల కేసులను పరిష్కరించే విభాగం ‘ఇంటర్నేషనల్ రెసిడ్యువల్ మెకానిజం ఫర్ క్రిమినల్ ట్రిబ్యునల్స్’ (ఐఆర్ఎంసీటీ)కి సారథ్యం వహిస్తున్న ఐక్యరాజ్యసమితి యుద్ధ నేరాల ప్రాసిక్యూటర్ సెర్జ్ బ్రామ్మెర్ట్జ్ దర్యాప్తును మళ్లీ ప్రారంభించటంతో ఈ అరెస్ట్ సాధ్యమైంది.

"ఫెలిసియన్ బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియంలలో ఎక్కడో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని మాకు ఏడాది కిందటే తెలుసు. ఫ్రాన్స్‌లో దాక్కున్నాడని మేం రెండు నెలల కిందట నిర్ధారణకు వచ్చాం. ఫ్రెంచ్ అధికారులు అతడు దాక్కున్న అపార్ట్‌మెంట్‌ను గుర్తించారు. దీంతో అతడ్ని పట్టుకునే ఆపరేషన్ చేపట్టాం" అని సెర్జ్ బీబీసీకి చెప్పారు.

అతడు ఇంతకాలం తప్పించుకు తిరగగలగటానికి.. ‘‘అతడి పిల్లల సహకారం’’ ఒక ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

ఫెలిసియన్‌కి కనీసం ఐదుగురు పిల్లలు ఉన్నట్లు చెప్తారు. ఇద్దరు కుమార్తెలకు రువాండా మాజీ అధ్యక్షుడు జువనాల్ హబారిమన కుమారులతో వివాహం జరిగింది. జువనాల్ ప్రయాణిస్తున్న విమానాన్ని 1994 ఏప్రిల్ 6న కూల్చి వేయటంతో అతడు చనిపోయాడు. ఆ సంఘటనతో రువాండాలో మారణహోమం మొదలైంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ఫ్రాన్స్‌లో కబుగా నివసించింది ఇక్కడే

ఫెలిసియన్ ఆచూకీ కనిపెట్టటానికి ఫ్రెంచ్ అధికారులు అతడి పిల్లల మీద నిఘా పెట్టారు. చివరికి.. పారిస్ శివారులోని అస్నియర్స్-సుర్-సీన్‌ అనే ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో మూడవ అంతస్తులోని ఫ్లాట్‌లో అతడు ఉన్నాడని.. ఓ గుర్తు తెలియని ఆఫ్రికా దేశానికి చెందిన పాస్‌పోర్ట్‌తో నకిలీ పేరుతో నివసిస్తున్నాడని కనిపెట్టారు.

ఈ దర్యాప్తులో కరోనావైరస్ మహమ్మారి కూడా సహాయపడిందని.. ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్ కారణంగా యూరప్‌ వ్యాప్తంగా అనేక కార్యకలాపాలు స్తంభించిపోవటంతో.. ఫెలిసియన్‌ మీద దృష్టి పెట్టడానికి సమయం లభించిందని.. ఫ్రాన్స్‌లో యుద్ధ నేరాల పోలీసు విభాగానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్ ఎరిక్ ఎమెరాక్స్ పేర్కొన్నారు.

1994లో కేవలం 100 రోజుల్లో రువాండాలో సుమారు 8,00,000 మంది జనాన్ని హుటు జాతి ఉగ్రవాదులు చంపారు. మైనారిటీలైన టుట్సీ వర్గానికి చెందిన వారిని, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈ మారణహోమం సాగించారు. ఆ ఉగ్రవాదులకు.. తేయాకు వ్యాపారం ద్వారా సంపన్నుడైన ఫెలిసియన్‌ మద్దతు ఇచ్చినట్లు చెప్తారు.

ఫెలిసియన్‌ను పట్టుకోవటానికి అవసరమైన సమాచారం అందిస్తే 50 లక్షల డాలర్లు బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది.

ఫెలిసియన్ మీద 1997లో తీవ్ర మారణహోమం నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల అభియోగాలు నమోదుచేశారు. అతడి తల మీద 50 లక్షల డాలర్ల అమెరికా బహుమతి ఉంది. అయినాకానీ.. ఆఫ్రికాలో మోస్ట్ వాంటెడ్ నేరస్తుల్లో ఒకడైన ఫెలిసియన్ ఇన్ని సంవత్సరాలుగా అనేక దేశాలు, ఖండాలలో పోలీసులు, చట్టాలకు దొరక్కుండా తప్పించుకు తిరగగలగటం ఆశ్చర్యకరం.

కెన్యాలో ఆశ్రయం పొందాడా?

ఫెలిసియన్ తూర్పు ఆఫ్రికాలో.. అతడికి, అతడి కుటుంబానికి వ్యాపార ప్రయోజనాలు ఉన్న కెన్యా సహా అనేక దేశాలలో నివసించినట్లు ఆరోపణలున్నాయి.

పరారీలో ఉన్న ఈ నేరస్తుడికి కెన్యా ఆశ్రయం ఇస్తోందని, అతడిని అరెస్ట్ చేసే ప్రయత్నాలను అక్కడి శక్తివంతమైన రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

రువాండా మారణహోమంలో 8 లక్షల మందికి పైగా జనాన్ని చంపేశారు

ఇంతకీ ఫెలిసియన్ కబుగా ఎవరు?

  • 1994 మారణహోమానికి ముందు రువాండాలో అత్యంత ధనవంతుడిగా పరిగణించేవారు
  • 1970లలో తేయాకు వ్యాపారం ద్వారా సంపన్నుడయ్యాడు
  • స్వదేశంలోనూ ఇతర దేశాల్లోనూ అనేక ఇతర వ్యాపార రంగాలలోకి ప్రవేశించాడు
  • అధికార ఎంఆర్ఎన్‌డీ పార్టీకి సన్నిహితుడు - 1994లో మరణించిన అధ్యక్షుడు జువనాల్ హబారిమనకు బంధువు (కూతుర్ల వివాహం ద్వారా)
  • మారణహోమం ప్రణాళికకు అగ్రస్థాయి మద్దతుదారుడిగా, హత్యల నిర్వహణకు తన వ్యాపారం, స్థలాలను ఉపయోగించటంతో పాటు నిధులు సమకూర్చడాని ఆరోపణలున్నాయి
  • టుట్సీలను చంపాలంటూ హుటూ జాతి వారిని రెచ్చగొట్టినట్లు ఆరోపణలున్న ప్రైవేట్ రేడియో స్టేషన్ ఆర్‌టీఎల్‌ఎం ప్రధాన యజమాని
  • అతడిని అరెస్ట్ చేయటానికి అవసరమైన సమాచారం ఇచ్చిన వారికి 50 లక్షల డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది

ఫెలిసియన్ తన వ్యాపారాలను కొనసాగించిన కెన్యాకు వెళ్లటం లేదా అక్కడ నివసించారనటానికి ఆధారాలు ఉన్నాయని రువాండాకు సంబంధించిన అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ 2006లో చెప్పింది

మూడు సంవత్సరాల తరువాత.. కెన్యా ప్రభుత్వాలు ఫెలిసియన్‌ను అప్పగించడానికి నిరాకరించాయని యుద్ధ నేరాలకు సంబంధించి అప్పటి అమెరికా రాయబారి స్టీఫెన్ రాప్ ఆరోపించారు.

ప్రముఖులు హాజరైన కార్యక్రమాలకు కూడా ఫెలిసియన్‌ హాజరైనట్లు ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలను కెన్యా ఖండిస్తూనే వచ్చింది.

కెన్యాలో ఫెలిసియన్ కుటుంబానికి ఆస్తులు ఉన్నాయనే విషయంలో ఎటువంటి విభేదం లేదు. అతడి భార్య జోసెఫిన్ ముకాజిటోని సహ యజమానిగా ఉన్న ఒక ఆస్తి వివాదం కోర్టుకు కూడా వెళ్లింది. ఆమె దానిని తిరిగి పొందటానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

ఐరాస తీర్మానం ప్రకారం సభ్య దేశాలు ఫెలిసియన్ ఆస్తులను గుర్తించి స్తంభింపచేయాల్సి ఉండటంతో.. స్పానిష్ విల్లాస్ అని పిలిచే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

కబుగా కోసం చాలాకాలంగా వెతుకుతున్నారు

పాత్రికేయుల ప్రాణాలకు ముప్పు...

కెన్యాలో ఫెలిసియన్ ఉనికి గురించి పలుమార్లు మీడియా కథనాలు సూచించాయి. కానీ.. అతడు కానీ, అతడి భార్య కానీ అక్కడ నివసించినట్లు అవి ఆధారాలు చూపలేదు.

కెన్యా రాజధాని నైరోబిలో అతడు అనేకసార్లు పోలీసుల వల నుండి తప్పించుకున్నాడని చెప్తారు.

నైరోబిలో 1997 జూలై 19న పోలీసుల దాడి చేసి రువాండా మారణహోమ నిందితులు ఏడుగురిని అరెస్ట్ చేసినప్పుడు.. ఒక సీనియర్ అధికారి ముందే హెచ్చరించటంతో ఫెలిసియన్ తప్పించుకున్నాడనే ఆరోపణా ఉంది.

అతడి ఆచూకీ కనిపెట్టటానికి ప్రయత్నించిన జర్నలిస్టులకు ఆ పని ప్రమాదకరంగా కూడా మారింది.

ఫ్రీలాన్స్ రిపోర్టర్ విలియం మునుహే 2003 జనవరి 16న నైరోబిలోని తన అపార్ట్‌మెంట్లో చనిపోయి కనిపించాడు.

మునుహె ఒక వ్యాపారవేత్తగా నటిస్తూ ఫెలిసియన్‌ను అరెస్ట్ చేయడానికి ఎఫ్‌బీఐతో కలిసి ఒక స్టింగ్ ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నట్లు ఆ తర్వాత తనకు తెలిసిందని అతడి సోదరుడు జోసెఫాట్ గిచుకి చెప్పారు.

"ఆశ్చర్యకరంగా.. మునుహే ఒక బొగ్గు పొయ్యి నుంచి పొగను పీల్చి (కార్బన్ మోనాక్సైడ్ విషంతో) ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. కానీ మార్చురీలో ఉన్నప్పుడు అతడి తల మీద బుల్లెట్ గాయం ఉండటం, అతడి గదిలో రక్తం ఉండటం నేను స్వయంగా చూశాను" అని గిచుకి బీబీసీకి తెలిపారు.

ఎనిమిది సంవత్సరాల తరువాత.. జాన్ అలన్ నాము అనే జర్నలిస్ట్.. కెన్యాలో ఒక వ్యాపారవేత్తను ఫెలిసియన్ అని నమ్మేలా ఒక వ్యక్తి తనను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించాడని భావిస్తున్నట్లు చెప్పారు.

ఫెలిసియన్‌కు కెన్యా బ్యాంక్ ఖాతా ఉందని, దానితో అతడు వ్యాపారం నిర్వహిస్తున్నాడని ఆధారాలతో సహా తన పరిశోధనల్లో వెలికితీయటం పట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నందున అలా జరిగిందని ఆయన అనుకుంటున్నారు.

అతడు, అతడి కుటుంబానికి చంపేస్తామనే బెదిరింపులు మొదలవటంతో వారు కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది.

"ఫెలిసియన్‌ ఇంతకాలం తప్పించుకుని తిరుగుతూ బయటపడడానికి కారణం.. కెన్యాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల సహకారం ఉందనటానికి అతడిని అరెస్టు చేసిన చోటే సాక్ష్యం’’ అని నాము బీబీసీతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

కబుగా లాయర్

వేట సాగిందిలా...

మారణహోమం జరిగిన వెంటనే ఫెలిసియన్ స్విట్జర్లాండ్‌కు పారిపోయాడు. కానీ అక్కడ ఉండటానికి అనుమతి లభించలేదు. దీంతో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని కిన్షాసా ద్వారా ఆఫ్రికాకు తిరిగి వచ్చాడని చెప్తారు.

అతడు కెన్యాలో ఉన్నట్లు చాలా సాక్ష్యాలు సూచిస్తున్నాయి. అయతే మడగాస్కర్, బురుండి దేశాల్లో కూడా అతడిని చూసినట్లు చెప్తున్నారని బ్రామెర్ట్జ్ తెలిపారు.

కానీ అలాంటి సమాచారం ఎప్పుడూ స్థిరంగా ఉండదని.. కాబట్టి " అధునాతనంగా సమన్వయంతో ఏక కాలంలో అనేక ప్రదేశాలలో సోదాల ద్వారా చేపట్టిన ఆపరేషన్" ద్వారా అతడిని అరెస్ట్ చేయగలిగామని ఆయన చెప్పారు.

అతడు చివరిసారి 2007లో జర్మనీలో శస్త్రచికిత్స చేసుకున్నాడని పక్కాగా తెలిసిన సమాచారం. అక్కడి నుంచి దర్యాప్తు మొదలుపెడితే.. అతడి ఆచూకీ తెలుసుకోవటానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టింది.

టెలిఫోన్, ఆర్థిక సమాచారాలను విస్తృతంగా విశ్లేషించటం ద్వారా చివరికి పారిస్‌లో అతడి ఆచూకీ దొరికింది.

‘‘అతడు ఎవరి సహకారం, సహాయం లేకుండా ఫ్రెంచ్ భూభాగంలోకి రహస్యంగా వచ్చి తలదాచుకుంటున్నాడని భావించటం కష్టం" అని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధి పాట్రిక్ బౌడోయిన్ పేర్కొన్నారు.

ఇన్ని సంవత్సరాలుగా ఫెలిసియన్ ఆచూకీ తెలియకపోవటం ఎలా సాధ్యమైంది, ఎవరు సాధ్యం చేశారు అనే దానిపై దర్యాప్తు చేయాలని హ్యూమన్ రైట్స్ వాచ్‌ పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, Rex Features

లాక్‌డౌన్‌కు ముందు వాకింగ్...

ఈ వృద్ధుడు సుమారు మూడు, నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నట్లు పారిస్‌లోని అతడి ఇరుపొరుగు వారు చెప్తున్నారు.

ఫెలిసియన్ "చాలా మంచిగా" ఉండేవాడని, "ఎవరైనా పలకరించినపుడు అతడు మాట్లాడే మాటలు సరిగా వినిపించేవి కాదు" అని అతడు నివసించిన భవనంలోని ఇంటి యజమానుల సంఘం అధిపతి ఆలివర్ ఒల్సేన్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

లాక్‌డౌన్‌కు ముందు అతడు తరచూ వాకింగ్ కోసం బయటకు వెళ్లేవాడని తెలిపారు.

ఫెలిసియన్ ఇప్పుడు సెంట్రల్ ప్యారిస్‌లోని లా శాంటె జైలుకు పరిమితమయ్యాడు. అతడిని ఐఆర్ఎంసీటీ కస్టడీకి అప్పగించే వరకూ అక్కడే ఉంచుతారు.

ఇందుకు కొన్ని వారాలు లేదా నెలలు పట్టవచ్చని, హేగ్‌లో కానీ టాంజానియాలోని అరుషలో కానీ ఐసీటీఆర్ విచారణ ప్రారంభం కావటానికి ఒక సంవత్సరం పట్టవచ్చని ప్రాసిక్యూటర్ సెర్జ్ చెప్పారు.

అయితే ఫెలిసియన్ తనను ఫ్రాన్స్‌లోనే విచారించాలని కోరుతున్నట్లు అతడి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.

ఇలాంటి విధానాల వల్ల తాము ఎదురుచూస్తున్న న్యాయం జరగటం ఆలస్యం కాకుండా ఉండాలని.. మారణహోమం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారు ఆశిస్తున్నారు.

ఫెలిసియన్‌ను అరెస్టు చేసిన తరువాత రువాండా వితంతువుల బృందం అవెగా నాయకురాలు వాలెరీ ముకాబయిరె బీబీసీతో మాట్లాడుతూ.. "అతడిని అరెస్టు చేసినందుకు మారణహోమం నుండి బయటపడిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఈ వార్త కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అతడు చట్టం ముందు నిలబడబోతున్నాడు..." అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)