జార్జ్ ఫ్లాయిడ్: అమెరికాలో ఆఫ్రో అమెరికన్ హత్య కేసులో ప్రధాన నిందితుడికి 12.5 లక్షల డాలర్ల పూచీకత్తుతో బెయిల్

ఫొటో సోర్స్, AFP
ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిన్నియాపోలిస్ ప్రాంతపు భద్రతాధికారి డెరెక్ చావిన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్బంగా తొలిసారి కోర్టు విచారణకు హాజరయ్యారు.
ఆయనకు 12.5 లక్షల డాలర్ల (దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు) పూచీకత్తుతో బెయిల్ లభించింది. కేసు తీవ్రత, ప్రజాగ్రహం కారణంగానే దీన్ని ఒక మిలియన్‌కు పెంచినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
సెకండ్ డిగ్రీ మర్డర్ ఆరోపణల కింద డెరెక్ చావిన్‌ను విచారిస్తున్నారు. ఈ హత్యలో అతనికి సహకరించారన్న ఆరోపణలపై మరో ముగ్గురు అధికారులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.
ఫ్లాయిడ్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ వినిపించింది. మే 25న జరిగిన ఒక ఘటనలో ఆఫ్రో-అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ మెడ మీద తెల్లజాతి పోలీస్ అధికారి చావిన్ మోకాలితో చాలాసేపు నొక్కిపట్టడంతో ఆయన మరణించారు. ఈ ఘటన బాధ్యులైన చావిన్, మరో ముగ్గురు అధికారులను ప్రభుత్వం తొలగించింది.
ఫొటో సోర్స్, Getty Images
హ్యూస్టన్ సిటీలో జార్జ్‌కు అంత్యక్రియలు జరుగుతాయి
మరోవైపు జార్జి ఫ్లాయిడ్ సొంత ప్రాంతమైన టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ సిటీలో ఆయన మృతదేహానికి స్థానికులు నివాళులు అర్పించారు. స్థానిక ది ఫౌంటెయిన్ ఆఫ్ ప్రెయిజ్ చర్చిలో ఆరు గంటలపాటు సందర్శనార్దం ఉంచిన జార్జ్ భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.
మంగళవారం నాడు హ్యూస్టన్ సిటీలో జార్జ్‌కు అంత్యక్రియలు జరుగుతాయి. మిన్నియాపోలిస్, నార్త్ కరోలీనా ప్రాంతాలలో ఆయన స్మృత్యర్దం పలు కార్యక్రమాలు జరిగాయి. శనివారం నాడు ఫ్లాయిడ్ కుటుంబ సభ్యుడొకరు వెంటరాగా, ఆయన మృతదేహాన్ని విమానంలో టెక్సాస్‌కు తరలించారు.
రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న జో బైడెన్ సోమవారంనాడు టెక్సాస్‌లో ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ''ఆయన వారి ఆవేదనను విన్నారు. వారికి సానుభూతి తెలిపారు'' అని ఫ్లాయిడ్ కుటుంబ సభ్యుడు బెంజమిన్ క్రంప్ వెల్లడించారు.
ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ''బాధలో ఉన్న కుటుంబానికి ప్రపంచమంతా సానుభూతి తెలుపుతోంది'' అని క్రంప్ అన్నారు. మంగళవారం జరగబోయే అంత్యక్రియలకు బైడెన్ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని కూడ ఇవ్వనున్నట్లు ఆయన సహచరులు వెల్లడించారు.
ఫొటో సోర్స్, Reuters
నిందితుడు డెరక్ చావిన్ వీడియో లింక్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు
బెయిల్ పిటిషన్ విచారణలో ఏం జరిగింది ?
సోమవారంనాడు చావిన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. 15 నిమిషాల పాటు విచారణ జరగ్గా చావిన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నారింజ రంగు సూట్ ధరించిన చావిన్ చేతికి సంకెళ్లతో ఒక చిన్న టేబుల్ మీద కూర్చుని కనిపించారు.
ఎలాంటి షరతులు లేకుండా 12.5 లక్షల డాలర్లకు బెయిల్ మంజూరు చేస్తామని జడ్జ్ జెన్నిసీ ఎం.రీడింగ్ వెల్లడించారు. లేదంటే 10 లక్షల డాలర్లతో కండీషన్లతో కూడిన బెయిల్ ఇస్తామని జడ్జ్ తెలిపారు.
జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలవకుండా ఉండటం, ఆయుధాలను ప్రభుత్వానికి అప్పజెప్పడం, విచారణ జరుగుతున్నంత కాలం న్యాయ, రక్షణ విధుల్లో పాలుపంచుకోకపోవడం అనేవి 10 లక్షల డాలర్ బెయిల్ నిబంధనలు. భారీ పూచికత్తుపై చావిన్ లాయర్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. ప్రస్తుతం చావిన్ మిన్నెసోటా స్టేట్ ప్రిజన్లో ఉన్నారు. జూన్ 29న ఆయన కేసులో తదుపరి విచారణ ఉంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
చావిన్ మీద నేరారోపణలేంటి?
చావిన్ మీద మూడు వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనుకోకుండా సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మానవ హననం. ఈ సెక్షన్ల కింద వరసగా 40, 25, 10 సంవత్సరాల జైలు శిక్షలు అనుభవించాల్సి రావచ్చు.
ఇంకా మరికొన్ని నేరారోపణలు కూడా చేర్చే అవకావం ఉంది. అయితే ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఆరోపణలు చేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే అతని వ్యూహాలను, ఉద్దేశాలను ప్రాసిక్యూషన్ నిరూపించాల్సి ఉంటుందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఎక్కువ నేరారోపణలు చేయడం ద్వారా నిందితుడికి తప్పకుండా శిక్ష పడేలా ప్రాసిక్యూటర్స్ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
పోలీసులు మెడ పట్టుకోవడం, మెడ మీద ఒత్తిడి పెంచే చర్యలను బ్యాన్ చేస్తూ మిన్నియాపోలీస్ సిటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌లోని డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు పోలీస్ సంస్కరణలకు చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇటు ఫ్రాన్స్‌లో కూడా బ్లాక్‌లైవ్స్ మ్యాటర్ ఉద్యమం తాలూకు నిరసనలు కనిపించాయి. తమ దేశంలో పోలీసులు అరెస్టు సమయంలో మెడలు పట్టుకుని ఈడ్చుకు రావడంలాంటి చర్యలను ఇకపై చేయబోరని ఫ్రాన్స్ హోంమంత్రి క్రిస్టోఫీ క్యాస్టనర్ అన్నారు. గత ఏడాది పోలీసులపై 1500 ఫిర్యాదులు వచ్చాయని, అందులో సగం భౌతికదాడులే ఉన్నాయని ఫ్రాన్స్ పోలీస్ వాచ్డాగ్ వెల్లడించింది.
ఫొటో సోర్స్, EPA
హ్యూస్టన్‌లో ఫ్లాయిడ్‌కు ప్రజల నివాళి
కరోనా వైరస్ కారణంగా ముఖానికి మాస్కులు, చేతికి తొడుగులు ధరించిన వందలమంది స్థానికులు భౌతిక దూరం పాటిస్తూ ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించారు. శవపేటిక పెట్టిన చర్చిలోనికి ఒకేసారి 15మందికంటే ఎక్కువమందిని అనుమతించలేదు.
బ్లాక్ లైవ్స్ మ్యాటర్, నో జస్టిస్, నో పీస్ పేరుతో సాగుతున్న ఈ భారీ ఆందోళనలు 1960ల తర్వాత జరుగుతున్న అతి పెద్ద నిరసనల ప్రదర్శనగా చెబుతున్నారు. టెక్సాస్‌లో ఒకప్పుడు శ్వేతాధిపత్య గ్రూప్ 'కు క్లక్స్ క్లాన్'కు పట్టున్న ప్రాంతంగా పేరున్న విడార్లో కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.
మెజారిటీ నిరసన ప్రదర్శనలు శాంతియుతంగా జరుగుతుండగా, అక్కడక్కడా లూటీలు, హింసాకాండ జరుగుతోంది. అల్లర్లు జరిగే చోట అవసరమైతే మిలిటరీని దింపుతానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందే ప్రకటించారు.
ఆందోళనలు కొంత సద్దుమణగడంతో ఆదివారం నుంచి భద్రతా నిబంధనలను కొద్దిగా సడలించారు. వారం రోజులుగా న్యూయార్క్ నగరంలో కొనసాగిన కర్ఫ్యూను ఎత్తివేశారు. వాషింగ్టన్ డీసీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా నేషనల్ గార్డ్స్‌కు ప్రెసిడెంట్ ట్రంప్ సూచించారు.
జార్జి ఫ్లాయిడ్ నిరసనలు: ‘ఒక నల్లజాతి అమెరికన్‌గా నేను భయపడుతున్నా’
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో నిరసనలు: సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు ఉందా?
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- దేశ రాజధానిలో తెలుగువారికి వైద్యం అందుతుందా?
- తెలంగాణలో విద్యుత్ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారా? అసలు బిల్లులను ఎలా లెక్కిస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)