రష్యా అర్కిటిక్ ప్రాంతంలో వేల టన్నుల చమురు లీకేజి... ప్రమాదంలో పర్యావరణం

జూన్ మొదటి వారంలో ప్రక్షాళన పనులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

అర్కిటిక్ జీవులకు ప్రాణాంతకంగా మారిన చమురు లీకేజి

ఉత్తర రష్యా ప్రాంతంలో ఉన్న ఆయిల్ ట్యాంకుల నుంచి జరిగిన ఇంధన లీకేజ్ నోరిల్క్ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద మంచి నీటి సరస్సుని కలుషితం చేసింది.

ఈ లీకేజ్ ఆర్కిటిక్ సముద్ర ప్రాంతం వరకు విస్తరించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కూలిపోయిన ఒక ఆయిల్ ట్యాంక్ నుంచి జరిగిన ఈ లీకేజ్ ఇప్పటికే నోరిల్క్ కి ఉత్తరంగా 20 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. దీనిని నియంత్రణలోకి తేవడానికి ఎమర్జెన్సీ సిబ్బంది కృషి చేస్తోంది.

ఇది రష్యా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అతి ఘోరమైన ప్రమాదమని, పర్యావరణవేత్తలు, అధికారులు చెబుతున్నారు. మే 29 వ తేదీన ఆయిల్ లీక్ అవ్వడం మొదలైంది.

ఇప్పటికే లీక్ అయిన 21000 టన్నుల ఆయిల్ అమ్బర్ణాయ నది, చుట్టుపక్కల పరీవాహక ప్రాంతాన్ని కలుషితం చేసింది.

నోరిల్క్ నదీ పరివాహక ప్రాంతంలో పెర్మాఫ్రోస్ట్ కరగడం వలన ఈ ఆయిల్ ట్యాంక్ మునిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో గత కొన్ని వారాలుగా అసాధారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇది గ్లోబల్ వార్మింగ్ కి సంకేతం కావచ్చు.

ప్రపంచంలోనే అతి పెద్ద స్థాయిలో నికెల్, పల్లాడియంని ఉత్పత్తి చేసే నోరిల్క్ నికెల్ కి ఈ లీకేజీ జరిగిన పవర్ ప్లాంట్ అనుబంధ సంస్థగా ఉంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

రష్యాలోని నోరిల్క్ శివార్లలోని అమ్బర్ణాయ నదిలో భారీగా కలిసిన డీజిల్

ఆర్కిటిక్ మహా సముద్రంలో భాగమైన కార సముద్రంలో కలిసే ప్యాసిన నదికి, ప్యాసినో సరస్సు తీరంగా ఉంది. అక్టోబర్ నుంచి జూన్ వరకు ఈ నది గడ్డ కట్టి ఉంటుంది.

"ఈ ఇంధనం ప్యాసినో సరస్సులో కలిసిందని క్రాస్నోయర్స్క్ ప్రాంత గవర్నర్ అలెక్సాన్డెర్ ఉస్ తెలిపారు.

70 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సరస్సులో చేపలు, మంచి జీవావరణం ఉన్నాయని ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

ఇప్పటికే 812,000 క్యూబిక్ అడుగుల లోతులో కలుషితమైన మట్టిని తొలగించినట్లు రియా నోవోస్తి వార్తాసంస్థ ప్రచురించింది.

నీటి వనరుల పైన, ఈ నీరు తాగే జంతువుల పైన, తీరంలో పెరిగే మొక్కల పైన ఈ కాలుష్యం చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని గ్రీన్ పీస్ రష్యా కి చెందిన వాసిలి యాబ్లోకోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నోరిల్సిక్‌లో చమురు లీకేజికి కారణమైన పవర్ ప్లాంట్

ప్యాసిన నది మరింత కలుషితం అవ్వకుండా చూసుకోవల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

గ్రీన్ పీస్ ఈ ఆయిల్ లీకేజ్ ని 1989లో అలస్కాలో చోటు చేసుకున్న వాల్డెజ్ ఉత్పాతంతో పోల్చింది.

పెర్మఫ్రోస్ట్ ప్రాంతంలో నెలకొల్పిన ప్రమాదకరమైన యూనిట్లను పరిశీలించమని రష్యా ప్రాసిక్యూటర్లు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఇంధన లీకేజ్ విషయంలో జరిగిన సమాచార జాప్యం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన సంస్థ డైరెక్టర్ వ్యాకేస్లావ్ స్టారోస్టిన్ ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఇంధన లీకేజీ లో జరిగిన నిర్లక్ష్యానికి గాను రష్యా పరిశోధన బృందం క్రిమినల్ కేసును నమోదు చేసింది.

ఫొటో సోర్స్, AFP

పెర్మఫ్రోస్ట్ అంటే ఏమిటి?

ఏదైనా భూభాగం రెండు గాని అంత కన్నా ఎక్కువ గానీ సంవత్సరాలు మంచుతో గడ్డ కట్టి ఉంటె ఉంటే ఆ ప్రాంతాన్ని పెర్మ ఫ్రోస్ట్ అంటారు.

రష్యా భూభాగంలో 55 శాతం , ముఖ్యంగా సైబీరియా ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పి ఉంటుంది. ఈ ప్రాంతంలో రష్యాలోని ఆయిల్ గ్యాస్ ఫీల్డ్ లు నెలకొని ఉంటాయి.

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వలన మంచు కరగడంలో, ఈ ఆయిల్ నిల్వలకి గతంలోలా ఈ ప్రాంతం అనువుగా లేదని, 2017 లో ఆర్కిటిక్ కౌన్సిల్ కి అందచేసిన నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రక్షాళనకు దిగిన అత్యవసర సిబ్బంది

రష్యాలో ప్రస్తుతం లీక్ అయిన ఇంధనం అమ్బర్ణాయ నదిని ఎరుపు వర్ణంలోకి మార్చేసింది.

ఈ ఘటన గురించి తగిన సమయంలోనే అధికారులకి సమాచారం అందించినట్లు నోరిల్క్ నికెల్ సంస్థ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ ప్రాంతం శుభ్రం చేయడానికి కావలసిన నిధులను కంపెనీ యాజమాన్యమే సమకూరుస్తుందని తెలిపింది.

నోరిల్క్ ఇప్పటికే బాగా కలుషిత ప్రాంతంగా పేరు పొందింది.

గతంలోఇదే ప్లాంట్లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా దగ్గర్లో ఉన్న నదిలోని నీరు ఎర్రగా మారినట్లు సంస్థ అంగీకరించింది.

అయితే, ఇప్పటికే ఇక్కడ కాలుష్యం నది అంతర్భాగాన్ని ఆవరించిందని రష్యా క్రస్నోయర్స్క్ ఉప పర్యావరణ మంత్రి యూలియా గుమెన్ యుక్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)