అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డోనల్డ్ ట్రంప్‌ను వైట్ హౌస్ నుంచి పంపించే శక్తి జో బిడెన్‌కు ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
రిపబ్లికన్ ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్‌తో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తలపడనున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్
ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ కి ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ పోటీ చేయనున్నారు.
బిడెన్ కి విదేశీ వ్యవహారాల నిర్వహణ పట్ల అవగాహన, సుదీర్ఘ రాజకీయ అనుభవం, సాధారణ ప్రజానీకాన్ని మెప్పించగలిగే వాక్చాతుర్యం, జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న అనుభవం ఉన్నాయని ఆయన మద్దతుదారుల అభిప్రాయం.
అయితే, ఆయన ఇతరులను ఇబ్బందికి గురి చేసే పనులు చేస్తారని ఆయన వ్యతిరేకులు వాదిస్తారు.
మరి ట్రంప్‌ను వైట్ హౌస్ నుంచి పంపించే శక్తి ఆయనకుందా ?
ఫొటో సోర్స్, Getty Images
వాక్చాతుర్యం
బిడెన్ రాజకీయ ప్రస్థానం 1973లో 47 సంవత్సరాల క్రితం వాషింగ్టన్ సెనేట్ కి ఎన్నికవ్వడంతో మొదలైంది. ఆయన 1987లో, 33 సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్ష పదవి కోసం మొదటిసారి ప్రచారం చేశారు. అయితే, ఆయనకు తన మాటలతో వోటర్లని ఆకర్షించే లక్షణంతో పాటు ఒక చిన్న మాటతో వివాదాల్లోకి వెళ్లిపోయే స్వభావం కూడా ఉంది.
ఇలాంటి స్వభావమే ఆయన తొలి సారి అధ్యక్ష పదవి కోసం చేస్తున్న ప్రచార సమయంలో ఆయన విజయాన్ని దెబ్బ తీసింది. ఆయన అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడటం ఇది మూడవ సారి.
“మా పూర్వీకులు పెన్సిల్వేనియా బొగ్గు గనుల్లో పని చేశారని వారు అందుకోవల్సిన అవకాశాలు అందుకోలేకపోయారని” ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కొన్ని ర్యాలీలలో చెప్పడం ప్రారంభించారు.
అయితే, ఆయన పూర్వీకులెవరూ నిజానికి బొగ్గు గనుల్లో పని చేయలేదు. ఒక బ్రిటిష్ రాజకీయవేత్త ప్రసంగం నుంచి ఆయన ఆ వ్యాక్యాన్నిదొంగిలించారు.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వ్యాఖ్యలు ‘జో బాంబులు’గా ప్రాచుర్యం పొందాయి.
ఫొటో సోర్స్, Getty Images
2012 లో ఆయన రాజకీయ అనుభవం గురించి చెప్పుకుంటూ నాకు 8 మంది అమెరికా అధ్యక్షులతో సన్నిహిత పరిచయాలున్నాయని అంటూ అందులో ముగ్గురితో శారీరక సంబంధాలున్నట్లు అర్ధం వచ్చేలా మాట్లాడారు.
2009 లో అందంగా,చలాకీగా, శుభ్రంగా కనిపించే తొలి ఆఫ్రికన్ అమెరికా వ్యక్తి ఒబామా అని వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలన్నప్పటికీ కూడా అమెరికాలో నల్ల జాతీయులు ఆయనకి మద్దతు పలుకుతున్నారు.
ఇటీవల ఒక నల్ల జాతి ప్రెసెంటెర్ హోస్ట్ చేస్తున్న రేడియో షో లో పాల్గొన్న ఆయన, “నువ్వు నాకు మద్దతిస్తావో, ట్రంప్ కి ఇస్తావో తేల్చుకోలేకపోతే నువ్వు నల్ల జాతీయుడివి కాదని కామెంట్ చేశారు”. ఇది ఆయనను వివాదంలోకి నెట్టింది.
ఫొటో సోర్స్, Reuters
ఎన్నికల ప్రచారంలో అనుభవం
అయితే, ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదివే రాజకీయ నాయకులు ఉన్న ప్రస్తుత తరుణంలో బిడెన్ మాత్రం తన మనసులోని మాటలతోనే ప్రసంగాలు చేస్తారు.
ఆయన నిజమైన రాజకీయవేత్త అని, ప్రజలతో సులభంగా కలిసిపోతారని, ఇందులో ఏ మాత్రం నాటకీయత లేదని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ న్యూయార్కర్ పత్రికతో మాట్లాడుతూ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
బిడెన్ మొదటి భార్య నెలియా, కూతురు కారు ప్రమాదంలో మరణించారు.
బిడెన్ పై ఆరోపణలు
గత సంవత్సరం 8 మంది మహిళలు బిడెన్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, తాకరాని చోట తాకి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి పనులు చేశారనే ఆరోపణలు చేశారు.
బిడెన్ ఆఫీసులో పని చేసిన తార రీడ్ అనే ఉద్యోగి 30 సంవత్సరాల క్రితం ఆయన తనని లైంగిక వేధింపులకు గురి చేశారని మార్చ్ నెలలో ఆరోపించారు. బిడెన్ ఈ ఆరోపణని ఖండించారు.
అయితే, బిడెన్ మద్దతుదారులు దీనికి సమాధానంగా ట్రంప్ పై కొంత మంది మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి మాట్లాడుతున్నారు.
ఫొటో సోర్స్, AFP
బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2009-2017 మధ్య కాలంలో జో బిడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి
ప్రజలతో దగ్గరగా మెలిగే బిడెన్ సహజ స్వభావం ఆయన ఈ సారి ఎన్నికలలో విఫలం కాకుండా చూస్తుందని డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు ఆశిస్తున్నారు.
ఆయన కనీసం మూడు దశాబ్దాల పాటు అమెరికా సెనెట్ లో పని చేశారు. ఒబామా పదవీ కాలంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అయితే కేవలం రాజకీయ అనుభవం మాత్రమే ఎన్నికలలో విజయానికి పని చేయదు.
బిడెన్ అవలంబించిన విదేశీ విధాన వ్యవహారాలు రిపబ్లికన్ల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నాయి .
ఫొటో సోర్స్, Reuters
వ్యక్తిగత జీవితం
ఆయన తొలి సారి సెనెట్ కి ఎన్నికైన వెంటనే ఒక కార్ ప్రమాదంలో భార్య, కూతురుని కోల్పోయారు. అయన ఇద్దరు కొడుకులకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక కొడుకు 46 సంవత్సారాలకే 2015 లో బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు.
ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఈ నష్టాలు ప్రజల సానుభూతి పొందేందుకు తోడ్పడ్డాయి.
కానీ, అతని మరో కుమారుడు హంటర్ పై మాత్రం మాదక ద్రవ్యాలు తీసుకుంటారని , అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జో బిడెన్
విదేశీ వ్యవహారాలు
బిడెన్ విదేశీ వ్యవహారాల పట్ల అవలంబించిన తీరు ఆయన విజయానికి ఎలా పని చేస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది.
ఆయన 1991 గల్ఫ్ యుద్ధానికి వ్యతిరేకంగా వోట్ చేసారు. 2003 లో ఇరాక్ ఆక్రమణని సమర్ధించారు. ఒసామా బిన్ లాడెన్ పై ప్రత్యేక సేనలని పంపే విషయంలో ఒబామాని జాగ్రత్తగా వ్యవహరించమని సూచించారు.
ఆయన యుద్ధ వ్యతిరేక ప్రతిపాదనలు డెమొక్రటిక్ పార్టీలో యువత సమర్ధించరు.
ఇప్పటి వరకు జరిగిన ప్రీ పోల్స్ లో ట్రంప్ కన్నా బిడెన్ కి ఎక్కువ మద్దతుని సూచిస్తున్నాయి.
కాకపొతే నవంబర్ లోపు అమెరికా రాజకీయ చిత్రంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా తెలియదు.
ఫొటో సోర్స్, Reuters
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న హిల్లరీ క్లింటన్ 2016 ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయారు
ఇప్పటికే అమెరికా ప్రభుత్వం అమెరికాలోని నల్ల జాతీయులతో పోలీసులు వ్యవహరించిన తీరు, కరోనా వైరస్ ని అరికట్టే విషయంలో తీసుకున్న చర్యల పట్ల బిడెన్ కి ట్రంప్ కి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఆఖరికి ఫేస్ మాస్క్‌లు ధరించే విషయం కూడా రాజకీయంగా మారింది. బిడెన్ ఫేస్ మాస్క్ ధరిస్తే ట్రంప్ ఎప్పుడూ మాస్క్ ధరించరు.
ఒక వేళ బిడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపడితే ఇది ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఒక గెలుపులాంటిది అవుతుంది. ఓడిపోతే, రాజకీయాలకు పనికి రారని ఆయన అనుకున్న వ్యక్తికి మరో నాలుగేళ్ల పాటు వైట్ హౌస్ పగ్గాలు ఇచ్చినట్లవుతుంది.
2016 ఎన్నికల సమయంలో “నేను అమెరికా అధ్యక్షుడిని కాకుండా కూడా హాయిగా మరణించగలనని”, ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడున్న పరిస్థితి మరోలా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో నిరసనలు: సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు ఉందా?
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- దేశ రాజధానిలో తెలుగువారికి వైద్యం అందుతుందా?
- తెలంగాణలో విద్యుత్ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారా? అసలు బిల్లులను ఎలా లెక్కిస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)