భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- సురేంద్ర ఫుయాల్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, PRAKASH MATHEMA/AFP via Getty Images
నేపాల్ తమదిగా చెబుతున్న లిపులేఖ్ ప్రాంతాన్ని అనుసంధానించే సరిహద్దు మార్గాన్ని భారత్ ఏకపక్షంగా తెరవడంపై నేపాలీ నాయకులు, ప్రముఖులు, సాధారణ పౌరుల నుంచి నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. భారత్-నేపాల్‌ల మధ్య దౌత్యపరమైన చర్చలు ఎప్పుడు మొదలవుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హిమాలయాలకు దక్షిణాన ఉండే నేపాల్, భారత్‌ల సంస్కృతీ సంప్రదాయాలు, భౌగోళిక పరిస్థితులు, దౌత్య సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవి.
రెండు దేశాల్లోని భిన్న జాతులు, భిన్న మతాలు, లౌకిక భావనలు ఈ బంధాలను మరింత బలోపేతం చేశాయి. ఒకరిపై మరొకరు ఆధారపడుతూ ముందుకుసాగేలా నడిపించాయి. ఈ బంధాల్లో కొన్ని ఒడిదుడుకులూ ఉన్నాయి.
భౌగోళిక-రాజకీయ, సరిహద్దు వివాదాలు గతంలోనూ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేశాయి.
మహాకాళి (శారద) నదికి పుట్టినిల్లు అయిన 350 చ.కి.మీ. భూభాగానికి సంబంధించిన సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో రెండు దేశాల మధ్య నడుస్తోంది. ఈ ప్రాంతం ప్రస్తుతం భారత్ ఆధీనంలో ఉంది. సుస్తాలోని గండక్ (నారాయణి) నది పరిసరాల్లో 140 చ.కి.మీ. భూభాగాన్ని భారత్ ఆక్రమించిందని కూడా నేపాల్ చెబుతోంది. అయితే ఈ ఆరోపణను భారత్ ఖండిస్తోంది. చర్చల కోసం ఈ వివాదాలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాయి.
భారత్-నేపాల్ సంబంధాలు ఒడిదుడుకులకు ఎదురుకావడం ఇదేమీ తొలిసారి కాదు. 1990 నుంచీ ఈ రెండు దేశాలు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఎదుర్కొన్నాయో.. ఇప్పుడు చూద్దాం.
ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ ప్రధానమంత్రి పీ శర్మా ఓలీతో భారత ప్రధాని మోదీ
ఆర్థిక దిగ్బంధం 1989-1990
హిమాలయ దేశమైన నేపాల్‌కు పశ్చిమం, దక్షిణం, తూర్పు.. ఇలా మూడు వైపులా ఉండేది భారత్ భూభాగమే. ఉత్తరాన మాత్రం చైనా (టిబెట్) ఉంటుంది. అయితే విదేశాల నుంచి చమురు, ఇతర అత్యవసర సరకులను సముద్ర మార్గం గుండా తెప్పించుకొనేందుకు నేపాల్ భారత్‌పైనే ఆధారపడుతోంది.
నేపాల్ రాజు బిరేంద్ర హయాంలో భారత్ అసంతృప్తితో ఉండేది. వాణిజ్య మార్గాలు, వ్యాపారాల కోసం ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుందామన్న నేపాల్ ప్రతిపాదననూ భారత్ తిరస్కరించింది.
ఈ ద్వైపాక్షిక విభేదాలే.. మొత్తం 21 సరిహద్దు మార్గాలను భారత్ మూసేసేందుకు కారణమయ్యాయి. అంతేకాదు నేపాలీ ట్రక్కులు, అద్దెకు తీసుకున్న రైళ్లను కోల్‌కతా నౌకాశ్రయానికి చేరుకోకుండా భారత్ అడ్డుకుంది. ఫలితంగా నేపాల్‌కు సముద్ర మార్గాలతో సంబంధాలు తెగిపోయాయి.
తర్వాత, విమానాలపై దాడిచేసే ఫిరంగులను అతి తక్కువ ధరకు చైనా నుంచి నేపాల్ కొనుగోలు చేసింది. అంతేకాదు భారత్ నుంచి వచ్చే వలస కార్మికులకు ఉద్యోగ పరిమితులూ ప్రవేశపెట్టింది. దీంతో భారత్‌లో ఆగ్రహ స్థాయిలు మరింత పెరిగాయి.
13 నెలల ఆర్థిక దిగ్బంధం నేపాల్ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేసింది. అంతేకాదు భారత్ వ్యతిరేక భావజాలాన్ని పెంచింది. నేపాల్‌లో కనిపించే అరుదైన వృక్ష సంపదపైనా చమురు సంక్షోభం ప్రభావం చూపింది.
నేపాల్‌లో చెలరేగిన మొదటి ప్రజా ఉద్యమం తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. ఈ ఉద్యమమే నేపాల్‌లో రాజకీయ పార్టీలపై తన తండ్రి మహేంద్ర విధించిన 30ఏళ్ల నిషేధాన్ని రాజు బిరేంద్ర ఎత్తివేసేలా చేసింది.
ఆ తర్వాత ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వ సారథి కృష్ణ ప్రసాద్ భట్టారాయ్.. కొత్త ఒప్పందాల కోసం భారత్‌లోనూ పర్యటించారు. దీంతో రెండు దేశాల మధ్య కొత్త బంధాలు పెనవేసుకున్నాయి.
నేపాల్, భారత్‌ల సంస్కృతీ సంప్రదాయాలు, భౌగోళిక పరిస్థితులు, దౌత్య సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవి
మహాకాళి ఒప్పందం-1996
ఏప్రిల్ 1995లో అప్పటి నేపాల్ కమ్యూనిస్టు ప్రధాన మంత్రి మన్మోహన్ అధికారి.. దిల్లీలో పర్యటించారు. నేపాల్-భారత్ సంబంధాలకు పునాదిగా మారిన పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ-1950ని సమీక్షించాలని, సరిహద్దులను పూర్తిగా తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో మళ్లీ విభేదాలు తలెత్తాయి.
భారత్‌కు సరిహద్దుల్లోని దక్షిణ తరాయ్ మధేశీ ప్రాంతంలో మారుతున్న జనాభా సమీకరణాలపై నేపాల్‌లో ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది.
చైనాతో సంబంధాలు మెరుగు పరుచుకుంటూనే.. తమకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలంటూ అధికారి పిలుపునిచ్చారు. అదే సంవత్సరం చివర్లో ప్రతిపాదిత మహాకాళీ ఒప్పందంపై వాడీవేడీ చర్చలు జరిగాయి. జాతీయ ప్రయోజనామా? లేదా భారత్‌కు ప్రయోజనామా? అంటూ నిరసనా వ్యక్తమైంది.
ఆ తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వ స్థానంలో.. షేర్ బహదూర్ దేఒబా నేతృత్వంలో నేపాలీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మహాకాళి నదిపై ప్రతిపాదించిన ఆనకట్ట నుంచి వచ్చే విద్యుత్, జలాల పంపకాలపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ.. 1996లో మహాకాళి ఒప్పందంపై భారత్-నేపాల్ సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందమే నదీ జలాల పంపకాలతోపాటు పంచేశ్వర్ ప్రాజెక్టుకూ బాటలు పరిచింది. నేపాల్‌లోని దార్చులా, భారత్‌లోని ధార్చులా ప్రాంతాల్లో 315 మీటర్ల ఈ ఆనకట్టను ప్రతిపాదించారు. ఆనకట్ట నుంచి రెండు దేశాల వినియోగం కోసం 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికీ ఈ ఒప్పందంలో ప్రతిపాదనలున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు పురోగతి నత్తనడకన సాగుతూ వస్తోంది.
అయితే ఒప్పందంలోని కొన్ని జాతి వ్యతిరేక నిబంధనలు నేపాలీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. 1998లో సీపీఎన్-యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ చీలికకు ఇదీ ఒక కారణం.
తాజా లిపులేఖ్ వివాదం నడుమ.. నేపాలీ ప్రభుత్వాన్ని మహాకాళీ ఒప్పందమూ వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సీపీఎన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావలి ఈ విషయంపై మాట్లాడారు కూడా. "మహాకాళి నదికి సంబంధించిన భూభాగం వివాదం సద్దుమణగకముందే 1996లో ఒప్పందంపై సంతకాలు చేయడం తప్పిదమే" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, SAVE THE BORDER CAMPAIGN/HANDOUT
'లిపులేఖ్, లింపియాధురా కాలాపానీ' తమవే అంటూ కొత్త మ్యాప్‌ను ఆమోదించిన క్యాబినెట్
మావోయిస్టు అతివాదానికి ముగింపు-2006
నేపాల్‌ను గణతంత్ర రాజ్యంగా మార్చేందుకు సీపీఎన్ మావోయిస్టు పార్టీ సాయుధ తిరుగుబాటును ఎంచుకోవడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. జూన్, 2010లో రాజ భవనంలో సామూహిక హత్యలు జరిగాయి. రాజు బిరేంద్ర కుటుంబం మొత్తాన్నీ ఊచకోత కోశారు. దీనిపై విచారణ కోసం రాజు సోదరుడు గ్యానేంద్ర ఓ కమిషన్ ఏర్పాటుచేశారు. ఈ ఊచకోతకు యువరాజు దీపేంద్ర బాధ్యుడని కమిషన్ ఆరోపించింది.
అయితే ఈ ఊచకోతకు గ్యానేంద్రే కారణమని కుట్ర సిద్ధాంతాలు చాలా వెలుగులోకి వచ్చాయి. కొందరైతే దీని వెనక భారత్ ఉందనీ ఆరోపించారు. అప్పుడే నేపాల్ అత్యయిక పరిస్థితిలోకి వెళ్లిపోయింది. మరోవైపు భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలూ దెబ్బతిన్నాయి. అయితే నేపాల్ రాజకీయ పార్టీలు, భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.
భారత్‌తో గ్యానేంద్ర అనుసరించిన విధానాలు మాత్రం మళ్లీ మళ్లీ విఫలం అవుతూనే వచ్చాయి. మరోవైపు భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టు నాయకులు, కొందరు నేపాలీ రాజకీయ నాయకులతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి.
నవంబరు 2005లో భారత్ మధ్యవర్తిత్వంపై నేపాల్‌లోని ఏడు పార్టీల సంకీర్ణం, మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నేపాల్ రాచరిక వ్యవస్థపై ప్రజా ఉద్యమానికి ఈ ఒప్పందం పునాది వేసింది. నేపాల్‌తో భారత్ అనుసరిస్తున్న విధానాల్లో మార్పులకు ఇదీ ఒక కారణం.
"నేపాల్‌లో సుస్థిరత కోసం రాజ్యాంగబద్ధ రాచరికంతోపాటు భిన్న పార్టీలున్న ప్రజాస్వామ్యం" అనేది రెండు స్తంభాల విధానంగా భారత్ అనుసరించేది. అయితే అది విఫలమైంది.
ఏడాది తర్వాత.. నవంబరు 2006లో, సమగ్ర శాంతి ఒప్పందం (నేపాల్ పీస్ డీల్) కుదిరింది. ఆ తర్వాత నేపాల్‌లో సాయుధ తిరుగుబాటు విధ్వంసమే సృష్టించింది. దాదాపు 17,000 మందిని పొట్టన పెట్టుకుంది.
భారత్‌లోని హిందూ అతివాదులతోపాటు ప్రపంచం చూస్తుండగానే.. 2008, మే 29న నేపాల్ రాజ్యాంగ సభ.. దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. దీంతో హిందూ రాచరిక వ్యవస్థ కథ ముగిసింది. కొన్ని రోజులకే చివరి రాజు గ్యానేంద్ర రాజ భవనాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.
ఫొటో సోర్స్, AFP
మావోయిస్టు నాయకుడైన పుష్పకుమార్ ధమాల్.. ప్రచండ పేరుతో ప్రాచుర్యం పొందారు
చైనాలో ప్రచండ పర్యటన-2008
2008 ఆగస్టులో, అప్పటి నేపాల్ ప్రధాని ప్రచండ.. భారత్ విశ్మయానికి గురయ్యే పనిచేశారు. ప్రధాని పదవి చేపట్టాక మొదట భారత్‌లో పర్యటించే సంప్రదాయాన్ని వదిలిపెట్టి.. ఆయన చైనాకు వెళ్లారు. దీంతో భారత్‌లో అనుమానాలు మరింత పెరిగాయి.
బిహార్ దుఃఖదాయిణిగా పిలిచే కోశి నది తూర్పు కట్ట తెగిపోవడంతో.. ఉత్తర బిహార్‌తోపాటు నేపాల్‌లోని సున్సారీలోనూ వరదలు విధ్వంసం సృష్టించిన కొన్ని వారాలకే ఆయన భారత్‌కు బదులుగా చైనాలో పర్యటించడంతో ఆందోళన మరింత ఎక్కువైంది.
అయితే ఈ విభేదాలకు త్వరగానే ప్రచండ ముగింపు పలికారు. ఒక నెల రోజుల్లోనే ఆయన భారత్‌లో పర్యటించారు. జల వనరులపై సహకారం, కోశి కట్ట పునర్నిర్మాణం, 1950నాటి పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ-1950 ఒప్పందం సమీక్షలపై భారత్‌తో ఆయన వరుస ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరోవైపు నేపాల్‌కు ఇచ్చే రుణ పరిమితినీ భారత్ పెంచింది.
కొత్త రాజ్యాంగం, సరిహద్దుల్లో ప్రతిష్టంభన-2015
2014 ఆగస్టులో నరేంద్ర మోదీ చరిత్రాత్మక నేపాల్ పర్యటన అద్భుతాలు చూపించింది. 17ఏళ్ల తర్వాత నేపాల్‌లో పర్యటించిన తొలి ప్రధాన మంత్రి ఆయనే. రాజ్యాంగ సభలో ప్రసంగంతోపాటు రాజధాని కాఠ్మాండూ వీధుల్లోని నేపాలీలతో సరదాగా మాట్లాడి... నేపాలీ ప్రజలను ఆకట్టుకున్నారు.
అయితే, ఏడాది తర్వాత మళ్లీ పరిస్థితులు మారిపోయాయి.
సెప్టెంబరు 2015లో కొత్త రాజ్యాంగాన్ని నేపాల్ రాజ్యాంగ సభ ఆమోదించింది. ఇటీవల కాలంలో నేపాల్-భారత్ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాల్లో ఇదీ ఒకటి. దీని తర్వాత దాదాపు ఆరు నెలలపాటు నేపాల్-భారత్ సరిహద్దులు మూతపడ్డాయి.
రాజ్యాంగంలో భారత్ సూచించిన మార్పులను నేపాల్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అంతేకాదు రాజ్యాంగాన్ని ఆమోదించినట్లు ప్రకటించింది.
ఫొటో సోర్స్, PRAKASH MATHEMA
దక్షిణ నేపాల్‌లోని మధేశీలు, థారులతోపాటు మైనారిటీ జనజాతి నాయకులకు ఈ కొత్త రాజ్యాంగం ఆగ్రహం తెప్పించింది. దక్షిణ నేపాల్‌లో వీరు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించారు. చమురు, గ్యాస్ లాంటి కీలక సరకులు నేపాల్‌కు అందకుండా నేపాల్-భారత్ సరిహద్దులను వారు దిగ్బంధించారు.
అయితే, భారత్ మరోసారి ఆర్థిక దిగ్బంధం విధించిందని నేపాల్ ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. మధేశీ కార్యకర్తలవైపు చూపిస్తూ.. వారే కోల్‌కతా నౌకాశ్రయంతో అనుసంధానించే కీలక బీర్గంజ్-రక్షౌల్ సరిహద్దుతోపాటు కీలక సరిహద్దు మార్గాలను దిగ్బంధించారని భారత్ తెలిపింది.
పశ్చిమ, మధ్య నేపాల్‌లో భారీ భూకంపాలు విధ్వంసం సృష్టించిన నాలుగు నెలలకే నేపాల్‌లో ఈ దిగ్బంధం.. మానవతా, ఆర్థిక సంక్షోభాలకు కారణమైంది. నేపాల్ నగరాల్లో పెట్రోల్ కోసం ఆగ్రహంతోనున్న జనాలు బారులు తీరడం సర్వసాధారణమైంది.
సాయం కోసం చైనా వైపు నేపాల్ చూసిన సమయంలో... మోదీ ప్రభుత్వం, భారత్‌లపై నేపాల్ ప్రజల్లో వ్యతిరేకత మరింత ఎక్కువైంది. చాలా మంది నేపాలీ నెటిజన్ల పోస్టుల్లో సర్వసాధారణంగా కనిపించే బ్యాక్ఆఫ్ఇండియా హ్యాష్‌ట్యాగ్‌లు పరిస్థితికి అద్దంపట్టాయి.
ఇప్పుడు చైనా, భారత్, నేపాల్‌ల కూడలిలోనున్న లిపులేఖ్‌పై వివాదం చెలరేగిన సమయంలో.. ఆ హ్యాష్‌ట్యాగ్ మళ్లీ ట్రెండ్ అవుతోంది. హిమాలయాలంత పురాతనమైన ద్వైపాక్షిక సంబంధాలను మళ్లీ ఇది ఒడిదుడుకులకు గురిచేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- వీడియో, ఇండియా లాక్డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- కృత్రిమ మేధస్సు: కరోనావైరస్ను ఈ అధునాతన సాంకేతికత అడ్డుకోగలదా?
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)