భారత్-చైనా మధ్య గల్వాన్ లోయ గురించి ఉద్రిక్తతలు ఎందుకు.. ఇది ఎప్పటి గొడవ?

  • కమలేష్ మఠేనీ
  • బీబీసీ ప్రతినిధి
భారత్-చైనా ఉద్రిక్తత

ఫొటో సోర్స్, Getty Images

భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో గత కొన్ని వారాల నుంచీ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) దగ్గర రెండు దేశాలు తమ సైన్యం మోహరింపు పెంచుతున్నాయి.

అక్సాయి చీన్‌లో ఉన్న గల్వాన్ లోయ గురించి రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

గల్వాన్ లోయ తీరంలో చైనా సైన్యం కొన్ని టెంట్స్ కనిపించాయి. ఆ తర్వాత భారత్ కూడా అక్కడ తన సైన్యం మోహరింపు పెంచింది. చైనా మాత్రం, గల్వాన్ లోయ దగ్గర భారత్ రక్షణ సంబంధిత అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తోంది.

మేలో రెండు దేశాల సరిహద్దుల్లో వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. మే 9న నార్త్ సిక్కిం నాకూలా సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో లద్దాఖ్‌లో ఎల్ఏసీ దగ్గర చైనా ఆర్మీ హెలికాప్టర్లు కనిపించాయి. ఆ తర్వాత భారత వైమానికదళం కూడా సుఖోయ్ సహా మితా యుద్ధ విమానాలతో గస్తీ ప్రారంభించింది.

సోమవారం వైమానిక దళ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా కూడా చైనా గురించి మాట్లాడారు. “అక్కడ కొన్ని అసాధారణ కార్యకలాపాలు కనిపించాయి. అలాంటి ఘటనలపై మేం నిశితంగా నిఘాపెడతాం. తగిన చర్యలు కూడా తీసుకుంటాం. అలాంటి వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అన్నారు.

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి గత వారం మాట్లాడిన పదాతిదళం చీఫ్ జనరల్ ఎంఎం నరవణే “చైనాతో ఉన్న సరిహద్దుల్లో భారత దళాలు తమ ‘స్థానం’లో ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి” అని చెప్పారు.

ఈ గొడవల్లో ఇరు దేశాల సైనికులూ దూకుడుగా ప్రవర్తించారు. అందుకే వారికి స్వల్ప గాయాలయ్యాయి అని కూడా ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్,

భారత్-చైనా ఉద్రిక్తత

భారత్‌పై చైనా ఆరోపణ

చైనా ఈ ఉద్రిక్తతలకు కారణం భారత్ అంటోంది. చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం ప్రచురించిన ఒక కథనంలో గాల్వన్ నది (లోయ) ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణం భారత్ అని రాసింది.

చైనా సైన్యం వివరాలుగా చెబుతూ ఆ పత్రిక “భారత్ ఈ ప్రాంతంలో రక్షణ సంబంధిత అక్రమ కట్టడాలు నిర్మిస్తోంది. అందు వల్ల చైనా అక్కడ సైన్యం మోహరింపు పెంచింది. ఈ ఉద్రిక్తతలను భారత్ మొదలుపెట్టింది. కానీ, అక్కడ 2017లో డోక్లాం లాంటి పరిస్థితులు ఏర్పడవు అని మాకు నమ్మకం ఉంది. భారత్ కోవిడ్-19 వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అది గాల్వన్ ఉద్రిక్తతలు సృష్టించింది” అని రాశారు.

గ్లోబల్ టైమ్స్ గాల్వన్ లోయ చైనా ప్రాంతం అని కూడా రాసింది. భారత్ చేపట్టినవి సరిహద్దు అంశాల్లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందాల ఉల్లంఘనే అని పేర్కొంది. మే ప్రారంభం నుంచీ భారత్ గాల్వన్ లోయ దగ్గర సరిహద్దు దాటుతోందని, చైనా భూభాగంలోకి చొచ్చుకొస్తోందని చెప్పింది.

గాల్వన్ లోయ ఎందుకు కీలకం

వివాదిత గాల్వన్ లోయ ప్రాంతం అక్సాయి చీన్‌లో ఉంది. ఈ లోయ లద్దాఖ్, అక్సాయి చీన్ మధ్య భారత-చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంది.

ఇక్కడ వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) అక్సాయి చీన్‌ను భారత్ నుంచి వేరు చేస్తుంది. అక్సాయి చీన్‌ మాదని భారత్, చైనా రెండూ వాదిస్తున్నాయి. చైనా దక్షిణ షింజియాంగ్, భారత్ లద్దాఖ్‌లో ఈ లోయ వ్యాపించి ఉంది.

“ఈ ప్రాంతం భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఎందుకంటే ఇది పాకిస్తాన్, చైనా షింజియాంగ్, లద్దాఖ్ సరిహద్దులతో కలిసి ఉంది. 1962 యుద్ధం జరిగినప్పుడు గాల్వన్ నది దగ్గర ఈ ప్రాంతం యుద్ధానికి ప్రధాన కేంద్రంగా మారింది” అని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, అంతర్జాతీయ అంశాల నిపుణుడు ఎస్డీ ముని అన్నారు.

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్,

భారత్-చైనా ఉద్రిక్తత

కరోనా సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత

ఒకవైపు ప్రపంచం కరోనావైరస్‌తో పోరాడుతోంది. భారత్‌లో కూడా ఈ కేసులు 3 లక్షలు దాటాయి. చైనాపై యూరప్, అమెరికా మాటిమాటికీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో రెండు దేశాల మధ్య కొత్త వివాదం తలెత్తడానికి కారణమేంటి?

“ప్రస్తుత సమయంలో భారత్ తమవిగా భావిస్తున్న ప్రాంతాలపై తమ వాదనను బలోపేతం చేసుకోవాలని అనుకుంటోంది. కానీ అవి వివాదాస్పద ప్రాంతాలు” అని ఎస్డీ ముని చెప్పారు.

ఇది 1958 నుంచే మొదలైంది. అప్పుడు అక్సాయి చీన్‌లో చైనా రోడ్డు నిర్మిస్తోంది. అది కరాకోరమ్ రోడ్డతో కలుస్తుంది. పాకిస్తాన్ వైపు కూడా వెళ్తుంది. ఆ రోడ్డు నిర్మిస్తున్నప్పడు భారత్ దానిని పట్టించుకోలేదు. కానీ రోడ్డు వేశాక అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటినుంచి అక్సాయి చీన్‌ను చైనా స్వాధీనం చేసుకుందని భారత్ చెబుతోంది” అని ఆయన చెప్పారు.

“కానీ, భారత్ దీనిపై అప్పుడు ఎలాంటి సైనిక చర్యకూ దిగలేదు. ఇప్పుడు భారత్ తన వాదన వినిపించాలి కాబట్టి చర్యలు చేపడుతోంది. పీఓకే, గిల్గిత్-బాల్టిస్తాన్ గురించి భారత్ తన వాదనను ఎలా బలోపేతం చేసుకుందో, అలాగే చేస్తోంది. అదే సమయంలో అక్సాయి చీన్‌లో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కానీ, ఇప్పుడు చైనాకు దానివల్ల ఇబ్బందిగా ఉంది” అన్నారు.

గాల్వన్ లోయలో భారత్ నిర్మాణాలు అక్రమం అని చైనా అంటోంది. ఎందుకంటే ఎల్ఏసీని అంగీకరిస్తామని, అక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టమని భారత్-చైనా మధ్య ఒక ఒప్పందం జరిగింది. కానీ, చైనా అక్కడ ముందు నుంచీ అవసరమైన సైనిక నిర్మాణాలు పూర్తి చేసింది. ఇప్పుడు ప్రస్తుత స్థితిని కొనసాగించాలని మాట్లాడుతోంది. తన స్థితిని బలోపేతం చేసుకోడానికి, ఇప్పుడు భారత్ కూడా అక్కడ వ్యూహాత్మక నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images

మారుతున్న భారత్ వ్యూహం

పీఓకే నుంచి భారత్ తన వ్యూహాన్ని అక్సాయి చీన్‌ వైపు మార్చడానికి కారణం ఏంటి. భారత్ అభద్రతగా భావిస్తోందా, లేదా దూకుడుగా మారిందా?

దీనిపై ఎస్డీ ముని “భారత్ దూకుడుగా మారలేదు. కచ్చితంగా వ్వయహరిస్తోంది. ఏ ప్రాంతాలను అది తమ హక్కుగా చెబుతూవచ్చిందో, ఇప్పుడు వాటిపై తమ హక్కు చూపించుకోవడం కూడా మొదలైంది” అన్నారు.

“1962తో పోలిస్తే ఇప్పటి భారత్ చాలా బలంగా ఉంది. ఆర్థికంగా కూడా పుంజుకుంది. అంతే కాదు, చైనా ఎలా ఆవిర్భవిస్తోందో చూస్తుంటే, దాన్నుంచి మనకు ప్రమాదం కూడా పెరుగుతోంది. పాకిస్తాన్‌తో కూడా భారత్‌కు సంబంధాలు దారుణంగా ఉన్నాయి. దాంతో ప్రమాదం మరింత పెరుగుతోంది. అలాంటప్పుడు తమ సరిహద్దులను రక్షించుకోవాలని భారత ప్రభుత్వానికి అనిపిస్తోంది. అక్సాయి చీన్‌లో భారత సైన్యం నిర్మాణాలు చేపడితే, అక్కడ నుంచి చైనా సైన్యం కార్యకలాపాలపై నిఘా పెట్టచ్చు” అంటారు ఎస్డీ ముని.

అటు గ్లోబల్ టైమ్స్ ఒక రీసెర్చ్ గురించి చెబుతూ గ్వాలన్ లోయలో డోక్లామ్ లాంటి స్థితి లేదని చెప్పింది. అక్సాయి చీన్‌లో చైనా సైన్యం బలంగా ఉందని, ఉద్రిక్తతలు పెరిగితే భారత సైన్యం దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రాసింది.

దీనికి సంబంధించి మాట్లాడిన నిపుణులు “చైనా పరిస్థితి అక్కడ బలంగా ఉంటే, దానివల్ల భారత్‌కు నష్టం కలగచ్చు. కానీ, కరోనావైరస్ వల్ల చైనా ఇప్పుడు దౌత్యపరంగా బలహీనం అయ్యింది. యూరోపియన్ యూనియన్, అమెరికా దానిపై బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నాయి. భారత్ ఇప్పటివరకూ చైనాను ప్రత్యక్షంగా ఏదీ అనలేదు. అందుకే చైనా భారత్‌తో సమతుల విధానాన్ని ఆశిస్తోంది. ఈ విషయంలో భారత్ చైనాతో సంప్రదింపులు జరిపే స్థితిలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

దేశాలపై ఒత్తిడి పెరుగుతుందా?

కరోనా కాలంలో రెండు దేశాల సరిహద్దుల దగ్గర ఏర్పడిన ఈ ఉద్రిక్తతల వల్ల వాటిపై మరింత ఒత్తిడి పెరుగుతుందా?

ఎస్డీ ముని మాత్రం “కరోనావైరస్‌తో పోరాటం ఒకవైపు, దేశ రక్షణ మరోవైపు. చైనా కూడా దక్షిణ చైనా సముద్రంలో సైనిక నిర్మాణాలను విస్తృతం చేసింది. ప్రపంచమంతా కరోనావైరస్ నియంత్రణలో బిజీగా ఉంది, కానీ సైన్యం కరోనావైరస్‌తో పోరాడ్డం లేదు. సైన్యం తమపని తాము చేస్తుంది. ఇవి కరోనాకు ముందు నుంచీ వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన సమస్యలుగా ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. అందుకే చైనా వాదన సరైనది కాదు” అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)