కరోనావైరస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌తో మీ మీద అడుగడుగునా నిఘా పెడుతున్నారా?

  • జుబేర్ అహ్మద్
  • బీబీసీ హిందీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అస్థిరపరిచినా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) వినియోగ విస్తృతి పెంచేందుకు మాత్రం దారులు వేసింది. కృత్రిమ మేధను కేవలం కరోనా వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియలోనో.. కరోనా వ్యాప్తి నిరోధక ప్రయత్నాల్లోనే కాదు వ్యక్తిగత గోప్యతకు తూట్లు పొడిచేలా ముందెన్నడూ చూడని విధంగా పౌరులపై నిఘా పెంచేందుకూ వాడుతున్నారు.

ఇజ్రాయెల్‌కు చెందిన మేధావి యువాల్ నో హరారీ ఇటీవల ‘బీబీసీ హార్డ్ టాక్‌’లో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజలు వందేళ్లు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కరోనా మహమ్మారి వ్యాపించిన ఈ కాలాన్ని కొత్త నిఘా శకం మొదలైన క్షణంగా గుర్తిస్తారని అన్నారు. ముఖ్యంగా మనుషులను హ్యాక్ చేసేలా చర్మం కింద అమర్చే చిప్‌లు వంటివి 21వ శతాబ్దంలో అతిపెద్ద పరిణామంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు.

అంతేకాదు.. బయోమెట్రిక్ డాటా మనుషులు తమను తాము తెలుసుకోవడం కంటే ఎక్కువగా వారి గురించి చెప్పే వ్యవస్థను ఏర్పరుస్తుందనీ ఆయన అన్నారు.

మనిషి మనసులోని భావాలను, ఉద్వేగాలను తెలుసుకోగలిగేలా అతని స్మార్ట్ ఫోన్‌‌లో కానీ, బయోమెట్రిక్ బ్రేస్‌లెట్‌లో కానీ యాప్స్ ఉంటాయన్నది ఆయన ఉద్దేశం.

ఫొటో సోర్స్, Getty Images

మర, మనిషిల సమ్మేళనం

ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది కానీ త్వరలో ఇదంతా నిజం కాబోతుంది.

‘‘మీరు ఆలోచిస్తే ఆ ఆలోచనమిటో చెప్పేసే యంత్రాల ఆవిష్కరణ ఎంతో దూరంలో లేదు’’ అని వాంకోవర్‌లో ఉంటున్న టెకీ కుమార్ బి. గంధం ‘బీబీసీ’తో చెప్పారు. ఈ ప్రయోగాలకు డ్రైవర్‌లెస్ కార్ ప్రమోటర్ ఎలాన్ మస్క్ సంస్థ న్యూరాలింక్ నిధులు సమకూరుస్తోంది.

కాలిఫోర్నియాలో ఉన్న న్యూరాలింక్ 15.8 కోట్ల డాలర్ల నిధులు సమకూరుస్తోంది. మనిషి మెదడులో అమర్చగలిగేటంతటి అతి సూక్ష్మ చిప్‌లను ఇది అభివృద్ధి చేసింది. ఈ ఎలక్ట్రోడ్లు వెయ్యి వేర్వేరు లొకేషన్లను రీడ్ చేయగలరవు.

ఇవి ఆ మనిషి ధరించే గాడ్జెట్‌కు అనుసంధానంగా ఉంటూ పనిచేస్తాయి. ఇలా మనిషి ఆలోచనలను చదవగలిగే పరికరాలు వచ్చాక ముందుముందు అచ్చం మనిషిలాగే ఆలోచించే పరికరాలూ రావొచ్చని భావిస్తున్నారు.

‘‘అయితే.. ఇలాంటి పరికరాల వల్ల కలిగే పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి. ఈ టెక్నాలజీ విజయవంతమై వాణిజ్య వినియోగం కోసం అందుబాటులోకి కనుక వచ్చేస్తే చాలా ఇబ్బందులు మొదలవుతాయి.

ఉదాహరణకి.. ఒక నిరంకుశ నేత చేతికి ఇది చిక్కితే ఆయన ఉపన్యసిస్తున్నప్పుడు ఎవరికైనా ఆయన మాటలు నచ్చకపోతే అది ఆయనకు తెలిసిపోతుంది.ఆయన ప్రసంగానికి బహిరంగంగా చప్పట్లు కొట్టినా లోలోన అది నచ్చకపోతే ఆ విషయం పసిగట్టేస్తారు.

దాంతో అసంతృప్తి ఉన్నవారిని లక్ష్యం చేసుకోవచ్చు.అది అసమ్మతిని, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంది’’ అంటారు హరారి.

ఫొటో సోర్స్, SPL

ఫొటో క్యాప్షన్,

2004 నాటి ఈ ఫొటోలో డాక్టర్ విన్సీ రోబో సర్జరీ చేయటం చూడొచ్చు

ఇంతకీ ఏమిటీ కృత్రిమ మేధ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సాంకేతిక పరిజ్ఞానం.

కంప్యూటర్లు మనిషిలా ఆలోచించడానికి, పనిచేయడానికి వీలు కల్పించే పరిజ్ఞానం. పరిసరాల నుంచి తెలుసుకున్న, గ్రహించిన జ్ఞానం సహాయంతో స్వయం నిర్ణయాలు తీసుకుని ప్రతిస్పందించడం దీని లక్షణం.

ఇది వివిధ దశల్లో ఇప్పటికే ఉన్నప్పటికీ మరింత కచ్చితత్వ సాధన దిశగా ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇది కచ్చితత్వంలో పనిచేయడానికి గాను నాణ్యమైన డాటా పెద్ద మొత్తంలో కావాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్య సేతు సురక్షితమేనా?

ఈ ఏడాది ఏప్రిల్ 2న భారత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి చర్చనీయంగా మారిన ఆరోగ్య సేతు యాప్ సంగతేంటో చూద్దామిప్పుడు.

ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులంతా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ దీన్ని తప్పనిసరి చేసినప్పటి నుంచి దీనిపై అనుమానాలు మొదలయ్యాయి.

దీన్ని వాడేవారు బ్లూటూత్, జీపీఎస్ నిత్యం ఆన్ చేసి ఉంచాల్సి ఉంటుంది.

అంటే... వారి కదలికలన్నీ తెలుసుకోవచ్చు. యూజర్ లొకేషన్ డాటా తీసుకుని దాన్ని సర్వర్‌కు అప్‌లోడ్ చేస్తామంటూ ఈ యాప్ ప్రైవసీ పాలసీలోనూ స్పష్టంగా ఉంది.

బ్లూటూత్ ఎనేబ్లింగ్ కాంటాక్ట్ ట్రేసింగ్ విధానం, మేపింగ్ వల్ల కోవిడ్-19 వ్యాప్తి నివారణకు చేసే ప్రయత్నాలకు ఈ యాప్ సహకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

మే 26 వరకు 11.4 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ప్రపంచంలోని ఏ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ కూడా ఇన్ని డౌన్‌లోడ్‌లను కలిగి లేదు.

‘‘12 భాషల్లో లభించే ఈ యాప్ యూజర్లలో దాదాపు 98 శాతం మంది ఆండ్రాయిడ్ ఓఎస్ వాడుతున్నవారే. 9 లక్షల మంది యూజర్లకు ఇది క్వారంటైన్, జాగ్రత్తలు, టెస్టింగు విషయంలో సలహాలు అందించిందని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉంది.

మరి, ఇంతవరకు సేకరించిన డాటా సంగతేంటి? కరోనా మహమ్మారి తరువాత ఆరోగ్య సేతు యాప్ ద్వారా సేకరించిన డాటా మొత్తం దానంతట అదే డిలీట్ అయిపోతుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

యాప్ డిజైన్, సోర్స్ వంటివన్నీ ప్రభుత్వం ఇప్పుడు వెల్లడించింది. సుమారు 30 ప్రభుత్వాలు కోవిడ్ నియంత్రణకు ఇలాంటి యాప్సే రూపొందించాయి.

చైనా కోవిడ్ కట్టడి కోసం రూపొందించిన అధికారిక యాప్ కూడా యూజర్ల కదలికలు తెలుసుకుంటుంది. చైనాలోనూ ఈ యాప్‌ను తప్పనిసరి చేశారు.

ఫొటో క్యాప్షన్,

జపాన్ ప్రొఫెసర్ హిరోషి ఇషిగురో తన సొంత క్లోన్ రోబోను తయారుచేశారు

కార్నెగీ నివేదికలో..

గత ఏడాది చివర్లో అమెరికాకు చెందిన కార్నెగీ సంస్థ ఒక నివేదికలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను విస్తృతంగా వాడుతుండడాన్ని ప్రస్తావించింది.

లిబరల్ డెమొక్రసీస్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సర్వేలెన్స్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు ఆ నివేదిక తెలిపింది.

ప్రపంచంలోని సుమారు 100 ప్రభుత్వాలకు అమెరికా, చైనాలకు చెందిన సంస్థలే అధునాత ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్సు పరిజ్ఞానాన్ని అందించినట్లు నివేదిక వెల్లడించింది.

‘‘చైనా, రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఏఐ టెక్నాలజీని సామూహిక నిఘా కోసం వినియోగిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాలకూ దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయ’’ని కార్నెగీ నివేదిక తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఆధార్‌తోనూ..

పౌరుల బయోమెట్రిక్, జనాభా డాటా ఆధారంగా రూపొందించిన భారత్ ప్రాజెక్ట్ ఆధార్ సంగతి కూడా ముగిసిన అధ్యాయమేమీ కాదని కుమార్ గంధం అన్నారు.

‘‘ఇంకా దీనిపై ఆందోళన ఉంది.. హ్యాకింగ్, టెక్నాలజీ సాయంతో ప్రభుత్వం పౌరులపై నిఘా పెట్టొచ్చు’’ అన్నారాయన. ‘‘భారత్ ప్రభుత్వం వద్ద తన 130 కోట్ల ప్రజల డాటా ఉంది. ఈ డాటా సహాయంతో ప్రభుత్వం వారికి నేరుగా నగదు సహాయం అందించగలుగుతుంది. అదే సమయంలో వారిపై నిఘా పెట్టే అవకాశం కూడా ప్రభుత్వం చేతిలో ఉంది’’ అని అభిప్రాయపడ్డారాయన.

ఆరోగ్య సేతు యాప్‌ను దుర్వినియోగం చేసే అవకాశమే లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ దానిపై ఇంకా ఆందోళన ఉందని ఆయన అన్నారు. ‘‘ఇది టూ వే ట్రాఫిక్ యాప్ కాదు. ప్రభుత్వానికి మీ కదలికలు తెలుస్తాయి.

కానీ, మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పడానికి అందులో అవకాశం లేదు’’ అంటారాయన.

‘‘థర్డ్ పార్టీ యాప్స్ వాడుతున్నట్లు డాటా ప్రైవసీ విషయంలో ఎప్పుడూ ఆందోళన ఉంటుంద’’ని న్యూయార్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు యోగేశ్ శర్మ అన్నారు.యూజర్ వైపు నుంచి డాటా తొలగించే అవకాశం ఉండాలని, యాప్ తన వద్ద ఉన్న డాటాను ఇతరులతో షేర్ చేయకుండా గట్టి నిబంధనలు ఉండాలని, సర్వర్ల నుంచి కూడా శాశ్వతంగా డాటా తొలగించేలా ఉండాలని.. ఇవన్నీ భారత్ వంటి దేశాల్లో అవసరాలని యోగేశ్ అన్నారు.

అయితే, సింగపూర్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ QUILT.AI మాత్రం ఆరోగ్య సేతు యాప్ గురించి అనవసరంగా భయపడుతున్నారంటోంది. ఆరోగ్య సేతు ఐడెంటిటీ, ప్రయాణ చరిత్రతో ముడిపడి ఉందని సంస్థకు చెందిన అంగద్ చౌదరి, అనురాగ్ బెనర్జీ చెప్పారు.

‘‘ఈ యాప్ గురించి మాట్లాడడానికి సంబంధించిన అర్హత మాకు లేనప్పటికీ దీన్ని సర్వేలెన్స్‌కు వాడుతారని భయపడాల్సిన పని మాత్రం లేదని చెప్పగలం.

ఎందుకంటే.. మెషిన్ లెర్నింగ్ యాప్‌లు మీరు ఎంత సమాచారం అందిస్తే అంతమేరకే పనిచేస్తాయి. లొకేషన్, ఐడెంటిటీ, ట్రావెల్ హిస్టరీలను ఆరోగ్య సేతు యాప్ తీసుకుంటుంది.

దాన్నిబట్టి అది కొన్ని అంచనాలు మాత్రమే వేయగలదు. అంతేకానీ, ఇది నిఘా పెడుతుందని భయపడనవసరం లేదు’’ అన్నారు వారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)